‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది
పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు కుట్ర కార్యాచరణపై నిర్దేశం
జీ హుజూర్ అంటున్న ఉన్నతాధికారులు
ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించేసిన సీఐడీ
న్యాయస్థానంలో విచారణకు సహాయ నిరాకరణ
బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు కుట్రదారు, లబ్ధిదారుగా సాగించిన కుంభకోణాల కేసులను పూర్తిగా నీరుగార్చే కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది! అందుకోసం ఇప్పటికే డీజీపీ, సీఐడీ కార్యాలయాలను పూర్తిగా ఆ పనిలో నిమగ్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఢిల్లీ నుంచి ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాదిని రప్పించి కేసుల కొట్టివేత కుట్రలను వేగవంతం చేయడం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం ఆధారాలతో సహా బట్టబయలయ్యాయి.
వాటిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందులో స్కిల్ స్కామ్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్ట్ చేయగా... ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ నాలుగు కేసులూ సీఐడీ విచారణలోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ కేసుల దర్యాప్తును నీరుగార్చి ఏకంగా కేసులను కొట్టి వేసేందుకు కార్యాచరణ చేపట్టారు.
అన్ని కేసుల నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో కూడా దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించినట్లు తెలిసింది.
నేను చెప్పినట్టు చేయండి.. ఆ కేసులను మూసేద్దాం
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున వాదించిన ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఏకంగా రోజుకు రూ.కోటికి పైగా ఫీజు చెల్లించి మరీ ఆయన్ను ప్రత్యేకంగా రప్పించారు. కానీ ఆయన వాదనను ఏసీబీ న్యాయస్థానం సమ్మతించలేదు.
చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయినా సరే అదే న్యాయవాది చంద్రబాబు కేసుల విచారణను ఇటు విజయవాడలో అటు ఢిల్లీలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ సీనియర్ న్యాయవాది సోమవారం హఠాత్తుగా విజయవాడలో వాలారు. జీ హుజూర్ అంటూ రాష్ట్ర పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసలు ఓ ప్రైవేట్ న్యాయవాదితో పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు సమావేశం కావడం ఏమిటని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఆ సమావేశం సాగింది.
స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడం... అనంతరం ఆ కేసులను మూసివేయడం... అందుకు ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి.... ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి...? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది అంశాలవారీగా వివరించారని తెలుస్తోంది. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలు పూర్తిగా సహకరించాలని ఆయన తేల్చిచెప్పారు. అందుకు పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు తలూపినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ న్యాయవాది పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో మంగళవారం కూడా సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన ప్రభుత్వం
చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటకెక్కించేసింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల చార్జిషీట్లను సీఐడీ గతంలో న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సీఐడీకి పంపింది.
అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సీఐడీ అధికారులకు అందచేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను నీరుగార్చేలా కూటమి పెద్దలు సీఐడీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఐడీ ఆ చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించలేదు. కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయడం లేదు.
‘సుప్రీం’లో విచారణకు సహాయ నిరాకరణ
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. 2023లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నిర్భీతిగా ఉల్లంఘించారు. కేసుల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడవద్దని న్యాయస్థానాలు స్పష్టమైన షరతులు విధించాయి. అయితే చంద్రబాబు దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ.. రెడ్‌బుక్ పేరిట హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
షరతులు ఉల్లంఘించినందున చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ 2023 డిసెంబర్‌లోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ హఠాత్తుగా రూటు మార్చేసింది. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణకు సహకరించడం లేదు. సుప్రీం కోర్టులో సీఐడీ వాదనను వినిపించాల్సిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు.
అది సరైన పద్ధతి కాదని సుప్రీం కోర్టు చెప్పినా తీరు మారడం లేదు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్‌గా పాల్గొన్నారు. వాదనలు వినిపించకుండా.. తాను ఢిల్లీలో లేనందున వాయిదా వేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిసారీ వాయిదాలు కోరడం సరైన చర్య కాదని వ్యాఖ్యానిస్తూ కేసు విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
సీబీఐకి అప్పగించాలి.. న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలి
న్యాయ నిపుణుల సూచన
స్కిల్ స్కామ్, ఇతర కేసుల దర్యాప్తు, తాజా పరిణామాలను గమనిస్తున్న న్యాయ నిపుణులు చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని సూచిస్తున్నారు. సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గడువు కోరిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుపై కేసుల దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించాలని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో మద్యం సిండికేట్ కేసు దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
షరతులు ఉల్లంఘిస్తున్న బాబు
⇒ స్కిల్ స్కామ్ కేసులో న్యాయస్థానం విధించిన బెయిల్ షరతులను ఎన్నికల ముందు, ఆ తర్వాత చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా బేఖాతర్ చేస్తున్నారు. తన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ఓటీటీ చానల్ కోసం నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్న చంద్రబాబు న్యాయస్థానాల షరతులంటే ఏమాత్రం లెక్కలేదనే రీతిలో షరతులను ఉల్లంఘిస్తూ మాట్లాడారు. ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టబోనని బెదిరింపులకు దిగడం గమనార్హం.
⇒ హిందుస్థాన్ టైమ్స్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సదస్సులోనూ చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించి స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడారు. అధికారులను బెదిరించే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment