పెన్షన్లన్నీ మూడు నెలల్లో రీ–వెరిఫికేషన్ చేయించండి
పెన్షనర్లలో అనర్హుల తొలగింపు కార్యక్రమం చేపట్టండి
రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ సొమ్ము రికవరీ చేయండి.. వైకల్య మెడికల్ సర్టిఫికెట్ల జారీకి లోపాల్లేకుండా మార్గదర్శకాలు
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మార్క్ ఏరివేత మొదలైంది. ఇప్పటికే పెన్షనర్ల సంఖ్య నెలనెలా తగ్గుతున్న విషయం తెలిసిందే. సామాజిక పెన్షన్ల సంఖ్య మరింత తగ్గించేందుకు ఆయన నడుంబిగించారు.
పెన్షన్లు పొందుతున్న అనర్హుల నుంచి పెన్షన్ సొమ్మును రెవెన్యూ రికవరీ చట్టం కింద వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది.
దివ్యాంగుల పేరిట తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారని పలువురు కలెక్టర్లు చెప్పగా.. ఎన్నికల ముందు అనర్హులైన 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ.. 3 నెలల్లో పెన్షన్లన్నీ రీ–వెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగించాలని ఆదేశించారు.
సర్టిఫికెట్ల జారీలో లోపాలున్నాయట..
అనర్హులను దివ్యాంగులుగా గుర్తిస్తూ సదరం సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులను ప్రాసిక్యూట్ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ల జారీ మార్గదర్శకాల్లో లోపాల కారణంగానే తప్పుడు సర్టిఫికెట్లు పొందుతున్నారని, లోపాలు లేకుండా మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు ఆ మార్గదర్శకాల మేరకు వైద్యులు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందన్నారు. కాగా.. ప్రమాదాల్లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు.
గ్రామ పంచాయతీలపై కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు, మంచినీటి వనరుల నిర్వహణ బాధ్యత పంచాయతీలదేనన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
పరిశ్రమలు–ఐటీ రంగాలపై సమీక్షిస్తూ.. రాజధాని అమరావతి తరహాలోనే పారిశ్రామిక పార్కుల భూసేకరణలో రైతులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. విశాఖలోని మధురవాడ, కాపులుప్పాడ, మంగళగిరిలో ఐటీ పార్కులు, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి, తిరుపతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
విద్యుత్ సంస్కరణలతో ‘పవర్’ పోగొట్టుకున్నా
విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి 2004లో పవర్ (అధికారం) పోగొట్టుకున్నానని చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సులో విద్యుత్ రంగంపై మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
రాజధాని అమరావతిపై సమీక్ష సందర్భంగా.. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే ప్రజా రాజధానిగా అమరావతి ఉండాలన్నారు. అమరావతి పరిధిలోని ఆర్–5 జోన్‌లో గత ప్రభుత్వం 50,793 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టగా.. వారికి అమరావతి పరిధిలో కాకుండా సంబంధిత జిల్లాల్లోనే ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను కోరారు.
విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా విద్యలో భవిష్యత్‌కు అనుగుణంగా కరిక్యులమ్ మార్చాలన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ..మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు మరింత చేర్చాలన్నారు. వైద్యశాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఏపీలో జనన, మరణాలను 100 శాతం నమోదు చేస్తూ, ప్రతి రికార్డు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయాలని, జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూ సమస్యలపైౖ జాయింట్ టాస్క్‌ఫోర్స్
రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో 50 శాతం రెవెన్యూ విభాగానికి సంబంధించినవే వస్తున్నాయన్నారు. వాటి పరిష్కారానికి ప్రతి జిల్లాలో కలెక్టర్–ఎస్పీ, ఆర్డీఓ–డీఎస్పీతో రెండు స్థాయిల్లో జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్లను వెరిఫికేషన్ చేసి అనర్హులుంటే రద్దు చేసి కొత్త వారికి ఇవ్వాలని ఆదేశించారు.
ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం
‘రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు.
బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఆస్పత్రులు పెడతాం?!
‘గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఆస్పత్రులు పెడతాం. ఇంటికొకటి పెట్టాలా. మీరు ఆస్పత్రులు పెడతా ఉండండి.. మేం ఎక్కడెక్కడకో పోతా ఉంటాం అంటే ఎలా’ అంటూ సీఎం చంద్రబాబు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై అసహనం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరి శిఖర గ్రామాల్లో కంటైనర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కోరగా సీఎం చిర్రుబుర్రులాడారు. ‘పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు కొండల్ని చదును చేసుకుంటూ వెళ్లిపోయి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కోచోట పది ఇళ్లు కూడా ఉండవు. ఒక గ్రామం కలిసి ఉండదు, అందర్నీ కలిసి ఒకచోట ఉండమని చెప్పండి’ అని అన్నారు.
గంజాయి, సెల్‌ఫోన్ల వల్లే అత్యాచారాలు
గంజాయి, సెల్‌ఫోన్ల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ల సమావేశంలో హోమ్, ఎక్సైజ్, గనుల శాఖల సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ విభాగానికి ఏటా నిధులు కేటాయిస్తామన్నారు.
డీ–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుచేసి అందులో నిపుణులైన వైద్యులు, మానసిక వైద్యులను నియమిస్తామన్నారు. ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్స్ వంటిచోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ టీవీ కవరేజీ లేనిచోట్ల డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. నేరస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు.
యాక్సిడెంట్ల హాట్ స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా కట్టడి చేయాలన్నారు. సీనరేజి రద్దు చేశాం కాబట్టి ఇసుక అక్రమ రవాణా పూర్తిగా నియంత్రించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment