హైదరాబాద్: రాష్ట్రంలో ఆసరా పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయల మేర పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. ఆసరా పథకంలో దివ్యాంగుల పింఛన్‌ను గత నెలలో రూ.3,016 నుంచి రూ.4,016కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకూ పెంచాలని ఇతర ఆసరా పింఛనుదారులు కోరుతున్నారు. ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,016 పింఛను ఇస్తోంది.
వీరికి సైతం వెయ్యి పెంచి రూ.3,016 ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం అనంతరం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇతర లబ్ధిదారులకూ త్వరలో పింఛను మొత్తాన్ని పెంచుతామని ఆదివారం సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
44,82,254 మందికి పింఛన్లు
ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులతో పాటు పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు; గీత, చేనేత, బీడీ కార్మికులు; ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ రోగులకు కలిపి మొత్తం 44,82,254 మందికి పింఛను ఇస్తోంది. ఇందుకు ఏటా రూ.11,628 కోట్లు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల్లో 5,16,890 మంది దివ్యాంగులకు గత నెల నుంచి వెయ్యి పెంచింది. వీరిని మినహాయిస్తే.. ఇతర పింఛనుదారులు 39 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,000 పెంపుతో ఖజానాపై మరో రూ.450 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment