సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా నెలవారీగా ఇస్తున్న పింఛన్ పరిమితిని పెంచింది. ఇప్పటివరకు రూ.3,016 చొప్పున దివ్యాంగులకు నెలవారీగా పింఛన్ ఇస్తుండగా... జూలై నుంచి రూ.4,016 చొప్పున ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం జీఓ. 25 జారీ చేసింది.
ఇప్పటివరకు ఇస్తున్న పింఛన్‌కు మరో వెయ్యి రూపాయల పరిమితిని పెంచిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సెర్ప్ సీఈఓను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ ఆదేశించారు. దివ్యాంగుల పింఛన్ పెంపునకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభ వేదికగా ప్రకటన చేశారు.
అందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో సంబంధిత శాఖ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. పింఛన్ పెంపుదలతో రాష్ట్రంలో దాదాపు 5,11,656 మందికి అదనపు లబ్ధి కలగనుంది.
ముఖ్యమంత్రికి మంత్రుల కృతజ్ఞతలు
రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆసరా పింఛన్లలో భాగంగా నెలవారీగా ఇస్తున్న మొత్తాన్ని పెంచినందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో సామాజిక పింఛన్ల పథకాన్ని ఇంత పెద్ద మొత్తంలో అమలు చేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment