Disabled
-
పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు
తణుకు అర్బన్ : ‘ఇరవయ్యేళ్ల నుంచి పింఛను తీసుకుంటున్నాం.. ఎప్పుడూ లేదు, ఇదేం ఖర్మో మరి.. కంటిచూపు కనిపించడం లేదంటే మళ్లీ పరీక్షలంటున్నారు.. పింఛను తొలగించేందుకే ఈ పరీక్షలు.. ఈ ప్రభుత్వానికి ఏ రోగమొచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు.. మీరు ఎన్ని డబ్బులు దొబ్బినా ఫర్వాలేదు వికలాంగుల మీద పడి ఏడుస్తున్నారు ఏంటో.. మీ ఖర్మ కాలింది మీకు కూడా మా గతే పడుతుంది’.. అంటూ దివ్యాంగులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మొదలైంది. ముందుగా పట్టణ పరిధిలోని దివ్యాంగులను వెరిఫికేషన్ శిబిరానికి రావాల్సిందిగా వార్డు సెక్రటరీలు నోటీసులిచ్చారు. మొదటి దఫాలో కంటి, చెవికి సంబంధించి ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరానికి దివ్యాంగులు తమ సహాయకులను తీసుకుని హాజరయ్యారు. ఇబ్బందులు పడ్డ దివ్యాంగులు.. ముఖ్యంగా కంటిచూపు లేని దివ్యాంగుల వెతలు వర్ణనాతీతం. వీరు అటూ ఇటూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవించారు. నిన్ననే నోటీసిచ్చి ఈరోజు నిర్థారణ శిబిరానికి రావాలంటూ హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ‘పింఛను మొత్తాన్ని పెంచడమెందుకు? ఇప్పుడు తొలగించేందుకు కుట్ర లు పన్నడమేంటి?’ అంటూ రుసరుసలాడారు. పింఛనుదారుల్లో ఎవరు సక్రమమో, ఎవరు అక్రమమో తెలుసుకునేందుకు మొత్తం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు నీళ్లప్యాకెట్లు తప్ప ఏమీ ఇవ్వకపోవడంతో పాటు సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. -
దివ్యాంగుల పింఛన్లలో కోత!
సాక్షి, అమరావతి: పింఛన్‌దారుల(pensioners) పట్ల చంద్రబాబు ప్రభుత్వం(chandrababu government) కనికరం చూపడంలేదు. సాధ్యమైనంత మంది లబ్ధిదారులకు పింఛను రద్దు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దివ్యాంగులు, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారినీ వదలడంలేదు. అంగ వైకల్యం(Disabled), వివిధ రకాల వ్యాధులకు గురై పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పింఛన్‌దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత వంటి జబ్బులతో పింఛను పొందుతున్న 24,091 మందినీ పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు ఇచ్చన మార్గదర్శకాలూ కఠినంగా ఉన్నాయి.నిర్ణీత సమయానికి వారికి పరీక్ష జరగకపోతే పింఛను రద్దయినట్లే. పక్షవాతం, కండరాల వ్యాధులతో బాధ పడుతున్న వారిని వైద్య బృందాలు ఇంటికి వెళ్లి పరీక్షించాలని ఆదేశించింది. ప్రభుత్వ వైద్యులు ఇంటికి వచ్చిన సమయంలో వీరు అందుబాటులో లేకపోతే పింఛను రద్దయినట్లే. దివ్యాంగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 7.95 లక్షల మంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీన వైద్యుల కమిటీల ముందు పునః పరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. వీరు నిర్ణీత తేదీన వైద్యుల బృందం ముందు హాజరు కాకపోతే పింఛను నిలిపివేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మెమో జారీ చేశారు. నేటి నుంచే తొలి దశ పరీక్షలుతొలి దశలో శనివారం నుంచే పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత తరహా వ్యాధులతో బాధపడుతూ పింఛన్లు తీసుకుంటున్న 24,091 మందికి ఇంటింటికీ వెళ్లి అర్హత పరీక్షలు చేస్తారు. ఇందు కోసం 112 వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందంలో ఎముకల డాక్టర్, జనరల్ మెడిసిన్, లబ్ధిదారుని ఏరియా స్థానిక పీహెచ్సీ వైద్యుడు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. 88 రోజుల పాటు తొలి దశ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలిన 7.95 లక్షలమంది దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇతర రోగాల కారణంగా పింఛన్ పొందుతున్న వారికి ప్రభుత్వాసుపత్రుల వద్ద కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.పరీక్షల నిర్వహణకు కమిటీలు⇒ ఈ పరీక్షల నిర్వహణకు ప్రతి జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా 11 మంది జిల్లా స్థాయి అ«ధికారులతో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లా కమిటీలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా లబ్ధిదారుల వైద్య పరీక్షలకు షెడ్యూల్ రూపొందిస్తాయి.⇒ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని పింఛనుదారులకు ఏ తేదీలో పరీక్షలు చేయాలో నిర్ణయించి, ఆ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ముందుగా లబ్ధిదారులకు నోటీసులు అందజేస్తారు. వైద్య బృందం ఇంటికి వెళ్లినప్పుడు పక్షవాతం లేదా కండరాల వ్యాధితో పింఛను పొందుతున్న లబ్ధిదారు లేకపోతే పింఛను నిలిపివేస్తారు. అదేవిధంగా దివ్యాంగులు, ఇతర వ్యాధుల పింఛనుదారులు నిర్ణయించిన తేదీకి నిర్ణీత వైద్య బృందం ఎదుట హాజరు కాకపోయినా తని పింఛన్‌ను హోల్డ్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.⇒ ఒక్కొ వైద్య బృందం రోజుకు 25 మంది పింఛనుదారులకు అర్హత– అనర్హతల పరిశీలనతో పాటు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టారు. లబ్ధిదారునికి గతంలో పింఛను పొందేందుకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కాకుండా కొత్త వారి ద్వారా ఇప్పుడు పరీక్షలు చేస్తారు.⇒ఈ మొత్తం కార్యక్రమం పర్యవేక్షణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు. వైద్య బృందాలు పరీక్షలు చేసే పింఛన్‌దారులపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. పునఃసమీక్షలో నిర్ధారించిన వాటిలో కనీసం 5 శాతం లబ్ధిదారులను కలెక్టర్లు సోషల్ ఆడిట్ చేయడానికి అదనంగా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తారు. -
దివ్యాంగులకు ఆరోగ్య బీమా.. ఈ 5 తప్పిదాలు చేయొద్దు
సరైన ఆరోగ్య బీమా పథకమనేది దివ్యాంగులకు ఒక రక్షణ కవచంలాంటిది. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన పథకాన్ని తీసుకోగలిగితే ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే, సరైన బీమా పథకాన్ని ఎంచుకోవడంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. అర్థం కాని పరిభాష, పైకి కనిపించని నిబంధనలు, అనేకానేక ఆప్షన్లు మొదలైన వాటితో ఇదో గందరగోళ వ్యవహారంగా ఉంటుంది.ఒక్క చిన్న తప్పటడుగు వేసినా సరైన కవరేజీ లేకుండా పోవడమో, ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావడమో లేక అత్యవసర పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురుకావడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దివ్యాంగులు ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు నివారించతగిన తప్పిదాలపై అవగాహన కల్పించడం ఈ కథనం ఉద్దేశం. అవేమిటంటే..కీలక వివరాలను పట్టించుకోకపోవడం: ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు స్పష్టంగా కనిపించే కీలక విషయాలను కూడా అంతగా పట్టించుకోకపోవడమనేది సాధారణంగా చేసే తప్పిదాల్లో ఒకటిగా ఉంటుంది. దివ్యాంగుల విషయానికొస్తే, పాలసీలోని ప్రతి చిన్న అంశమూ ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటుంది. కాబట్టి అన్ని నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, పరిమితులు మొదలైన వాటి గురించి జాగ్రత్తగా చదువుకోవాలి.నిర్దిష్ట అనారోగ్యాలు, చికిత్సలకు బీమా వర్తించకుండా మినహాయింపుల్లాంటివేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటి వివరాలను పట్టించుకోకపోతే ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావచ్చు లేదా క్లెయిమ్ పూర్తి మొత్తం చేతికి రాకపోవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు.కేవలం ప్రీమియంనే ప్రాతిపదికగా ఎంచుకోవడం:ప్రీమియం అనేది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కేవలం ప్రీమియం తక్కువగా ఉందనే ఆలోచనతో పథకాన్ని ఎంచుకుంటే చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. సాధారణంగా ప్రీమియంలు తక్కువగా ఉంటే మన జేబు నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి రావచ్చు.కవరేజీ పరిమితంగానే ఉండొచ్చు లేదా దివ్యాంగుల నిర్దిష్ట అవసరాలకు బీమా ఉపయోగపడని విధంగా పరిమితుల్లాంటివి ఉండొచ్చు. ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ గణనీయంగా మెరుగైన కవరేజీని ఇచ్చే పథకాన్ని ఎంచుకుంటే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా మెరుగ్గా ఉంటుంది.కో–పే, సబ్–లిమిట్స్ తెలుసుకోకపోవడం: క్లెయిమ్ చేసేటప్పుడు చేతికి వచ్చే మొత్తంపై కో–పే, సబ్–లిమిట్స్ అనే కీలకాంశాలు చాలా ప్రభావం చూపుతాయి. కో–పే అనేది క్లెయిమ్ సమయంలో పాలసీదారు తాను భరించేందుకు అంగీకరించే నిర్దిష్ట శాతాన్ని తెలియజేస్తుంది. కో–పే పరిమితులు ఎంత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీ చెల్లించే క్లెయిమ్ పేఅవుట్ అంత తక్కువవుతుంది.అలాగే, సబ్–లిమిట్స్ అనేవి నిర్దిష్ట అనారోగ్యాలు లేక చికిత్సలు, అంటే ఉదాహరణకు క్యాటరాక్ట్, మోకాలి మార్పిడి మొదలైన వాటికి వర్తించే కవరేజీ మొత్తాన్ని ఒక స్థాయికి పరిమితం చేస్తాయి. ఈ పరిమితులను చూసుకోకపోతే జేబుకు గణనీయంగా చిల్లు పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం: కాలం గడిచే కొద్దీ ఆరోగ్య అవసరాలు మారుతుంటాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకునే ప్లాన్‌ను ఎంచుకోవడం కీలకం. దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి అదనపు సంరక్షణ లేక విభిన్నమైన చికిత్సలు అవసరమవుతాయి. ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు, ప్రస్తుత అవసరాలు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో తలెత్తే అవకాశము న్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.వివిధ ఆప్షన్లను పరిశీలించకపోవడం: ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు కనిపించిన మొదటి పథకాన్ని తీసేసుకోకుండా వివిధ ప్లాన్లను పరిశీలించి చూసుకోవాలి. కవరేజీ, ఖర్చులు, ప్రొవైడర్ నెట్‌వర్క్‌లు, అదనపు ప్రయోజనాలపరంగా వివిధ పథకాల్లో మార్పులు ఉంటాయి. పలు ప్లాన్లను పోల్చి చూసుకునేందుకు కాస్త సమయం వెచ్చించాలి. దివ్యాంగులకు సంబంధించి ఒక్కో ప్లాన్‌లో కవరేజీ ఏ విధంగా ఉందనేది పరిశీలించి చూసుకోవాలి.ఇందుకోసం కంపారిజన్ వెబ్సైట్ల వంటి సాధనాలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే బీమా అడ్వైజర్ల సలహా తీసుకోవాలి. ప్లాన్ వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇలాంటి విధానాన్ని పాటిస్తే అవసరాలకు తగినట్లుగా ఉండే సమగ్రమైన, చౌకైన పథకాన్ని ఎంచుకోవడానికి వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే, పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా చదువుకోవాలి. ప్రీమియం మాత్రమే చూసుకోవద్దు. కవరేజీ పరిమితులను పరిశీలించుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవాలి. వివిధ ఆప్షన్లను పోల్చి చూసుకోవాలి. -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్‌లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024 -
‘దివ్యాంగులకూ సమానావకాశాలు కల్పించాలి’
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు కూడా మన సమాజంలో అందరితోపాటు సమానావకాశాలు పొందాలని, అందుకోసం వారిని ఆదుకునేందుకు సహృదయులు ముందుకు వస్తే దివ్యాంగులు ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని టీసీపీ వేవ్ సంస్థ యాజమాన్య ప్రతినిధి పవన్ గాది తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి దివ్యాంగుల జీవితాల్లో మార్పు తేవాలన్నది తమ లక్ష్యమని ఆయన అన్నారు. కృత్రిమ అవయవాల ద్వారా ఇక్కడికొచ్చిన దివ్యాంగులు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగారని, ఇక్కడ అమర్చిన ప్రతి ఒక్క అవయవం వాళ్లందరి సామర్థ్యాలను మరింతగా వెలికితీసేలా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం అందించిన స్ఫూర్తితో మరింతమంది దివ్యాంగుల జీవితాలను మార్చగలమన్న నమ్మకం తమకు కుదిరిందని ఆయన అన్నారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి ఆధ్వర్యంలో గుర్తించిన 50 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, వీల్ఛైర్లు, మూడుచక్రాల సైకిళ్లు, హ్యాండ్ కిట్లు, కాలిపర్స్, వాకర్ల లాంటివాటిని టీసీపీ వేవ్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అందించారు. కింగ్ కోఠిలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ స్వప్న వాయువేగుల మాట్లాడుతూ, పారాలింపిక్స్ లాంటి క్రీడల్లో భారతీయులు ఎంతో ప్రతిభ చూపిస్తున్నారని.. దివ్యాంగులకు కొంత సాయం అందించగలిగితే వాళ్లు సమాజంలో అందరితో సమానంగా ముందుకొచ్చి, గౌరవప్రదమైన జీవితం గడపగలరని అన్నారు. నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన ఈ 50 మంది సొంతంగా పరికరాలు సమకూర్చుకునే స్థితిలో లేనందున వారిని ఆదుకోవాలని శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి తమను సంప్రదించగానే వెంటనే ముందుకు వచ్చామని ఆమె తెలిపారు. సమితివారే స్వయంగా ఈ కృత్రిమ అవయవాలను తయారుచేసి ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. రాబోయే రోజుల్లో 500 మంది దివ్యాంగులకు ఈ తరహా కృత్రిమ అవయవాలు, వీల్ ఛైర్లు, వాకర్లు అందజేస్తామని తెలిపారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి సహకారంతోనే తాము ఇదంతా చేయగలుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఫిక్కి ఐటీ ఛైర్మన్ మోహన్ రాయుడు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ సూరావఝల రాము, డీసీఎస్ఐ సీఈఓ డాక్టర్ శ్రీరామ్, సలహాదారు బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్ 75 రెట్లు పెంచాం
సాక్షి, హైదరాబాద్/చాదర్‌ఘాట్/గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత వికలాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో హెలెన్ కెల్లర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా రూ.కోటి మాత్రమే కేటాయిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వ కేటాయింపులతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం 75రెట్లు అధికంగా కేటాయింపులు జరిపిందన్నారు. అదేవిధంగా ఉన్న త విద్యా సంస్థల్లో దివ్యాంగులకు కనీసం 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వయో పరిమితి కూడా ఐదేళ్లు పెంచిందన్నారు. తమ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, ఉద్యాగాల కల్పనలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. అనంతరం తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజే రజినికి ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు బి.శైలజ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం రవీంద్రభారతిలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కిల్లర్ 144వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... వికలాంగులను బాధ్యతగా చూడలేనివారు, వికలాంగులను స్వార్థ ప్రయోజనాలకోసమే వాడుకునేవారు నిజమైన వికలాంగులన్నారు. అనంతరం దివ్యాంగుల కోసం వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. -
బ్యాంకుల నిండా పింఛనుదారులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం పలుచోట్ల పింఛను డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవ్వాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,939.35 కోట్లు విడుదల విషయం చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయమే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. డబ్బు బ్యాంకుల్లో జమ అయినట్లు శనివారం సాయంత్రానికి 44,54,243 (93.29 శాతం) లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్టు అధికారులు తెలిపారు. శనివారమే 14.33 లక్షల మందికి ఇంటివద్దే అందిన పింఛను డీబీటీ రూపంలో బ్యాంకులో జమచేసినవారు పోను మిగిలిన 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై ఉండే 17,56,105 మంది లబ్ధిదారులకు ఒకటోతేదీ నుంచి ఐదోతేదీ మధ్య గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా వారి ఇంటివద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో 14,33,709 మందికి శనివారమే వారి ఇళ్లవద్ద పింఛను డబ్బు పంపిణీ చేశారు. ఇంటివద్ద పింఛన్ల పంపిణీ 81.64 శాతం పూర్తయిందని, మిగిలిన వారికోసం మరో నాలుగు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు
సాక్షి, అమరావతి: పోలింగ్ కేంద్రం వరకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈమేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు శుక్రవారం ప్రకటించారు. వీరికి ఇంటి వద్దే ఓటు వేయాలనేది తప్పనిసరి కాదని, ఇది ఐచ్ఛికం మాత్రమేనని చెప్పారు. ఇటువంటి ఓటర్లు దేశవ్యాప్తంగా 1.70 కోట్లకు పైగా ఉన్నట్లు సీఈసీ తెలిపింది. ఇందులో 85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలకు పైగా, దివ్యాంగులు 90 లక్షలకుపైగా ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లలో మహిళలు ఎక్కువ ఉన్నారు. వీరిలో 33.84 లక్షల మంది పురుషులు కాగా, 47.27 లక్షల మంది మహిళా ఓటర్లు, 18 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న ఓటర్లలో 53.64 లక్షల మంది పురుషులు, 36.42 లక్షల మంది మహిళలు, 442 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. ఈ వర్గాల వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించడం ప్రగతిశీల చర్యగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ వర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే సమయంలో ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని పొందే విధానం సరళంగా, సమగ్రంగా, పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12 డి ఫారమ్‌ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. దివ్యాంగులు 12 డి ఫామ్‌తో పాటు వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరి నుంచి 12 డి ఫామ్‌ను బూత్ లెవల్ ఆఫీసర్ సేకరిస్తారు. జవాబుదారీ, పాదర్శకత కోసం ఇంటి వద్ద ఓటు వేసే వారి వివరాలను అభ్యర్ధులకు అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు. ఈ ఓటర్ల ఇళ్లకు భద్రతా అధికారులతో పాటు ప్రత్యేక పోలింగ్ బృందం వెళ్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తారో ముందుగానే ఆ ఓటర్లకు తెలియజేస్తారు. ఇంటి వద్ద ఓటు వేసే పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యతను పాటిస్తారు. ఇంటి వద్ద ఓటు వేసిన తరువాత ఆ బ్యాలెట్లను భద్రంగా బ్యాక్సుల్లో ఉంచి తిరిగి రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేస్తారు. రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు మొత్తం ఓటర్లు 2,11,088 పురుషులు 84,155 మహిళలు 1,26,927 థర్డ్ జెండర్ 6 రాష్ట్రంలో 40 శాతం వైకల్యం గల ఓటర్లు మొత్తం ఓటర్లు 5,18,193 పురుషులు 3,02,374 మహిళలు 2,15,795 థర్డ్ జెండర్ 24 -
బోసి నవ్వులకు భరోసా ఏదీ?
వేకువజామునే వచ్చి ‘అవ్వా.. తాత.. ఇదిగో మీ పింఛన్ సొమ్ము తెచ్చాను. తీసుకోండి’ అంటూ అప్యాయంగా పలకరించే వలంటీర్ సేవలను నిర్ధాక్షిణ్యంగా చంద్రబాబు రాక్షసానందం కోసం నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఆశగా ఎదురు చూసే వలంటీర్లను ఆ సేవల నుంచి తొలగించారనే నిజాన్ని నమ్మలేక దిగాలు పడిపోయారు. వలంటీర్లను తొలగించాలంటూ చంద్రబాబు కుట్రతో ఎన్నికల కమిషన్‌కు íఫిర్యాదు చేయడంతో వారిని ఆ విధుల నుంచి తప్పించారు. దీంతో ప్రతి నెల మాదిరిగానే ఈ నెల సూర్యుడు పొడవకుండానే వస్తారని వేచి చూసి.. చూసి బారెడు పొద్దెక్కినా రాకపోవడంతో చంద్రబాబు కుటిలత్వం వల్ల పింఛన్ అందలేదని తెలుసుకుని గుండెలు అవిసేలా రోదించారు. ప్రతి నెలా ఒకటో తేదీన బోసి నవ్వులతో ఎదురు చూసే ఆ వృద్దులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడాలా ? అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్న తరుణంలో గంటలపాటు సచివాలయాల అరుగులమీద అధికారుల కోసం ఎదురుచూసిన జ్ఞాపకాలను చూసి ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, నెట్వర్క్ ఇలాగైతే ఎలా..? ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్దురాలి పేరు పొటుకూరి గంగమ్మ. వయస్సు 85 సంవత్సరాలు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలోని సురేంద్రం. సొంతంగా ఏ పని చేసుకోలేదు. కనీసం లేచి నిలబడలేదు. ప్రతి నెల వలంటీర్ వచ్చి ఈమెకు పింఛన్ నగదు అందచేసేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించడంతో ఈ నెల సకాలంలో పింఛన్ అందలేదు. ఈమె పింఛన్ తీసుకోడానికి సచివాలయానికి వెళ్లాలంటే నాలుగు ఫర్లాంగులు దూరం ప్రయాణించాలి. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. ఇద్దరు పట్టుకుని ఆటోలో తీసుకువెళ్లాలి. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో ఎలా వెళ్లాలి అని ఆందోళన చెందుతోంది. –పొటుకూరి గంగమ్మ, సురేంద్రం గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా అయ్యో అననివారు లేరు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాళం శివకృష్ణ. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంగళరావు నగర్‌కు చెందిన ఈయన పుట్టుకతో అంధుడు. పోలియో బారిన పడిన దివ్యాంగురాలు రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం శివకృష్ణకు రోడ్డు ప్రమాదంలో నడుము దెబ్బతిని స్పర్శ లేకుండా పోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దివ్యాంగ (అంధుడు) పెన్షన్ పొందుతున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని స్టాండ్ సహకారంతో నడుస్తున్న భార్య రాజేశ్వరికి కూడా పెన్షన్ మంజూరైంది. వచ్చే పింఛన్, అమ్మ ఒడి పథకంతో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ జీవితం గడుపుతున్నారు. మంచానికే పరిమితమైన భర్త, స్టాండ్ సహాయంతో నడుస్తున్న భార్య ఇద్దరూ పింఛన్ కోసం కనీసం సచివాలయానికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వారికి వలంటీర్ల సహకారంతో ప్రతినెలా 1వ తేదీన ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. టీడీపీ నీచ రాజకీయాలకు ఈ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది. – అంధుడు శివకృష్ణతో భార్య రాజేశ్వరి వెంగళరావునగర్, గుంటూరు జిల్లా డయాలసిస్ ఎలా చేయించుకోవాలి ? 68 ఏళ్లు పైబడిన నేను చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. వారంలో ఒకసారి డయాలసిస్, మరో రోజు వైద్యం చేయించుకుంటున్నా. షుగరు, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి నెలా వలంటీర్ వచ్చి 1వ తేదీన తెల్లవారకముందు రూ.10 వేలు పింఛన్ అందించేవాడు. వాటిని వైద్యం కోసం ఉపయోగిస్తాను. కానీ వలంటీర్లు పింఛన్ ఇవ్వడానికి వీల్లేదంటూ చంద్రబాబు చేసిన ఇబ్బందికి ఈ నెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి క్యూలో నిలబడలేని పరిస్థితి. మా లాంటి రోగులను, వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడు. – మాతంగి వెంకాయమ్మ, డయాలసిస్ రోగి, హరిశ్చంద్రపురం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా సచివాలయాల్లో పడిగాపులు తప్పవా..? నాలుగు సంవత్సరాలుగా వలంటీర్ ప్రతి నెల 1వ తేదీన ఇంటికే వచ్చి పింఛన్ అందించేవాడు. నా లాంటి వృద్ధులకు ఎంతో మేలు జరిగేది. ఇప్పుడు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. అక్కడికి వెళ్లి పడిగాపులు కాసి తెచ్చుకొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాను, వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ నిలిపివేయాలనడం చాలా దారుణం. అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. వృద్దుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ కొనసాగించాలి. – సయ్యద్ పెద్దబీబి, ఉరుటూరు, వీరపునాయునిపల్లె మండలం, కడప జిల్లా అన్ని తానై చూసేది ఒకటోతేదీ వస్తే వలంటీర్ మా వీధిలోకి వచ్చి ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేది. గతంలో పెన్షన్ తీసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగి బాధలు పడేదాన్ని. వలంటీర్ వ్యవస్థ వచి్చన తరువాత పెన్షన్‌తో పాటు అన్ని తానై చూసేది. గతంలో భారీ వర్షాలు రావడంతో మా ప్రాంతం వరద ముంపునకు గురైంది. ఇళ్లలోకి నీళ్లు చేరవడంతో ముందుగానే వలంటీరు వచ్చి జాగ్రత్తలు తీసుకుని మాకు పునరావాసం కలి్పంచి సహాయం చేసింది. అలాంటి వారిని పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించడం బాధాకరం. – గులాబ్జాన్, బాపక కాలువ, మదనపల్లె.చిత్తూరు జిల్లా. ఇక మాకు పస్తులే కాళ్లు చేతులు సన్నగిల్లి ఒంట్లో సత్తువ లేక మంచం పట్టాను. ఐదేళ్లుగా ఇంటికే పొద్దున్నే వలంటీర్ వచ్చి పెన్షన్ అందించేవారు. మా లాంటి వృద్ధులకు వరంలా ఉండేది. ఇప్పుడు మానవత్వం లేని రాజకీయ స్వార్థంతో మేమంతా సచివాలయం వద్ద పెన్షన్ తీసుకోవాలని చెబుతు న్నారు. వలంటీర్ తెచ్చి పింఛన్ ఇవ్వకుంటే పస్తులతో చావు తప్పదు. ఆర్.కరాపాడులో సచివాల యం వద్దకు వెళ్లేందుకు శరీరం సహకరించదు. మా లాంటి పేదలపై ఇటువంటి కక్షసాధింపు మంచిది కాదు –హత్తి త్రినాథ్, కన్నుపుట్టుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా ఈ పాపం ఊరికే పోదు నా వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో మంచంలో నుంచి లేవాలంటే ఇద్దరు మనుషులు పట్టుకుని లేపాలి. ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి వృద్దాప్య పింఛన్ ఇచ్చేవాడు. ఈ నెల ఇంకా అందలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంటే నా వల్ల కాదు. వలంటీర్ నేను ఉండే మంచం దగ్గరికే వచ్చి పింఛను ఇచ్చే వాడు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లేవారు లేరు. ఈ పాపం ఊరికే పోదు – షేక్ బడేబి,కురిచేడు, ప్రకాశం జిల్లా నడవలేని నేను సచివాలయానికి ఎలా వెళ్లాలి? ఉదయం నుంచి వలంటీరు వచ్చి పింఛన్ ఇస్తారేమో అని ఎదురు చూశాను. మూడో తేదీ వరకు పింఛన్ ఇవ్వరని తెలిసింది. సచివాలయానికి వెళ్లి నేనే పింఛన్‌ను తెచ్చుకోవాలని చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నాను. ఇప్పటి వరకు గ్రామ వలంటీరు ఒకటొవ తేదీనే మా ఇంటికి వచ్చి పింఛన్ అందించారు. ఇప్పుడు వలంటీర్లు పని చేయకూడదని చెప్పడం దారుణం. వలంటీర్లు పనిచేయకపోతే నాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. ఈ ఐదేళ్ల నుంచి పింఛన్ కోసం వెళ్లే నరకయాతన తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితులు వచ్చాయి. – సూరగాని తులశమ్మ, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా) పింఛన్ కటకటే.. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. డయాలిసిస్ చేయించుకునే స్థోమత లేకపోయినప్పటికీ సీఎం జగన్ ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు రూ.10 వేలు పింఛన్‌ను మూడు నెలలుగా అందజేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయవద్దంటూ ఫిర్యాదు చేయడంతో ఈ నెల సచివాలయం వద్దకు వెళ్లి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. – నాబాన వెంకటే‹Ù, గర్భాం గ్రామం, మెరకమూడిదాం మండలం, విజయనగరం జిల్లా రెండు కిలోమీటర్లు నడవాలి ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేది. ఇప్పుడు సచివాలయానికి వచ్చి పింఛన్ తీసుకోమంటున్నారు. మా ఇంటి నుంచి 2.కి.మీ దూరంలో ఉన్న వీరఘట్టం సచివాలయానికి నేను నడిచి వెళ్లాలి. ఓ పక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల్లో పింఛన్ కోసం వెళితే మళ్లీ తిరిగి ఇంటికి వస్తానో రానో అని భయంగా ఉంది. చంద్రబాబు తీరు సరైనదికాదు. – బిడ్డిక పెద్ద సుంబురు, అచ్చెపువలస గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా చంద్రబాబుకు కడుపుమంట ఎందుకో? వలంటీర్లు ఉదయాన్నే తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. అంతేకాదు వలంటీర్ల వల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇపుడు తగుదనమ్మా అని చంద్రబాబు వలంటీర్లను అడ్డుకుని పింఛన్ ఇవ్వకుండా చేస్తే ఎంత ఇబ్బంది. దీనివల్ల ఆయనకు ఒరిగేది ఏమిటి? – బి.మంగమ్మ, పింఛన్ లబి్ధదారు, చెందోడు, కోట మండలం, తిరుపతి జిల్లా మళ్లీ పాత కష్టాలేనా .నేను దివ్యాంగురాలిని. గతంలో పెన్షన్ కోసం మా నాన్న వెంకటరమణ ప్రతి నెలా ఒకటో తేదీన కె.నగరపాలెం పంచాయతీ కార్యాలయానికి ఆటోలో తీసుకొని వెళ్లేవారు. ఒక్కోసారి నెలకు రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ కష్టం తప్పింది.ఈ ఐదేళ్లు ఎక్కడికి వెళ్లకుండానే ఇంటికే పెన్షన్ వచి్చంది. ఇప్పుడు వలంటీర్లు పెన్షన్‌ను అందించకూడదని అంటున్నారు. – చల్లపల్లి ఎరి్నకుమారి, మంగమారిపేట, విశాఖ జిల్లా పింఛన్ కోసం పక్క ఊరికి వెళ్లాలా..? వలంటీర్లు నెలనెలా ఠంఛన్‌గా ఇంటికే వచ్చి అందజేసేవారు. ఇకపై పింఛన్ తీసుకునేందుకు పక్క ఊర్లో ఉన్న సచివాలయానికి వెళ్లాలా? నాకు చాలా ఏళ్లుగా ఆరోగ్యం బాగోలేక ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాకు పింఛన్ డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చేవారు. నడవలేని నాకు ఇక ఇబ్బందులు తప్పవు. అక్కడ పడిగాపులు కాసే ఓపిక నాకు లేదు. – వరికూటి మాలకొండారెడ్డి, చెన్నారెడ్డిపల్లి, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆయన బుద్ధే అంత నాకు పెన్షన్‌ను ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీర్ తలుపుతట్టి ఇచ్చేవారు. చంద్రబాబు రాజకీయంలో ఇప్పుడు నేను పెన్షన్ తీసుకోవాలంటే మా గ్రామ సచివాలయానికి వెళ్లాలి. ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయమేస్తోంది. ఇలా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది. – కోటపాటి పెంచలయ్య, దిగువపేటలోని గాం«దీవీది, సిద్దవటం, వైఎస్సార్ జిల్లా నేను సచివాలయానికి ఎలా వెళ్లేది? గత రెండేళ్లుగా పక్షవాతంతో కాళ్లు పూర్తిగా చచ్చుబడ్డాయి. లేవలేని దుస్థితి. 24 గంటలు మంచంపైనే ఉండాల్సి వస్తుంది. ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి వలంటీర్ పింఛన్ ఇచ్చివెళ్లేది. ప్రస్తుతం వలంటీర్లకు పింఛన్ పంపిణీ నిలిపివేయడం చాలా దారుణం. నేను ఏవిధంగా సచివాలయానికి వెళ్లాలి. ఎలా పింఛన్ తీసుకోవాలని, వరుసలో ఎలా నిలబడాలి. గుర్తొస్తేనే భయమేస్తోంది. – సువార్తమ్మ, క్రిష్టిపాడు గ్రామం, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా ఆ తిప్పలు మాకొద్దు నాకు 77 ఏళ్లు. ఎవరూ లేరు. చెల్లెలు కొడుకే అన్నం పెడుతున్నాడు. నడవలేని దుస్థితిలో పింఛన్ డబ్బులే ఆసరా. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపురం నడిచి వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రతి నెల వలంటీర్ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు కోసం ఎదురు చూశా. కానీ సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. జీ.ఎర్రగుడి సచివాలయం వెళ్లాలంటే 14 కిలోమీటర్లు. నడవలేని స్థితిలో ఉన్న నేను అంతదూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. – సయ్యద్ గూడమ్మ, తుగ్గలి మండలం, ఆర్.కొట్టాల గ్రామం, కర్నూలు జిల్లా -
ఓట్ ఫ్రమ్ హోం
సాక్షి, నరసరావుపేట: చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు.. ఆటోలో ఓ ముసలవ్వ.. ఇలా అనేక మంది ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు పడే తిప్పలు గతంలో కనిపించేవి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారి కష్టాలకు చెక్ పెట్టింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40%కి మించి వైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సీఈసీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే.. ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే ‘ఓట్ ఫ్రమ్ హోం’కు అవకాశం కల్పిస్తాయి. బూత్ లెవల్ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి.. వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. పోలింగ్ బూత్ తరహా ఏర్పాట్లు ఇంటి నుంచే ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు రాదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. ఇంటి నుంచి ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మందికి ఓటు హక్కు కల్పించారనే వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారమిస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. మంచి అవకాశం... 80 ఏళ్లు నిం.డిన మా లాంటి వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించి ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశముంది. – యెన్నం వెంకట నర్సిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. ఉప్పలపాడు, పల్నాడు జిల్లా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక కొంతమంది తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతమైంది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అర్హులైన వారు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్ శివశంకర్, పల్నాడు జిల్లా కలెక్టర్ -
చేతులు లేకున్నా చెక్కుచెదరలేదు
కాగజ్‌నగర్‌టౌన్: పుట్టుకతోనే చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. కాళ్ల వేళ్లే కుంచగా మారి అందమైన బొమ్మలెన్నో వేశాయి..కంప్యూటర్ కీ బోర్డుపై టక్టక్ శబ్దం వినిపిస్తూ ఎన్నో ఎంట్రీలు చేశాయి. ఆర్థిక ఇబ్బందులెన్ని ఎదురైనా నిరుత్సాహపడకుండా పీజీ వరకూ చదివి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు జాకీర్‌పాషా. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఆటో డ్రైవర్ షేక్ బాబా–మెహరా దంపతుల మొదటి సంతానమైన జాకీర్ పాషా డిగ్రీ వరకు కాగజ్‌నగర్‌లోనే చదివాడు. ఆపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నాడు. పీజీ చదువుతుండగానే కంప్యూటర్ కోర్సులు కూడా పూర్తి చేశాడు. ♦ జాకీర్‌పాషా కాళ్లతో పెయింటింగ్స్ వేయడమే కాకుండా.. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాడు. ♦ హరితహారం కార్యక్రమంలో వందలాది మొక్కలను కాళ్ల సాయంతో నాటి ఆదర్శంగా నిలిచాడు. ♦ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా కేంద్రానికి వెళ్లి కాలి సాయంతో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ♦ తాజాగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి పలువురు ఆపరేటర్లను ఎంపిక చేశారు. అందులో జాకీర్పాషాకు అవకాశం దక్కింది. కాళ్లతోనే వివరాలను అప్లోడ్ చేస్తున్నాడు. రుణంరాలేదు.. కొలువూదొరకలేదు గత నవంబర్‌లో తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వెలువడిన రుణాల కోసం జాకీర్‌పాషా దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన కొలువు ఇప్పించాలని పలుమార్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సైతం కొలువు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు సమరి్పంచాడు. ప్రభుత్వ సాయంకోసం ఎదురుచూపు మాది నిరుపేద కుటుంబం. నాతోపాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. నాన్న ఆటో నడిపితే వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నా. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే నా కుటుంబానికి మేలు జరుగుతుంది. – జాకీర్ పాషా, దివ్యాంగుడు -
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
విమానంలో వికలాంగుడి పట్ల అమానుషం: కన్నీటి పర్యంతమైన జంట
న్యూఢిల్లీ: వికాలాంగుడన్న కనీస కనికరం లేకుండా విమానంలో దారుణంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. తమకు జరిగిన అవమానాన్ని తడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో తీరని మానసిక వేదనకు గురయ్యమాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ కెనడా క్షమాపణ చెప్పింది. బ్రిటిష్ కొలంబియాకు చెందిన హార్డ్‌వేర్ సేల్స్‌మ్యాన్ రోడ్నీ హాడ్జిన్స్ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. వీల్ చెయిర్ లేనిదే కదలలేని స్థితి. అయితే ఆగస్టులో వివాహ వార్షికోత్సవ వేడుకుల కోసం ఎయిర్ కెనడాలో భార్య డీనాతో కలిసి లాస్ వెగాస్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా విమానం ల్యాండ్ అయినప్పుడు మోటరైజ్డ్ వీల్‌చైర్ కావాలని అడిగాడు. అయితే విమానం మళ్లీ టేకాఫ్‌కు సిద్ధం కావడానికి ముందు వీల్‌చైర్‌ను ఎక్కించుకోవడానికి సమయం లేదని ఫ్లైట్ అటెండెంట్ దంపతులకు ఖరాఖండీగా చెప్పేశారు. పైగా దిగాలంటూ తొందరపెట్టారు. దీంతో రోడ్నీ భార్య అతడిని బలవంతంగా రెండు కాళ్లు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రోడ్నీ హాడ్జిన్స్ దంపతులు(ఫైల్ ఫోటో) ఈ విషయాన్ని డీన్నా హాడ్జిన్స్ ఇటీవలి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు 12 లైన్లకు వరకూ భర్త వీపుమీద జరుగుతూ ఉంటే, తాను రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్లాల్సి వచ్చిందని, దీంతో అతనికి వీపుపైన, కాళ్లకు గాయాలని చెప్పుకొచ్చారు. తనకూ వెన్నులో నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో శారీరక బాధలతో పోలిస్తే.. తన భర్త హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమకు తీరని మానసిక వ్యధను మిగిల్చిందంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఎనిమిదినెలలకు ప్లాన్ చేస్తున్న టూర్ అవమానకరంగా సాగిందని పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలోఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ కెనడా వారు హాడ్గిన్స్ దంపతులు క్షమాపణలు చెప్పి, తగిన నష్టపరిహారాన్ని కూడా అందించారు. పరిహారంతో సరా...?: రోడ్నీ హాడ్జిన్స్ పరిహారంతో సమస్య పరిష్కారం కాదంటూ వికలాంగ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ వ్యవహరించిన తీరుపై రోడ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనేదే తన తాపత్రయమని చెప్పారు. -
పింఛన్లు:65,98,138
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం. ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. -
దివ్యాంగుల పింఛన్ రూ.4,016
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా నెలవారీగా ఇస్తున్న పింఛన్ పరిమితిని పెంచింది. ఇప్పటివరకు రూ.3,016 చొప్పున దివ్యాంగులకు నెలవారీగా పింఛన్ ఇస్తుండగా... జూలై నుంచి రూ.4,016 చొప్పున ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం జీఓ. 25 జారీ చేసింది. ఇప్పటివరకు ఇస్తున్న పింఛన్‌కు మరో వెయ్యి రూపాయల పరిమితిని పెంచిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సెర్ప్ సీఈఓను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ ఆదేశించారు. దివ్యాంగుల పింఛన్ పెంపునకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభ వేదికగా ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో సంబంధిత శాఖ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. పింఛన్ పెంపుదలతో రాష్ట్రంలో దాదాపు 5,11,656 మందికి అదనపు లబ్ధి కలగనుంది. ముఖ్యమంత్రికి మంత్రుల కృతజ్ఞతలు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆసరా పింఛన్లలో భాగంగా నెలవారీగా ఇస్తున్న మొత్తాన్ని పెంచినందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో సామాజిక పింఛన్ల పథకాన్ని ఇంత పెద్ద మొత్తంలో అమలు చేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని అన్నారు. -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్‌కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్‌గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్‌కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!
ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం పర్యటన ముగిసే సమయానికి తిరు ఎస్ మణికందన్ అనే దివ్యాంగుడిని కలిశారు. అతనితో సమావేశమై ప్రత్యేక సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను 'ప్రత్యేక సెల్ఫీ' పేరుతో మోదీ ట్విట్టర్లో షేర్ చేస్తూ అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అతను సొంతంగా దుకాణాన్ని నడపడమే గాక తన రోజువారి లాభాలలో గణనీయమైన భాగాన్ని బీజేపీకి ఇస్తాడని చెప్పారు. "ఆయన నేను ప్రారంభించిన రోడ్‌కు బూత్ ప్రెసిడెంట్‌గా, కార్యకర్తగా పనిచేయడం మాకెంతో గర్వకారణం. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో నేను కార్యకర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అతని జీవితం స్ఫూర్తిదాయకం, అలాగే మా పార్టీ సిద్ధాంతాల పట్ల అతను కనబర్చిన నిబద్ధత కూడా ఆదర్శవంతంగా ఉంది . అతని భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మోదీ చెన్నైలో రూ. 5వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది ప్రభుత్వ పని సంస్కృతి, దార్శినికతల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు మోదీ. తమ ప్రభుత్వ డెడ్‌లైన్ కంటే ముందే ఫలితాలను సాధిస్తుందన్నారు. తమ ప్రభుత్వం విజయాలను అందుకోవడంలో పని సంస్కృతి, విజన్ అనే రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అంటే ఆలస్యం కానీ ఇప్పుడూ ఆ అర్థం డెలిరీ(తగిన సమయానికి అందించడం). తాము పన్ను చెల్లించే చెల్లింపుదారుల ప్రతి రూపాయికి తాము జవాబుదారిగా పనిచేస్తున్నాం. తాము నిర్థిష్ట గడువులతో పని చేస్తాం, వాటికంటే ముందే ఫలితాలను సాధిస్తాం అని మోదీ ఒక బహిరంగ సభలో అన్నారు. (చదవండి: సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి) -
‘ఇలాంటి పిల్లల’కూ హక్కులుంటాయి!
‘దివ్యాంగులు మెట్లు ఎక్కలేకపో వడానికి కారణం వాళ్లకు కళ్లో, కాళ్లో లేకపో వడం కాదు సమాజానికి సహానుభూతి లేకపో వడం’ అంటుంది తమిళ రచయిత్రి కంభంపా టి శ్రీలత.డిస్లెక్సియాతో పుట్టిన కూతురి కోసం తానే టీచర్‌గా మారింది శ్రీలత. ‘నార్మల్ వ్యక్తుల మెజారిటీ సమాజం దివ్యాంగుల పట్ల ఎటువంటి బాధ్యత వహించకపో యినా వాళ్లు తమ జీవితాలను నిశ్శబ్దంగా నిర్మించుకుంటూనే ఉంటారు’ అంటుందామె. కూతురి జీవితాన్ని, ఆమెలాంటి దివ్యాంగుల జీవితాలను ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకంగా తీసుకొచ్చిందామె. శ్రీలత తాను రాసిన ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకాన్ని ఏడు అధ్యాయాలుగా విభజించింది. ఆ ఏడింటిలో ఒకదాని పేరు ‘దృష్టి లేనిది ఎవరికి?’. ‘ఈ సమాజంలో దృష్టి లేనిది అంధులకా దివ్యాంగుల పట్ల ఎటువంటి ఆలోచనా లేని సామాన్యులకా?’ అని ప్రశ్నిస్తుంది అందులో.‘సమర్థత (ఎబిలిటీ) మీకు మాత్రమే ఉంటుందా? అందుకే దివ్యాంగులను డిజేబుల్ అంటారా? వారూ సమర్థులే. కాని వారి కదలికలకు వీలు కల్పించలేని నిర్మాణాలు, చదవడానికి వీల్లేని చదువులు, వారికి సమాన అవకాశం ఇవ్వలేని స్కూళ్లు... ఇవి వారిని సమర్థత లేనివారుగా చేస్తున్నాయి’ అంటుందామె. చెన్నైలో నివసించే శ్రీలత సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి. ఆమె రాసిన కవితా సంకలనాలు ఆదరణ పొందాయి. ‘టేబుల్ ఫర్ ఫోర్’ అనే నవల పెద్ద పురస్కారాల వరకూ వెళ్లింది. అయితే ఆ రాసిన పుస్తకాల కంటే తాజాగా వెలువరించిన ‘దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్’ పుస్తకం విలక్షణమైనది. దానికి కారణం ఆమె కూతురు అనన్యకు 9 ఏళ్లు ఉండగా ‘ఇలాంటి అమ్మాయిని స్కూల్లో ఉంచుకోలేం’ అని ప్రిన్సిపల్ నిర్దాక్షిణ్యంగా చెప్పడమే. ఆ ‘ఇలాంటి అమ్మాయి’ (దిస్ కైండ్ ఆఫ్ చైల్డ్)ని గుండెలకు హత్తుకుని తానే చదువు చెప్పుకుంది శ్రీలత. దానికి కారణం అనన్య డిస్లెక్సియాతో బాధ పడుతూ ఉండటమే. ఇంకా కచ్చితంగా చె΄్పాలంటే అనన్యకు ‘స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ’ (ఎస్‌ఎల్‌డి) ఉంది. ‘నా కూతురిని కూడా అందరి పిల్లలతో పా టు కూచోబెట్టి చదివించే స్కూళ్లు ఉండాలి. ఆ స్కూల్లో నా కూతురు స్థితిని స్వీకరించే పరిస్థితి ఉండాలి. నా కూతురే కాదు అలాంటి అందరు పిల్లలకు’ అంటుంది శ్రీలత. ‘న్యూరోడైవర్సిటీ’... అంటే మెదడు సంబంధమైన లోపా లతో పుట్టే పిల్లలు– ఆటిజమ్, డిస్ర్పా క్సియా, డిస్కాల్క్యులియా, డిస్గ్రాఫియా... తదితర అవస్థలతో బాధ పడుతుంటే వారి కోసం సమాజంలో ఎటువంటి ఆలోచనా ఉండదని ఈ పుస్తకంలో విపులంగా రాస్తుంది శ్రీలత. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి కంటే టీనేజ్‌కు వచ్చినప్పుడు ఎదురయ్యే మానసిక, శారీరక పరిస్థితుల గురించి చాలా అవగాహన లోపం ఉందని అంటుందామె. అందుకే తన పుస్తకంలో ‘మా షరతులతో మేము’ అనే చాప్టర్‌ను రాసింది. దివ్యాంగులు తమ పరిమితిని గుర్తించి ఆ పరిమితిని స్వీకరించి రాజీ పడక హక్కుల కోసం పో రాడాలని కోరుతుందామె. ‘దివ్యాంగుల హక్కులు మానవ హక్కులు. మీరు జాలి పడి రాల్చే సౌకర్యాలు కాదు’ అంటుంది శ్రీలత. దివ్యాంగుల విషయంలో అన్నింటి కంటే ముఖ్యమైన సమస్య ‘కేర్ గివర్స్’. అంటే ‘చూసుకునేవాళ్లు’. తల్లిదండ్రులు, భార్యాభర్తలు... వీరు దివ్యాంగులతో ఎలా మెలగాలో ఒక చాప్టర్లో రాస్తే తోబుట్టువులు, పిల్లలు ఎలా మెలగాలో ఇంకో చాప్టర్లో రాసింది. ‘పో లియోతో ఉన్న తండ్రితో నార్మల్‌గా పుట్టిన కొడుకు ఎలా మసలుకున్నాడో... తన తండ్రిని అర్థం చేసుకుని ఎలా బాసటగా నిలిచాడో ఒక కేస్‌స్టడీ ఈ పుస్తకంలో ఉంది’ అని చెబుతుంది శ్రీలత. అనేక మంది దివ్యాంగుల గెలుపు కథలను, తల్లిదండ్రుల, తోబుట్టువుల, సహాయకుల, స్పెషల్ ఎడ్యుకేటర్ల అనుభవాలను కథలుగా, ఇంటర్వ్యూలుగా, మౌఖిక కథనాలుగా ఈ పుస్తకంలో రికార్డు చేసింది శ్రీలత. దివ్యాంగుల నిజమైన అవసరాలు ఏమిటో సమాజానికి రావాల్సిన దృష్టి ఏమిటో ఈ పుస్తకం సమర్థంగా తెలియచేస్తుంది. ‘ఇలాంటి పుస్తకాలు ఎంతమంది రాస్తే అంత మంచిది’ అంటుంది శ్రీలత. అన్నింటి కంటే ముఖ్యం శ్రీలత కుమారుడు అనిరుద్ధ తన సోదరి అనన్యను చూస్తూ ‘ప్రతి స్కూల్లో పిల్లలకు దివ్యాంగుల గురించి పా ఠాలు చెప్పాలి. దివ్యాంగులతో ఎలా మెలగాలో పిల్లలకు సిలబస్‌గా ఎందుకు చెప్పరు? అప్పుడు కదా స్కూల్లో ఏ దివ్యాంగ పిల్లవాడైనా చేరితే ఇతర పిల్లలు అతనితో బాగా మెలిగేది’ అన్న మాట ఎంతో ఆలోచించదగ్గది. -
దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్
నౌపడ: హితారామ్ సత్నామీ. వయోభారంతో ఆరోగ్యం క్షీణించిన వృద్ధుడు. పైగా దివ్యాంగుడు. ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లాలో మారుమూల గ్రామం భుత్కాపడని నివసిస్తున్నాడు. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మధుబాబు పెన్షన్ యోజన’ లబ్ధిదారుడు. స్వయంగా నడవలేడు. ప్రతినెలా దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు ఇతరుల సాయంతో ప్రయాణించి, పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పెన్షన్ తెచ్చుకొనేవాడు. ఫిబ్రవరిలో మాత్రం అతడికి ఈ ప్రయాణ బాధ తప్పింది. గ్రామ సర్పంచి డ్రోన్ ద్వారా పెన్షన్ అందజేసే ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. సర్పంచ్ సరోజ్ అగర్వాల్ డ్రోన్ ద్వారా పెన్షన్ డబ్బులను తన ఇంటి వద్దకే చేర్చారని హితారామ్ సత్నామీ ఆనందం వ్యక్తం చేశాడు. వృద్ధుడు హితారామ్ గురించి తెలిసిన తర్వాత సొంత డబ్బులతో ఆన్లైన్లో డ్రోన్ కొనుగోలు చేశామని, ప్రతినెలా డ్రోన్ సాయంతో అతడికి పెన్షన్ అందజేయాలని నిర్ణయించామని సర్పంచ్ సరోజ్ అగర్వాల్ చెప్పారు. -
దివ్యాంగ బాలిక దారుణ హత్య.. కత్తితో దాడి చేసి పరారైన సైకో
సాక్షి, తాడేపల్లి రూరల్: బాలిక తల్లి మీద కక్ష పెంచుకున్న యువకుడు చివరికి దివ్యాంగురాలైన ఆమె కుమార్తెను వేధింపులకు గురిచేసి చివరికి హత్యచేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తాడేపల్లి పట్టణం ఎన్టీఆర్ కరకట్టకు చెందిన వంగ మనోరమ కుమార్తె ఎస్తేరురాణి (17) పుట్టుకతోనే దివ్యాంగురాలు(అంధురాలు). తండ్రి యేబుతో తల్లి విడిపోవడంతో ఎస్తేరురాణి తల్లి వద్ద ఉంటోంది. మనోరమ ఇంటికి వచ్చి వెళ్లే దేవదాసు అనే యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన నాగపోగు ధనుంజయరాజు అలియాస్ కుక్కల రాజు పరిచయమయ్యాడు. మనోరమ, కుక్కల రాజుల ఇళ్లు ఎదురెదురు కావడంతో దేవదాసు రెండు ఇళ్లకూ వస్తూ పోతూ ఉంటాడు. మూడు రోజుల కిందట దేవదాసు మద్యం తాగి మనోరమ ఇంట్లో వాంతి చేసుకోవడంతో ఆయన చేతే మనోరమ ఇల్లు కడిగించింది. దీనిని కుక్కల రాజు వీడియో తీసి అందరికీ చూపడంతో కక్ష పెంచుకున్న దేవదాసు.. కుక్కల రాజును చంపుతానని బెదిరించాడు. దీంతో మొదలైన వివాదం.. కుక్కల రాజు మనోరమ చేయి పట్టుకుని లాగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేంత వరకూ వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాజు బంధువులకు విషయం చెప్పడంతో వారు కుక్కల రాజును మందలించారు. దీంతో కోపం పెంచుకున్న కుక్కల రాజు ఆదివారం రాత్రి ఎవరూ లేని సమయంలో మనోరమ ఇంటికి వెళ్లి అంధురాలైన ఎస్తేరురాణి చేయిపట్టుకుని లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో ఆమె మెడపై, తలపై విచక్షణ రహితంగా నరికాడు. ఎస్తేరురాణి పెద్దగా కేకలు వేయడంతో తల్లితో పాటు అక్కడే ఉన్న బంధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే కుక్కల రాజు పరారయ్యాడు. గాయపడిన ఎస్తేరురాణిని బంధువులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన వెలుగులోకొచి్చంది. దీంతో పోలీసులు కుక్కల రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీడీపీ నేతల సంరక్షణలో కుక్కల రాజు కుక్కల రాజు వివాహానంతరం విజయవాడ రాణిగారితోట నుంచి కరకట్టకు వచ్చి భార్య, తల్లితో కలసి నివాసముంటున్నాడు. 2019లో తల్లితో, భార్యతో వివాదం రావడంతో వారిని తీవ్రంగా కొట్టి గొడ్డలితో నరికేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తల్లి, భార్య పారిపోయి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించగా, కుక్కల రాజు గొడ్డలితో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో తల్లీ, భార్య అతనికి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి కరకట్ట మీద పట్టాభిరామయ్య కాలనీకి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు అతనికి ఆశ్రయం కల్పించారు. కుక్కల రాజు కుక్కలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలకు, కుక్కల రాజుకు గొడవ జరగ్గా.. కుక్కల రాజును చేరదీసిన వారే చితకబాది, పెంపుడు కుక్కలతో కరిపించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మొదటి నుంచి సైకోలా వ్యవహరిస్తున్న కుక్కల రాజును పోలీసుల నుంచి కాపాడింది టీడీపీ నేతలే. ఇదిలా ఉండగా, బాధితురాలి కుటుంబ సభ్యులను సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తుందని చెప్పారు. పోలీసుల అదుపులో నిందితుడు.. ఎస్తేరు రాణిని హత్యచేసిన కుక్కలరాజును పోలీసులు గంట వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే నార్త్‌జోన్ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, పెదకాకాని పోలీసులను అప్రమత్తంచేసి క్రైం సిబ్బందితో జల్లెడ పట్టారు. సీతానగరం రైల్వేబ్రిడ్జి మీద నుంచి విజయవాడ వెళ్తుండగా నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం మరోవైపు.. ఎస్తేరురాణి మృతిచెందడంతో ఆమె కుటుంబానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాడేపల్లి ఇన్చార్జి తహసీల్దార్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయాన్ని మనోరమకు తెలియజేసినట్లు చెప్పారు. చదవండి: ఇన్విజిలేటర్ మందలించాడని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య -
వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్!
మనం కొంచెం కష్టం వస్తే చాలు నాకే ఎందుకు ఇలా అనుకుంటాం. కుంగిపోయి దిగులుపడిపోతాం. ఛాలెంజ్‌గా తీసుకోం. పైగా ఈ కష్టం మనకు ఏమైన నేర్పుతుందా! లేక మనకు తెలియంది ఏదో చెబుతుందని అని పాజిటివ్‌గా అస్సలు ఆలోచించాం. మరికొంతమంది ఆత్మహత్యలకు వరకు వెళ్లిపోతారు. ఇంకొందరు నాబతుకింతే అన్నట్టుగా ఉండిపోయి ఏ తాగుడో లేక డ్రగ్స్కో బానిసైపోతారు. కొందరే ఎలాంటి కష్టమైన సరే తెగువతో పోరాడాలనుకుంటారు. వారే ఏదో ఒకరోజు గొప్పస్థాయికి ఎదుగుతారు. ఒకవేళ అందుకోలేకపోయినా ఎందరికో స్ఫూర్తిని అయినా నింపుతారు. అలాంటి వారే ఈ ప్రపంచానికి కావాల్సింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి ఒక కాలు లేదు అయినా సరే మరో కాలితో తన జీవనాన్ని సాగిస్తున్నాడు. కుమిలిపోలేదు కాదుగదా అయ్యో! ఈ ఒంటి కాలితో ఏ పని చేయగలను అని కూడా అనుకోలేదు. తన పొట్ట పోషించుకుని ఏదో విధంగా బతకాలని తపించాడు. బహుశా అదే అతని ఆత్మశక్తి కాబోలు. ఒక దివ్యాంగుడు ఒక చేతిలోని ఊతకర్ర సాయంతో మరో చేతితో రిక్షా లాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ సంఘటన ప్రేరణ ఇచ్చేలానే గాక ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించే పాఠం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో బాస్ నీ గట్స్‌కి సెల్యూట్ అంటూ అతన్నిప్రశంసిస్తూ ట్వీట్ చేశారు చాలా మంది నెటిజన్లు. जीना है गर कुछ प्रयास तो करना होगा स्वर्ग देखना है तो खुद को मारना होगाhttps://t.co/PwsFvru9b7 pic.twitter.com/PLzGJd3YdG — Aamir Khan ₚₐᵣₒdy (@AamirKhanfa) January 17, 2023 (చదవండి: ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఊహించని షాక్.. పెండ్యులం రాడ్ విరగడంతో..) -
Alina Alam: అద్భుతదీపం
దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది... అలీన అద్భుతదీపం కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు.. ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ అనేది తన అనుభవంలోకి వచ్చింది. ‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది అలమ్. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి. ‘రోమన్ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన. 23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్. ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్ మాటల్లో... ‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’ నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది. అయితే పెద్దగా స్పందన లభించలేదు. ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది. ‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన. కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాం్యపస్లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన. ‘మిట్టీ’ సక్సెస్ఫుల్ కేఫ్గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది. ‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి. దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్. -
నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి రూ.90,000 విలువైన..
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన ఖలీల్ అనే దివ్యాంగుడికి సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. ఈ ఏడాది జూలైలో వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు వచ్చిన ముఖ్యమంత్రిని ఖలీల్ కలిసి తనకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రమిచ్చాడు. దీంతో అతనికి రూ.90,000 విలువైన ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేస్తూ కలెక్టర్ సుమిత్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏవో రాజ్‌కుమార్ ఆ వాహనాన్ని ఖలీల్‌కు అందజేశారు. తనకు ఎలక్ట్రిక్ వాహనం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి ఖలీల్ కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: (నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల) -
Viral Video: గుజరాత్ లో కేజ్రీవాల్ కోసం వికలాంగుడి ప్రచారం..
-
ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్‌కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. కాలిఫోర్నియాకు చెందిన ఇంజినీరింగ్ మేనేజర్ డిమిత్రి బోరోడెంకో బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న తనను ఆఫీసుకు తిరిగి రావాలని ఆదేశించారని అయితే దీనికి నిరాకరించడంతో ట్విటర్ తనను తొలగించిందని పేర్కొన్నారు. ఇది ఫెడరల్ అమెరికన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఉల్లంఘన అని బోరోడెంకో చెప్పారు. తన వైకల్యం కారణంగా కోవిడ్ బారిన పడితే కష్టమని ఆయన వాదించారు. అలాగే డిమాండ్ పనితీరు,ఉత్పాదకత ప్రమాణాలను అందుకోలేక పోవడంతో వైకల్యం ఉన్నఅనేక మంది ట్విటర్ ఉద్యోగులు బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మరో దావాలో పేర్కొన్నారు. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్, 2020లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం యజమానికి భారం కానంతవరకు వర్క్ ఫ్రం హోం పని విధానం సహేతుకమైందే. అలాగే రిమోట్ పనివిధానాన్ని రద్దు చేసిన మస్క్ నేతృత్వంలోని ట్విటర్ యాజమాన్యం చట్టం ప్రకారం 60 రోజుల నోటీసు ఇవ్వకుండా వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందని ఆరోపిస్తూ అదే కోర్టులో మరో ఫిర్యాదు దాఖలైంది. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న మస్క్ ఇంత తక్కువ సమయంలో ఉద్యోగులను చాలా ఆవేదనకు, బాధకు గురిచేశాడని వారిని అనిశ్చితిలో పడవేశాడని ట్విటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ మూడు కేసులను వాదిస్తున్న న్యాయవాది షానన్ లిస్-రియోర్డాన్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. ట్విటర్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 3,700 మంది ఉద్యోగులను లేదా కంపెనీలోని సగం మంది ఉద్యోగులను ఆకస్మికంగా తొలగించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. (మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) కాగా ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ, ట్విటర్ అభివృద్ధికి తోడ్పడతారో, లేదా సంస్థను వీడతారో తేల్చుకోమని ట్విటర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేయడం కలకలం రేపింది. దీంతో వందలాది ఉద్యోగులు కంపెనీకి గుడ్‌బై చెప్పడం మరింత ఆందోళన రేగింది. ఫలితంగా నవంబరు 21, సోమవారం వరకు ట్విటర్ ఆఫీసులను మూసివేస్తున్నట్టు ట్విటర్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు పనితీరు, ప్రతిభ ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందని తెగేసి చెప్పింది. అలాగే రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల పనితీరును ఎక్కువ చేసి చూపిస్తూ ఆయా మేనేజర్లు తప్పుడు రిపోర్ట్ చేస్తే వారిపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించడం గమనార్హం. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) -
దివ్యాంగురాలైన కూతురి కోసం రోబో
పనజి: ఆయన పేరు బిపిన్ కదమ్. వయసు 40 ఏళ్లు. ఉండేది గోవాలో. పని చేసేది దినసరి కూలీగా. కదమ్‌కు ఓ 14 ఏళ్ల కూతురు. దివ్యాంగురాలు. చేతులు కదపలేదు. తినిపించడం మొదలుకుని అన్ని పనులూ దగ్గరుండి చూసుకునే తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో రెండేళ్ల క్రితం పూర్తిగా మంచాన పడింది. కదమ్ సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన ఆయన్ను బాగా ఆలోచింపజేశాయి. దాంతో కూతురికి వేళకు తిండి తినిపించేందుకు ఏకంగా ఓ రోబోనే తయారు చేసేశాడు కదమ్! ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఎవరి సాయమూ తీసుకోకుండా ఏడాది పాటు తదేకంగా శ్రమించాడు. ఆన్లైన్ సమాచారం ఆధారంగా చివరికి సాధించాడు. ఈ రోబో వాయిస్ కమాండ్‌కు అనుగుణంగా పని చేస్తుంది. పాప కోరిన మేరకు పండ్లు, దాల్ రైస్ వంటివి తినిపిస్తుంది. అమ్మలా ఆకలి తీరుస్తోంది గనుక దీనికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు కదమ్. ఇప్పుడు రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే కూతురి నవ్వు ముఖం చూస్తే ఎనలేని శక్తి వస్తోందని చెబుతున్నాడు. కదమ్ ఘనతను గోవా ఇన్నొవేషన్ కౌన్సిల్ ఎంతో మెచ్చుకుంది. కమర్షియల్‌గా మార్కెటింగ్ చేసేందుకు వీలుగా రోబోను మరింత మెరుగుపరచాలని సూచించింది. అందుకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ‘‘ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహిస్తున్నారు. అదే మాదిరిగా నా కూతురు కూడా నాతోపాటు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మనిర్భర్‌గా ఉండాలన్న తపనే నాతో ఈ పని చేయించింది’’ అంటున్నాడు కదమ్. -
ఆశ చూపించి.. ఉసూరుమనిపించి..
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): నిధుల సేకరణలో కమీషన్లు ఆశ చూపించి మా ప్రేమ సంస్థ యజమాని ముకుందా తమను మోసం చేశారంటూ ఓ వికలాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని మా ప్రేమ సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు, వికలాంగుడైన ముద్దులు సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఏడాది క్రితం వరకు మా ప్రేమ సంస్థలో వలంటీర్‌గా పని చేశానన్నారు. చారిటీ పేరిట సేకరించిన నిధుల్లో ప్రతి రోజు సగం కమిషన్‌గా ఇస్తానని సంస్థ అధినేత ముకుందా నమ్మబలికాడన్నారు. దీంతో తెన్నేటి పార్కు నుంచి ఆర్కే బీచ్ వరకు పర్యాటకుల నుంచి రోజూ రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు సేకరించి ముకుందాకు ఇచ్చేవాడినన్నారు. కొన్ని రోజులు కమీషన్ సక్రమంగానే ఇచ్చిన ముకుందా.. తరువాత ఆపేశారని ఆరోపించారు. దీనికి తోడు జాలరిపేటకు చెందిన పలువురు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి, వారి నుంచి డిపాజిట్ కింద రూ.3 వేలు తీసుకోవాలని తనకు సూచించాడన్నారు. దీంతో పదుల సంఖ్యలో మహిళల నుంచి నిధులు సేకరించినట్లు తెలిపారు. అయితే వారికి ఎలాంటి రుణాలు ఇవ్వకపోవడంతో వారిలో కొందరు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని సంతోష్‌కుమార్ తెలిపారు. డబ్బులు విషయంపై ప్రశ్నించడంతో తనను వలంటీర్‌గా తొలగించాడన్నారు. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, ఎంవీపీ పోలీసు స్టేషన్లో ముకుందాపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ముకుందాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. (చదవండి: అలలపై కలల నావ..!) -
అబోలీ.. ద డిజేబుల్డ్ సెలబ్రెటీ
కొంతమందికి పరిస్థితులన్నీ చక్కగా అనుకూలంగా ఉంటే, మరికొందరికి కనీసం వయసుకు తగ్గినట్లుగా శరీరం ఎదగక నానా ఇబ్బందులు పడుతుంటారు. అబోలి జరీత్ జీవితం సరిగ్గా ఇలానే ఉంది. శరీరం ఎదగకపోడంతో తన పనులు తాను సరిగా చేసుకోలేని సమస్యతో బాధపడుతోంది. బతికినంత కాలం సమస్య తీరదని తెలిసినప్పటికీ తను ఒక స్టార్‌గా ఎదగాలనుకుంటుంది అబోలి. కేవలం మూడు అడుగుల ఎత్తున్న అబోలీ... స్టార్ అయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ నెటిజన్లతో అబ్బో..లీ అనిపిస్తుంది. నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ జరీత్ చిన్నారిగా ఉన్నప్పుడే ఆస్టియోమలాసియా (అస్థిమృదుత్వం) వచ్చింది. చిన్నపిల్లల్లో అసాధారణంగా వచ్చే ఈ వ్యాధి విటమిన్ లోపం కారణంగా వస్తుంది. అబోలికి ఈ సమస్య రావడంతో ఎముకలు సరిగా ఎదగలేదు. దీనికితోడు కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం మానేశాయి. ఫలితంగా తన ఎత్తు కేవలం మూడు అడుగుల నాలుగు అంగుళాలు మాత్రమే పెరిగింది. ఈ అనారోగ్య సమస్య వల్ల ప్రస్తుతం 19 ఏళ్ల అబోలీ ఐదేళ్ల చిన్నారిలా కనిపిస్తుంది. కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో నిత్యం డయపర్లు వేసుకుని ఉండాల్సిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదని డాక్టర్లు స్పష్టం చేయడంతో మరింత దిగులుపడింది అబోలి. ఒకపక్క మానసిక బాధ, మరోపక్క తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా కదలలేని పరిస్థితి. అయినా అబోలి ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఉపశమనం కలిగించే వైద్యచికిత్సలు తీసుకుని కాస్త అటూ ఇటూ కదలగలిగేలా శక్తిని పుంజుకుంది. స్టార్‌గా ఎదగాలని.. ఆరోగ్యం బాగోకపోయినా అబోలికి చిన్నప్పటి నుంచి స్టార్‌గా ఎదగాలనే కల ఉంది. ఈ విషయం తెలిసిన వారు నిరుత్సాహపరిచేలా గేలిచేయడం, ఆమె దురదృష్టాన్ని అవహేళనచేస్తూ తనని మరింత కుంగదీసేవారు. అయినా అబోలి అధైర్యపడలేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎలాగైనా స్టార్‌గా ఎదగాలనుకుంది. ఈ క్రమంలోనే.. ముందుగా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంది. కానీ శరీరం సహకరించకపోవడంతో..గాయనిగా మారాలనుకుంది. సంగీతం నేర్చుకుంటూనే ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్ వరకు చేరింది. అంతేగాక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాక్టింగ్ చేస్తోన్న ఫోటోలు, వీడియోలు, పాటలు పాడుతోన్న వీడియోలు పంపుతూ నెటిజన్లను అలరిస్తోంది. తన హావభావాలతో ఏడువేలమందికి పైగా ఫాలోవర్స్‌ను మెప్పిస్తూ డిజేబుల్డ్ సెలబ్రెటీగా దూసుకుపోతోంది. నాకు నేనే ప్రేరణ.. సంగీతం నేర్చుకుంటూ, పాటలు పాడుతూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాను. నా గురించి ఎవరు ప్రతికూలంగా మాట్లాడినా నేనస్సలు పట్టించుకోను. చిన్నప్పటి నుంచి ఎదుర్కోన్న అనే అనుభవాలు నాకు నేనే ప్రేరణగా తీసుకునేలా చేశాయి. నాకున్న ఒకే ఒక కల పాపులర్ సింగర్‌ని కావడం. నా దృష్టి మొత్తం దానిమీదే ఉంటుంది. – అబోలి -
ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని స్పష్టంచేశారు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం కాకూడదని.. ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విటర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022 ఏం జరిగింది? హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇండిగో ఏమంటోంది? రాంచి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం వరకూ గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని.. కానీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని.. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరుకున్నారని వివరించింది. చదవండి👉🏻 రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ -
ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం
Disabling Bomb Their bare hands and just a bottle of water: ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. ఒక వైపు రష్యా విదేశీయుల తరలింపు నిమిత్తం కాల్పుల విరమణ ప్రకటిస్తూనే మరోవైపు నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్కెయిన్ చాలా ఘోరంగా అతలాకుతలమైపోతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ దేశాన్ని తమ ప్రజలను రక్షించుకుంటామంటూ తమ దేశ భక్తిని చాటుతున్నారు. మరోవైపు సైనికులు కూడా తమవంతుగా ప్రాణాలను లెక్కచేయకుండా రష్యా బలగాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అత్యంత ధైర్య సాహసాలతో రష్యా సైన్యాన్ని నిలవరించడమే కాక రష్యా దాడులను తిప్పికొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగా ఉక్రేనియన్ పేలుడు ఆర్డినెన్స్ డిస్పోజల్ స్పెషలిస్ట్‌ల బృందం తమ దేశంలో పేలకుండా పడి ఉన్న బాంబులను కేవలం ఉత్తి చేతులతో వాటిని నేరుగా తీసి, వాటర్ బాటిల్‌తో నిర్విర్యం చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమ దేశ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ బాంబులను నిర్విర్యం చేస్తున్న తీరుని చూస్తే మనసు చలించుపోతుందంటూ వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ వాసులు సైతం రష్య యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దంటూ నినాదాలు చేసి మరీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. This #Russia-dropped bomb would flatten a building — and yet these #Ukraine EODs defuse it with 2 hands and a bottle of water, while shells audibly land nearby. Mind boggling bravery.pic.twitter.com/KvCZeOxRyz — Charles Lister (@Charles_Lister) March 9, 2022 (చదవండి: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!) -
భార్య కాపురానికి రావడం లేదని ... దివ్యాంగుడి బలవన్మరణం
శాలిగౌరారం: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ దివ్యాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అడ్లూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్లూరు గ్రామానికి చెందిన వరికుప్పల ఉపేందర్(35)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం అతడికి భార్యతో పాటూ కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తనతల్లిగారింటికి ఉపేందర్ భార్య వెళ్లింది. అప్పటినుంచి కాపురానికి రావడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపేందర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వరికుప్పల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. -
పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు?
సాక్షి,ఇల్లందకుంట(కరీంనగర్): ‘నేను వికలాంగుడిని కాదా.. సంవత్సరం నుంచి పింఛన్ వస్త లేదు.. కళ్లకు కనిపిస్తలేనా.. నాకెందుకు పింఛన్ ఇవ్వరు’ అంటూ ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జమ్మికుంట మండలంలోని వావిలాలలో సోమవారం రాత్రి టీఆర్ఎస్ ధూంధాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మడుపు రాజేశ్ వేదిక పైకి ఎక్కి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త అతని కాలర్ పట్టుకొని, కిందికి దింపేందుకు ప్రయత్నించగా పడిపోయాడు. అనంతరం రాజేశ్ మాట్లాడుతూ.. కార్యక్రమం ప్రారంభానికి ముందే తనకు ఏడాదిగా పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని వాపోయాడు. వారి నుంచి తప్పించుకొని స్టేజి ఎక్కి తన బాధను అందరికీ చెప్పుకునే ప్రయత్నం చేశానన్నాడు. ఇందులో ఏ విధమైన రాజకీయాలు లేవని పేర్కొన్నాడు. పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్‌కు, పదిసార్లు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగినా రాలేదని చెప్పాడు. చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
జుట్టుపట్టుకుని లాగి కొడుతూ... ‘మై గరీబ్ ఆద్మీ హూ’ అన్న విడిచి పెట్టలేదు..
జైపూర్: రాజస్థాన్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పోలీసులు.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. బిల్వారా జిల్లాలోని.. ఒక దేవాలయం ముందు చెప్పులు అమ్మే వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు.. బిల్వారాలోని స్థానిక దేవాలయం ముందు ఒక దివ్యాంగుడు చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్లు అక్కడికి చేరుకుని చెప్పుల షాపును తీసేయాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా.. అతడిని నోటికొచ్చినట్లు దుర్భాషాలాడారు. అతడిని బయటకు లాగి జుట్టుపట్టుకుని విచక్షణ రహితంగా కొట్టసాగారు. రోడ్డుపై లాక్కెళుతూ క్రూరంగా ప్రవర్తించారు. ఆ దివ్యాంగుడు ‘మై గరీబ్ ఆద్మీ హూ’ నన్ను విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికి పోలీసులు విడిచిపెట్టలేదు. అయితే, స్థానికులు పోలీసులను ఎవరు కూడా వారిని ఆపే సాహసం చేయడం లేదు. అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై బిల్వారా పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సంఘటపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. కాగా, గతంలో లక్నో సమీపంలోని ఉన్నావ్‌లో 18 ఏళ్ల కూరగాయలు అమ్మే వ్యక్తిపై పోలీసులు ఇలానే క్రూరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ వ్యక్తి కొన్నినెలల తర్వాత మృతిచెందాడు. దీంతో బంధువులు అతని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఉన్నతాధికారులు దిగివచ్చి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో బంధువులు తమ నిరసనను మానుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరగటంతో పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్: అంగవైకల్యం ఉన్నా.. స్టెప్పులు ఇరగదీసిన యువతి
ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ ఓ యువతి డాన్స్‌ని ఇరగదీసింది. ఆ యువతి తనకున్న ఒక్క కాలుతో అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వికలాంగ డాన్స్‌ర్ సుభ్రీత్ కౌర్ ఘుమ్మన్ అగ్నిపత్లోని హిట్ సాంగ్ 'చికినీ చమేలీ' డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఆమె చేసిన డాన్స్‌కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుభ్రీత్ మొదటి సారి.. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆమె ఈ షోలో రెండో రౌండ్‌కు అర్హత కూడా సాధించింది. ఇటీవల సుభ్రీత్ అప్పట్లో తాను డాన్స్ చేసిన పాటకు మళ్లీ అదే ఎనర్జీతో స్టెప్పులేసిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో... " నా మొదటి టీవీ నృత్య ప్రదర్శనను 7 సంవత్సరాల తరువాత మళ్లీ చేస్తున్నాను ... మీకు ఇది నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను" అనే క్యాప్షన్తోటి ఈ వీడియోను అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఇప్పటికే 28 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టింది. నెటిజన్లు ఆమె డాన్స్‌కు , ఆత్మధైర్యానికి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by subhreet Kaur Ghumman (@subhreet.ghumman) -
దివ్యాంగులకు 5 శాతం ‘డబుల్’ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ పథకంలో దివ్యాంగులకు 5 శాతం ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దివ్యాంగుల పరికరాల పంపిణీ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, విద్య, ఉపాధి పథకాల్లో 5 శాతం, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దివ్యాంగులకు పరికరాలను అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి దరఖాస్తులు ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ఫిబ్రవరి ఆరో తేదీ వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి 15 నుంచి పరికరాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. -
దివ్యాంగులకు కావాల్సింది మద్దతు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు సమాజం నుంచి సానుభూతిని కాకుండా మద్దతును కోరుకుంటారని, వారికి సమాజం అండగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన ‘అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు 2020’లో ఆయన మాట్లాడుతూ ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు సాంకేతికతను ఉపయోగించుకుని దివ్యాంగులకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని సూచించారు. స్టార్టప్‌లు తయారు చేసే పరికరాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం నిలబెట్టే దిశగా అడుగు పడాలని, బధిరులు, అంధులతో పాటు అంగవైకల్యం కలిగిన వారికి అవసరమైన పరికరాలు తయారు కావాలని కేటీఆర్ అన్నారు. వ్యవసాయం, మహిళల రక్షణతో పాటు సమాజంలో అవసరమైన రంగాలన్నింటిలో శాస్త్రీయ ఆవిష్కరణలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎగ్జిబిషన్ పరిశీలన దివ్యాంగులు నిత్యం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం స్టార్టప్‌లు రూపొందించిన ఆవిష్కరణలతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ ఇంక్యుబేటర్ టీ వర్క్స్‌లో తమ ఆలోచనలకు రూపం ఇవ్వాలని స్టార్టప్‌లకు సూచించారు. ఆవిష్కర్తలు, విద్యార్థులు, స్టార్టప్‌లు రూపొం దించిన 30కి పైగా ఆవిష్కరణలను కేటీఆర్ పరిశీలించారు. ఐఐటీ హైదరాబాద్, టీ వర్క్స్, సోషల్ ఆల్ఫా, ఆర్ట్లాబ్ ఫౌండేషన్, అసిస్టెక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ నేత్రవిజ్ఞాన సంస్థలు ఎగ్జిబిషన్లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.వాసుదేవరెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, దివ్యాంగుల సం క్షేమశాఖ కార్యదర్శి దివ్య, కమిషనర్ శైలజ, టీఎస్ఐసీ సీఈఓ రవి నారాయణ్ పాల్గొన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు: ఎంపీ సంతోష్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: సమాజంలో ఎంతోకాలం అవమానాలు, అసమానతలకు గురైన దివ్యాంగులు ఇటీవల అవకాశాలను అందిపుచ్చుకుని అనేక రం గాల్లో ప్రతిభ చూపుతున్నారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సంతోష్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాం గుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, వారు ఆత్మగౌరవంతో బతికేలా ఆసరా పథకం ద్వారా ఆదుకుంటోందని పేర్కొన్నారు. దివ్యాంగులతో ముచ్చటించిన ఎంపీ సంతోష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. త్వరలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, అంధులకు లాప్టాప్స్, బధిరులకు 4జి స్మార్ట్ఫోన్లు, బ్యాటరీ వీల్చైర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాసుదేవరెడ్డి వెల్లడించారు. దివ్యాంగులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ కవిత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు గురువారం కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు రూ.500 పెన్షన్ ఇవ్వగా, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్షన్ మొత్తాన్ని రూ.3,016కు పెంచిందన్నారు. గత ఆరేళ్లుగా వికలాంగుల కార్పొరేషన్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దివ్యాంగులకు ఉపయోగపడే వాహనాలు, అనేక ఇతర పరికరాలను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ కృషికి గత ఏడాది డిసెంబర్ 3న రాష్ట్రపతి అవార్డు దక్కిందని కవిత గుర్తు చేశారు. కవితను కలసిన వారిలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, 21 దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు. -
నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా!
సాక్షి, ఆదిలాబాద్ : ఆడపిల్లలు భారమనుకుంటున్న ఈ రోజుల్లో ఓ తండ్రి అంగవైకల్యం గల తన కూతురును పరీక్ష కేంద్రానికి స్వయంగా తీసుకొచ్చి పరీక్ష రాయించాడు. పట్టణంలోని కోలిపుర కాలనీకి చెందిన మందుల్వార్ బావురావుకు అంగ వైకల్యం ఉన్న కూతురు వికిత ఉంది. అయితే ఆమె బంగారు భవిష్యత్తు కోసం బావురావు తన కూతురును ఓపెన్‌లో డిగ్రీ చదివిస్తున్నాడు. అయితే సోమవారం పరీక్షలు రాయడానికి ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాల పరీక్ష కేంద్రానికి ఆమెను తీసుకొచ్చి ‘నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా’ అంటూ ధైర్యాన్నిచ్చాడు. కాగా వికితకు సహాయంగా పదవ తరగతి విద్యార్థి పరీక్ష రాశాడు. -
కాన్వాయ్ ఆపి.. దివ్యాంగుడి గోడు విని..
సాక్షి, గోల్కొండ: దివ్యాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానవత్వంతో ఆలకించి, సమస్య పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలీచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో ఓ వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు ఆపి దిగారు. క్యా హై భాయ్... సలామంటూ చేయి కలిపారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనను మహ్మద్ సలీం అని పరిచయం చేసుకున్న అతడు.. గతంలో డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదని, ఉండేందుకు ఇల్లు కూడా లేదని, తగిన సహా యం చేయాలని కోరాడు. దీనికి సీఎం వెంటనే స్పందించారు. సలీం సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు టోలీచౌకిలో సలీం నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు. సలీం దివ్యాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండటంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. -
‘కనిపెంచే’ దైవాలు
పెళ్లయ్యాక పిల్లలు కలగాలని ఆలుమగలు కోరుకుంటారు. సంతానం కలిగాక వారి భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటారు. ఆ దంపతులు కూడా గతంలో అలాగే కలలు కన్నారు. కాని వీరి ఊహలకు భిన్నంగా విధి మరో రాత రాసింది. పుట్టిన ఇద్దరు పిల్లలు పాఠశాల విద్య చదువుకుంటున్న సమయంలో అంగవైకల్యంతో కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఇది జరిగి 22 సంవత్సరాలయింది. నాటి నుండి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల సేవలోనే బతుకు సాగదీస్తున్నారు. ఈ హృదయ విదారక ఉదంతం ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలోనిది. ఇరగవరం: జిల్లాలోని అయినపర్రు గ్రామానికి చెందిన కర్రి వరహాలరెడ్డి, లక్ష్మిప్రభావతిలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నాగలక్ష్మి శారదాదేవి (34), చిన్న కుమార్తె జయసాయిశ్రీ(22). పుట్టినప్పుడు ఇద్దరూ బాగానే ఉన్నారు. పెద్ద కుమార్తె 5వ తరగతి చదువుతుండగా 10 సంవత్సరాల వయసులో స్కూల్‌కు వెళ్తుండగా తరచూ పడిపోతూ ఉండేది. దీంతో తల్లిదండ్రులు తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలు చేసి ఆమెకు జన్యుపరమైన లోపం ఉందని చెప్పారు. ఎంత వైద్యం చేసినా పరిస్థితి మెరుగుకాదని వైద్యులు చెప్పారు. అయినా మెరుగైన వైద్యం కోసమని బిడ్డను రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ వంటి ఆసుపత్రులకు తీసుకువెళ్లి చూపించారు. అక్కడ కూడా కొన్నిసార్లు మందులు ఇచ్చి పరీక్షలు చేసి బాగవుతుందని చెప్పేవారు. చివరికి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి వారు పెద్ద కుమార్తె కాళ్ళల్లో నుండి కొద్ది శరీర భాగాన్ని కట్‌చేసి టెస్ట్‌లకు అమెరికా పంపించారు. ఈ అమ్మాయికి మస్క్యులర్ డిస్ట్రోఫీ (కండరాల బలహీనత) వచ్చిందని, కండరాలు క్రమక్రమంగా చచ్చుబడిపోతాయని, శరీరంలో కొన్ని భాగాలకు రక్త ప్రసరణ కూడా ఆగిపోతుందని రిపోర్టు వచ్చింది. ఈ జబ్బు నయంకాదని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. పెద్ద కుమార్తెకు 12 సంవత్సరాల వయస్సులో వ్యాధి సోకింది. ఇప్పుడు ఆమె వయస్సు 34 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు శరీరంలోని కాళ్లు, చేతులు చచ్చుబడి బతికిఉన్న జీవశ్ఛవాల్లా ఉన్నారు. ఇదిలా ఉంటే పెద్ద కుమార్తె తరువాత 12 సంవత్సరాలకు పుట్టిన చిన్నకుమార్తె జయసాయిశ్రీ పరిస్థితి కూడా అదే. 12 సంవత్సరాల వయస్సులో ఆమెకు కూడా కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడం ప్రారంభమైంది. దీంతో చిన్న కుమార్తెకు కేరళ ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తే ఉపయోగం ఉంటుందని ప్రయత్నం చేశారు. దాని వల్ల కూడా ఎటువంటి ఉపయోగం కలగలేదు. దీంతో కన్నబిడ్డలు కళ్ల ముందు కదలలేని పరిస్థితుల్లో ఉంటే తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు. అయినా బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటూ బతుకుతున్నారు. వరహాలరెడ్డి తనకు ఉన్న 2 ఎకరాల పొలాన్ని బిడ్డల వైద్య ఖర్చుల కోసం అమ్మేశారు. అయినకాడికి బంధువులు దగ్గర అప్పులు కూడా చేశారు. చివరకు మిగిలింది ఒక పెంకుటిల్లు మాత్రమే. అది కూడా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట్లో తల్లి లక్ష్మీప్రభావతే బిడ్డల ఆలనాపాలన చూసుకునేది. అయితే బిడ్డలు ఎదిగేకొద్దీ వారిని కదల్చాలన్నా ఇద్దరి సహాయం తప్పకుండా కావాలి. దీంతో వరహాలరెడ్డి కూడా పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే బిడ్డలను చూసుకుంటున్నారు. వైద్యానికి డబ్బులు లేవు. బతకడానికి పనిచేసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో పిల్లలకు పింఛన్ ఇవ్వమని అధికారులు, నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ వారు కనికరించలేదు. చివరకు సంవత్సరం క్రితం ఒక పాపకు పింఛను రాశారు. వాటితోటే బతుకుతున్నారు. అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తే బిడ్డలను బతికించుకుంటామని తండ్రి వరహాలరెడ్డి వేడుకుంటున్నారు. దాతలు చైతన్య గోదావరి బ్యాంక్, ఏలేటిపాడు, అకౌంట్ నంబర్ 720710025000296లో సహాయం జమ చేయాలని ప్రాధేయపడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదుకోవాలి పెద్దకుమార్తె 22 సంవత్సరాల నుండి, చిన్న కుమార్తె 10 సంవత్సరాల నుండి మసు్క్యలర్ డిస్ట్రోఫీ (కండరాల బలహీనత) వ్యాధితో బాధ పడుతున్నారు. పిల్లలిద్దరికీ చాలా చోట్ల పలురకాల వైద్యం చేయించాం. ఎక్కడా ఫలితం కనిపించలేదు. చివరకు ఉన్న ఆస్తి మొత్తం అయిపోయింది. అయినకాడికి అప్పులు చేశాం. ఇక ఉండటానికి ఇల్లు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందరికీ అన్ని విధాలా సహాయం చేస్తున్నారు. మాకు కూడా సహాయం చేస్తే పిల్లలిద్దరికీ తిండిపెట్టుకుని బతికించుకుంటాం. – కర్రి వరహాలరెడ్డి, పిల్లల తండ్రి మేం బతికి ఉన్నంతకాలం సాకుతాం వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకోవలసిన పిల్లల్ని మేమే చూసుకుంటున్నాం. ఉదయం ముఖం కడుక్కునేటప్పటి నుంచి స్నానం చేయించడం, దుస్తులు మార్చడం అన్నీ మంచం మీదే. అన్నీ తల్లిదండ్రులుగా మేమే చేస్తున్నాం. మొదట్లో నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. భర్త పనికి వెళ్లేవారు. పిల్లల వయస్సు పెరగడంతో నా భర్త సహాయం కూడా అవసరమవుతోంది. దీంతో ఇద్దరికీ పనికి పోవడానికి వీలుకావడం లేదు. చిన్నపాపకు వచ్చే పింఛన్ డబ్బులతో బతుకుతున్నాం. మేం చనిపోతే బిడ్డల పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. – కర్రి లక్ష్మీ ప్రభావతి, పిల్లల తల్లి -
‘పెళ్లి’.. ప్రోత్సాహమేదీ?
సాక్షి, ఖమ్మం: దివ్యాంగులను వివిధ రంగాల్లో ప్రోత్సహించేందుకు.. వారు స్వయం శక్తితో ఎదిగేందుకు.. ఆర్థిక సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా.. అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఎవరైనా సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే.. వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. జిల్లాలో సుమారు 30వేలకు పైగా వికలాంగులు ఉన్నారు. వీరిని ఆర్థికంగా ప్రోత్సహించడంతోపాటు వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా వికలాంగులకు సబ్సిడీ రుణాలతోపాటు వివాహ ప్రోత్సాహకాలు సక్రమంగా అందడం లేదు. దీంతో ప్రభుత్వ సహాయం కోసం దివ్యాంగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ ఏడాది రూ.61లక్షలు విడుదలయ్యాయని, వాటిని త్వరలోనే అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఎదురుచూపులు.. శారీరకంగా అంగవైకల్యం ఉన్నా ప్రతిభ కనబరుస్తూ పలు రంగాల్లో దూసుకుపోతున్న దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. అంగవైకల్యం ఉన్నా.. వారితో జీవితం పంచుకునేందుకు సకలాంగులు ముందుకొచ్చి వారిని వివాహం చేసుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాల పేరుతో ఆర్థికంగా ఆదుకుంటూ వస్తోంది. అయితే మూడేళ్లుగా దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులను ప్రోత్సహించేందుకు అందించే ప్రోత్సాహక నిధులను మాత్రం సక్రమంగా అందించడం లేదు. ఈ నిధులను రెట్టింపు చేసిన ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో జిల్లాలో 156 మంది అర్హులు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. బకాయిలు ఇలా.. వికలాంగులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సబ్సిడీ రుణాలతోపాటు వికలాంగులను ఎవరైనా సకలాంగులు పెళ్లి చేసుకుంటే వారికి ప్రోత్సాహకాలను అందిస్తూ వచ్చింది. దీంతో వికలాంగులకు కూడా ఒక అండ దొరికినట్లయ్యేది. 2018 మార్చి నెలకు ముందు వరకు ప్రభుత్వం వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు రూ.50వేల వరకు ప్రోత్సాహకాన్ని అందించేది. అయితే 2018 మార్చి 28వ తేదీ నుంచి వికలాంగులను పెళ్లి చేసుకున్న సకలాంగులకు ప్రోత్సాహకం కింద రూ.లక్ష చొప్పున అందించాలని నిర్ణయించింది. అయితే ప్రోత్సాహకాలను పెంచినప్పటికీ వాటిని అందించకపోవడంతో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2018–19లో బడ్జెట్ ప్రీజింగ్‌లో పెట్టారనే కారణంతో ఒక్కరికి కూడా ప్రోత్సాహకం అందించలేదు. 2018 మార్చి నెలకు ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో 122 మందికి ప్రోత్సాహకాలు అందించాల్సి ఉండగా.. 2018 మార్చి తర్వాత ఇప్పటివరకు 34 మంది ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్ల నుంచి ప్రోత్సాహకాలు ఇలా.. జిల్లాలో దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులను ప్రోత్సహిస్తూ.. అర్హులను గుర్తించి అధికారులు నిధులు అందిస్తున్నారు. 2015–16లో 59 మందికి రూ.29.50లక్షలను అధికారులు ప్రోత్సాహకాల కింద అందించారు. 2016–17లో 63 మందికి రూ.31.50లక్షలు, 2017–18లో 36 మందికి రూ.18లక్షలు అందించారు. 2018–19లో బడ్జెట్ ప్రీజింగ్‌లో ఉందని అర్హులైన లబ్ధిదారులకు నిధులు అందించలేదు. 2019–20లో 8 మందికి రూ.4 లక్షలు అందించారు. ఇంకా రూ.50వేల ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకున్నవారు 122 మంది అర్హులుగా ఉండగా.. రూ.లక్ష ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 34 మంది ఉన్నారు. సకాలంలో అందిస్తాం.. సకలాంగులను వివాహం చేసుకున్న దివ్యాంగులకు అందించే ప్రోత్సాహకాలు కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. సకాలంలో నిధులు విడుదల కాక ప్రోత్సాహకాలు అందించలేకపోయాం. ఇటీవల రూ.61లక్షల నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. – సబిత, జిల్లా సంక్షేమాధికారి -
పర్వతాన్ని అధిరోహించిన దివ్యాంగుడు
సాక్షి, చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన చిదుగుళ్ల శేఖర్‌గౌడ్ తన స్వగ్రామంలో ఉన్న పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు. ఉన్నత విద్యాభ్యాసం కొయ్యలగూడెం గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సాగింది. అక్కడి నుంచి ఇంటర్ చదివేందుకు అప్పటి జిల్లా కేంద్రమైన నల్లగొండకు వెళ్లాడు. ప్రభుత్వ కళాశాలలో చేరి ఓ గది అద్దెకు తీసుకొని చదువుంటూ ఉండే వాడు. తాను అద్దెకు ఉన్న ఇంటిపై ప్రమాదవశాత్తు జరిగిన విద్యుదాఘాతానికి గురై శేఖర్ తీవ్రగాయాల పాలయ్యాడు. వైద్యులు కుడి చేయి, ఎడమ కాలును తొలగించారు. అసలే నిరుపేద కుటుంబం ఆపై చేతికి అందిన కుమారుడి అవిటితనంతో కుటుంబం మరింత చితికింది. కొన్ని నెలల పాటు ఇంటి వద్దే ఉంటూ కుటుంబ బాధలు గుర్తించి స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు. అందులో భాగంగా సెల్‌ఫోన్ షాప్ పెట్టుకోగా నష్టం చవిచూసింది. ఇదంతా తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. తర్వాత కొంతమంది మిత్రుల సాయంతో కృత్రిమ అవయవాలు అమర్చుకోగలిగాడు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లలో అద్భుతాలు.. తనకు కాలు, చెయ్యి లేకున్నా ఎన్నో అద్భుతాలకు కేంద్ర బిందువుగా మారాడు శేఖర్‌గౌడ్. కొంతమంది స్ఫూర్తితో ముందుగా నడకపై దృష్టి సారించాడు. క్రమక్రమంగా రన్నింగ్ చేయడం ప్రారంభించి విజయవంతమయ్యాడు. తనలాంటి ఎందరో దివ్యాంగులకు, విద్యార్థులకు శిక్షణ సైతం అందించాడు. కొంతకాలం తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్లపై దృష్టిపెట్టాడు. కొద్ది కాలానికే వీటిలోనూ సక్సెస్ అయ్యాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నో రకాల పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాడు. మౌంట్‌ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ దివ్యాంగుడు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శేఖర్ నిరంతరం శ్రమించేవాడు. గత ఆగస్టులో యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు కొంత మంది సభ్యులతో కలిసి బయలుదేరాడు. ఆ బృందంలో ఇతనొక్కడే దివ్యాంగుడు. 5642మీటర్ల ఎత్తైన మౌంట్‌ఎల్‌బ్రూస్ పర్వతాన్ని కేవలం 17గంటల్లోనే అధిరోహించి అద్భుతం సృష్టించాడు. అక్కడే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ వ్యక్తి ఇతనే. తొలి భారతీయ దివ్యాంగుడు సైతం ఇతనే కావడం గర్వించదగ్గ విషయం. తాజాగా కిలిమంజారో పర్వత అధిరోహణ.. అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని నిరంతరం భావించే శేఖర్ అందుకోసం నిరంతరం పరితపిస్తుంటాడు. తాజాగా దక్షిణాఫ్రికా దేశంలోని 5895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. గత నెల 22న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన సహచరురాలు భావనతో(దివ్యాంగురాలు కాదు) కలిసి నడక ప్రారంభించాడు. అదే నెల 27న పర్వతాన్ని అధిరోహించి తన ఘనతను చాటా డు. ఈ మేరకు అధికా రికంగా ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఈ పర్వతాన్ని అధి రోహించిన తొలి భారతీయ దివ్యాం గుడిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆర్థిక సహకారం లేక నానా అవస్థలు.. ఎన్నో రకాల సాహసాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న శేఖర్‌కు ఆర్థికపరమైన సహకారం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాడు. జీవనం కోసం ఆస్పత్రిలో పని చేయగా వచ్చే రూ. 13వేలతో పూటగడవడమే కష్టమయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక్కో సాహసయాత్రకు రూ. 2లక్షల నుంచి 3లక్షల వరకు ఖర్చవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నాడు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకువస్తున్న శేఖర్‌కు ప్రభుత్వాలు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక చేయూతను అందించాల్సి ఉంది. ఎత్తైన పర్వతాల అధిరోహణ.. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా శేఖర్ ముందుకు సాగుతున్నా డు. ఈ ఏడాది ఆగస్టులో యూరప్‌లోని మౌంట్ఎ ల్బ్రూస్ను, గత నెల దీపావళిన దక్షిణాఫ్రికాలోని కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించాడు. సౌత్ అమెరికా అర్జెంటీనాలోని 6962 మీటర్ల ఎత్తైన మౌంట్ఎకాన్కాగా, నార్త్అమెరికాలోని అల్హక్కాలోని 6194మీటర్ల ఎత్తులో ని మౌంట్బెనాలి, అంటార్కిటికా దేశంలో 4892మీటర్ల ఎత్తులోని మౌంట్విన్సన్మాసిఫ్, ఆస్ట్రేలియాలోని 2282 మీటర్ల ఎత్తులోని మౌంట్కాస్కిస్కోలతో పాటు నేపాల్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (8848మీటర్లు)ను అధిరోహించాలని శేఖర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. పని చేస్తూనే.. పేద కుటుంబం కావడంతో శేఖర్‌కు ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉండేవి. సొంత ఊరిని విడిచి హైదరాబాద్‌కు వెళ్లిన శేఖర్‌కు ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. మూడు పూటలు తిండి కూడా తినలేని పరిస్థితి. ఈ బాధలను అధిగమించేందుకు ప్రైవేట్‌గా ఏదైనా ఉద్యో గం చేయాలనుకున్నాడు. ప్రణవ్ ఆస్పత్రిలో ఓ ఉద్యోగంలో చేరాడు. నెల రోజులపాటు పని చేస్తే వచ్చే రూ.. 13వేలతో జీవనం సాగిస్తున్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యం ప్రమాదంలో కాలు, చెయ్యి కోల్పోయా. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నా. గత ఆగస్టులో యూరప్‌లోని అత్యంత ఎత్తైన మౌంట్‌ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహిం చా. గత నెల దీపావళిన దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నదే నా జీవిత లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దాతలు నాకు తోడ్పాటునందించాలి. – చిదుగుళ్ల శేఖర్‌గౌడ్ -
హోమ్లీ హోమ్
నలభై ఏళ్లుగా అనాథ బాలలు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం ఇస్తున్న డాక్టర్ గీత దంపతులు.. ఇప్పుడు మరొక హోమ్లీ హోమ్‌తో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. ఓ పదమూడేళ్ల అమ్మాయి. తమ ఊరికి వచ్చిన డాక్టర్ల బృందాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆ మెడికల్ టీమ్ ఆ ఊరి వాడల్లో పర్యటిస్తోంది. ఒక్కొక్కరు వచ్చి తమ అనారోగ్యం గురించి చెబుతున్నారు. డాక్టర్లు మందులు ఇచ్చి ఎలా వాడాలో చెబుతున్నారు. అప్పుడే టీనేజ్లోకొచ్చిన ఆ అమ్మాయికి ఆ సన్నివేశం అద్భుతంగా అనిపిస్తోంది. మెడికల్ టీమ్ పని పూర్తి చేసుకుని తిరిగి పట్నం పోవడానికి సిద్ధమైంది. వాళ్ల వెంటే వెళ్తున్న అమ్మాయికి ఓ గుడిసెలో నుంచి మూలుగు వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే మంచం మీద ముడుచుకుని పడుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ‘‘డాక్టర్లొచ్చారు చూపించుకుందువు గాని రా’’ అని ఆ అమ్మాయిని లేపింది. లేచే పరిస్థితిలో లేదా అమ్మాయి. ఆమెను లేపి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. గుడిసె బయటకు వచ్చి చూస్తే మెడికల్ టీమ్ ముందుకు వెళ్లిపోయింది. పరుగెత్తుకుంటూ వెళ్లి ‘‘ఓ అమ్మాయి మంచం మీద నుంచి లేవలేకపోతోంది. వైద్యం చేద్దురు రండి’’ అని చెప్పి, మెడికల్ టీమ్‌ను వెనక్కు తీసుకు వచ్చి, జ్వరంతో బాధపడుతున్న అమ్మాయికి వైద్యం చేయించింది. ఇది జరిగి యాభై ఏళ్లవుతోంది. ఆ రోజే నిర్ణయించుకుంది ఆ అమ్మాయి తాను డాక్టర్ని కావాలని, వైద్యం అందని వాళ్లకు వైద్యం చేయాలని. అనుకున్నట్లే డాక్టర్ అయ్యి, దేశం నలుమూలలా పర్యటిస్తూ ప్రభుత్వ వైద్యం అందని, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు వైద్యం చేస్తోంది. ఆమే.. డాక్టర్ గీతా ఏరువ. గీత.. ఆధ్యాత్మిక సేవామార్గం పట్టడానికి ప్రేరేపించిన సందర్భం అది. ఏదీ వృథా కాకూడదు డాక్టర్ గీత సొంతూరు కర్నూలు జిల్లా కౌలూరు. ఆమె పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. తండ్రి బాలిరెడ్డి మిలటరీ ఆఫీసర్. ఆయన పెంపకం తనకు ‘ఇవ్వడాన్ని’ నేర్పిందని అంటారు గీత. ‘‘నేనీ గౌను వేసుకోను అంటే మా నాన్న వెంటనే ‘మరి దీనిని ఏం చేద్దాం’ అని అడిగేవారు. ఈ గౌనులో పత్తి పండించిన రైతు శ్రమ ఉంది, రంగులద్దిన కార్మికుని శ్రమ ఉంది. కుట్టిన టైలర్ పని ఉంది. ఇంతమంది పని ఉంది ఈ గౌను వెనుక. అలాగే నేను పడిన శ్రమతో సంపాదించిన డబ్బుతో కొన్నాను. అంతకంటే ఎక్కువగా... ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరు. దీనిని ఉపయోగించకపోవడం తప్పు. నువ్వు వేసుకోకపోతే మరొకరికి ఇవ్వు. వనరులను వృథా చేయకూడదు’ అని చెప్పారు. మిలటరీలో పనిచేయడం వల్ల ఆయనలో వెల్లివిరిసిన సేవాభావం అది. మాకూ అవే నేర్పించారు. ఇప్పటికీ మాకెంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకుని మిగిలినది లేని వాళ్లకు ఇవ్వడం అలవాటైంది. టామ్ (భర్త థామస్ రెడ్డి) క్రైస్తవ మిషనరీ నేర్పించిన కరుణ, సేవా ప్రభావంతో పెరిగిన వారు కావడంతో మా ఇద్దరికీ సేవ చేయడమే జీవితం అయింది’’ అన్నారు డాక్టర్ గీత. మా తర్వాత కూడా పిల్లల్లేని దంపతులు తమకు పిల్లల్లేని కారణంగా అనాథాశ్రమాలకు వెళ్లి ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటారు. టామ్– గీత దంపతులు ఏకంగా అనాథాశ్రమాలనే దత్తత తీసుకున్నారు. స్వయంగా ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ (ఎఫ్సీఎన్)’ను స్థాపించి అనాథ, పేద పిల్లల కోసం స్కూళ్లు, కాలేజీలు పెట్టారు. తల్లిదండ్రులు ఉండి పై చదువులకు ఫీజు కట్టుకోలేని పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండువేల ఐదు వందల మంది విద్యార్థులు వీళ్ల సంస్థల ద్వారా జీవితాలను నిలబెట్టుకున్నారు. ఇంత విస్తృతమైన సర్వీస్ చేయాలంటే డబ్బవసరం పెద్ద మొత్తంలోనే ఉంటుంది. అందుకు ఈ దంపతులు ఇక్కడి పిల్లలను అమెరికా నుంచి దాతలతో అనుసంధానం చేశారు. ‘‘మాకు విరాళాలిస్తున్న వాళ్లలో ఎక్కువ మంది మేము అమెరికాలో ఉద్యోగం చేసినప్పటి మా ఫ్రెండ్సే. ఫండ్ రైజింగ్ కోసం ఏటా ఆరు నెలలు అమెరికాలో ఉంటున్నాం. మాకు వయసై పోయిన తర్వాత ఈ సర్వీస్ ఆగిపోకుండా కొనసాగేటట్లు సిస్టమ్‌ను డెవలప్ చేయడమే ఇప్పుడు మా ముందున్న ఆలోచన. అందుకే అవకతవకలకు అవకాశం లేని విధంగా ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు డాక్టర్ గీత. – వాకా మంజులారెడ్డి రెండు వందల మందికి మా అమ్మానాన్నలు ఆంతోనమ్మ, శౌరిరెడ్డిల జ్ఞాపకార్థం పోరుమామిళ్ల, ధర్మవరం, గుంటూరు, జడ్చర్ల, నంద్యాల, మైదుకూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కడప, హైదరాబాద్‌లలో విద్యాసంస్థలు, హోమ్‌లను స్థాపించాం. ఇప్పుడు షాద్ నగర్లో నిర్మించిన హోమ్‌లో ఒక్కో గదికి ఒక్కో దాత పేరు ఉంటుంది. ఇందులో ఆశ్రయం పొందుతున్న వాళ్లు తాము ఉంటున్న గదికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ల పేరును రోజూ గుర్తు చేసుకుంటారు. అలా పెరిగిన పిల్లలు పెద్దయిన తర్వాత ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారని మా విశ్వాసం. సేవాశ్రమంలో రెండు వందల మందికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆశ్రయం అవసరమైన వాళ్లకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. – థామస్‌రెడ్డి, ఎఫ్సీఎన్ నిర్వాహకులు పిల్లలకు అందరూ ఉండాలి హైదరాబాద్‌కు సమీపంలోని షాద్‌నగర్‌లో స్థాపించిన మా ‘సేవాశ్రమం’ జనవరి 23న ప్రారంభం అవుతోంది. మా ముఖ్య ఉద్దేశం ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలను పిల్లలకు అనుభవంలోకి తేవడమే. పిల్లలు తమకు ఎవరూ లేరనే నిస్పృహలో పెరగకూడదు. వృద్ధులు కూడా మరణం కోసం ఎదురు చూస్తూ రోజులు గడపకూడదు. జీవించి ఉన్నన్ని రోజులూ సంతోషంగా గడపాలి. అలాగే దివ్యాంగులు కూడా ఏదో బతుకీడుస్తున్నాం అనే నిర్వేదంలో మునిగిపోకుండా తాము చేయగలిగిన సర్వీస్ ఇతరులకు చేయగలుగుతున్నామనే మానసికానందంతో జీవించాలి. అందుకోసం పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు హోమ్‌లను ఒకే ప్రాంగణంలో నిర్మించాం. – డాక్టర్ గీత, ఎఫ్సీఎన్ నిర్వాహకురాలు -
ఫేస్బుక్లో ప్రముఖ జర్నలిస్టుల అకౌంట్లు మాయం
న్యూఢిల్లీ : గత 10 రోజులుగా... ఫేస్బుక్ డజనుకు పైగా జర్నలిస్టుల అకౌంట్లను మాయం చేసింది. కనీసం ఎలాంటి హెచ్చరికలు లేదా నోటీసులు లేకుండా.. వారి అకౌంట్లను డిసేబుల్ చేసింది. వీరిలో చాలా మంది సీనియర్ ఎడిటర్లే ఉన్నారట. అసలెందుకు ఫేస్బుక్ ఈ పని చేసింది? సీనియర్ ఎడిటర్ల అకౌంట్లనే ఎందుకు డిసేబుల్ చేస్తుంది? అంటే దాని వెనుక పెద్ద కథే ఉందట. ఈ జర్నలిస్టులందరూ దేశంలో జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై ఆర్టికల్స్ రాస్తూ ఫేస్బుక్లో పోస్టు చేస్తున్నారు. ఎక్కువగా మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అట్టడగు వర్గాల వారి సమస్యలు, జాతీ ప్రాముఖ్యత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వీరు ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగే అవకాశముందనే కారణంతో, ఏకంగా జర్నలిస్టుల అకౌంట్లనే ఫేస్బుక్ డిసేబుల్ చేస్తుందట. సెప్టెంబర్ చివరి వారంలో ఫేస్బుక్ పలువురు ప్రముఖ జర్నలిస్ట్‌ల అకౌంట్లను డిసేబుల్ చేసింది. వారిలో దైనిక్ భాస్కర్ న్యూస్ ఎడిటర్ అజయ్ ప్రకాశ్, జంజ్వార్.కామ్ ఎడిటర్ ప్రేరణ నెగి, జనతాకారిపోర్టర్.కామ్ ఎడిటర్, బీబీసీ మాజీ ఎడిటర్ రిఫత్ జావిద్, గల్ఫ్‌లో అవార్డ్ విన్నింగ్ భారతీయ జర్నలిస్ట్, కాలమిస్ట్, ఖలీజ్ టైమ్స్ మాజీ ఒపీనియన్ ఎడిటర్ అజాజ్ జాకా సయ్యద్‌లు ఉన్నారు. అంతేకాక, జర్నలిస్ట్‌లపై వేటు వేయడాన్ని ఫేస్బుక్ ఇంకా ఆపలేదట. మరికొంతమంది ఎడిటర్లపై కూడా ఫేస్బుక్ వేటు వేసినట్టు తెలిసింది. ‘ఎలాంటి కారణం లేకుండా.. న్యూస్ వెబ్సైట్ ఎడిటర్ల ఖాతాలను ఫేస్బుక్ డిసేబుల్ చేస్తోంది. జాతీయ ప్రాముఖ్యత, సమకాలీన రాజకీయ అంశాలు, అట్టడుగు గ్రూప్‌లు, మైనార్టీల సమస్యలపై ఆర్టికల్స్ రాస్తున్న ఎడిటర్లనే ఫేస్బుక్ టార్గెట్ చేసింది’ అని కారవాన్‌డైలీ.కామ్ ట్వీట్ చేసింది. ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్‌లు వాసిమ్ త్యాగి, సంజయ్ పాండే వంటి వారి అకౌంట్లను కూడా ఫేస్బుక్ డిసేబుల్ చేసింది. దీంతో ఎడిటర్లు ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఫేస్‌బుక్‌ను తెలియపరిచారు. ఫేస్బుక్ ఎలాంటి నోటీసులు లేకుండా తమ అకౌంట్లను డిసేబుల్ చేయడంపై మండిపడ్డారు. పదేపదే ఫిర్యాదు చేయడంతో, కొంతమంది అకౌంట్లను ఫేస్బుక్ రిస్టోర్ చేసింది. అయితే కొంతమంది అకౌంట్లను ఇప్పటికీ డిసేబుల్‌లోనే ఉంచినట్టు తెలిసింది. ‘నా అకౌంట్ ఇప్పటికీ డిసేబుల్‌లోనే ఉంది. కొత్త ఐడీ క్రియేట్ చేసుకుని, ఫేస్‌బుక్‌కు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, అకౌంట్‌ను రిస్టోర్ చేయలేదు. భారత్‌లో మైనార్టీలపై పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా రచనలు రాసినందుకే నా అకౌంట్‌ను డిసేబుల్ చేసినట్టు నేను భావిస్తున్నా’ అని అజాజ్ జాకా సయ్యద్ అభిప్రాయపడ్డారు. న్యూస్ ఇంటర్నేషనల్, అరబ్ న్యూస్, గల్ఫ్ న్యూస్, స్ట్రయిట్స్ టైమ్స్ ఆఫ్ సింగపూర్, గ్రేటర్ కశ్మీర్, ఇన్కిలాబ్ ఉర్దూ డైలీ వంటి పలు జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్స్‌కు సయ్యద్ రచయితగా ఉన్నారు. దేశీయ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆమోదించదగినది కాదని, ఒకవేళ అలా చేస్తే భారత్‌లో ఫేస్‌బుక్‌ను బ్లాక్ చేస్తారని జర్నలిస్ట్ సంజయ్ పాండే హెచ్చరించారు. ఇప్పటికే పలు దేశాల రాజకీయాల్లో ఫేస్బుక్ జోక్యం చేసుకుందని ఆ కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికి రెండు సార్లు ఫేస్బుక్ నా ఐడీని డిస్‌బుల్ చేసింది. నేను ఫేస్బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్‌లను అనుసరిస్తా. ఇదే మీ ఫ్రీ స్పీచ్’ అంటూ జర్నలిస్ట్ వాసిమ్ అక్రమ్ త్యాగి, ఫేస్‌బుక్‌ను ప్రశ్నించారు. -
సంచలనం; మరో షెల్టర్ హోం అకృత్యాలు
భోపాల్: మద్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక షెల్టర్‌హోం చిన్నారులపై వెలుగుచూసిన అకృత్యాలు సంచనలం రేపాయి. ఒక ప్రైవేటు వసతి గృహం యజమాని దివ్యాంగులైన బాలబాలికలపై చాలాకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు యజమాని లైంగిక హింస, వేధింపులు కారణంగా తమ సహచరులు ముగ్గురు చనిపోయినట్టుగా బాధితులు ఆరోపించారు. దీంతో యజమానిని శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక మాజీ సైనికుడు (70) భోపాల్‌లో భైరాంఘర్ ప్రాంతంలో ప్రైవేటుగా ఒక షెల్టర్ హోం నిర్వహిస్తున్నాడు. దివ్యాంగులైన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. కాలయముడిలా మారాడు. నిత్యం దారుణమైన లైంగిక వేధింపులు, హింసకు పాల్పడేవాడు. దీంతో బాధితులు యజమాని అకృత్యాలపై సాంఘిక న్యాయ విభాగానికి మొరపెట్టుకున్నారు. షెల్టర్ హోం యజమాని లైంగిక హింస కారణంగానే విపరీతమైన రక్తస్రావంతో ఒక బాలుడు మరణించగా, గోడకేసి తలను మోదడంతో మరో విద్యార్థి అసువులుగా బాసాడు. మరో ఉదంతంలో రాత్రంతా చలిలో బలవంతంగా పడుకోబెట్టడంతో మరో విద్యార్థి ప్రాణాలు విడిచాడని వివరించారు. దీనిపై తదుపరి విచారణకు ఆదేశించామని సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కృష్ణ మోహన్ తివారి వెల్లడించారు. ఈ ఉదంతంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విభాగం స్పందించింది. గతంలో ఇతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించింది. బాధితులతో కలిసి స్థానిక టీటీ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని డీఐజి ధర్మేంద్ర చౌదరి తెలిపారు. 1995లో రిజిస్టర్ చేసుకున్న ఈ హోం రెండు శాఖలను (భైరాంఘర్, హోషంగాబాద్) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధిత నిధులను కూడా పొందుతోంది. 2003 నాటి లెక్కల ప్రకారం 42 మంది బాలురు, 58 మంది బాలికలు ఈ హోంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 2017 లో హొషంగాబాద్ కలెక్టర్‌కు లైంగిక వేధింపుల గురించి ఓ బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సరిగా ఉందని తేలినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అయితే, ఫిర్యాదు తర్వాత హోషంగాబాద్ శాఖ మూసివేసారు. -
వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 3 శాతం రిజర్వేషన్లు ఉండగా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు ఒక శాతం పెరిగాయి. ఈ మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రతి వంద పోస్టుల్లో 6, 31, 56, 82వ సంఖ్యలోని ఉద్యోగాలను వికలాంగులకు కేటాయించాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీలో వికలాంగుల రిజర్వేషన్లలో సమస్యలు తలెత్తితే వాటిని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంధ, దృష్టిలోపం ఉన్న వారికి 1 శాతం, మూగ, చెవిటిలోపాలున్న వారికి 1 శాతం, కదల్లేకపోవడం, నరాల బలహీనతతో నడవలేకపోవడం, మరుగుజ్జులు, కండరాల పెరుగుదల లోపించిన వారికి 1 శాతం, బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబులిటీ, మానసిక రుగ్మత, బహుళ వైకల్యం ఉన్న వారికి 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. -
అనుష్క ప్రతిభను కొనియాడిన ప్రధాని
న్యూఢిల్లీ : సాధించిన విజయాన్ని ఎవరైనా గుర్తించినప్పుడు కలిగే సంతోషం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటింది ఓ దివ్యాంగ విద్యార్థిని సాధించిన విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించి దేశ ప్రజలకు తెలుపడంతో.. ఆ బాలిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురుగ్రామ్‌కు చెందిన 15 ఏళ్ల అనుష్క పాండా వెన్నుముక్కలో కండరాల క్షీణత వల్ల వీల్ చైర్‌కే పరిమితమయ్యారు. కానీ తల్లిదండ్రుల ప్రొద్భలంతో తన కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా తన సంకల్పాన్ని మాత్రం వదలలేదు. వీల్ చైర్లోనే సన్ సిటీ స్కూల్‌కు వెళుతూ సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో 97.8 శాతం మార్కులతో టాప్ ర్యాంక్(వికలాంగుల విభాగంలో) సాధించారు. ఈ విషయం మోదీ దృష్టికి వెళ్లడంతో.. ఆదివారం నాటి మన్‌కీ బాత్‌లో ప్రధాని మాట్లాడుతూ.. అనుష్క ప్రతిభను కొనియాడారు. ఆమె సాధించిన విజయం అద్భుతమని, ఇది ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు. అనుష్క వెన్నుముక్కలోని కండరాల క్షీణతతో బాధపడుతున్నప్పటికీ.. సమస్యలను అధిగమించి అల్ ఇండియా టాపర్‌గా నిలిచారని అభినందించారు. అనుష్కలాగా ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారికి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన సంకల్పంతో కష్టపడితే వారు ఎలాంటి లక్ష్యాన్ని అయిన చేరుకోవచ్చని మోదీ వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి అనుష్క జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగంలో తనకు శుభాకాంక్షలు తెలపడంపై అనుష్క ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఐఐటీలో సీటు సాధించి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యమని అనుష్క వెల్లడించారు. -
భర్తను భుజాలపై మోస్తూ..ఫోటో వైరల్
సాక్షి, మధుర : దివ్యాంగుడైన భర్తను తన భుజాలపై ఎక్కించుకుని వెళ్తున్న ఓ మహిళ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్తను భుజాలపై మోసుకు వెళుతున్న ఆమెకు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన బిమ్లా దేవి అనే మహిళ.. నరాల సంబంధిత వ్యాధితో కుడికాలు కోల్పోయిన తన భర్త బదన్ సింగ్‌ను గత కొన్ని నెలలుగా భుజాలపై ప్రభుత్వ ఆస్పత్రికి మోసుకెళుతోంది. బదన్ సింగ్‌కు వీల్ చైర్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు... దివ్యాంగుడని ధ్రువీకరణ పత్రం తీసుకు రమ్మన్నారు. దీంతో ఆమె ఆ సర్టిఫికేట్ కోసం భర్తను మోసుకుని వెళుతూ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చాలాకాలంగా తిరుగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం కనికరించలేదు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆమెను కార్యాలయం చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా బిమ్లా దేవి మాట్లాడుతూ.. ధ్రువీకరణ పత్రం పొందడానికి చాలా కార్యాలయాల చుట్టూ తిరిగాం. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయింది. అయితే భర్తను అలా మోసుకు వెళుతున్న ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దంపతుల ఫోటో ఉత్తరప్రదేశ్ మంత్రి భూపేంద్ర చౌదరి కంట పడింది. దీనిపై స్పందించిన ఆయన... వారికి సహాయం అందకపోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటని, వెంటనే ఆ భార్యాభర్తలకు సహాయం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. ఎట్టకేలకు బుధవారం బిమ్లా దేవి దంపతులకు ధ్రువీకరణ పత్రం అందడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్ది నెలల ముందు వరకు వారి జీవితం సాఫీగా సాగిపోయేదని, నరాల వ్యాధి కారణంగా తన భర్త కాలు కోల్పోవడంతో కష్టాలు చుట్టుముట్టాయని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆటోలో వెళ్లడానికి కూడా డబ్బులు లేవని, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని ఆమె వివరించింది. భర్త కాలుపోవడంతో కుటుంబ భారంతో పాటు భర్తకు మందులు కొనే బాధ్యత కూడా బిమ్లా భుజాలపై పడింది. -
దేవుడా నువ్వే దిక్కు: వికలాంగులు
సాక్షి. హైదరాబాద్: నీరవ్‌మోదీ కుంభకోణం చిరు వికలాంగుల ఉద్యోగులను రోడ్డు పాలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న గీతాంజలి జేమ్స్ జ్యువెల్లరీ కంపెనీలో 600 మంది ఉద్యోగుల్లో 200 మంది వికలాంగులు పని చేస్తున్నారు. ఆ కంపెనీని కుంభకోణంలో భాగంగా అధికారులు సీజ్ చేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. దీంతో తమ బాధ ప్రభుత్వానికి చెప్పుకుందామని శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లిన వికలాంగులకు అక్కడి అధికారులు సచివాలయానికి వెళ్లాలని సూచించారు. అక్కడా ఫలితం లేకపోవడంతో గేటు దగ్గర ఉన్న అధికారులకు వినతి పత్రం సమర్పించి, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. పెద్దలు చేసిన తప్పులకు చిరు ఉద్యోగులం రోడ్డుపాలయ్యాం దేవుడా.. నువ్వే దిక్కంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
దివ్యాంగులకు ప్రభుత్వ చేయూత
మహబూబ్‌నగర్ రూరల్: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారు అన్ని రంగాల్లో రాణించేలా రిజర్వేషన్ రూపంలో పోత్సహిస్తోంది. ప్రస్తుతం వారికి ఉన్న 3శాతం రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఎక్కడా అమలు కాలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 5 శాతానికి తీసుకున్న నిర్ణయంతో వికలాంగులకు ఎంతో మేలు కలగనుంది. జిల్లాలోని 61 వేల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. 2016 వికలాంగుల చట్టం ప్రకారం 5శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాల్సి ఉంది. వివిధ పథకాల్లో 61వేల మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 22,852 మంది ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత పింఛన్ నెలకు రూ.1500 చొప్పున పొందుతున్నారు. జిల్లాల విభజన అనంతరం ఇప్పటి వరకు 275 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్దిపొందారు. వివిధ కార్పొరేషన్ల నుంచి 81 మంది రుణాలు తీసుకున్నారు. దాదాపు 81 మంది ట్రై సైకిళ్లు, 22మంది వీల్‌చైర్స్‌ను అందుకున్నారు. వారంలో ప్రతి మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించి అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఇప్పటి దాక 48,480 మంది హాజరు అయ్యారు. ఇందులో 47,881 మందిని వికలత్వ పరీక్ష నిర్వహంచగా వారిలో 31,952 మంది అర్హత సాధించారు. ప్రభుత్వాలు 7 కేటగిరీల్లో వారి వైకల్య శాతాన్ని పరిగణలోకి తీసుకుని సంక్షేమంలో పాధాన్యమిస్తున్నాయి. భరోసా ఇచ్చిన 2016 చట్టం 1995లో వికలాంగుల కోసం చట్టం చేసినా అది అమలుకు నోచుకోలేదు. ఐక్యరాజ్య సమితి తెచ్చిన ఒత్తిడి నేపథ్యంలో 2007లో యూఎన్సీ ఆర్పీడీ డిక్లరేషన్‌పై కేంద్ర ప్రభుత్వం 2014లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. వివిధ కారణాల దృష్ట్యా ఆ బిల్లు రాజ్యసభలో ఆగిపోయింది. 2016లో వివిధ జాతీయ వికలాంగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో 2016 డిసెంబర్లో చట్టం తెచ్చారు. ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలను కచ్చితంగా అమలు చేస్తే వికలాంగులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. అమలుకు చర్యలు జిల్లాలోని వికలాంగులకు ప్రభుత్వం పెం చిన 5 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూస్తాం. ఇటు ఉద్యోగాల భర్తీ, అటు సంక్షేమ పథకాల్లో, డబుల్ బెడ్రూం ఇళ్లలోనూ 5 శాతం వికలాంగులకు కచ్చితంగా వచ్చేలా ఆ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిం చి న్యాయం జరిగేలా చూస్తాం. – జి.శంకరాచారి, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి ప్రభుత్వ నిర్ణయం మాకు వరం దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇప్పుడున్న కోటాను సర్కార్ పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం నిజంగా మాకు వరం లాంటిది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఈ కల ఇప్పుడు నెరవేరనుంది. – ఎ.నరేందర్, ఎల్ఎల్సీ సభ్యుడు రుణపడి ఉంటాం 5శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం హర్షణీయం. ఇది మాకు ఎంతగానో దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వుం మా పట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిది. పెంచిన కోటా తప్పకుండా అమలు చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – టి.మధుబాబు, ఎన్పీఆర్టీ జిల్లా అధ్యక్షుడు -
ఆపరేషన్‌తో దివ్యాంగురాలైన గర్భిణి
జయపురం: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి దివ్యాంగురాలైనందున అందుకు బాధ్యుడైన డాక్టర్ బాధితురాలికి రూ.20 లక్షల పరిహారం చెల్లించా లని వినియోగదారుల అదాలత్ ఆదేశించింది. వివరా లిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్ జిల్లా తారాగాం పంచా యతీలోని బొడముండగుడ గ్రామానికి చెందిన ఆశిష్ రహమాన్ ఖాన్ దురాశి భార్య సబినా రహమాన్‌కు 2010 మే నెల 19వతేదీన పురిటి నొప్పులు ఎక్కువై తాళలేకపోవడంతో భర్త ఆమెను నవరంగ్‌పూర్ క్రిస్టియన్ ఆస్పత్రిలో చేర్చాడు. ఆమెను పరీక్షించిన ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ నాగ్ ఆపరేషన్ చేయాలని సూచించాడు. అందుకు ఆశిష్ రహమాన్ అంగీకరించాడు. ఆపరేషన్ చేసేందుకు ముందుగా డాక్టర్ ఆమె వెన్నెముక వద మూడు మత్తు ఇంజక్షన్లు చేశా రు. బాధతో మెలికలు తిరుగుతున్న ఆమెకు ఈ ఇంజ క్షన్లు పనిచేయకపోవడంతో మరోసారి డాక్టర్ ఇంజక్ష న్ ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయగా ఆమెకు ఒక మగ శిశువు జన్మించాడు. అయితే ఆమె వెన్నెముక నుంచి రెండు కాళ్ల వరకు శరీరం పనిచేయలేదు. ఈ విషయం ఆమె డాక్టర్‌కు తెలపగా ఎటువంటి వైద్యం చేయకుండా మరో పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపిం చండని లేనిపక్షంలో ప్రాణాపాయమని వైద్యుడు ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె ను భర్త విశాఖపట్నం తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు పరీ క్షించి ఆమెకు స్కానింగ్ చేసి ఆపరేషన్ చేయాలని తెలి పారు. దీంతో సబీనాకు మరోసారి విశాఖపట్నంలో ఆపరేషన్ జరిగింది. అందుకు రూ.3లక్షల 80 వేలు ఖర్చయింది. విశాఖపట్నం ఆస్పత్రి నుంచి ఆమెను జూన్ 8వ తేదీన డిశ్చార్జ్ చేశారు. తిరిగి ఆమెకు జూన్ 21వ తేదీన మరో సారి అన్ని పరీక్షలు చేశారు. అందుకు మరో రూ.19 వేలు ఖర్చయింది. బాధితుడికి అనుకూలంగా తీర్పు ఈ సంఘటనపై బాధితురాలి భర్త నవరంగ్‌పూర్ వినియోగదారుల అదాలత్‌ను ఆశ్రయించాడు. ఆస్పత్రి ఖర్చులు, ఇతర ఖర్చులు ఇప్పించండని వేడుకున్నాడు. బాధితుడి ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న వినియోగదారుల అదాలత్ అధ్యక్షుడు గోపాల కృష్ణ రథ్, సభ్యులు మీణాక్షీపాఢిలు ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు నిచ్చారు. సబీనాకు నష్టపరిహారంగా రూ.20 లక్షలను 30 రోజుల్లో చెల్లించాలని ఆ సమయం దాటితే రూ.30 లక్షలకు 12 శాతం వడ్డీ చొప్పున చెల్లించాలని ఆపరేషన్ చేసిన క్రిస్టియన్ ఆస్పత్రి డాక్టర్ సంతోష్ కుమార్నాగ్ను ఆదేశించారు. -
అద్భుతం.. రెండు కాళ్ల ఆవు
సాక్షి వెబ్ : కొండకోనల నడుమ అదొక చిన్న గిరిజన గుంపు. అక్కడి ఓ పేద రైతు ఇల్లు ఇప్పుడొక చిన్నపాటి టూరిస్ట్ స్పాట్‌గా మారింది. వారు ‘అద్భుతం’గా భావిస్తోన్న వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాస్తుల రాక అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అవును. ఆ రెండు కాళ్ల ఆవు దూడను చూస్తే మీరు కూడా వావ్ అంటారేమో! థాయిలాండ్‌లోని ఓ కుగ్రామంలో పెరుగుతోన్న రెండు కాళ్ల ఆవు దూడ వార్తను ‘థాయి స్మైల్’ అనే ఆన్లైన్ మీడియా కంపెనీ వెలుగులోకి తెచ్చింది. సాక్షి వెబ్. ‘వికలాంగ ఆవు పోరాటస్ఫూర్తి’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టైన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. సర్కస్ ఫీట్లా కనిపించే వాస్తవ దృశ్యాల్లో.. ఆ రెండు కాళ్ల దూడ నడుస్తున్న తీరు వింతగానూ, స్ఫూర్తిదాయకంగానూ ఉంటే, దానిని ప్రేమగా పెంచుకుంటోన్న రైతు ఆదర్శవంతుడిలా కనిపిస్తాడు. ఆధునిక దేశాల్లో వికలాంగ జంతువులకు కృత్రిమ అవయవాలు అమర్చడం సహజమే. టెక్సాస్(అమెరికా)కు చెందిన ఓ మహిళ.. కాళ్లు కోల్పోయిన తమ బర్రె దూడకు వేల డాలర్లు పోసి, ఆపరేషన్ ద్వారా కృత్రిమ పాదాలు పెట్టించింది.(స్లైడ్‌లో సంబంధిత ఫొటోను చూడొచ్చు) ఇంకా కొన్ని దేశాల్లో వికలాంగ గొర్రెలు, కుక్కలు, పిల్లలులకు యంత్రాలను అమర్చి వాటి జీవితాలు సాఫీగా సాగేందుకు సహాయపడుతున్నారు. థాయ్‌లాండ్ రెండు కాళ్ల ఆవు దూడ కూడా నాలుగు కాళ్లపై నడిచేరోజు వస్తుందని, రావాలని ఆశిద్దామా... -
ఆటకు వైకల్యం దాసోహం
► దివ్యాంగుల క్రికెట్లో రాణిస్తున్న సయ్యద్ నూరుల్ హుదా ► అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ► గుర్తించని ప్రభుత్వం అనంతపురం: అనంతపురానికి చెందిన అయూబ్, ఖాతూన్‌బీ దంపతుల కుమారుడు సయ్యద్ నూరుల్ హుదాకు పుట్టుకతోనే కుడికాలు లోపం ఉంది. చూసేందుకు సాధారణ యువకుడిగా కనిపించినా.. ఎడమకాలి కన్నా కుడికాలు పొట్టిగా ఉండడంతో అందరిలా అతను నడవలేరు. సోదరుడు ఆసిఫ్‌బాషా సహకారంతో క్రికెట్ ఆడడం ప్రారంభించిన నూరుల్ హుదా... పదో తరగతి పూర్తి అయిన తర్వాత ఐటీఐలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2007లో జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 2012లో తండ్రి మరణంతో కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యారు. తర్వాత ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అందించిన స్ఫూర్తితో తన కెరీర్‌ను ప్రారంభించి, అతి తక్కువ కాలంలోనే ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ జట్టులో స్థానం పదిలం చేసుకున్నారు. 2016లో జాతీయ జట్టులో, 2017లో భారత జట్టులో బెస్ట్ క్రికెటర్‌గా రాణించారు. ఆటలో ప్రతిభ ఇలా.. 2013లో బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 60 పరుగులు చేయడంతో ప్రత్యేక గుర్తింపు లభించింది. అదే ఏడాది దివ్యాంగుల క్రికెట్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ముంబయిలోని జింఖానా మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టుపై 9 బంతుల్లో 35 పరుగులు చేయడం ద్వారా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. 2016లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లో 153 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అదే ఏడాది డిసెంబర్ 20 నుంచి 22 వరకు వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన అంతర్ జిల్లాల దివ్వాంగుల క్రికెట్ టోర్నీలో వైఎస్సార్ కడప జట్టుపై 21 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగులు సాధించారు. గుంటూరులో జరిగిన దివ్యాంగుల టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన నూరల్ హుదా మొత్తం 210 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నారు. ప్రభుత్వం గుర్తించడం లేదు.. 2007 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆటగాడిగా గుర్తింపు పొందాను. ఇందుకు ఎన్నో ధ్రువీకరణపత్రాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం గుర్తించకపోవడంతో నేను సాధించిన సర్టిఫికెట్లన్నీ చెత్తకాగితాల్లా మారిపోయాయి. కనీసం ప్రశంసించేవారు కూడా లేరు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నా.. కనీసం ఒక్క సెంట్ స్థలం కూడా ప్రభుత్వం ఇచ్చి ప్రోత్సహించలేదు. కేవలం దివ్యాంగుడిని కావడం వల్లనే ఇంత నిరాదరణ ఎదురవుతోంది. – సయ్యడ్ నూరుల్ హుదా, క్రికెటర్, అనంతపురం -
19న సమర సమ్మేళనం
హైదరాబాద్: ఈనెల 19న నిజాంకాలేజీ గ్రౌండ్స్‌లో వికలాంగుల సమర సమ్మేళనం నిర్వహించనున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) ప్రకటించింది. వికలాంగుల డిమాండ్ల సాధనలో భాగంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి వికలాంగుడికి పింఛన్ ఇవ్వాలని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను తిరిగి ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే డిమాండ్లను సాధించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నట్లు ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ పేర్కొన్నారు. -
విభిన్న ప్రతిభావంతులు స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో ఇంటర్, ఆపైన చదువుతున్న విభిన్న ప్రతిభావంతుల(అంగవైకల్యం, ఆంధులు, మూగ, బధిరులు, బుద్ధిమాంద్యం, అనాథలు) నుంచి 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమం ఏడీ భాస్కరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఠీఠీఠీ.్చp్ఛp్చటట.ఛిజజ.జౌఠి.జీn ద్వారా ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని ప్రింట్ కాపీని కలెక్టరేట్లోని వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రేషన్‌కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. -
వికలాంగులకు మెట్రో పాస్ ఇవ్వాలి
పటాన్చెరు: వికలాంగులందరికీ మెట్రో బస్‌పాస్‌లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10.45 లక్షల మంది వికలాంగులున్నారని తెలిపారు. మంగళవారం పటాన్‌చెరులోని శ్రామిక్ భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం వికలాంగత్వం ఉన్న వారికే పాసులు ఇస్తామని ఆర్టీసీ చెప్తుందన్నారు. 40 శాతం వికలాంగత్వం ఉన్న వారికి ఇతర ప్రభుత్వ పథకాల్లో అవకాశం లభిస్తున్నప్పటికీ మెట్రో బస్‌పాస్ సౌకర్యం దొరక్కపోవడం సరైంది కాదన్నారు. 4.45 లక్షల మంది వికలాంగులకు 41 శాతం వికలాంగత్వ ఉందన్నారు. గతంలోనే ప్రభుత్వాలు వికలాంగులకు మెట్రో, హైటెక్ బస్సుల్లో పాస్‌లు ఇస్తామని చెప్పినా నేటికీ అది అమలుకు నోచుకోలేదన్నారు. ఈ నెల 19 నుంచి 20 వరకు అన్ని డిపోల ముందు నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేస్తున్నమని తెలిపారు. ఈ నెల 26న బస్బవన్ను ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆ వేదిక జిల్లా సహాయ కార్యదర్శి బి.బస్వరాజ్, డివిజన్ నాయకులు సత్యనారాయణ, రాంచందర్, గోపాల్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్లో వికలాంగుల బిల్లు ప్రవేశపెట్టాలి
హిమాయత్‌నగర్: వికలాంగులకు ప్రయోజనం కలిగించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని పలు సంఘాల నాయకులు అన్నారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో “నూతన చట్టం అమలు–అభ్యంతరాలపై’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూనాయక్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం రూపొందించిన 1995యాక్ట్ నేటికీ అమలు కావడం లేదన్నారు. వికలాంగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెటనే బిల్లు చేస్తామని చెప్పిన బీజెపి ప్రభుత్వం దాని ఊసెత్తడం లేదన్నారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. డీఓపీటీ శాఖ వికలాంగులకు రిజర్వేషన్ల అభ్యంతరాలను వ్యక్తం చేయడం తగదని, వికలాంగులకు ఏ ఉద్యోగమైనా చేయగలిగే సత్తా ఉందన్నారు. కార్యక్రమంలో కస్తూరి జయప్రసాద్, రాంబాబు, వల్లభనేని ప్రసాద్, లక్ష్మీనారాయణ, నండూరి రమేష్, రాఘవన్, రాజేందర్ పాల్గొన్నారు. -
మెట్రో బస్సుల్లో వికలాంగులకు పాసులివ్వాలి
సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైటెక్, మెట్రో బస్సుల్లో వికలాంగులకు బస్ పాసులను అనమతించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సమితి అధ్యక్షుడు గోరెంకల నర్సింహ, కార్యదర్శి ఎం. అడివయ్య, నాయకులు వెంకటేష్, వెంకట్, చంద్రమోహన్, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. -
వికలాంగుల ముసాయిదా బిల్లు ఆమోదించాలి
బాలసముద్రం : వికలాంగుల ముసాయిదా బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి బిల్లును ఆమోదింపజేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌నపీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి అంజయ్య డిమాండ్ చేశారు. వికలాంగు హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటి సమావేశం హంటర్‌రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా అంజయ్య పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల ఉద్యోగ రిజర్వేషన్లకై సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంట్లో ప్రత్యేక చర్చ చేపట్టాలన్నారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం 100 రోజుల్లోనే బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని చెప్పిన హామీ ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ తగిన అర్హతలు ఉన్నా వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల నిరుద్యోగుల వేదిక రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, రమేశ్, మున్నా, నర్సింగ్, యాకయ్య, జయంగీర్, తిరుపతి, రవి, సుమన్, సంపత్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా అడ్డరాజు, గజ్జి పైడిలను ఎన్నుకున్నారు. -
వికలాంగుల వసతిగృహానికి అద్దె భవనం కావాలి
హన్మకొండ చౌరస్తా : వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో ప్రభుత్వ వి కలాంగుల బాలుర వసతి గృహం నిర్వహణ కు అద్దె భవనం కావాలని వికలాంగుల సం క్షేమ శాఖ సహాయ సంచాలకుడు అంకం శంకర్ సోమవారం తెలిపారు. ప్రభుత్వ నిబందనల ప్రకారం అద్దె చెల్లిస్తామన్నారు. వంద మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాల ని తెలిపారు. ఆసక్తి గల వారు 0870–25779 16 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
పాడులోకంలో బతకలేక..
♦ తనువు చాలించిన అత్యాచార బాధితురాలు ♦ ఎనిమిది నెలలుగా నరకయాతన ♦ తల్లితో తరచూ ఆవేదన ♦ చివరకు విగతజీవిగా మారిన వైనం ♦ తల్లడిల్లిన తల్లి హృదయం బయ్యారంలో విషాదం గజ్వేల్ : పేద కుటుంబానికి చెందిన పన్నెండేళ్ల వికలాం గురాలు.. కామాంధుడి చేతిలో ఎనిమిది నెలల క్రితం అత్యాచారానికి గురైంది. పసితనంలోనే చిన్నారిని చిదిమేయడంతో బతుకు ఆగమైంది. అప్పటినుంచి మానసిక, ఆరోగ్య సమస్యలతో నరకయాతన అనుభవించింది. నిత్యం కన్నీటితో కాలం గడిపింది. ‘అమ్మా నాకీబతుకొద్దు’ అంటూ తరచూ తల్లితో ఆవేదన చెందింది. చిత్రవధను భరించలేక తల్లడిల్లిపోయింది. తుదకు బుధవారం రాత్రి ప్రాణాలు విడిచింది. కన్నపేగు మృతితో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ఓ దుర్మార్గుడి చేష్టలతో తన కూతురు భవిష్యత్తును బుగ్గిపాల్జేశాడంటూ గుండెలవిసేలా రోదించింది. ఈ విషాదకరమైన ఘటన గజ్వేల్ మండలం బయ్యారంలో చోటుచేసుకుంది. బయ్యారం గ్రామానికి చెందిన గాలెంక నర్సమ్మ, నాగయ్య దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. తొమ్మిదేళ్ల క్రితమే పెద్ద కూతురు వివాహం జరిగింది. వివాహం, ఇంటి నిర్మాణం కోసం నాగయ్య దాదాపు రూ.3.5 లక్షల మేర అప్పులు చేశాడు. అప్పుల బెంగతో అనారోగ్యం బారినపడి మూడేళ్ల క్రితం మరణించాడు. రెండో కూతురు స్రవంతి (12) వికలాంగురాలు. కుమారుడికి ఏడేళ్లు ఉంటాయి. అసలే పేదరికం, అందునా తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం తల్లిపై పడింది. నర్సమ్మ కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తుంది. పుట్టెడు అప్పుల్లో ఉన్న నర్సమ్మ అతికష్టమ్మీద కాలం గడుపుతోంది. వైకల్యం కారణంగా స్రవంతి ఇంటి వద్దే ఉంటుంది. ఎనిమిది నెలల క్రితం... కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబంలో ఎనిమిది నెలల క్రితం ఓ విషాదం చోటుచేసుకుంది. వికలాంగురాలైన స్రవంతిని ఓ కామాంధుడు తాగిన మైకంలో ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కూలీ పనుల నుంచి వచ్చిన తల్లి ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇతర ఆసుపత్రుల చుట్టూ తిరిగినా మామూలు మనిషి కాలేక పోయింది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అప్పట్లో ఎస్పీగా ఉన్న సుమతి ఆ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అత్యాచారం తర్వాత షాక్‌లోకి... ఎనిమిది నెలల క్రితం అత్యాచారం జరగ్గా ఆ బాలిక అప్పటి నుంచి మానసిక, ఆరోగ్యపర సమస్యలతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ వచ్చింది. ఈ క్రమంలో బయటకు రావడానికి కూడా ఇష్టపడలేదు. తీవ్రంగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యం పాలైంది. ‘నేను ఈ బతుకు బతకలేనని’ తరచూ తల్లితో తన ఆవేదనను వెల్లగక్కేది. అప్పటికే ఫిట్స్‌తో బాధపడుతున్న ఆ బాలికకు తరచూ విష జ్వరాలు రావటంతో చిక్కి శల్యమైం ది. కూతుర్ని ఎలా బతికించుకోవాలో తెలియక మదనపడింది. అత్యాచార బాధిత సాయం కింద ఇటీవల ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు రావడంతో అందు లో నుంచి వైద్యం కోసం రూ.50వేలు ఖర్చు చేసింది. కూతుర్ని చూసుకోవడానికి కూలీ పనులు మానేసింది. ఫించన్ డబ్బుతో పూటగడుపుకుంటున్నది. అయినా ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడలేదు. మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన స్రవంతి బుధవారం రాత్రి కన్నుమూసింది. గురువారం గ్రామానికి వెళ్లిన ‘సాక్షి’కి ఈ విషయం చెబుతూ నర్సమ్మ కన్నీరుమున్నీరైంది. నా బిడ్డను కడుపుల పెట్టి చూసుకున్న.. ‘నా బిడ్డకు కాళ్లు సరిగ లేకపోయినా... కడుపుల పెట్టి చూసుకుంటున్న... అది నా ఎంబడి ఉంటే అదే సంతోషమనుకున్న... కామంతో కండ్లు మూసుకపోయిన దుర్మార్గుడు నా బిడ్డ బతుకు ఆగం జేసిండు. అప్పటి నుంచి నా బిడ్డ... మనిషిలా లేదు. ఎప్పుడు రందీతో ఉండేటిది. నాకు ఈ బతుకు ఇష్టం లేదు... సచ్చిపోతా... అని జెప్పేది... గిప్పుడు నాకు కడుపు కోత మిగిల్చిపోయింది....అంటూ బాలిక తల్లి నర్సమ్మ విలపించింది. కూతురి అంత్యక్రియలు సైతం చేయలేని స్థితిలో ఉన్న ఆ తల్లిని గ్రామానికి చెందిన నాయకుడు నర్సింలు ఓదార్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
మేం బతికే ఉన్నాం..
లైవ్ సర్టిఫికెట్ కోసం పింఛన్‌దారుల పాట్లు ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల పెన్షన్‌దారులకు విధించిన కొత్త నిబంధనతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెన్షన్ లబ్ధిదారులు తాము బతికి ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ సేవ కేంద్రాలలో వేలి ముద్రలు పోల్చి చూసుకుని ‘లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్’ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈనెల 21 వ తేదీలోగా ‘లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్’ సమర్పించాలని పేర్కొంది. దీంతో నిజామాబాద్‌లోని పెన్షన్ లబ్ధిదారులు నగరంలోని మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అందరూ ఒకేసారి రావడంతో గంటల తరబడి వరుసల్లో నిల్చోవాల్సి వస్తోంది. బుధవారం సర్వర్ సతాయించడంతో మరింత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది. -
పింఛన్ల పంపిణీలో గోల్మాల్!
► రూ. కోటి స్వాహా ► ఫోర్జరీ సంతకాలు,వేలిముద్రలతో వ్యవహారం ► రెండేళ్ల తర్వాతవెలుగుచూసిన అవినీతి బాగోతం సాక్షి, సిటీబ్యూరో: నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందాల్సిన పింఛన్లను కొందరు అక్రమార్కులు స్వాహా చేశారు. ఆన్లైన్ విధానానికి ముందున్న మాన్యువల్ పద్ధతిని ఆసరాగా చేసుకుని కొందరు రెవెన్యూ సిబ్బంది ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో దాదాపు రూ.కోటి రూపాయల పింఛన్లు దొడ్డిదారిన కాజేసినట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ అవినీతి బాగోతం వెలుగుచూసింది. కొంత మంది లబ్ధిదారులకు సంబంధించి తొమ్మిది నెలల పింఛన్ డబ్బులు వారికి ఇవ్వకుండానే....కాగితాలపై చెల్లిం చినట్లు ఫోర్జరీ సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్‌నగర్ మండలంలో వెలుగు చూసిన అవినీతి బాగోతం ఉన్నతాధికారులను తలవంపులకు గురి చేస్తున్నది. సెర్ప్ యంత్రాంగం మ్యానువల్‌గా పంపిణీ చేసిన పింఛన్ల లెక్కలపై నివేదిక కోరగా, ఆరా తీసిన జిల్లా యంత్రాంగానికి దిమ్మ తిరిగి నంత పనైంది. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగి నట్టు అనుమానించిన కలెక్టర్..ఆసిఫ్‌నగర్ మండలంలో లెక్కతేలని రూ. 30 లక్షలపై నివేదిక సమర్పించాలని తహశీల్దార్‌గా పని చేసిన మల్లేష్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు. పైగా ఈ సంఘటనపై హైదరాబాద్ ఆర్డీఓ నిఖిలను విచారణాధికారిగా నియమించారు. ఇదీ కథ... హైదరాబాద్ జిల్లాలో 1.56 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, వీరికి ప్రతి నెల రూ. 17.76 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే ..ప్రారంభంలో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోవటంతో తొమ్మిది నెలలకు పైగా పింఛన్ డబ్బులను మాన్యువల్‌గా రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేశారు. దీన్ని అదనుగా మలుచుకున్న రెవెన్యూ సిబ్బంది అందినంత దోచుకున్నారు. లబ్ధిదారుల ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో పింఛన్ డబ్బులు స్వాహా చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో దర్జాగా పనులు కానిచ్చారు. పంపిణీ ఇలా... ఆన్లైన్ విధానం లేకముందు జిల్లాలో ప్రతి నెలా పింఛన్లకు సంబంధించిన మొత్తం డబ్బులను సదరు మండలానికి చెందిన తహశీల్దారు బ్యాంకు అకౌంట్లో సెర్ఫ్ జమ చేస్తుండటంతో వీఆర్వోలు, వారి అసిస్టెంట్లు పలు ప్రాంతాల కమ్యూనిటీ హాళ్ల నుంచి డబ్బులు పంపిణీ చేసేవారు. పలు కారణాల వల్ల వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ డబ్బులు తీసుకోకుంటే ....ఫోర్జరీతో స్వాహా చేసేవారు. పింఛన్ రాలేదని కార్యాలయానికి వస్తే... చూసి చెబుతామంటూ వేధించే వారు. వరుసగా మూడు నెలల పింఛన్ డబ్బులు తీసుకోకుంటే... రద్దవుతుందని భయపెట్టి అదనంగా డబ్బులు లాగేవారు. పంపిణీ చేయగా మిగిలిన పింఛన్ డబ్బులు ఎప్పటికప్పుడు సెర్ఫ్‌లో జమ చేయాల్సిన్నప్పటికీ తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉంచి అవినీతికి తెరలేపారు. సెర్ఫ్ సీరియస్‌తో.... జిల్లాలో మాన్యువల్‌గా పంపిణీ చేసిన పింఛన్ లెక్కలపై సెర్ఫ్ సీరియస్‌గా నివేదిక కోరటంతో అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఫలితంగా ఎక్కువగా అవినీతి జరిగిందని అనుమానించి... ఆసిఫ్‌నగర్ బాగోతంపై విచారణాధికారిని నియమించే స్థాయికి వెళ్లింది. లెక్కల విషయానికి వస్తే... జిల్లాలోని ఎనిమిది మండలాలకు చెందిన తహశీల్దార్లు రూ.87.84 లక్షలు జమ చేయాల్సి ఉందని సెర్ఫ్‌కు నివేదించగా, మరో ఏడు మండలాల అధికారులు అదనంగా రూ. 83.58 లక్షలు పంపిణీ చేశామని, మీ నుంచే మా మండలాలకు డబ్బులు జమ కావాల్సి ఉందని ఆన్లైన్ నివేదికలో పేర్కొనటం ఆశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎనిమిది మండలాల నుంచి జమ చేయాల్సిన రూ.87.84 లక్షలు జమ చేయకుండా ఏం చేశారన్న అనుమానాల నేపథ్యంలో పక్కదారి పట్టించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పైగా లెక్కలు చూపించటానికి తిరిగి జమ చే సే ప్రయత్నంలో నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తున్నది. మరో ఏడు మండలాల్లో అదనంగా రూ.83.58 లక్షలు పింఛన్ డబ్బులు పంపిణీ చేశామని సెర్ఫ్‌కు నివేదించటంపై....రెవెన్యూ సిబ్బం దికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో జిల్లాలో పింఛన్ల పంపిణిలో రూ.కోటికి పైగా గోల్మాల్ జరిగినట్లు ఆ వర్గాల్లోనే చర్చ సాగుతున్నది. -
పిల్లలందరికీ ఒకటే టూత్ బ్రష్!
అంగవైకల్యంతో అవస్థలు పడే పిల్లలకు ఆసరా అందించాల్సిన ప్రభుత్వ హాస్టళ్లు, జీవిత చరమాంకంలో పట్టించుకునేవారు లేక పడరాని పాట్లు పడే వృద్ధుల ఆశ్రమాల పరిస్థితి దయనీయంగా ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ హోమ్స్‌లో సుమారు 50 మంది పిల్లలు ఒకే టూత్ బ్రష్ వాడుతున్నవైనం తనను ఎంతో బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధీనంలో కొనసాగుతున్న వికలాంగ బాలల హాస్టళ్ళు, వృద్ధాశ్రమాల్లో పరిస్థితిపై.. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ హెచ్ఎల్ దత్తు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమాలను, హాస్టళ్ళను ప్రతిరోజూ సందర్శిస్తున్న ఆయన... వారికి సరైన సహకారం అందించి వారిలో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబర్ లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్మన్ గా నియమితులైన తర్వాత.. ప్రతిరోజూ బెంగళూరు సమీపంలోని వృద్ధాశ్రమాలను సందర్శించి వారితో కొంత సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి కథ విన్నానని చెప్పారు. ఆయనకు ఇద్దరు బాగా సంపాదిస్తున్న, ఉన్నత స్థాయిలో ఉన్న కొడుకులు ఉన్నారని, అయితే వారితో కలసి తనకు ఉండే భాగ్యం మాత్రం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం తనను ఎంతో బాధించిందని, అటువంటి వారికి రోజూ కౌన్సెలింగ్ ఇప్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు. జస్టిస్ దత్తు ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత... ఇరత సభ్యులు జస్టిస్ సిరియాక్ జోసెఫ్, డి. మురుగేశన్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్సి సిన్హాలతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి.. రాష్ట్రాల్లోని వికలాంగ పిల్లల హాస్టళ్లు, వృద్ధాశ్రమాలను సందర్శించి, ప్రాథమిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వాటి పరిస్థితులను మెరుగు పరిచేందుకు కావలసిన సలహాలు, సూచనలను ఇచ్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లో, వికలాంగ హాస్టళ్ళలో ఉండేవారి జీవితాలు ఆనందమయంగా ఉండేట్టు మార్పులు జరిగితే తన జీవితంలో అదే అత్యంత సంతోషకర సన్నివేశం అవుతుందని జస్టిస్ దత్తు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వేసవి వచ్చిందంటే అతనికి నరకయాతన
► అరుదైన వ్యాధితో నరకయాతన ► స్వేదగ్రంథులు లేక దహించుకుపోతున్న పదేళ్ల బాలుడు నోరు తెరిస్తే వేడివేడి.. కళ్లు మూస్తే కన్నీటి తడి.. ఆవలిస్తే ఆవిరేఆవిరి.. ఊపిరంతా ఉక్కిరిబిక్కిరి.. నిండా పదేళ్లు కూడా నిండని ఈ బాలుడి దుస్థితి. వేసవి వచ్చిందంటే చాలు మండిపోతున్న భూగోళంలా మారిపోతుంది ఇతని శరీరం. చెమట బయటకు రాక.. నిత్యం నిప్పులకొలిమిలా శరీరం దహించుకుపోతూ నరకయాతన అనుభవిస్తున్నాడు. ఎప్పుడూ తడి కండువా కప్పుకొంటూ, కుళాయిల్లో శరీరాన్ని తడుపుకొంటూ జీవిస్తున్నాడు. అరుదైన వ్యాధి కుమారుడ్ని కుంగదీసేస్తున్నా పేదరికంతో బాధను గుండెల్లోనే దిగమింగుతున్నారు ఆ తల్లిదండ్రులు. నూజెండ్ల : గుంటూరు జిల్లా ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శింగంశెట్టి వెంకట సాయిపవన్‌కుమార్ అనే పదేళ్ల బాలుడు పుట్టుకతోనే స్వేదగ్రంథులు లేకుండా జన్మించాడు. జన్యుపరమైన వ్యాధితో వెంట్రుకలు కూడా రాని పరిస్థితి. తల్లిదండ్రులు మల్లీశ్వరి, ఆదిశేషయ్య ఎంతోమంది డాక్టర్లకు చూపించారు. అయినా ఫలితం లేదు. ప్రస్తుతం ముక్కెళ్లపాడు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడు వేసవి వచ్చిందంటే చాలు నరకయాతన అనుభవిస్తాడు. చెమట బయటకు పోక తీవ్రమైన ఉక్కపోతకు గురై అల్లాడిపోతుంటాడు. ఎప్పుడూ చల్లటి వాతావరణంలో ఉంచాలని, ఏసీ లేదా కూలర్ ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. పేద కుటుంబం కావడంతో సాయి తడికండువా కప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. తపానికి తాళలేక బడిలో కుళాయిల కింద, బజార్లలో బోర్ల కింద నిత్యం తల తడుపుకొంటుంటాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాల్సిన వైద్యశాఖ అధికారులు ఈ బాలుడిని పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ప్రభుత్వానికి నివేదించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రత్యేక వికలాంగుల కేటగిరీలో పింఛను ఇప్పించాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుంచీ ఇంతే.. మా బాబు స్వేద గ్రంథులు లేకుండా పుట్టడంతో చిన్నవయసులో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక చాలా బాధపడేవాళ్లం. మూడేళ్ల వయసులో గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో చూపించగా, స్వేద గ్రంథులు లేకుండా పుట్టాడని, చల్లని వాతావరణంలో ఉంచాలని చెప్పారు. ఏసీ ఏర్పాటుచేసే స్థోమత మాకు లేదు. పింఛన్ కోసం అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. - శింగంశెట్టి ఆదిశేషయ్య, బాలుడి తండ్రి చల్లటి వాతావరణంలో ఉంచాలి ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను శీతల బాలుడు అంటారు. లక్షల్లో 10 శాతం మంది పిల్లలకు మాత్రమే ఈ తరహా వ్యాధి సోకుతుంది. వేసవిలో నీడపట్టున ఉంచడం, చల్లటి వాతావరణంలో ఉంచడం వంటివి చేయాలి. వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధిని ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. మజ్జిగ, రాగి జావ ఎక్కువగా ఇవ్వాలి. - లెనిన్‌రెడ్డి, వైద్య నిపుణుడు, వినుకొండ -
25 లక్షలమంది వికలాంగులకు శిక్షణ
న్యూ ఢిల్లీ: వచ్చే ఏడేళ్ళలో 25లక్షల మంది వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశం సమైక్యతకు, సమానత్వానికి ఎంతో విలువనిస్తుందని, వసుధైక కుటుంబం అంటూ ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా భావించడం మనదేశ సిద్ధాంతమని ఆయన అన్నారు. అదే సిద్ధాంతం మన చుట్టుపక్కల వాతావరణానికి, జీవితాలకు అన్వయిస్తుందన్నారు. భారతదేశ జనాభాలో వికలాంగులు సింహభాగం ఉన్నారని, వారికి అర్థవంతమైన ఉపాధి మార్గాలను కల్పించడం అవసరమని మోదీ తెలిపారు. వచ్చే ఏడేళ్ళలో వైకల్యాలున్న 25 లక్షల మందికి ప్రత్యేక శిక్షణ కల్పించనున్నట్లు నైంత్ వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ డిజయబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్ (డీపీఐ) సందర్భంలో మోదీ ఓ సందేశాన్నిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ఈ అంశం మోదీ వ్యక్తిగత ఆసక్తిని కనబరచిందని సామాజిక న్యాయం, సాధికారత శాఖామంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలతోపాటు మొత్తం 70 దేశాలనుంచి 200 మందికి పైగా వైకల్యాలున్న వారు హాజరౌతున్నట్లు 150 దేశాల్లో సభ్యత్వం ఉన్న వికలాంగుల మానవ హక్కుల సంస్థ తెలిపింది. -
వికలాంగులను విస్మరించడం తగదు
హైదరాబాద్: వికలాంగ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం మూడురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం తగదని బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న వికలాంగ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా వికలాంగులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వికలాంగుల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రేపటి కల్లా ఈ సమస్యపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే పదివేల మంది వికలాంగ విద్యార్థులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్‌లు కృష్ణయ్యతో కలసి వికలాంగుల నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ నిరసనలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అందె రాంబాబు, చెరుకు నాగభూషణం, నారా నాగేశ్వరరావు, పద్మప్రియ, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైతు బజార్లలో వికలాంగులకు 3 శాతం స్టాళ్లు
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు బజార్లలో వికలాంగులకు స్టాళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం దుకాణాల్లో 3 శాతం స్టాళ్లను రైతు కుటుంబాలకు చెందిన వికలాంగులకు కేటాయిస్తారు. జాయింట్ కలెక్టర్ ఈమేరకు దరఖాస్తులను ఆహ్వానించి అర్హులను గుర్తిస్తారు. వికలాంగులు, స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మూడు సొసైటీల ఆస్తులు అమ్ముకోవచ్చు తూర్పు గోదావరి జిల్లాలోని మూడు సొసైటీల నిరుపయోగ ఆస్తులను అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తుని, సామర్లకోట, గొల్లపాలెంలోని డీసీఎంఎస్ సొసైటీ భవనాలు చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ఎరువులు, విత్తనాల వ్యాపారాన్ని నిర్వహించేందుకు మూలధనంగా వినియోగిస్తారు. వీటిని ప్రభుత్వం సూచించిన మేరకు విక్రయించేందుకు కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షునికి అనుమతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఆ సలహాదారుకు సెంట్రల్ ఫండ్ నుంచి జీతభత్యాలు వ్యవసాయ మార్కెటింగ్, గిరిజన సంక్షేమ విభాగానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ ఐఎఎస్ అధికారి జీవీ కృష్ణారావు జీత భత్యాలను సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదా కలిగిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సలహాదారుగా నియమించింది. అల్లవరం సొసైటీ ఛైర్మన్ నియామకం అల్లవరం మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా గునిశెట్టి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా మల్లాది వెంకట రమణ నియమితులయ్యారు. మరో 17 మంది సభ్యులుగా ఉంటారు. -
పోటెత్తిన వికలాంగులు
సంగారెడ్డి క్రైం: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభు త్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహిం చిన సదరం శిబిరానికి వికలాంగులు పోటెత్తారు. జిల్లాలోని నలుమూలల నుంచి వికలాంగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. వికలాంగుల ధ్రువీకరణ పత్రం కోసం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతినెలా రెండు రోజులు ఈ శిబిరం నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఉదయం 6 గంటలకే ఆసుపత్రికి వచ్చిన వికలాంగులు సాయంత్రం వరకు బారులు తీరారు. వందల సంఖ్యలో వచ్చిన వారికి టెంట్లు, మంచినీటి వసతి కల్పించకపోవడంతో మండుటెండలోనే నిలబడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల అవస్థలు వర్ణణాతీతం. డాక్టర్లు సర్టిఫై చేయడానికి కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. ఒకే ఒక్క ద్వారం గుండా వికలాంగులను ఆసుపత్రిలోకి అనుమతించడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. పోలీసుల బందోబస్తు మధ్య ఈ శిబిరం కొనసాగించాల్సి వచ్చింది. -
నీళ్లు తాగి వాళ్లు... కన్నీళ్లు తాగి నేను...
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... అంతవరకూ వేగంగా పరుగులు తీసిన రైలు తన వేగాన్ని తగ్గించింది. పరుగును నడకగా మార్చి స్టేషన్‌ను చేరుకోవడానికి నెమ్మదిగా సాగుతోంది. నరసాపురం అన్న బోర్డు చూడగానే నా మనసులో కాసింత ఆనందం, కాసింత ఆందోళన. రైలు ఆగింది. నాలో ఉద్వేగం పెరిగింది. నలిగి చిరగడానికి సిద్ధంగా ఉన్న కాటన్ చీరను భుజాల చుట్టూ కప్పుకుని, ఓ చేతితో పాత సూట్‌కేసు, ఇంకో చేతితో పర్సు పట్టుకుని తలుపు వైపు నడిచాను. ప్లాట్‌ఫామ్ మీద అడుగు పెడుతుంటే నా కాళ్లు సన్నగా వణకడం నాకు తెలుస్తోంది. భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనన్న చింతన నన్ను చిత్రవధ చేస్తోంది. భావోద్వేగాలను అదిమిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నా కళ్లు ఆతృతగా స్టేషన్ అంతా కలియజూస్తున్నాయి. నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తిని చూడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అంతలో వెనుక నుంచి నా భుజమ్మీద చేయి పడింది. అది నాకు బాగా పరిచయమైన స్పర్శ. ఠక్కున వెనక్కి తిరిగాను. మాసిన గడ్డం, నలిగిన దుస్తులు, ముఖంలో దైన్యత, కళ్ల నిండా దిగులు... తన అంగవైకల్యానికి సాక్ష్యంగా చొక్కా కుడి చేయి, ప్యాంటు ఎడమ కాలు గాలికి ఎగురుతున్నాయి. ఒక్క అంగలో వెళ్లి తనని హత్తుకుపోయాను. గుండెల్లోని వేదన కరిగి కళ్ల నుంచి పొంగు తుంటే నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగాను. నన్ను ఎలా ఓదార్చాలో తెలియక తను మౌనం వహించాడు. తనకి ఏమి చెప్పాలో తెలియక నేను మూగబొమ్మనయ్యాను. అయినా ఏం చెప్పగలను? నా పట్ల ఏం జరిగిందో, నా బతుకు ఏ విధంగా నలిగిపోయిందో తనతో ఎలా చెప్పగలను?! ఆకాశానికి ఎగరాలని కొందరు ఉవ్విళ్లూరుతారు. నేలమీద నిశ్చింతగా నిలబడగలిగే చోటుంటే చాలని కొందరనుకుంటారు. రెండోకోవకు చెందినదాన్ని నేను. ఉన్నదాంట్లో తృప్తిగా బతికేస్తే చాలనుకుంటాను. అందుకే ఏనాడూ ఏదీ లేదని చింతించలేదు. నిజానికి సంతోషించడానికి కూడా మా దగ్గరేం లేదు. ట్రక్కు డ్రైవరైన నా భర్త సంపాదన మాకు విలాసాలనివ్వలేకపోయినా, వేళకింత అన్నం పెట్టేది. సంపద లేకపోయినా జీవితం సంతోషంగానే సాగిపోయేది. కానీ అది కూడా కంటగింపుగా అనిపించిందో ఏమో ఆ దేవుడికి... ఒక్కసారిగా మా జీవితాలను చిందరవందర చేశాడు. ఓ రోడ్డు ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఒక చేయి, కాలు తీసేశారు డాక్టర్లు. దాంతో మా బతుకులు అతలాకుతలమైపోయాయి. నాకా ఉద్యోగం చేసేంత చదువు లేదు. అలా అని భర్తని, ముగ్గురు పిల్లల్నీ ఆకలికి బలిపెట్టలేను. అందుకే మొదటిసారి గడప దాటాను. పొలం గట్ల మీద పరుగులు తీశాను. ఎండలో ఎండాను. వానలో తడిశాను. ఎలాగైనా కుటుంబాన్ని నెట్టుకు రావాలని తపించాను. కానీ ఎంత కష్టపడినా మా కడుపుల్లో ఎప్పుడూ కాసింత ఖాళీ ఉంటూనే ఉండేది. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చాడు రాజు... మా పెదనాన్న కొడుకు. ‘కొయిటా ఎల్లిపోవే అక్కా, కస్టాలు తీరతాయి’ అన్నాడు. ఏజెంట్‌కి ఓ ముప్ఫై వేలు ఇస్తే దుబాయ్ పంసిస్తాడనీ, నెలకు ఇరవై వేల జీతం వస్తుంది కాబట్టి జీవితం మారిపోతుందనీ చెప్పాడు. అది మా కష్టాలు తీరడానికి దొరికిన అవకాశంలా తోచడంతో తటపటాయించకుండా తలూపేశాను. ఉన్న చిన్న గుడిసెనీ తాకట్టు పెట్టేసి, ఏజెంటుకు ముప్ఫై వేలు కట్టేశాను. కళ్లు మూసి తెరిచేలోగా వీసా వచ్చేసింది. నన్ను తీసుకెళ్లి దుబాయ్‌లోని ఓ ఇంట్లో వదిలిపెట్టింది. కోటీశ్వరుడైన సేఠ్ ఇల్లు అది. ఇంటిపని చేయడానికి ఇద్దరు నౌకర్లున్నారు. నేను వంట చేస్తే చాలు అన్నాడు. నిజమనుకున్నాను. కానీ వారం తిరిగేసరికి ఇద్దరు పనివాళ్లూ మానేశారు. కాదు, సేఠ్ మాన్పించే శాడు. వాళ్ల పనీ నన్నే చేయమన్నాడు. అతడి చెప్పులు తుడవడం దగ్గర్నుంచి బాత్రూమ్ కడగడం వరకూ నాదే బాధ్యత. పది రోజుల్లో ఒళ్లు హూనమైపోయింది. నీరసం ముంచుకొచ్చింది. కానీ అవన్నీ ఆ సేఠ్‌కి నచ్చని లక్షణాలు. కూర్చుని కనిపిస్తే అరిచేవాడు. ఏదో ఒక పని పురమాయించేవాడు. దానికి తోడు రెండు రోజులకోసారి ఫ్రెండ్స్‌కి ఇంట్లో పార్టీలు ఇచ్చేవాడు. అతడి సరదాలు నా శరీరానికి చిత్రహింసలు. విశ్రాంతి అన్న మాటకు స్థానం లేదు. రోగమొచ్చినా మందూ మాకూ కోరకూడదు. కోరుకున్న కొయిటా ఉద్యోగం కొలిమిలాంటిదని అర్థమవడానికి ఎంతోకాలం పట్టలేదు. అయినా భరించాను. వికలాంగుడైన నా భర్త, జాలిగొలిపే నా పిల్లల ముఖాలు గుర్తొచ్చి సహించాను. కానీ నా జీవితం మరింత దిగజారిపోతుందని ఊహించలేదు. ఉన్నట్టుండి ఒకరోజు సేఠ్ పశువులా మీద పడ్డాడు. తన కోరిక తీర్చాలన్నాడు. కాదంటే కొట్టాడు. పని చేయడానికి వచ్చిన తర్వాత ఏ పనయినా చేయాలంటూ నియమాలు బోధించాడు. మొండికేస్తే దొంగతనం కేసులో ఇరికిస్తానన్నాడు. జీవితాంతం జైల్లో పడేయిస్తానన్నాడు. నా ఆత్మాభిమానం నన్ను లొంగనివ్వకపోయినా, అతడి పశుబలం నన్ను వశం చేసుకుంది. నా బతుకును కాలరాసింది. ఆ క్షణమే నేను ఆడదానిగా చచ్చిపోయాను. కానీ ఓ భార్యగా, తల్లిగా నా బాధ్యత గుర్తుకొచ్చి జీవచ్ఛవంలా బతికున్నాను. కానీ నా సహనం మావాళ్ల కడుపులు నింపలేదు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు సేఠ్. అడిగితే అరిచేవాడు. అర్థిస్తే అవమానించేవాడు. ఓ పక్క నావాళ్లు ఎలా బతుకుతున్నారో అన్న దిగులు... మరోపక్క నా తనువు, జీవితం సేఠ్ చేతుల్లో నలిగిపోతున్నాయన్న వేదన... ఎన్నాళ్లు అలా చావలేక బతికానో చెప్పలేను. చివరికి శరీరం పట్టు తప్పింది. ఆరోగ్యం అదుపు తప్పింది. మంచం మీది నుంచి లేవడం గగనమైంది. దాంతో నేనిక తనకి పనికి రాను తీసుకుపొమ్మని ఏజెంట్‌తో చెప్పాడు సేఠ్. హైదరాబాద్ నుంచి నరసాపురం వెళ్లడానికి రైలు చార్జీలు చేతిలో పెట్టి, నన్ను విమానమెక్కించేశాడు ఏజెంట్. సంతోషంగా వెళ్లిన నేను, సర్వం కోల్పోయి వచ్చాను. నిస్సహాయంగా నా భర్తను పిల్లల్ని చేరుకున్నాను. అక్కడ పడిన యాతనకి నా శరీరం ఇప్పటికీ సలుపుతూనే ఉంది. అక్కడ జరిగిన అవమానాలకి నా మనసు నేటికీ బాధతో మూలుగుతూనే ఉంది. దేనికోసం వెళ్లానో, దేనికోసం అంతటి హింసనూ అనుభవించానో దానికి ఫలితం లేకుండా పోయింది. మా వాళ్లకు నేను చేసిందేమీ లేదు. మా కష్టాలు తీరిందీ లేదు. అదే పేదరికం. అదే ఆకలి. కనీసం ఇంతకుముందులా కూలిపని చేసుకుందామన్నా నలిగిపోయిన నా దేహం సహకరించడం లేదు. అప్పు పుట్టిన పూట భోజనం. లేని పూట పస్తు. ఎన్నో పూటలు నా భర్త, పిల్లలు నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంటే... నేను నా కన్నీళ్లు తాగుతూ బతుకీడుస్తున్నాను. అంతకంటే ఏం చేయగలను!! - జయ, తూ.గో. జిల్లా (గోప్యత కోసం పేర్లు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి -
పింఛన్ తంటాలు
జీవితానికి ఆసరా కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛన్ జాబితాలో పేరు లేదని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్నపానీయాలు మానుకుంటున్నారు. ఆందోళన బాట పడుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు పింఛన్ల జాబితాలో పేరు లేదని ఆరుగురు చనిపోయారు. నిజామాబాద్‌లో ఎంపీ కవితను అడ్డుకున్నారు. వరంగల్‌లో దీక్షలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఓ వృద్ధురాలు అన్నపానీయాలు మానేసి నిరసన వ్యక్తం చేస్తోంది. మరోపక్క అధికారులు నిర్లక్ష్యంతో అనర్హులకు ఆసరా దక్కుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ కోసం అన్నపానీయాలు బంద్ రెండు రోజులుగా వృద్ధురాలి నిరసన ఆందోళనలో కుటుంబ సభ్యులు తూప్రాన్: ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా అందిస్తున్న పింఛన్ జాబితాలో తన పేరు లేదని ఓ వృద్ధురాలు రెండు రోజులుగా అన్నపానీయాలు మానేసి నిరసన తెలుపుతోంది. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పిట్ల పోచమ్మ (85) వితంతువు. కాగా.. అప్పులబాధతో పన్నెండేళ్ల క్రితం కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అత్త, కోడళ్లు వితంతు పింఛన్ తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు రూ.1000 అంది స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ పంచాయతీ వద్ద వీఆర్ఓ అరుణ గ్రామానికి చెందిన అర్హుల జాబితా అతికించింది. అందులో గ్రామానికి చెందిన 09 మంది కి చెందిన వితంతువుల పేర్లు లేవు. విషయం తెలుసుకున్న పిట్ల పోచమ్మ తనకున్న ఒక్క ఆసరా రాకుండా పోయిందని బాధపడుతూ శుక్రవారం నుంచి అన్నపానీయాలు మానేసింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా ఏమీ తీసుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శి పింఛన్లు రాని వారికి తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా వృద్ధురాలు మాత్రం అన్నపానీయాలు ముట్టుకోవడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
పింఛన్ జాబితాలో పేరు లేదని..
వికలాంగుడి ఆత్మహత్య... ముగ్గురికి గుండెపోటు సాక్షి నెట్వర్క్: నిన్నటి వరకు జీవనాధారంగా నిలిచిన పింఛన్ పథకం జాబితాలో పేరు లేదని నిజామాబాద్ జిల్లాలో ఓ వికలాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు మరణించారు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం ఉప్పర్‌పల్లికి చెందిన మద్దికుంట చంద్రం(35) వికలాంగుడు. రెండేళ్లుగా వికలాంగ పింఛన్ పొందుతున్నాడు. తాజాగా వచ్చిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా దుబ్బాక నగర పంచాయతీకి చెందిన సుంకోజు కుమారస్వామి(65), ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు బొరిగాం శంకర్(52) పింఛన్ జాబితాలో తమ పేరు లేకపోవడంతో గుండెపోటుకు గురై మరణించాడు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంకు చెందిన కొండూరు ఇస్తారి(75) జాబితాలో తన పేరు లేదని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వచ్చి మంచంపై పడుకొని అలాగే మృతి చెందాడు. -
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
కర్నూలు అగ్రికల్చర్ : వికలాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని అదనపు జాయింట్ కలెక్టర్ రామస్వామి అన్నారు. కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేదికపై ఆయన మాట్లాడారు. వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికలాంగులందరూ విధిగా సదరం ధ్రువపత్రాలు పొందినప్పుడే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. సదరమ్ క్యాంపుల్లో జాప్యం లేకుండా ధ్రువపత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగాలని కోరారు. వికలాంగులకు ఉచిత న్యాయాన్ని అందించేందుకు, ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించడంతో పాటు కోర్టు ఫీజులు కూడా చెల్లిస్తున్నామని జిల్లా న్యాయ సేవా సంస్థ జడ్జి ఆదినారాయణ తెలి పారు. వికలాంగులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. వికలాంగులు అన్యాయానికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు వివరించారు. వికలాంగుల శాఖ ఏడీ వరప్రసాద్, మెప్మా పీడీ రామాంజనేయులు మాట్లాడారు. అనంతరం ముగ్గురికి వివాహ ప్రోత్సాహకంగా రూ.50 వేలు ప్రకారం ఏజేసీ రామస్వామి అందజేశారు. ఐదుగురు వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వికలాంగుల సంఘాల నేతలు పాల్గొన్నారు. బధిరులు, అంధులు, శారీరక వికలాంగుల సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. భారీ ర్యాలీ అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు వికలాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ-వెలుగు, మెప్మా, సర్వశిక్ష అభియాన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వహించిన వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్ అన్పించాయి. -
పింఛన్ల కోసం ఆందోళనలు
కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ధర్నాలు కరీంనగర్: పింఛన్లు తొలగించి మా నోట్లో మట్టికొట్టొద్దంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. 90% వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ పింఛన్లు తొలగించారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలున్నప్పటికీ వృద్ధాప్య, వితంతు పింఛన్లు రద్దు చేశారని మరికొందరు వాపోయారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామని హా మీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ముస్తాబాద్‌లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రాజీవ్‌చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. వయ సు నిండిన, అరవై శాతానికి పైగా అంగవైకల్యం కలిగిన, భర్త చనిపోయిన వారికి పింఛన్లు ఇవ్వ డం లేదన్నారు. మండలానికి మరో వెయ్యికిపైగా పింఛన్లు వస్తాయని ఎంపీడీవో ఓబులేసు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆ ధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్‌లో ధర్నా చేశారు. మాదాసు సతీష్(28) అనే సర్పంచ్‌ను చేనేత కార్మికుడిగా గుర్తిస్తూ పింఛన్ ఎలా మంజూరు చేశారంటూ అధికారులను నిలదీశారు. గతంలో ఉన్న పింఛన్లను తొలగించి తమకు అన్యాయం చేశారంటూ వెల్గటూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. -
అయ్యో పాపం!
రాష్ర్ట ప్రభుత్వ నిర్ధయకు పరాకాష్ట ఈ సంఘటనలు. వయసు పైబడి... కుటుంబసభ్యుల నిరాదరణను మౌనంగా భరిస్తున్న వృద్ధుల, ఒకరు సాయం చేస్తే తప్పా ఎలాంటి పనులు చేసుకోలేని వికలాంగుల, కట్టుకున్న వాడు అకాల వృత్యువాత పడితే అయినోళ్ల పంచన చేరి తలదాచుకుంటున్న వితంతువుల పింఛన్లను రద్దు చేసిన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఈసడించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా పర్వాలేదు. ప్రతి నెలా తమకు అందజేస్తున్న పింఛన్లను మాత్రం రద్దు చేయకుంటే చాలునన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. - చెన్నేకొత్తపల్లి/అనంతపురం కార్పొరేషన్ వంద శాతం వైకల్యం ఉన్నా అందని పింఛన్ అర్హులైన వారు పింఛన్లు అందక నానా ఇబ్బందులు పడుతుంటే అనర్హులు మాత్రం దర్జాగా వాటిని ఎగరేసుకువెళుతున్నారు. చెన్నేకొత్తపల్లికి చెందిన రామలక్ష్మి, శ్రీనివాసులు దంపతుల రెండవ సంతానంగా పుట్టిన పూజారి నరసింహులుది అదే పరిస్థితి. పుట్టుకతోనే ఆ బాలుడికి రెండు చేతులూ లేవు. ప్రస్తుతం చెన్నేకొత్తపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న నరసింహులుకు వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. దీనిపై గతంలో 416381నంబర్లో పింఛన్ బుక్కును కూడా ఇచ్చారు. కొన్నేళ్లుగా రూ. 500 చొప్పున పింఛన్‌ను ఇస్తూ వచ్చారు. రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే పేరుతో పింఛన్ జాబితా నుంచి నరసింహులు పేరు తొలగించారు. దీనిపై అధికారులను కలిసి విచారణ చేస్తే నిర్లక్ష్యమే వారికి ఎదురవుతోంది. ప్రస్తుతం బడికి వెళ్లడం మానేసి పింఛన్‌ను పునరుద్ధరించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం నరసింహులు, అతని తల్లిదండ్రులకు నిత్యృత్యమైంది. -
పేరుకు రాజు.. కష్టమే రోజూ
ఇతని పేరు అడ్డా బాలరాజు. వయసు 42 ఏళ్లు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన ఈయన పుట్టుకతోనే వికలాంగుడు. గూని సమస్య ఉండటంతో ఏ పనీ చేయలేడు. గతంలో తండ్రి చనిపోయాడు. తల్లి వృద్ధురాలు. ఇతడి పెద్దక్క భర్త మరణించడంతో కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చేసింది. చిన్నక్క అడపాదడపా వీరి ఆలనాపాలనా పట్టించుకునేది. ఆగ్రహించిన ఆమె భర్త పుట్టింటికే పో.. అని ఆమెను తరిమేశాడు. తల్లి, ఇద్దరు అక్కలు, వారి బిడ్డలకు ఒక్క మెతుకు కూడా పెట్టలేని దుస్థితికి చేరిన బాల రాజు తనలో తానే కుమిలిపోతున్నాడు. ఇతనికి రెండు నెలల క్రితం వరకూ వికలాంగుల కోటాలో నెలకు రూ.500 పింఛను వచ్చేది. ఆ మొత్తాన్ని రూ.1,500 పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో బాలరాజు సంబరపడ్డాడు. ఆ సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. రెండు నెలలుగా అతడికి పింఛను అందటం లేదు. ఇదేమని అడిగితే జాబితాలో పేరు లేదని ఒకరు, కంప్యూటర్లో పేరు రాలేదని ఇంకొకరు, వేలి ముద్రలు పడలేదని మరొకరు చెబుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి ఇతనిది. ‘అవిటితనంతో బాధపడుతున్నాను. ఎందుకీ బతుకు అనిపిస్తోంది. చంద్రబాబు పింఛను పెంచుతానంటే ఆనందపడ్డాను. ఆయన దయ కూడా నాపై లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాలరాజుకు పింఛను అందుతుందా.. కష్టాలు కొంచెమైనా తీరుతాయా.. ఏమో అధికారులే సమాధానం చెప్పాలి మరి. - పాలకోడేరు -
పింఛన్.. టెన్షన్!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తయారైంది పింఛన్ల పరిస్థితి. బోగస్ పింఛన్లను ఏరివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న పింఛన్లకు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఏంచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటూనే దరఖాస్తులను వడపోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్తగా రాబోయే పింఛన్లపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని షేక్‌పేట మండల కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన చర్చావేదికలో మహిళలు తమ మనోగతాన్ని వెల్లడించారు. బంజారాహిల్స్: వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ల కోసం ప్రభుత్వం ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించగానే పెద్ద సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తరలివచ్చి ధ్రువపత్రాలు జతపరిచి దరఖాస్తులను అందజేశారు. ఊహించినదానికంటే భిన్నంగా దరఖాస్తులు రావడంతో ఇందులో ఎంతమందికి అర్హత కల్పిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వితంతు, వృద్ధాప్య పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు అందినట్లు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. షేక్‌పేట మండల పరిధిలో వృద్ధాప్య పింఛన్ల కోసం 2,614, వితంతు పింఛన్ల కోసం 2,679, వికలాంగుల పింఛన్ల కోసం 1027. మొత్తం కలిపి 6320 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు మండల పరిధిలో కేవలం 3,100 మందికి మాత్రమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందడంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు లభిస్తాయా ఇందులో కూడా వడపోత ఉంటుందా అనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాల్సిందేనని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలని ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్‌కు చెందిన రమణమ్మ అనే వృద్ధురాలు డిమాండ్ చేసింది. కొత్త పింఛన్ల కోసం ఎప్పటి నుంచో చూస్తున్నామని ఈ సారి తప్పకుండా అర్హత కల్పించాలని బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్ బస్తీకి చెందిన రాములు అనే చిరు వ్యాపారి కోరారు. పింఛన్ల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని పాత సంఖ్య తరహాలోనే ఇస్తానంటే చాలా మంది నష్టపోతారని పంజగుట్ట రామకృష్ణానగర్ బస్తీకి చెందిన మొగులయ్య అనే వృద్ధుడు తెలిపారు. దాదాపు చర్చలో పాల్గొన్న వారంతా దరఖాస్తుదారులందరికీ అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. షేక్‌పేట మండల పరిధిలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పింఛన్లు ఇస్తామని వెల్లడిస్తే మాత్రం చాలా మంది నష్టపోవాల్సి వస్తుందని జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని నందగిరిహిల్స్, గురుబ్రహ్మనగర్‌కు చెందిన నారాయణ అన్నారు. వృద్ధులను కనికరించాలి ఈ సారి పింఛన్ పెరగడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు ఇవ్వాలి. వృద్ధులను కనికరించాలి. కొంత మందికే ఇస్తామంటే కుదరదు. - మొగులమ్మ వస్తాయనే ఆశిస్తున్నాం ఈసారి ప్రతి ఒక్కరికీ పింఛన్లలో మేలు చేకూరుతుందని భావిస్తున్నాం. పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో ఈ సారి అక్రమాలు, అవినీతి చోటు చేసుకునే అవకాశాలు లేవని విన్నాం. పకడ్బందీగా దరఖాస్తుల విచారణ కూడా చేపడుతుండటంతో అర్హత ఉన్నవారందరూ లబ్ధిపొందుతారని అనుకుంటున్నాం. - గంగారపు లక్ష్మి -
చేతికందేనా!
పింఛన్ల కోసం 1.60లక్షల మంది ఎదురుచూపులు ఇప్పటి వరకు 1.11లక్షల మందికే అందిన వైనం జన్మభూమిలోనే అందిస్తామని అధికారుల ప్రకటన వాయిదా పడితే తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారుల్లో ఆందోళన మచిలీపట్నం/గుడ్లవల్లేరు : హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ పెను తుపాను పరోక్షంగా మన జిల్లాలోని 1.60లక్షల మందికి పైగా సామాజిక పెన్షనర్ల పైనా తీవ్ర ప్రభావమే చూపింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పెంచిన పింఛనుతో ‘పండగ’ చేసుకుందామని ఆశించిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ దీపావళి రోజు చీకటే మిగిలింది. అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అందజేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి తొలుత అనర్హులను తొలగించేందుకు సర్వే నిర్వహించారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో కొందరికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో హుదూద్ తుపాను సంభవించడంతో జన్మభూమిని వాయిదా వేశారు. దీంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. అంతా తికమకే.. జిల్లా వ్యాప్తంగా 3.13 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇటీవల ఏర్పాటుచేసిన కమిటీలు సర్వే నిర్వహించి 14,370 మంది అనర్హులని గుర్తించారు. మరో 21వేల మందికిపైగా పింఛనుదారులకు ఆధార్ అనుసంధానం పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వారికి పింఛన్లు నిలిపివేశామని, పూర్తి పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మిగిలిన 2.77 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో 1.11 లక్షల మందికి పింఛన్లు అందజేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. మిగిలినవారికి ఈ నెల 25 నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఇస్తామని చెబుతున్నారు. అయితే, పింఛన్ల పంపిణీకి జన్మభూమితో లింకు పెట్టి నెలాఖరు వరకు అందజేయకపోవడంతో మందుబిళ్లలు కూడా కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు వాపోతున్నారు. పింఛన్లు నిలిపేయటం అన్యాయం హుదూద్ తుపాను వల్ల జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేయటంలో అర్థం ఉంది. కానీ, లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లను నిలిపేయటం అన్యాయం. వృద్ధులు, వికలాంగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలి. - కాటే నాగజ్యోతి, ఎంపీటీసీ సభ్యురాలు, వేమవరం, గుడ్లవల్లేరు మండలం -
రియల్ మోసం
నందికొట్కూరురూరల్: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ వికలాంగుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తక్కువ ధరకు పొలం ఇప్పిస్తానని చెప్పి ఓ ఉద్యోగి డబ్బులు స్వాహా చేయడంతో మోసపోయిన యువకుడు జీవితంపై విరక్తి చెంది బలవన్మరం పొందిన సంఘటన మండల పరిధిలోని నాగటూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీ నరసింహులు(28) శనివారం తెల్లవారు జామున స్థానిక ఆర్టీసీ బస్టాండులో పురుగుల మందు తాగి ఆపస్మారకస్థితికి చేరుకోవడంతో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన క్షత గాత్రుడిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్లో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నరసింహులు కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ క్రమంలో కర్నూలు నగరం బీ క్యాంపులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి రాజానాయక్‌తో పరిచయం ఏర్పడింది. తన భార్య ఉమమహహేశ్వరమ్మ రె వెన్యూ కార్యాలయంలో పనిచేస్తుందని, తక్కువ ధరకే విలువైన పొలం ఇప్పిస్తానని నరసింహులును నమ్మించాడు. దీంతో తక్కువ ధరకే మంచి ఇళ్ల స్థలం ఇప్పిస్తానని ఆ యువకుడు తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద రూ.9 లక్షలు, తాను కూడబెట్టుకున్న రూ. లక్ష కలిపి మొత్తం రూ.10 లక్షలు రాజానాయక్ చేతిలో పెట్టాడు. డబ్బు తీసుకున్న ఆ ఉద్యోగి అదిగో..ఇదిగో అంటూ కొన్నాళ్లు సతాయించాడు. చివరకు మాట మార్చి నాకు డుబ్బులు ఇచ్చినట్లు నీ దగ్గర ఎలాంటి ఆధారం లేదని నిరాకరించాడు. దీంతో తన వద్ద వాయిస్ రికార్డు ఉందని చూపించినా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కనికరించకపోవడంతో వారం రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న వ్యక్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఇంటర్ వరకు చదువుకొని ఆ తర్వాత వికలాంగుల సమస్యలపై పొరాటాలు చేశాడు. ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. మృతుడి తల్లి అక్కమ్మ ఫిర్యాదు మేరకు నందికొట్కూరు ఎస్ఐ జమీర్ కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘పెన్నిధి’ అన్నారు..ఉన్నది ఊడ్చారు
కొంకుదురు (బిక్కవోలు) : పింఛన్ల మొత్తాన్ని పెంచుతామన్న టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో కొత్త ఆశలు చిగురించాయి. తమ బతుకుబండి కష్టాల గతుకుల నుంచి బయటపడి, సాఫీగా సాగుతుందన్న భరోసా కలిగింది. ఇంతలోనే వారిలో కొందరు హతాశులు కాక తప్పలేదు. వారి పరిస్థితి పరమాన్నం దక్కుతుందని నోరూరుతుండగా.. నోటి దగ్గరి గంజి కుండనే గుంజుకుపోయినట్టయింది. తనిఖీ పేరుతో తమను పింఛన్లకు అనర్హులను చేయడంతో ఆ నిస్సహాయులు నిర్ఘాంతపోతున్నారు. జిల్లావ్యాప్తంగా అలాంటి వారెందరో. బిక్కవోలు మండలం కొంకుదురులో పింఛన్లు రద్దయిన వారి గోడు ఆ వేదననే ప్రతిధ్వనిస్తోంది. మండలంలో మొత్తం 501 పింఛన్లు రద్దు చేస్తే.. వాటిలో 113 కొంకుదురువే. తామంతా సర్కారీ సాయానికి నూరుశాతం అర్హులమే అయినా నిర్దాక్షిణ్యంగా పింఛన్ రద్దు చేశారని వారు వాపోతున్నారు. ఇందుకు అధికార పార్టీకి చెందిన వారే కారణమని ఆక్రోశిస్తున్నారు. గ్రామంలోని శెట్టిబలిజ పేటకు చెందిన కట్టా వెంకటరమణ తనకు ఓ కాలు అవిటిదని, 74 శాతం వైకల్యం ఉన్నట్టు సదరమ్ సర్టిఫికెట్ ఉన్నా.. ఇప్పుడు తనిఖీల్లో అనర్హుడనని పింఛన్ రద్దు చేశారని గొల్లుమన్నాడు. కొవ్వూరి సూర్యకాంతం అనే వితంతువు తన భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించినా.. ‘నువ్వు వితంతువు కాదు’ అని పింఛన్ రద్దు చేశారని వాపోయింది. రోగిష్టి వాడైన తన కొడుకు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీలో తిరిగినందుకు తన పింఛన్ రద్దు చేయాలని టీడీపీకి చెందిన ఒక నాయకుడు బహిరంగంగా అన్నాడని ఆరోపించింది. నేకూరి సత్యవతి అనే యువతికి రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. ఆమెకు 81 శాతం వైకల్యం ఉన్నట్టు సదరమ్ శిబిరంలో ధృవీకరించారు. అయినా సత్యవతికి వైకల్యం లేదని పింఛన్ రద్దు చేశారు. నా అన్నవారు లేని కుక్కల ముత్యాలమ్మ అనే వృద్ధురాలికి వచ్చే పింఛన్, బంధువుల సాయమే జీవనాధారం. ఆమె ఇంట్లో ఇద్దరు పింఛన్దారులున్నారన్న సాకుతో పింఛన్ రద్దు చేశారు. ఇలా గ్రామంలో పింఛన్లు రద్దయిన తామంతా ఇంచుమించు అర్హులేనని బాధితులు అంటున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. వైకల్యమున్నా పింఛన్ రద్దు నాకు ఒక కాలు పూర్తిగా పని చెయ్యదు. కష్టపడి ఏ పనీ చేయలేను. చిన్న కొట్టు పెట్టుకొని బతుకుతున్నాను. అటువంటిది నా పెన్షనే తీసివేశారు. - కట్టా వెంకటరమణ వితంతువును కాదట.. నా భర్త చనిపోయారు. నా కొడుకు ఆరోగ్యం బాగోదు. నా భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించినా.. నేను వితంతువును కాదని పింఛన్ రద్దు చేశారు. - కొవ్వూరి సూర్యకాంతం డబుల్ సాకుతో ఏకాకికి ఎసరు నా వయస్సు 70 సంవత్సరాలు. నా అన్నవారెవరూ లేని ఒంటరి దాన్ని. నాకు ఇల్లు తప్ప ఏ ఆస్తీ లేదు. డబుల్ పెన్షన్ ఉందన్న కారణంతో నా పెన్షన్ రద్దు చేశారు. - కుక్కల ముత్యాలమ్మ -
పింఛను పెరుగుతుందనే ఆశతో
ఏలూరు (వన్‌టౌన్) : వైకల్య ధ్రువీకరణ కోసం జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో గురువారం నిర్వహించిన సదరం శిబిరాలు వికలాంగులు పోటెత్తారు. గతంలో ఈ శిబిరాలకు 100 నుంచి 150 మంది వచ్చేవారు. అయితే ప్రస్తుత టీడీపీ సర్కారు వికలాంగులకు పింఛను రూ.1500కు పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో ఈ శిబిరాలకు కుటుంబ సభ్యులతో కలిసి వేలాదిగా హాజరయ్యారు. అంతేకాకుండా శిబిరాల నిర్వహణలో, ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం కూడా రద్దీకి కారణంగా చెబుతున్నారు. ఇటీవల పింఛన్ల సర్వేలో అనర్హత వేటు పడిన కొందరు ధ్రువీకరణ పత్రాల కోసం శిబిరాలకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా, శిబిరాలకు వచ్చిన వికలాంగులను నియంత్రించడం నిర్వాహకులకు కష్టసాధ్యమైంది. ఆయా ఆస్పత్రుల్లో సాధారణ ఓపీ సేవలకు కొంత ఆటంకం ఏర్పడింది. రోగులు నానాయాతన పడ్డారు. నేడు, రేపు మళ్లీ పరీక్షలు భీమవరం అర్బన్ : స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి సుమారు 500కు పైగా వికలాంగులు పరీక్షలు నిమిత్తం వచ్చారు. దీంతో అక్కడ స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. సరైన క్యూ విధానం లేకపోవడం, సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో వికలాంగులు అవస్థలు పడ్డారు. 2010 సంవత్సరానికి సంబంధించిన వికలాంగ ధృవీకరణపత్రాలు జారీలో జాప్యం వల్లే రద్దీకి కారణమని అధికారులు చెబుతున్నారు. వీరు కూడా గురువారం శిబిరానికి హాజరయ్యారని అంటున్నారు. శిబిరంలో కొంతమందినే పరీక్ష చేసి మిగిలిన వారికిసీరియల్ నంబర్లు ఇచ్చి పంపించివేశారు. వీరిని శుక్రవారం, సోమవారం నిర్వహించే క్యాంపులో నిర్దారణ పరీక్షలు చేస్తామని వారికి తెలిపారు. 274 మందికి వైకల్య పరీక్షలు తణుకు అర్బన్ : తణుకులో ప్రతి వారం సదరం శిబిరం నిర్వహస్తున్నా గురువారం ఒక్కసారిగా వెయ్యి మంది వికలాంగులు రావడంతో వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు అవస్థలు పడ్డారు. వికలాంగులు భారీగా క్యూలో నిలబడ్డారు. ఊహించని విధంగా వచ్చిన సిబ్బందిని చూసి డీఆర్డీఏ సిబ్బంది ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆస్పత్రి ఆవరణలో టెంట్లు వేయించారు. అప్పటివరకు వికలాంగులు, వారి బంధువులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. కాగా, శిబిరానికి వచ్చిన 1000 మందిలో 274 మంది వికలాంగులకు వికలాంగత్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆర్థోపెడిక్ 131, కంటికి సంబంధించి 77, చెవిటి, మూగ వికలాంగులు 66 మందికి పరీక్షలు చేశారు. మిగిలినవారికి ఆసుపత్రి ఆవరణలో శుక్ర, శనివారాలు కూడా శిబిరం నిర్వహిస్తామని సదరం ఏపీఎం బాలకోటయ్య చెప్పారు. ఇందుకోసం మిగిలిపోయిన వికలాంగులు ఎవరు ఏరోజు రావాలో తేదీ ప్రకారం కూపన్లు అందచేశామని పేర్కొన్నారు.