
ఉద్దేశ పూర్వకంగా పది నెలలుగా దాఖలు చేయని సీఐడీ
ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా హిమబిందు ఉన్నంత వరకు కాలయాపన
ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించినా స్పందించని వైనం
గతంలో ఈ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించారని టార్గెట్
ఆ అవినీతి కేసులను నీరుగార్చేందుకు కూటమి పెద్దల ఆదేశాలతో బరితెగింపు
ఏకంగా న్యాయమూర్తి ఇంటిపైనే నిఘా
సీఐడీని అడ్డుపెట్టుకుని సాక్షులకు బెదిరింపులు, హెచ్చరికలు
తాజాగా రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆ న్యాయమూర్తి బదిలీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు కుట్రదారు, లబ్దిదారుగా సాగిన కుంభకోణాల కేసులను నీరుగార్చేందుకు ఎంతకైనా తెగిస్తామని సీఐడీ పదే పదే స్పష్టం చేస్తోంది. న్యాయస్థానాల్లో ఆ కేసుల విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్రను పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకే చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్‌షీట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ఎంతగా అంటే.. ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి బి.సత్యవెంకట హిమబిందు బదిలీ అయ్యేంత వరకు ఏకంగా 10 నెలలపాటు చార్జ్‌షీట్లు దాఖలు చేయకుండా సాగదీయడం గమనార్హం.
తాజా బదిలీల్లో హిమబిందును రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసు శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో 2023లో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు న్యాయమూర్తి హిమబిందు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
అప్పట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా దాఖలు చేసిన రిమాండ్ నివేదిక పట్ల సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పరిణామానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం న్యాయమూర్తి హిమబిందుకు ప్రత్యేక భద్రత కూడా కల్పించింది.
కేసులు నీరుగార్చే కుట్ర.. సాక్షులకు బెదిరింపులు
రాష్ట్రంలో గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబుపై అవినీతి కేసులను సీఐడీ అటకెక్కించింది. ఆ కేసులను నీరుగార్చడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని న్యాయస్థానంలో సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు, అధికారులను బెదిరించి బెంబేలెత్తిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు మళ్లీ నమోదు చేయిస్తోంది.
అంతేకాకుండా చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్‌షీట్లను న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా సీఐడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిట్.. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను గత ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది.
అప్పటి సీఐడీ అధికారులు ఆ వివరణలతో సహా చార్జిషీట్లను సిద్ధం చేశారు. కానీ గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా బదిలీల్లో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి హిమబిందు బదిలీ అయ్యారు.
న్యాయమూర్తి ప్రశ్నించినా స్పందించని సీఐడీ
చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్‌షీట్లను పునఃదాఖలు చేయక పోవడాన్ని కొన్ని నెలల క్రితం న్యాయమూర్తి ప్రశ్నించారు కూడా. చంద్రబాబు, నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గతంలో సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వివరిస్తానని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెబుతూ తనను అప్రూవర్‌గా గుర్తించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొన్ని రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంత వరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా.. నిందితుడా.. అన్నది నిర్ధారించలేమన్నారు.
చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సీఐడీ తరఫు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. న్యాయమూర్తి ప్రశ్నించిన ఐదారు నెలల తర్వాత కూడా సీఐడీ ఆ చార్జ్‌షీట్లను పునఃదాఖలు చేయకపోవడం గమనార్హం. అంటే న్యాయమూర్తిగా హిమబిందు ఉన్నంత వరకు సీఐడీ చార్జ్‌షీట్లను దాఖలు చేయకూడదని నిర్ణయించుకుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.
న్యాయమూర్తిపైనే ఇంటెలిజెన్స్ నిఘా!
చంద్రబాబు కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి హిమబిందుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం కలకలం సృష్టించింది. ఆ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లో ఇంటలిజెన్స్ అధికారులు తిష్ట వేసి, ప్రతి కదలికనూ గమనిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండటం గమనార్హం. నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయమూర్తి సిబ్బంది గుర్తించారు.
న్యాయమూర్తి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని కూడా వారు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, పోలీసు అధికారిని ఆ అంశంపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు.