బోసి నవ్వులకు భరోసా ఏదీ?  | old people waiting for volunteers on April 1 | Sakshi
Sakshi News home page

బోసి నవ్వులకు భరోసా ఏదీ? 

Published Tue, Apr 2 2024 4:13 AM | Last Updated on Tue, Apr 2 2024 4:13 AM

old people waiting for volunteers on April 1 - Sakshi

తెల్లారింది...పింఛన్‌ మాత్రం లేదు 

ఏప్రిల్‌ 1న వలంటీర్ల కోసం ఎదురు తెన్నులు  

పింఛన్లు సచివాలయాల్లోనే అంటూ ప్రకటనతో దిగాలు  

చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న వృద్దులు  

గంటలకొద్ది క్యూలైన్లలో ఉన్న జ్ఞాపకాలతో ఆందోళనలో పెన్షనర్లు 

తీవ్ర నైరాశ్యంలో వృద్ధులు, దివ్యాంగులు

చంద్రబాబు కుటిలత్వంపై సర్వత్రా విమర్శలు  

ఎప్పుడు అందజేస్తారో తెలియని దుస్థితి

వేకువజామునే  వచ్చి ‘అవ్వా.. తాత.. ఇదిగో మీ పింఛన్‌ సొమ్ము తెచ్చాను. తీసుకోండి’ అంటూ అప్యాయంగా పలకరించే వలంటీర్‌ సేవలను నిర్ధాక్షిణ్యంగా చంద్రబాబు రాక్షసానందం కోసం నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఆశగా ఎదురు చూసే వలంటీర్లను ఆ సేవల నుంచి తొలగించారనే నిజాన్ని నమ్మలేక దిగాలు పడిపోయారు. వలంటీర్లను తొలగించాలంటూ చంద్రబాబు కుట్రతో ఎన్నికల కమిషన్‌కు íఫిర్యాదు చేయడంతో వారిని ఆ విధుల నుంచి తప్పించారు.

దీంతో ప్రతి నెల మాదిరిగానే ఈ నెల సూర్యుడు పొడవకుండానే వస్తారని వేచి చూసి.. చూసి  బారెడు పొద్దెక్కినా రాకపోవడంతో చంద్రబాబు కుటిలత్వం వల్ల పింఛన్‌ అందలేదని తెలుసుకుని గుండెలు అవిసేలా రోదించారు. ప్రతి నెలా ఒకటో తేదీన బోసి నవ్వులతో ఎదురు చూసే ఆ వృద్దులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడాలా ? అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్న తరుణంలో గంటలపాటు సచివాలయాల అరుగులమీద అధికారుల కోసం ఎదురుచూసిన జ్ఞాపకాలను చూసి ఆందోళన చెందుతున్నారు. సాక్షి, నెట్‌వర్క్‌

ఇలాగైతే ఎలా..? 
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్దురాలి పేరు పొటుకూరి గంగమ్మ. వయస్సు 85 సంవత్సరాలు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలోని సురేంద్రం. సొంతంగా ఏ పని చేసుకోలేదు. కనీసం లేచి నిలబడలేదు. ప్రతి నెల వలంటీర్‌ వచ్చి ఈమెకు పింఛన్‌ నగదు అందచేసేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించడంతో ఈ నెల సకాలంలో పింఛన్‌ అందలేదు. ఈమె పింఛన్‌ తీసుకోడానికి సచివాలయానికి వెళ్లాలంటే నాలుగు ఫర్లాంగులు దూరం ప్రయాణించాలి. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. ఇద్దరు పట్టుకుని ఆటోలో తీసుకువెళ్లాలి. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో ఎలా వెళ్లాలి అని  ఆందోళన చెందుతోంది.   –పొటుకూరి గంగమ్మ, సురేంద్రం గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా 

అయ్యో అననివారు లేరు 
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాళం శివకృష్ణ. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంగళరావు నగర్‌కు చెందిన ఈయన పుట్టుకతో అంధుడు. పోలియో బారిన పడిన దివ్యాంగురాలు రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం శివకృష్ణకు రోడ్డు ప్రమాదంలో నడుము దెబ్బతిని స్పర్శ లేకుండా పోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దివ్యాంగ (అంధుడు) పెన్షన్‌ పొందుతున్నాడు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని స్టాండ్‌ సహకారంతో నడుస్తున్న భార్య రాజేశ్వరికి కూడా పెన్షన్‌ మంజూరైంది.

వచ్చే పింఛన్, అమ్మ ఒడి పథకంతో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ జీవితం గడుపుతున్నారు. మంచానికే పరిమితమైన భర్త, స్టాండ్‌ సహాయంతో నడుస్తున్న భార్య ఇద్దరూ పింఛన్‌ కోసం కనీసం సచివాలయానికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వారికి  వలంటీర్ల సహకారంతో ప్రతినెలా 1వ తేదీన ఇంటికి వచ్చి పింఛన్‌ అందజేసేవారు. టీడీపీ నీచ రాజకీయాలకు ఈ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది.   – అంధుడు శివకృష్ణతో భార్య రాజేశ్వరి వెంగళరావునగర్, గుంటూరు జిల్లా 

డయాలసిస్‌ ఎలా చేయించుకోవాలి ? 
68 ఏళ్లు పైబడిన నేను చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. వారంలో ఒకసారి డయాలసిస్, మరో రోజు వైద్యం చేయించుకుంటున్నా. షుగరు, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలున్నాయి.  ప్రతి నెలా వలంటీర్‌ వచ్చి 1వ తేదీన తెల్లవారకముందు రూ.10 వేలు పింఛన్‌ అందించేవాడు. వాటిని వైద్యం కోసం ఉపయోగిస్తాను. కానీ వలంటీర్లు పింఛన్‌ ఇవ్వడానికి వీల్లేదంటూ చంద్రబాబు చేసిన ఇబ్బందికి ఈ నెల పింఛన్‌ అందలేదు. సచివాలయానికి వెళ్లి క్యూలో నిలబడలేని పరిస్థితి. మా లాంటి రోగులను, వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడు.  – మాతంగి వెంకాయమ్మ, డయాలసిస్‌ రోగి, హరిశ్చంద్రపురం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా 

సచివాలయాల్లో పడిగాపులు తప్పవా..?  
నాలుగు సంవత్సరాలుగా వలంటీర్‌ ప్రతి నెల 1వ తేదీన ఇంటికే వచ్చి పింఛన్‌ అందించేవాడు. నా లాంటి వృద్ధులకు ఎంతో మేలు జరిగేది. ఇప్పుడు సచివాలయాలకు వెళ్లి పింఛన్‌ తీసుకోవాలంటున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. అక్కడికి వెళ్లి పడిగాపులు కాసి తెచ్చుకొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. పింఛన్‌ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాను,  వలంటీర్‌ల ద్వారా పింఛన్‌ పంపిణీ నిలిపివేయాలనడం చాలా దారుణం. అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. వృద్దుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వలంటీర్‌ల ద్వారా పింఛన్‌ పంపిణీ కొనసాగించాలి. – సయ్యద్‌ పెద్దబీబి, ఉరుటూరు, వీరపునాయునిపల్లె మండలం, కడప జిల్లా  

అన్ని తానై చూసేది  
ఒకటోతేదీ వస్తే వలంటీర్‌ మా వీధిలోకి వచ్చి ఇంటింటికి వెళ్లి పింఛన్‌ ఇచ్చేది. గతంలో పెన్షన్‌ తీసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగి బాధలు పడేదాన్ని. వలంటీర్‌ వ్యవస్థ వచి్చన  తరువాత పెన్షన్‌తో పాటు అన్ని తానై చూసేది. గతంలో భారీ వర్షాలు రావడంతో మా ప్రాంతం వరద ముంపునకు గురైంది. ఇళ్లలోకి నీళ్లు చేరవడంతో ముందుగానే  వలంటీరు వచ్చి జాగ్రత్తలు తీసుకుని మాకు పునరావాసం కలి్పంచి సహాయం చేసింది. అలాంటి వారిని పెన్షన్‌ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించడం బాధాకరం.    – గులాబ్‌జాన్, బాపక కాలువ, మదనపల్లె.చిత్తూరు జిల్లా. 

ఇక మాకు పస్తులే 
కాళ్లు చేతులు సన్నగిల్లి ఒంట్లో సత్తువ లేక మంచం పట్టాను. ఐదేళ్లుగా ఇంటికే పొద్దున్నే వలంటీర్‌ వచ్చి పెన్షన్‌ అందించేవారు. మా లాంటి వృద్ధులకు వరంలా ఉండేది. ఇప్పుడు మానవత్వం లేని రాజకీయ స్వార్థంతో మేమంతా సచివాలయం వద్ద పెన్షన్‌ తీసుకోవాలని చెబుతు న్నారు. వలంటీర్‌ తెచ్చి పింఛన్‌ ఇవ్వకుంటే పస్తులతో చావు తప్పదు. ఆర్‌.కరాపాడులో సచివాల యం వద్దకు వెళ్లేందుకు శరీరం సహకరించదు. మా లాంటి పేదలపై ఇటువంటి కక్షసాధింపు మంచిది కాదు  –హత్తి త్రినాథ్, కన్నుపుట్టుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా  

ఈ పాపం ఊరికే పోదు 
నా వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో మంచంలో నుంచి లేవాలంటే ఇద్దరు మనుషులు పట్టుకుని లేపాలి. ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి వృద్దాప్య  పింఛన్‌ ఇచ్చేవాడు. ఈ నెల ఇంకా అందలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంటే నా వల్ల కాదు. వలంటీర్‌ నేను ఉండే మంచం దగ్గరికే వచ్చి పింఛను ఇచ్చే వాడు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లేవారు లేరు. ఈ పాపం ఊరికే పోదు  – షేక్‌ బడేబి,కురిచేడు, ప్రకాశం జిల్లా 

నడవలేని నేను సచివాలయానికి ఎలా వెళ్లాలి? 
ఉదయం నుంచి వలంటీరు వచ్చి పింఛన్‌ ఇస్తారేమో అని ఎదురు చూశాను. మూడో తేదీ వరకు పింఛన్‌ ఇవ్వరని తెలిసింది. సచివాలయానికి వెళ్లి నేనే పింఛన్‌ను తెచ్చుకోవాలని చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నాను. ఇప్పటి వరకు గ్రామ వలంటీరు ఒకటొవ తేదీనే మా ఇంటికి వచ్చి పింఛన్‌ అందించారు. ఇప్పుడు వలంటీర్లు పని చేయకూడదని చెప్పడం దారుణం. వలంటీర్లు పనిచేయకపోతే నాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. ఈ ఐదేళ్ల నుంచి పింఛన్‌ కోసం వెళ్లే నరకయాతన తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితులు వచ్చాయి.  – సూరగాని తులశమ్మ, జి.కొండూరు, ఎన్టీఆర్‌ జిల్లా) 

పింఛన్‌ కటకటే..  
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. డయాలిసిస్‌ చేయించుకునే స్థోమత లేకపోయినప్పటికీ సీఎం జగన్‌ ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు రూ.10 వేలు పింఛన్‌ను మూడు నెలలుగా అందజేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్‌ అందజేసేవారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయవద్దంటూ ఫిర్యాదు చేయడంతో ఈ నెల సచివాలయం వద్దకు వెళ్లి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్‌ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. –  నాబాన వెంకటే‹Ù,  గర్భాం గ్రామం, మెరకమూడిదాం మండలం, విజయనగరం జిల్లా 

రెండు కిలోమీటర్లు నడవాలి  
 ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్‌ ఇచ్చేది. ఇప్పుడు సచివాలయానికి వచ్చి పింఛన్‌ తీసుకోమంటున్నారు. మా ఇంటి నుంచి  2.కి.మీ దూరంలో ఉన్న వీరఘట్టం సచివాలయానికి నేను నడిచి వెళ్లాలి. ఓ పక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల్లో పింఛన్‌ కోసం వెళితే మళ్లీ తిరిగి ఇంటికి వస్తానో రానో అని భయంగా ఉంది. చంద్రబాబు తీరు సరైనదికాదు.  – బిడ్డిక పెద్ద సుంబురు, అచ్చెపువలస గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా  

చంద్రబాబుకు కడుపుమంట ఎందుకో?  
వలంటీర్లు ఉదయాన్నే తలుపుతట్టి పింఛన్‌ డబ్బులు ఇచ్చేవారు. అంతేకాదు వలంటీర్ల వల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇపుడు  తగుదనమ్మా అని చంద్రబాబు వలంటీర్లను అడ్డుకుని పింఛన్‌ ఇవ్వకుండా చేస్తే  ఎంత ఇబ్బంది. దీనివల్ల ఆయనకు ఒరిగేది ఏమిటి?  
– బి.మంగమ్మ, పింఛన్‌ లబి్ధదారు, చెందోడు, కోట మండలం, తిరుపతి జిల్లా 

మళ్లీ పాత కష్టాలేనా 
.నేను దివ్యాంగురాలిని. గతంలో పెన్షన్‌ కోసం మా నాన్న వెంకటరమణ ప్రతి నెలా ఒకటో తేదీన కె.నగరపాలెం పంచాయతీ కార్యాలయానికి ఆటోలో తీసుకొని వెళ్లేవారు. ఒక్కోసారి నెలకు రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆ కష్టం తప్పింది.ఈ ఐదేళ్లు ఎక్కడికి వెళ్లకుండానే ఇంటికే పెన్షన్‌ వచి్చంది. ఇప్పుడు వలంటీర్లు పెన్షన్‌ను అందించకూడదని అంటున్నారు.  
– చల్లపల్లి ఎరి్నకుమారి, మంగమారిపేట, విశాఖ జిల్లా 

పింఛన్‌ కోసం పక్క ఊరికి వెళ్లాలా..? 
వలంటీర్లు నెలనెలా ఠంఛన్‌గా ఇంటికే వచ్చి అందజేసేవారు. ఇకపై పింఛన్‌ తీసుకునేందుకు పక్క ఊర్లో ఉన్న సచివాలయానికి వెళ్లాలా? నాకు చాలా ఏళ్లుగా ఆరోగ్యం బాగోలేక ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాకు పింఛన్‌ డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చేవారు. నడవలేని నాకు ఇక ఇబ్బందులు తప్పవు. అక్కడ పడిగాపులు కాసే ఓపిక నాకు లేదు. – వరికూటి మాలకొండారెడ్డి, చెన్నారెడ్డిపల్లి, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా 

ఆయన బుద్ధే అంత 
నాకు పెన్షన్‌ను ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీర్‌ తలుపుతట్టి ఇచ్చేవారు. చంద్రబాబు రాజకీయంలో  ఇప్పుడు నేను పెన్షన్‌ తీసుకోవాలంటే మా గ్రామ సచివాలయానికి వెళ్లాలి. ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయమేస్తోంది. ఇలా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు మా  ఉసురు తప్పక తగులుతుంది.  – కోటపాటి పెంచలయ్య, దిగువపేటలోని గాం«దీవీది, సిద్దవటం, వైఎస్సార్‌ జిల్లా 

నేను సచివాలయానికి ఎలా వెళ్లేది? 
గత  రెండేళ్లుగా పక్షవాతంతో కాళ్లు పూర్తిగా చచ్చుబడ్డాయి. లేవలేని దుస్థితి.  24 గంటలు మంచంపైనే ఉండాల్సి వస్తుంది. ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి వలంటీర్‌ పింఛన్‌ ఇచ్చివెళ్లేది. ప్రస్తుతం వలంటీర్లకు పింఛన్‌ పంపిణీ నిలిపివేయడం చాలా దారుణం. నేను ఏవిధంగా సచివాలయా­నికి వెళ్లాలి. ఎలా పింఛన్‌ తీసుకోవాలని, వరుసలో ఎలా నిలబడాలి. గుర్తొస్తేనే భయమేస్తోంది.   – సువార్తమ్మ, క్రిష్టిపాడు గ్రామం, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా  

ఆ తిప్పలు మాకొద్దు 
నాకు 77 ఏళ్లు. ఎవరూ లేరు. చెల్లెలు కొడుకే అన్నం పెడుతున్నాడు. నడవలేని దుస్థితిలో పింఛన్‌ డబ్బులే ఆసరా. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్‌ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపురం నడిచి వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రతి నెల వలంటీర్‌ ఇంటికొచ్చి పింఛన్‌ ఇస్తున్నారు. ఈ నెల పింఛన్‌ డబ్బులు కోసం ఎదురు చూశా. కానీ సచివాలయానికి వెళ్లి పింఛన్‌ తీసుకోవాలంటున్నారు. జీ.ఎర్రగుడి సచివాలయం వెళ్లాలంటే 14 కిలోమీటర్లు. నడవలేని స్థితిలో ఉన్న నేను అంతదూరం వెళ్లి పింఛన్‌ ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది.  – సయ్యద్‌ గూడమ్మ, తుగ్గలి మండలం, ఆర్‌.కొట్టాల గ్రామం, కర్నూలు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement