పింఛన్లలో 15.60 శాతం అవినీతి
ఆస్పత్రుల్లో 37 శాతం అవినీతి
ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలి
ప్రజాభిప్రాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: పింఛన్ల(pensioners) పంపిణీతోపాటు ఆస్పత్రుల్లో వైద్యసేవల్లో అవినీతి కంపు కొడుతోందని ఐవీఆర్‌ఎస్‌తోపాటు వివిధ రూపాల్లో చేయించిన సర్వేల్లో వెల్లడైందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. పథకాల లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సోమవారం ఆయా శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పేదలకు పింఛన్ల పంపిణీల్లో 15.60% అవినీతి, ఆస్పత్రుల్లో 37% అవినీతి ఉందని సర్వేల్లో తేలిందని చెప్పారు.
ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సేవలపై 35% మంది అసంతృప్తి వ్యక్తం చేశారని, వివిధ పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆస్పత్రులు, దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించామని సీఎం చెప్పారు.
ప్రజలే ఫస్ట్ అనే విధానంలో పనిచేయాలి
ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి, ప్రతి విభాగం పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎవరు ఏం చెప్పినా లబ్ధిదారుల మాటే ఫైనల్ అని, ప్రజలు క్షేత్రస్థాయి నుంచి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌నే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో విధానాల అమలుపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఆ శాఖల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఈ ఫలితాలు వచ్చాయని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
ఇదే సమయంలో కొన్ని శాఖల్లో 7 నెలల కాలంలో అనుకున్న స్థాయిలో మార్పు రాకపోవడంపై సీఎం లోతుగా సమీక్షించారు. కారణాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మార్పులు తేవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో 1 శాతం కూడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. ఇసుక, ఎరువుల విషయంలో సంతృప్తిస్థాయి మరింత పెరగాలని సీఎం సూచించారు. ఇసుక లభ్యతపై 78 శాతం మంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79 శాతం, రవాణా చార్జీలపై 75 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారని, ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని, నూరు శాతం సంతృప్తి కనిపించాలని సీఎం ఆదేశించారు.
ప్రతి ఇంట్లో ఏఐ ప్రొఫెషనల్
రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ఏఐని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆరీ్టజీఎస్‌పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల పనితీరు మెరుగవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, సత్ఫలితాలు సాధిస్తామని తెలిపారు. అన్ని శాఖలు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుని పనితీరు మెరుగుపరచుకోవడం ద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు.
త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించనున్నామన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డేటాను అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నట్టు ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినే‹Ùకుమార్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ముఖ్యమంత్రి కార్యదర్శులు రాజమౌళి, పీఎస్ ప్రద్యుమ్న, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే‹Ùకుమార్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment