‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
వంద రోజుల్లో ఏడు శ్వేత పత్రాలను విడుదల చేశా
ప్రతి నెలా 1న ‘పేదల సేవలో’ దీపావళికి ఉచిత గ్యాస్, అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు
మగవారు సంతానం పెంచే పనిలో ఉండండి
జనాభాను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు
చీమకుర్తి: అనుభవాన్నంతా ఉపయోగించా.. అందుకే 93 శాతం సీట్లను గెలిపించుకున్నా అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కూటమి 21 ఎంపీ సీట్లు కూడా గెలవటంతో ఢిల్లీలో పరపతి పెరిగిందన్నారు. ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ పేరుతో శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడటంతో ఆకస్మికంగా ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని శాఖల్లో సర్వే చేసి ఏడు శ్వేత పత్రాలను విడుదల చేశానన్నారు. రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లు అప్పు ఉందని, వాటికి ఏటా రూ. 1 లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. అందుకోసం సంపద సృష్టించి గాడితప్పిన పాలనను గాడిలో పెడుతున్నానన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పారు. దగ్గరలోనున్న ఇసుకను ట్రాక్టర్ల ద్వారా లేక ఎడ్ల బండ్లపైన లేక నెత్తిమీద పెట్టుకోనైనా తెచ్చుకోవచ్చని అన్నారు.
దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. గత ప్రభుత్వం నాసిరకం నెయ్యితో తిరుమల పవిత్రతను దెబ్బతీసిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టమంటారా? అంటూ ప్రశ్నించారు. నంగనాచి మాటలు మాట్లాడుతున్న మాజీ చైర్మన్ ఈ జిల్లాలోనే ఉన్నాడని, ఆయన పేరు తాను చెప్పనని అన్నారు (మనం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డు ఎవరైనా తిన్నారా తమ్ముళ్లూ అని రెండు సార్లు అడిగినా.. జనం నుంచి స్పందన లేదు).
ఇక నుంచి ప్రతి నెలా 1న ‘పేదల సేవలో’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ అంతా ప్రతి గ్రామంలో ఇలాంటి సభలే ఏర్పాటు చేసి నిజమైన అర్హులకు కొత్త పెన్షన్లు అందజేస్తామని, అదే సభలో దొంగ పెన్షన్లపై విచారణ చేస్తామన్నారు.
మగవాళ్లూ... అర్థమైందా..
జనాభా తగ్గుతోందని, పిల్లలను పుట్టించకపోతే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని, అందుకే ఆడవారికి పనులు చెప్పటం తగ్గించి మగవారు ఆ పనిలో ఉండండి అంటూ చంద్రబాబు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘మగవారికి అర్థమైందా...?’’ అంటూ ప్రశ్నించారు. 15 ఏళ్ల క్రితం తానే జనాభా నియంత్రణ మార్గాలను అమలు చేశానన్నారు.
దాని వలన జనాభా తగ్గిందన్నారు. రాబోయే ఐదేళ్లలో జనాభాను పెంచేందుకు పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ పేరుతో రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా సర్పంచ్‌ని గ్రామంలో ఇంటింటికీ తిరిగి జనాభా పెంచేందుకు అవగాహన కల్పించాలంటూ సీఎం సూచించారు. కార్యక్రమం తర్వాత కొంతమంది ఇళ్లకు వెళ్లి చంద్రబాబు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment