ఈ ప్రభుత్వానికి ఏ రోగమొచ్చిందో మమ్మల్ని ఇలా వేధిస్తోంది
మీ ఖర్మకాలింది.. మీకూ మా గతే పడుతుంది
వెరిఫికేషన్ శిబిరాల్లో దివ్యాంగుల శాపనార్థాలు
తణుకు అర్బన్ : ‘ఇరవయ్యేళ్ల నుంచి పింఛను తీసుకుంటున్నాం.. ఎప్పుడూ లేదు, ఇదేం ఖర్మో మరి.. కంటిచూపు కనిపించడం లేదంటే మళ్లీ పరీక్షలంటున్నారు.. పింఛను తొలగించేందుకే ఈ పరీక్షలు.. ఈ ప్రభుత్వానికి ఏ రోగమొచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు.. మీరు ఎన్ని డబ్బులు దొబ్బినా ఫర్వాలేదు వికలాంగుల మీద పడి ఏడుస్తున్నారు ఏంటో.. మీ ఖర్మ కాలింది మీకు కూడా మా గతే పడుతుంది’.. అంటూ దివ్యాంగులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మొదలైంది. ముందుగా పట్టణ పరిధిలోని దివ్యాంగులను వెరిఫికేషన్ శిబిరానికి రావాల్సిందిగా వార్డు సెక్రటరీలు నోటీసులిచ్చారు. మొదటి దఫాలో కంటి, చెవికి సంబంధించి ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరానికి దివ్యాంగులు తమ సహాయకులను తీసుకుని హాజరయ్యారు.
ఇబ్బందులు పడ్డ దివ్యాంగులు..
ముఖ్యంగా కంటిచూపు లేని దివ్యాంగుల వెతలు వర్ణనాతీతం. వీరు అటూ ఇటూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవించారు. నిన్ననే నోటీసిచ్చి ఈరోజు నిర్థారణ శిబిరానికి రావాలంటూ హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ‘పింఛను మొత్తాన్ని పెంచడమెందుకు? ఇప్పుడు తొలగించేందుకు కుట్ర లు పన్నడమేంటి?’ అంటూ రుసరుసలాడారు. పింఛనుదారుల్లో ఎవరు సక్రమమో, ఎవరు అక్రమమో తెలుసుకునేందుకు మొత్తం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు నీళ్లప్యాకెట్లు తప్ప ఏమీ ఇవ్వకపోవడంతో పాటు సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment