అయ్యో పాపం!
రాష్ర్ట ప్రభుత్వ నిర్ధయకు పరాకాష్ట ఈ సంఘటనలు. వయసు పైబడి... కుటుంబసభ్యుల నిరాదరణను మౌనంగా భరిస్తున్న వృద్ధుల, ఒకరు సాయం చేస్తే తప్పా ఎలాంటి పనులు చేసుకోలేని వికలాంగుల, కట్టుకున్న వాడు అకాల వృత్యువాత పడితే అయినోళ్ల పంచన చేరి తలదాచుకుంటున్న వితంతువుల పింఛన్లను రద్దు చేసిన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఈసడించుకుంటున్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా పర్వాలేదు. ప్రతి నెలా తమకు అందజేస్తున్న పింఛన్లను మాత్రం రద్దు చేయకుంటే చాలునన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
- చెన్నేకొత్తపల్లి/అనంతపురం కార్పొరేషన్
వంద శాతం వైకల్యం ఉన్నా అందని పింఛన్
అర్హులైన వారు పింఛన్లు అందక నానా ఇబ్బందులు పడుతుంటే అనర్హులు మాత్రం దర్జాగా వాటిని ఎగరేసుకువెళుతున్నారు. చెన్నేకొత్తపల్లికి చెందిన రామలక్ష్మి, శ్రీనివాసులు దంపతుల రెండవ సంతానంగా పుట్టిన పూజారి నరసింహులుది అదే పరిస్థితి. పుట్టుకతోనే ఆ బాలుడికి రెండు చేతులూ లేవు. ప్రస్తుతం చెన్నేకొత్తపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న నరసింహులుకు వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరణ పత్రం కూడా ఉంది.
దీనిపై గతంలో 416381నంబర్‌లో పింఛన్ బుక్కును కూడా ఇచ్చారు. కొన్నేళ్లుగా రూ. 500 చొప్పున పింఛన్‌ను ఇస్తూ వచ్చారు. రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే పేరుతో పింఛన్ జాబితా నుంచి నరసింహులు పేరు తొలగించారు. దీనిపై అధికారులను కలిసి విచారణ చేస్తే నిర్లక్ష్యమే వారికి ఎదురవుతోంది. ప్రస్తుతం బడికి వెళ్లడం మానేసి పింఛన్‌ను పునరుద్ధరించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం నరసింహులు, అతని తల్లిదండ్రులకు నిత్యృత్యమైంది.