
పేద పిల్లలతో ప్రైవేట్ స్కూళ్ల దందా
ఆర్‌టీఈ చట్ట ప్రకారం చేరిన పిల్లలకు ప్రైవేటు స్కూళ్ల ఆంక్షలు
రాష్ట్రంలో ఈ చట్టం కింద 50 వేల మంది విద్యార్థుల చేరిక
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తక్కువని కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు
కొత్తగా ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశం.. కాలయాపన చేసిన సర్కారు
తీరిగ్గా ఇప్పుడు ఫీజు నిర్ణయంపై కమిటీ
ఇంతలో ఫీజు చెల్లిస్తేనే పై తరగతులకు అనుమతిస్తామంటున్న స్కూళ్లు
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లలో చేరిన పేద విద్యార్థులను పై తరగతులకు పంపేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. తాము నిర్ణయించిన ఫీజు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్లు కొనసాగిస్తామని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక జిల్లా విద్యా శాఖ అధికారులను ఆశ్రయిస్తే ‘సెటిల్ చేసుకోవాలి’ అంటూ సలహా ఇస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ఆర్‌టీఈ చట్టం కింద పేద పిల్లలకు కేటాయించారు.
విద్యాశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా గత మూడు విద్యా సంవత్సరాల్లో 50 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. వీరిలో చాలా మంది నిరుపేదలు కావడంతో ఫీజులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. ఫీజులపై ఏడాది క్రితమే హైకోర్టు ఇచ్చిన తీర్పును యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు తల్లిదండ్రులపై భారం పెరిగిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుపేదల చదువు కోసం అమలు చేసిన ఆర్‌టీఈ చట్టం ప్రవేశాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
మొత్తం ఫీజు కోసం యాజమాన్యాల ఒత్తిడి
ఆర్‌టీఈ చట్టం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం జీవో నంబర్ 24 ప్రకారం ఫీజులను ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, పట్టణ ప్రాంతాల్లో రూ.8,500 స్కూలు ఫీజుగా నిర్ణయించి 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకం తీసుకున్న తల్లిదండ్రులు ఈ ఫీజు మొత్తాన్ని చెల్లించాలని, మిగిలిన వారికి ప్రభుత్వమే ఆయా స్కూళ్లకు చెల్లించేలా నిబంధన విధించింది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తక్కువగా ఉందని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
దీనిపై వాదనలు ముగిసే నాటికి రెండు విద్యా సంవత్సరాలు పూర్తయి మూడో ఏడాది ప్రారంభమైంది. అనంతరం జీవో నంబర్ 24లో ఉన్న ఫీజులు సరిగా లేవని, కొత్తగా ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. దీంతో స్కూళ్ల యాజమాన్యాలు కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని పిల్లల తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచాయి.
ఆయా స్కూళ్లు నిర్ణయించిన వార్షిక ఫీజు మొత్తం (స్కూలును బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేలు) చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అమ్మఒడి తీసుకున్న వారు స్కూళ్లకు నిర్ణీత మొత్తం ఫీజుగా చెల్లించారు. ఈ విద్యా సంవత్సరం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వక పోవడంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం మరింత పెరిగిపోయింది.
ఫీజు అంచనాపై తీరిగ్గా ఇప్పుడు కమిటీ
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం–2009 (ఆర్‌టీఈ) కింద ఏటా పేద పిల్లలకు అందిస్తున్న ఉచిత విద్యలో భాగంగా ఇటీవల ఫీజులు నిర్ణయించేందుకు పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గా సమగ్ర శిక్ష ఎస్పీడీ కనీ్వనర్‌గా మరో తొమ్మిది మంది అధికారులతో ప్రభుత్వం కమిటీ నియమించింది. జీవో నంబర్ 24పై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ కమిటీని ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికంటే ముందే ప్రభుత్వం నియమిస్తుంది. మూడు నెలల్లో నివేదికను ఇస్తుంది.
డిసెంబర్‌లో సమావేశమై విద్యార్థుల ఫీజులను నిర్ణయిస్తుంది. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి రెండు వారాల క్రితం కమిటీ వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కమిటీని త్వరగా వేసి ఉంటే ఇంత ఒత్తిడి ఉండేది కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.