
సంప్రదాయ ఉద్యోగ ఆధారిత పథకాలను మించిన యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం మెరుగైన ఫలితాలు ఇస్తుందని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందిస్తున్నట్లు కొన్ని సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. అందులోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.
అసంఘటిత రంగాల్లోని కార్మికులు, వ్యాపారులు, 18 ఏళ్లు పైబడిన స్వయం ఉపాధి పొందుతున్న అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ పథకం ఏ నిర్దిష్ట ఉపాధితో ముడిపడి ఉండదని చెబుతున్నారు. వ్యక్తులు తమ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెన్షన్ పథకంపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
రెండు పథకాలను కలుపుతారా..?
ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసిన తర్వాత, ఇతర వివరాలను జోడించేందుకు, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక భాగస్వాముల నుంచి సూచనలు కోరుతుంది. ఇప్పటికే ఉన్న ప్రధాన మంత్రి-శ్రమ యోగి మాన్ధన్ స్కీమ్ (పీఎం-ఎస్‌వైఎం), నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ (ఎన్‌పీఎస్-ట్రేడర్స్) వంటి పెన్షన్ పథకాలను ఒకే వ్యవస్థ కింద క్రమబద్ధీకరించడం, వాటిని మరింత ప్రయోజనకరంగా, సులభంగా అందుబాటులో ఉంచడం ఈ పథకం లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందంగా 60 ఏళ్ల తరువాత నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తుంది. అందుకు వయసును అనుసరించి రూ.55 నుంచి రూ.200 వరకు కంట్రిబ్యూట్ చేయాలి.
అటల్ పెన్షన్ యోజన పథకం కూడా కొత్త పథకంలో చేరే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (బీవోసీడబ్ల్యూ) చట్టం కింద వసూలు చేసిన మొత్తాన్ని ఈ రంగంలోని కార్మికులకు పింఛన్ల కోసం ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులు
ఈ పథకం ఎందుకు అవసరం?
భారతదేశంలో 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ జనాభా 2036 నాటికి 22.7 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఆదాయం లేని సమయంలో సమగ్ర సామాజిక భద్రత లేదా పెన్షన్ పథకం అవసరం ఉంటుంది. అమెరికా, యూరప్, కెనడా, రష్యా, చైనా వంటి అనేక దేశాల్లో పింఛన్లు, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి వాటికి సామాజిక బీమా వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక భద్రత అధికంగా ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థ, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్య భీమాపై ఆధారపడి ఉంది. ఇది ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది.