
‘కరకట్ట బంగ్లా’ సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్
అటాచ్‌మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ
పైగా సీఎం అధికారిక నివాసంగా గుర్తింపునకు తోడ్పాటు
గత ఏడాది జూన్ నుంచి ఆ బంగ్లానే అధికారిక నివాసమని గుర్తింపు
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అధికారిక నివాసం అదే
ఈ మేరకు గుర్తిస్తూ తాజాగా రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలు
ఎఫ్‌టీఎల్ పరిధి దాటి నిర్మించిన బంగ్లా సీఎం నివాసమా?
అసైన్డ్ భూములు, ఐఆర్‌ఆర్ కేసులో గతంలో ఆ బంగ్లా అటాచ్
చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చేలా సీఐడీ అడుగులు
సాక్షి, అమరావతి: ‘అవినీతి కేసు(Corruption Case)ల్లో ప్రధాన నిందితుడు చంద్రబాబు(Chandrababu)తోనే మాకు అటాచ్‌మెంట్.. అంతేతప్ప, అవినీతితో కొల్లగొట్టిన ఆస్తుల అటాచ్‌మెంట్ గురించి మాత్రం పట్టించుకోం’ అన్నట్లుంది రాష్ట్రంలో ప్రస్తుతం సీఐడీ పరిస్థితి. చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చే కుట్రను సీఐడీ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుల్లో అబద్ధపు వాంగ్మూలాల కోసం సాక్షులను వేధిస్తున్న సీఐడీ(CID).. మరోవైపు ఆ కేసుల్లో గతంలో అటాచ్ చేసిన ఆస్తులను నిందితులకు ఏకపక్షంగా ధారాదత్తం చేసేస్తోంది. గతంలో సీఐడీ అటాచ్ చేసిన కరకట్ట బంగ్లాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రకటించింది.
అంతేకాకుండా గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించినప్పుడు కూడా కరకట్ట బంగ్లానే ఆయన అధికారిక నివాసంగా కూడా గుర్తిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం న్యాయ నిపుణులను సైతం విస్మయ పరుస్తోంది. ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి నిర్మించిన భవనాన్ని తన అధికారిక నివాసంగా సీఎం ప్రకటించడం విస్తుగొలుపుతోంది.
2014–19 మధ్య టీడీపీ(TDP) ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టిన కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసుల్లో చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల్లో ఆయన ఏ1గా సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసులు నమోదు చేయడంతోపాటు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. చంద్రబాబు తన సన్నిహితుడు లింగమనేని రమేశ్‌తో కలిసి భారీ భూ దోపిడీకి పాల్పడినట్లు కీలక ఆధారాలు సేకరించింది.
ఆ క్విడ్ ప్రో కో కుట్రలో భాగంగానే లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన కరకట్ట బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చినట్లు నిగ్గు తేల్చింది. అందుకే ఆ బంగ్లాను సీఐడీ అటాచ్ చేసింది. ఆ మేరకు న్యాయస్థానం అనుమతి కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. గడువు ఏడాది పూర్తయిన తర్వాత దర్యాప్తు నిబంధనల మేరకు సీఐడీ కరకట్ట బంగ్లా అటాచ్‌మెంట్ గడువు పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరాలి. ఎందుకంటే ఆ కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉన్నాయి కాబట్టి.
అలాగే, చంద్రబాబు బెయిల్ రద్దు కోసం సీఐడీ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతోంది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఐడీ ప్లేటు ఫిరాయించింది. చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌లు వ్యవహరిస్తున్నారు. అందుకే కరకట్ట బంగ్లా అటాచ్‌మెంట్ గడువు పొడిగించాలని సీఐడీ న్యాయస్థానాన్ని కోరలేదు. దీంతో కరకట్ట బంగ్లాను సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా గత ఏడాది జూన్ 12 నుంచి.. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. దీన్నిబట్టి ప్రధాన నిందితుడు చంద్రబాబుతో సీఐడీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన
టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా మరోసారి నిబంధనలను ఉల్లంఘించింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించినప్పుడు ఆయన అధికారిక నివాసంగా కరకట్ట బంగ్లాను గుర్తిస్తూ తాజాగా అంటే బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బంగ్లాను అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ గతంలో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించింది. 2023 జూన్‌లో అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ కరకట్ట బంగ్లా యాజమాన్య హక్కులు, అధికారిక గుర్తింపు తదితర విషయాల్లో ఎలాంటి మార్పులు, సవరణలు చేయడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం గత కాలం నుంచి.. అంటే అటాచ్‌మెంట్‌లో ఉన్నప్పటి నుంచి వర్తించేలా కరకట్ట బంగ్లాను అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కచ్చితంగా న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖను సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. కరకట్ట బంగ్లాను అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఆ శాఖే రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే చంద్రబాబే స్వయంగా న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు జారీ చేసినట్టేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

చంద్రబాబు, లింగమనేని పిల్లి మొగ్గలు
⇒ రాజధాని అమరావతిలో భారీ భూ దోపిడీ సందర్భంగా జరిగిన క్విడ్ ప్రో కో లో భాగంగానే కరకట్ట బంగ్లాను లింగమనేని కుటుంబం చంద్రబాబుకు ఇచ్చింది. దీనిపై సీఐడీ విచారణలో లింగమనేని పొంతనలేని సమాధానాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు.
⇒ మొదట ఆ బంగ్లా సీఎం నివాసం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చినట్లు ఆయన విచారణలో చెప్పారు. మరి ఉచితంగా ఇస్తే సీఎంగా చంద్రబాబు తన అధికారిక నివాసానికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) ఎలా తీసుకున్నారు? ప్రజాధనాన్ని ఎలా డ్రా చేసుకున్నారు? అని సీఐడీ ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలారు.
⇒ దీంతో ఆ తర్వాత విచారణలో లింగమనేని ప్లేటు మార్చారు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద ఆ కరకట్ట బంగ్లాను ‘సీఆర్‌డీఏ’కు ఇచ్చినట్లు చెప్పారు. మరి భూ సమీకరణ కింద ఇస్తే.. అందుకు ప్రతిఫలంగా మీకు సీఆర్‌డీఏ ఎక్కడ ప్లాట్లు కేటాయించిందని ప్రశ్నించగా లింగమనేని నోట మళ్లీ మాట రాలేదు. భూ సమీకరణ కింద ఇస్తే అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది. మరి అప్పటి సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసానికి హెచ్‌ఆర్‌ఏ ఎలా తీసుకున్నారు? ప్రజాధనాన్ని ఎలా డ్రా చేసుకున్నారని ప్రశ్నించేసరికి ఆయన నుంచి సౌండ్ లేదు.
⇒ ఈ నేపథ్యంలో.. లింగమనేని రమేశ్ మరో కట్టుకథను తెరపైకి తెచ్చారు. ఆ కరకట్ట బంగ్లాను చంద్రబాబుకు అద్దెకిచ్చానని చెప్పారు. మరి అద్దెకిస్తే ఆ అద్దె ఆదాయాన్ని ఆదాయ పన్ను రిటర్న్‌లో ఎక్కడ చూపించారని సీఐడీ ప్రశ్నించడంతో ఆయన బిక్క మొహం వేశారు. ఎందుకంటే.. ఆయన తన ఆదాయ పన్ను రిటర్న్‌లలో ఎక్కడా కరకట్ట బంగ్లాను అద్దెకిచ్చినట్లుగా వెల్లడించలేదు. కారణం.. ఆయన కరకట్ట బంగ్లాను చంద్రబాబుకు అద్దెకివ్వనేలేదు.
ఎఫ్‌టీఎల్ పరిధి దాటిన ఇంట్లో సీఎం ఉంటారా!?
అసలు విషయం ఏమిటంటే.. క్విడ్ ప్రో కో కుట్రలో భాగంగానే లింగమనేని రమేశ్ కుటుంబం చంద్రబాబుకు కరకట్ట బంగ్లాను సమర్పించింది. లింగమనేని రమేశ్ కుటుంబంతో కలిసి చంద్రబాబు, నారాయణ అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ రూపొందించడంలో అక్రమాలకు పాల్పడి లింగమనేని రమేశ్ కుటుంబం భూముల విలువ భారీగా పెరిగేటట్లు చేశారు. అందుకు ఆ భూముల్లో వాటాతో పాటు కొసరుగా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా దక్కింది. ఇదిలా ఉండగా.. ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. నదీ పరివాహక ప్రాంతం పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ మేరకు కఠిన చట్టాలు చేశారు. కానీ, ఆ చట్టాలను అమలు చేయాల్సిన సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కూడా చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఎఫ్‌టీఎల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మించిన కరకట్ట బంగ్లాను తన అధికారిక నివాసంగా చేసుకున్నారు. అంటే నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ తనకు ఏమాత్రం పట్టదని స్పష్టంగా ప్రకటించినట్లే.
కరకట్ట బంగ్లా అటాచ్‌మెంట్‌కు అనుమతినిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను కూడా ప్రస్తుత చంద్ర బాబు ప్రభుత్వం నిర్భీతిగా ఉల్లంఘించింది. అటాచ్‌మెంట్‌లో ఉన్న ఈ బంగ్లా గుర్తింపు, వాస్తవ పరిస్థితిలో ఎలాంటి మార్పులు చేయకూడదన్న న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానాల ఆదేశాలంటే ఏమాత్రం లెక్కలేనట్టు వ్యవహరించింది.
Comments
Please login to add a commentAdd a comment