private schools
-
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్‌బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్‌లను విప్పదీయించి బ్లేజర్‌తో ఇంటికి పంపించింది. పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్‌లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్‌లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్‌బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్‌బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్‌లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది! -
స్కూళ్ల ఫీ‘జులుం’కు చెక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ముకుతాడు వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. ప్రైవేటు స్కూళ్లను వర్గీకరించడంతోపాటు ఆయా స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం ఇవ్వాలని.. ప్రైవేటు స్కూళ్లను ఎంఈవో స్థాయి అధికారి తనిఖీ చేయాలనే సిఫార్సు చేయనుంది. అలాగే మౌలిక వసతుల కల్పన, అనుభవజు్ఞలైన టీచర్లు, ఇతర సిబ్బందికి అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అన్ని స్కూళ్లను ఆడిట్ పరిధిలోకి తేవడాన్ని సరైన విధానంగా భావిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో మరికొన్ని షరతులు విధించాలనే యోచనలో ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ సిఫా ర్సు మేరకే ఫీజులు ఉండాలనే ప్రభుత్వానికి సూచించాలని భావిస్తోంది. రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు స్కూళ్లు భారీగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. అలాగే పుస్తకాలు, దుస్తులు, ఇతర అవసరాల పేరుతో అదనంగా వసూళ్లు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక కార్పొరేట్ స్కూళ్లు అయితే రూ. 5 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వార్షిక ఫీజులు దండుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లను కట్టడి చేసేందుకు సిఫార్సులు చేయాలని విద్యా కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ నివేదిక అనంతరం వచ్చే ఏడాది నుంచి ఫీజుల కట్టడికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్ల వాదన ఇలా.. ⇒ రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేసే స్కూళ్లను.. రూ. 50 వేలలోపు ఫీజులు తీసుకొనే స్కూళ్లను ఒకే గాటన కట్టకూడదు. ∙ఏటా 15 శాతం ఫీజు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కార్పొరేట్ స్కూళ్ల డిమాండ్ ఇదీ.. ⇒ మారిన విద్యా విధానంలో కంప్యూటర్ విద్యకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. సబ్జెక్టు టీచర్ల వేతన భారం పెరిగింది. ⇒ ఏటా ఫీజులు పెంచుకొనే అవకాశం ఇవ్వాలి.అందరికీ ఆమోద యోగ్యంగా నివేదిక..ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విధానం ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. విద్యా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ స్కూళ్ల యాజమాన్యాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలతోనే నివేదిక రూపొందిస్తున్నాం. ఫీజుల నియంత్రణ వల్ల పేద వర్గాలకు ఊరట ఉంటుందని ఆశిస్తున్నాం. – ఆకునూరి మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ -
ప్రైవేటుపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో పనిచేసే ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది. ఏయే విద్యార్హతలున్నాయో ఆరా తీయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాలవిద్య డైరెక్టరేట్ కార్యాలయం ఇప్పటికే అంతర్గత ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలల వివరాలను ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి..అందులో పొందుపర్చాలని అధికారులు భావిస్తున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత విద్య బోధించే ఉపాధ్యాయుల ధ్రువీకరణ పత్రాలు కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూళ్లలో అర్హత లేనివారు బోధిస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకు వివరించాలని సీఎం భావించినట్టు అధికారులు చెబుతున్నారు. యూడైస్కూ అందించాలి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల డేటా ఏటా పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతులు ఏమున్నాయో ఇందులో పేర్కొనాలి. విద్యాశాఖ ఇప్పటివరకూ ప్రభుత్వ స్కూళ్లలోని వివరాలనే యూడైస్‌కు సమగ్రంగా ఇస్తోంది. ప్రైవేటు స్కూళ్ల నుంచి అన్ని వివరాలు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాల కోసం ఎన్ని లేఖలు రాసినా ప్రైవేట్ స్కూళ్లు స్పందించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర వివరాలు తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్‌లోనే టీచర్లు ఎక్కువ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 29 వేలు, ప్రైవేట్ 11 వేల వరకూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1.35 లక్షల మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్లలో 2 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అయితే సర్కారీ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేట్ స్కూళ్లలో 34 లక్షల మంది చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కనీసం మౌలిక వసతులు కూడా లేని, ఏ అర్హత లేనివారు బోధిస్తున్నా విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ బాట పడుతున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా ఉపాధ్యాయుల అర్హతలను వెల్లడించే అవకాశమే లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. బీఈడీ అర్హతతో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉన్నారా అనేది తెలుసుకోవాలి. దీనికి మండల స్థాయిలోఎంఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓలు దృష్టి పెట్టాలి. అయితే డీఈఓ, ఎంఈఓ పోస్టుల్లో మెజారిటీగా ఇన్చార్జ్లనే కొనసాగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ లోపాలు వెంటాడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
మన బడుల్లో చేరండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చేరికలు కొంత ఆశాజనకంగానే ఉన్నా ఆ తర్వాత క్లాసుల్లో ఎన్రోల్మెంట్ పడిపోతోంది. ఆరో తరగతి నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. దీన్ని సరిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టనున్నారు. ఏటా పాఠశాలలు తెరిచే ముందు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టడం సాధరణమే అయినప్పటికీ ఈసారి విద్యార్థుల శాతాన్ని ఎక్కువగా పెంచాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.సమస్యలు పరిష్కరిస్తేనే.. ఈ ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ నిధులతో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతోపాటు భవనాల మరమ్మతులు, స్మార్ట్ క్లాస్రూంలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిబ్బంది జీతాలకు ఖర్చు చేయనుంది. గతంలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద స్కూళ్లలో మౌలికవసతులు కల్పించాలని నిర్ణయించగా ప్రభుత్వం మారడంతో ఈ కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీంతోపాటు టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశాలలను వేధిస్తోంది. ప్రధానంగా ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం లేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి.ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇది..⇒ రాష్ట్రంలో 30,023 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,213 స్కూళ్లలో గతేడాది జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. 13,364 పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య 50లోపే ఉంది. ⇒ రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. 5,821 స్కూళ్లు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. 80 శాతం స్కూళ్లలో సబ్జెక్టు లేదా భాషా పండితుల కొరత ఉంది. ⇒దివ్యాంగులకు టాయ్‌లెట్స్ లేని స్కూళ్లు 15.45 శాతం ఉన్నాయి. బాలికలకు టాయ్‌లెట్స్ లేని బడులు 9.44 శాతం ఉన్నాయి. ⇒ 18, 19 పాఠశాలల్లో సమీకృత సైన్స్ లే»ొరేటరీలు లేవు. ఐసీటీ ల్యాబ్‌లు లేని స్కూళ్లు 11.7 శాతం. స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్‌లు లేని బడులు 71 శాతం ఉన్నాయి. ⇒ ఎస్సీఈఆర్టీలో మంజూరైన పోస్టుల్లో 46.15 శాతం పోస్టులు, డైట్ కాలేజీల్లో 67.83 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో పెరిగి.. మళ్లీ తగ్గి.. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. వారిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే మిగతా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. 2020 నుంచి 2022 వరకూ ఏటా 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ 2023 నుంచి మళ్లీ క్రమంగా ఏటా లక్ష మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి నిష్క్రమిస్తున్నారు. మెరుగైన విద్య లేనందుకేనా? రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యార్థుల హాజరుపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఇటీవల ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యార్థులు కూడా ఉండటం లేదు. ఐదో తరగతి వరకు ఒక్కో క్లాసులో 40 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత, సకాలంలో పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన కుంటుపడుతోంది. దీంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టణాలకు తరలుతున్నాయని నివేదిక పేర్కొంది. విస్తృత ప్రచారం కల్పించేలా.. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు పెంచుతున్న తీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి టీచర్లకు సూచించింది. జూన్ ఒకటి నుంచి 11వ మధ్య చేపట్టే బడిబాట కార్యక్రమంలో స్కూళ్లను ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని, ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొంది. -
ఆన్లైన్లోనే ప్రైవేటు పాఠశాలలకు అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఆన్లైన్లో మాత్రమే అనుమతి మంజూరు చేస్తామని, ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశించారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు, సూచనలు, సలహాలపై మంగళవారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రైవేటు పాఠశాలలకు అనుమతి, గుర్తింపునకు సంబంధించి ఆన్లైన్ ద్వారా సకాలంలో చలానా చెల్లింపులు, పోర్టల్‌లో సమస్యలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు–సిబ్బంది సమస్యలు, పీఎఫ్, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ కార్డు, ఉద్యోగుల జీతాల చెల్లింపు, గుర్తింపు పొడిగింపు, వార్షిక పరిపాలన నివేదిక, ఫీజులు, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల నిర్వహణపై చర్చించారు. ఇతర సంస్థల ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) వంటివి అప్లోడ్ చేసేందుకు వీలుగా విద్యాశాఖ పోర్టల్‌ను పునరుద్ధరిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రతి ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన వార్షిక పరిపాలన నివేదికను సంబంధిత విద్యాశాఖాధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పి.పార్వతి, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయినికి అభినందన అనకాపల్లి జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి ఈనెల 5 నుంచి 9 వరకు నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ పోటీల్లో పాల్గొని నాలుగు పతకాలు సాధించారు. ఆమెను ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ సురేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల విద్య డైరెక్టర్ పి.పార్వతి, ఏపీ టెట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మేరీ చంద్రిక, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు పాల్గొన్నారు. -
నడీరోడ్డుపై స్కూల్ పిల్లలు చేసిన పనికి సబితా మేడం ఏమంటుందో మరి ?
-
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నేడు స్కూళ్లకు సెలవు
సాక్షి న్యూఢిల్లీ: భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడతెరిపిలేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై వంతు వచ్చింది. దంచి కొడుతున్న వానలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. నేడు అనగా గురువారం కూడా ముంబైకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అధికారు లను అలర్ట్ చేశారు. అవసరమైన అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతర సముదాయాలను కాస్త ముందుగానే మూసివేయాలని సూచించారు. #WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai. IMD has issued a 'Red' alert for Palghar, and Raigad districts and an 'Orange' alert for Thane, Mumbai and Ratnagiri today. pic.twitter.com/HR0KUqGCPZ — ANI (@ANI) July 19, 2023 తద్వారా జనం త్వరగా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడు తెరవాలో పరిస్థితులను బట్టి స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ముంబై తో పాటు పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనతో పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో కూడా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. -
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్
-
మొక్కు‘బడి బాట’..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘బడిబాట’కు స్పందన నామమాత్రంగానే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించట్లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటుండగా..టీచర్ల నిర్లిప్తత ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు స్కూళ్లు ఆకర్షించినట్టుగా విద్యార్థులను ప్రభుత్వ టీచర్లు ఆకర్షించడం లేదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నట్టు సమాచారం. కాగా చాలాచోట్ల బడిబాట కార్యక్రమానికి వెళ్లేందుకు టీచర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో వెళ్లినట్టుగా చూపిస్తూ, ఆన్లైన్లో ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు పంపుతున్నారు. దీంతో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. డీఈవోలు, ఎంఈవోల కొరతతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బడి మానేసినవారు తిరిగి చేరేలా.. బడి మానేసిన వారిని బడికి తిరిగి రప్పించడమే కాకుండా, ప్రభుత్వ స్కూళ్లలోకి విద్యార్థులను మరలించేందుకు విద్యాశాఖ ఈ నెల 3 నుంచి ‘బడిబాట’చేపట్టింది. ప్రతి స్కూల్ పరిధిలో టీచర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలు బడిలో చేరేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గుర్తించింది 66 వేలు.. ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల మందిని కొత్తగా చేర్పిస్తున్నామని విద్యాశాఖ చెబుతోంది. కానీ ఇప్పటివరకు బడిలో చేర్పించాల్సిన విద్యార్థులు 66,847 మందిని మాత్రమే గుర్తించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో ఒకటవ తరగతిలో చేర్చాల్సిన వారి సంఖ్య 16,038 ఉంది. ఇందులో 12,120 మందిని అంగన్వాడీల్లో చేరి్పంచేందుకు పేర్లు నమోదు చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చేరేందుకు 1,181 మంది మొగ్గుచూపారు. ఇక 2,737 మంది బడిబాట బృందాలతో సంబంధం లేకుండానే స్కూళ్లలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు 2–7 తరగతుల మధ్య బడి మానేసిన పిల్లలు 8,966 మందిని కూడా గుర్తించారు. వీళ్లు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చేరారన్నది స్పష్టత ఇవ్వలేదు. రాజధాని పరిసరాల్లోనే ఎక్కువ బడి మానేస్తున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకన్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 4,137 మందిని గుర్తించారు. హైదరాబాద్‌లో 2,376 మంది బడి మానేసినట్టు తెలుసుకున్నారు. మెదక్‌లో 2,254 మంది, మేడ్చల్‌లో 1,457 మంది బడికి దూరమైనట్టు గుర్తించారు. ఇక ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 3,371 మంది, నిజామాబాద్‌లో 4,107 మంది బడి మానేసిన పిల్లలున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకెళ్లని విద్యార్థుల తల్లిదండ్రులంతా దినసరి కూలీలే కావడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు పిల్లలను కూడా రోజువారీ పనులకు పంపుతున్నట్టు తేలింది. వీళ్లను గుర్తించడమే తప్ప, వీరంతా స్కూళ్లలో చేరతారా? లేదా? అనేది మాత్రం స్పష్టం కావట్లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్లు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికీ గాలమేస్తున్నాయి. గ్రామాల్లో కొంతమందికి కమీషన్లు ఇస్తూ పిల్లల్ని తమ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరుతున్నాయి. ఊరూరా ఫ్లెక్ల్సీలతో ప్రచారం చేస్తున్నాయి. టీచర్లకు టార్గెట్లు వి«ధించి మరీ విద్యార్థులను చేర్చేలా ఒత్తిడి చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు రాష్ట్రం మొత్తమ్మీద లక్షమంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లలో చేరినట్టు తెలుస్తోంది. -
Telangana: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాదుడు.. ఎల్కేజీకి లక్షన్నర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు ఈసారి ఫీజులు భారీగా పెంచినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని బడుల్లో ఏకంగా 50 శాతం వరకూ ఫీజులు పెంచారని వాపోతున్నారు. కోవిడ్ తర్వాత గత ఏడాది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని తల్లిదండ్రుల నుంచి అందినంతా దోచేస్తున్నాయి. అదీగాక, సగం ఫీజును ముందుగానే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అంటూ అదనపు బాదుడు సరేసరి. ఇంకోవైపు డీజిల్ ధర విపరీతంగా పెరిగిందంటూ రవాణా చార్జీలూ 30 శాతం వరకూ పెంచారు. దీంతో పేదవాడికి ప్రైవేటు విద్య తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా అంతంతమాత్రంగానే చదువు సాగుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. చదవండి: కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజ్.. నియంత్రణ ఏమైనట్టు? ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. దీంతో ఫీజుల నియంత్రణ కోసం 2016లో ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. స్కూల్లో విద్యార్థిని చేర్చేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్లు, కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకూ పెంచుతున్నట్లు కమిటీ దృష్టికొచ్చింది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఇష్టానుసారం కాకుండా మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని కమిటీ సూచించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ విధానం కనుమరుగు... రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఫీజుల నియంత్రణను బడ్జెట్ స్కూళ్లు (వార్షిక ఫీజు రూ. 20 వేలలోపు ఉండేవి) స్వాగతించాయి. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15% ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇక్కడే సమస్య వస్తోంది. పెద్ద స్కూళ్లు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతీ గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపి 25 శాతం ఫీజు పెంచారు. ప్రతీ స్కూలు 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చు. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల నియంత్రణ కమిటీ పరిశీలిస్తుంది. పాఠశాల యాజమాన్యం ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానాతోపాటు గుర్తింపు రద్దు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఫీజుల పెంపును పరిశీలించేందుకు 2018లో తిరుపతిరావు కమిటీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దాదాపు 4,500 స్కూళ్లు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘంగత ఏడాది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫీజులనియంత్రణ కార్యాచరణకు నోచుకోలేదు. -
ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్ధులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈమేరకు జీవో 24ను విడుదల చేశారు. ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ సీట్లకు సంబంధించి మార్చి 4న ప్రవేశాల క్యాలెండర్‌తో సహా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆయా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మార్చి 6 నుంచి 16 వరకు సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్ విండో మార్చి 18నుంచి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 7వ తేదీవరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థుల ఎంపిక ఏప్రిల్ 9 నుంచి 12 వరకు చేపడతారు. మొదటి విడత కేటాయింపు ఏప్రిల్ 13న ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 21వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరికలను ఖరారు చేసుకోవాలి. అనంతరం రెండోవిడత సీట్ల కేటాయింపు ఏప్రిల్ 25న చేపడతారు. ఈ విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరాలి. రిజిస్ట్రేషన్లను హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్లో నమోదు చేయాలి. ఈ ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్‌లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు. రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆమొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు. -
స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రా యితీ అని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్కూల్స్‌లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్‌కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యమే... కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి ముందుగానే అడ్మిషన్ ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. కనిపించని నోటీసు బోర్డు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్ కార్పొరేట్, ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం -
ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్‌గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్ చేయడమో.. లేక తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది. నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర స్కూళ్లపై కూడా.. ►స్టేట్ సిలబస్‌తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్‌పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్ సిలబస్ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది. ►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది. ►ప్రైవేటు యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. ►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. ►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది. -
చిన్నారిని వేధిస్తున్న కారు డ్రైవర్ ను చితకబాదిన పేరెంట్స్
-
ప్రభుత్వ చర్యలు సంతృప్తికరం
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న తమ ఆదేశాల అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కనిపిస్తోందని, అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పింది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్ దాఖలు చేసిన కోర్టు ఆదేశాల అమలు నివేదికపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2,603 మంది విద్యార్థులకు ప్రవేశాలు.. విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు అన్ని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని జనవరిలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్ టి.యోగేష్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. ప్రభుత్వ న్యాయవాది ఎల్వీఎస్ నాగరాజు స్పందిస్తూ.. ధర్మాసనం ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచారు. కేటాయించిన సీట్ల వివరాలను కూడా తెలియజేశారు. 25 శాతం సీట్ల గురించి మీడియాలో విస్తృత ప్రచారం చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 9,514 ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశాల నిమిత్తం 5,195 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 3,515 మంది ఆన్లైన్ వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ఆరు దశల్లో దరఖాస్తులను పరిశీలించగా.. 3,288 మంది లాటరీకి ఎంపికయ్యారని చెప్పారు. ఇందులో 2,603 మంది 1వ తరగతి ప్రవేశాలు పొందారని వివరించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా స్కూళ్లకు పంపించామన్నారు. మిగిలిన సీట్లకు రెండో జాబితా విడుదల చేస్తామని నాగరాజు చెప్పారు. ఈ వివరాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ టి.యోగేష్ స్పందిస్తూ కేవలం 2,603 సీట్లే భర్తీ చేశారని, మీడియాలో విస్తృత ప్రచారం చేయలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కనిపిస్తోందని పేర్కొంది. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 25 % సీట్లు
సాక్షి, అమరావతి: పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు. 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
ప్రైవేటు బడుల్లో భద్రతెంత?
కడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకునే విషయంలో ఉన్నంత శ్రద్ధ వారికి మౌలిక వసతులను కల్పించడంలో లేదనే చెప్పాలి. విద్యార్థులకు ఆటపాటలటుంచితే మలమూత్రాలను కూడా ప్రశాంతంగా విసర్జించని పరిస్థితి దాపురించింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలాగా ఉంచుతున్నారు. జిల్లాలో చాలా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను ఇరుకు గదులు, వ్యాపార సంస్థలు, అపార్టుమెంట్లలో నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 వందలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో అధికశాతం ఇరుకుగదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపకశాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అటు, ఇటుగా ఉన్నా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరువాత రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతులు, రెన్యువల్స్‌కు గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీస వసతులు కరువు కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులను కల్పించడం లేదనే విమర్శలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు తాగేందుకు సరిపడా మంచినీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలున్నాయి. వీటితోపాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు గానీ మూత్రశాలలు కానీ ఉండటం లేదు. సహజంగా భార్య,భర్తతోపాటు ఇద్దరు పిల్లలున్న ఓ కుంటుంబం సింగిల్ బాత్రూంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది వందల మంది విద్యార్థులున్న పాఠశాలల పరిస్థితిని గమనిస్తే దారుణంగా ఉంది. కడపలో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలున్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలుంటాయి. పాఠశాల విరామ సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని పలువురు వాపోతున్నారు. ఇక అమ్మాయిల ఇబ్బందులు వర్ణనాతీతం. కొంతమంది బాలికలు బాత్రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేçస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇది కొన్ని రుగ్మతలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు పాఠశాలల్లో మౌలిక వసతులపై స్పందించాల్సిన అవసరం ఉంది. పరిశీలిస్తా అపార్టుమెంట్లు, ఇరుకైన సముదాయాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే పరిశీలిస్తాం. నిబంధనలు పాటించకుండా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పాఠశాలలను నిర్వహించకూడదు. – చెప్పలి దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన గదులు, ఆటస్థలంతోపాటు, మంచినీటి సౌకర్యం అలాగే ఆధునిక వసతులతో మరుగుదొడ్లు, పరిమితి గంటల్లో బోధన ఉంటుంది. దీంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టింది. అయినా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలనే ఆశ్రయిస్తున్నారు. అదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది ఈ పాఠశాలల్లో చదివిన వారేనన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. -
ప్రైవేటు విద్యార్థులకు చౌకగా పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కుల పేరిట జరుగుతున్న దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ముకుతాడు వేసింది. తల్లిదండ్రులపై ఏటా వేలాది రూపాయల భారం పడకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులు తదితరాలను ప్రభుత్వమే ముద్రించి పంపిణీ చేసే విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ధరకు నాణ్యతతో కూడిన పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు ఈ పాఠశాలల విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ఆయా యాజమాన్యాలు ప్రైవేటు పబ్లిషర్ల నుంచి తీసుకొని అందించే విధానాన్ని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి, తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు దండుకొనేవి. కొన్ని పాఠశాలల విద్యార్థులు షాపుల్లో అధిక ధరలకు కొనేవారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలైతే ఒకటో తరగతి నుంచే పాఠ్య పుస్తకాలకోసం రూ.5 వేల వరకు వసూలు చేసేవి. పై తరగతులకు వెళ్తున్నకొద్దీ ఈ వ్యయం రూ.10వేలకు పైనే ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పబ్లిషర్ల పుస్తకాలను కూడా ఈ స్కూళ్లు బలవంతంగా అంటగట్టేవి. ఈ పుస్తకాల నుంచి ఏదైనా బోధిస్తారా అంటే అదీ ఉండదు. ఆయా సంస్థలు రూపొందించే స్టడీ మెటీరియల్‌ను అనుసరించి బోధన, పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి మళ్లీ అదనంగా వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ ముకుతాడు వేస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్యను అనుసరించి ముందుగా ఇండెంటు తీసుకొని 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రైవేటు పాఠశాలల్లో 24, 44,942 మంది విద్యార్థులుండగా వాటి నుంచి 18,02,879 మంది విద్యార్థులకు సరిపడా ఇండెంటు వచ్చింది. వీరికి ఆయా తరగతులు, టైటిళ్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించి 1.83 కోట్ల పాఠ్యపుస్తకాలను విద్యా శాఖ, ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగం సిద్ధం చేశాయి. పంపిణీకి ఏర్పాట్లు చేపట్టాయి. తరగతులు, స్టూడెంట్లవారీగా సెట్ల కింద అందిస్తున్నాయి. స్కూళ్ల యాజమాన్యాలు నిర్దేశిత గేట్‌వే ద్వారా డబ్బులు చెల్లిం చగానే పుస్తకాలను ఎంఈవోల ద్వారా అం దిస్తారు. పాఠ్య పుస్తకాల ధరలను నిర్ణయిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీచేసింది. -
సర్కారు బడి... అడ్మిషన్ల సందడి
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సర్కారు బడులు కొత్త విద్యార్థుల చేరికతో సందడిగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్ల కోసం క్యూలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోయి అడ్మిషన్లు ఇవ్వలేమని చెప్పేదాకా వెళ్లిపోయాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు–మన బడి’తో ప్రైవేటుకు దీటుగా మెరుగుపర్చడంతోనే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా కొత్త విద్యార్థులు చేరారని అంటున్నాయి. బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తే.. భారీగా అడ్మిషన్లు అవుతాయని పేర్కొంటున్నాయి. 30 వేల పాఠశాలలు.. 30లక్షల విద్యార్థులు రాష్ట్రంలో 30వేల వరకు ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వాటి పరిధిలో 30 లక్షల మంది చదువుతున్నారు. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న గురుకుల విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు మినహాయిస్తే.. 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 23.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా 25 శాతం పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా రూ.12 వేల కోట్లు కేటాయించింది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు కూడా మొదలయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీనితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాటివైపు ఆకర్షితులవుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గత పదిహేను రోజుల్లో ఏకంగా 1,50,826 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వేర్వేరు తరగతుల్లో ప్రవేశాలు పొందారు. అంటే రోజుకు సగటున 10వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు లెక్క. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని.. ఇందులో కనీసం నెల రోజుల పాటు రోజూ పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు కొనసాగే అవకాశం ఉందని విద్యా శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విధానాన్ని ఇంటర్, డిగ్రీ స్థాయిల్లోనూ అమలు చేస్తే.. పదో తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదవుతున్న ప్రవేశాల్లో అత్యధికం పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. రెండేళ్లుగా కోవిడ్–19 ప్రభావంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజులను అడ్డగోలుగా పెంచేశాయి. ఆ భారం మోయలేని పేద, మధ్యతరగతి కుటుంబాల వారు పిల్లలను ఆంగ్ల మాధ్యమం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ► ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు జీవనోపాధి కోసం ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో.. నగర శివార్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చేరికలు ఉంటున్నాయి. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డిలతోపాటు హన్మకొండ, సిద్దిపేట, ఇతర జిల్లా కేంద్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు జిల్లాల్లోనూ గణనీయంగానే అడ్మిషన్లు ఉంటున్నాయి. ► సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ ఈ మధ్య నిర్వహించిన సర్వేలో కరోనా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణమైందని.. చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని తేల్చింది. తమ పిల్లలను మంచి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు పంపించలేని స్థితికి జారిపోయాయని తమ నివేదికలో పేర్కొంది కూడా. ఇంగ్లిష్ మీడియం కలిసి వస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం కలిసి వస్తున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెరగడం, కోవిడ్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారడం కూడా కారణమే. ఉపాధ్యాయుల కొరత తీర్చడం, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిస్తే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతాయి. – చావా రవి, టీఎస్టీయుఎఫ్ ప్రధాన కార్యదర్శి స్కూళ్లు నిండిపోతున్నాయి రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే విద్యార్థులు ఎక్కువైపోయి.. నో అడ్మిషన్స్ బోర్డులు పెడుతున్నారు. రాబోయే కాలంలో అలాంటి స్కూళ్లు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. మన ఊరు–మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల తల్లితండ్రులు ఆకర్షితులవుతున్నారు. – రాజ భాను చంద్రప్రకాశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను స్వాగతిస్తున్నాం. తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరగడమే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం. ప్రైవేటు ఫీజుల భారం కూడా దీనికి కారణమవుతోంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడితే బాగుంటుంది. – జి.సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు జోరుగా అడ్మిషన్లు ► తెలంగాణ ఏర్పాటు నుంచి ఏటా సగటున లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుంటారు. అదికూడా జూన్ రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకు కూడా అడ్మిషన్లు జరుగుతుంటాయి. ► ఈసారి అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఈ లెక్కన మొత్తంగా అడ్మిషన్లు ముగిసే నాటికి మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల మంది వరకు కొత్తగా చేరే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు– మన బడి’తో సదుపాయాల కల్పనే దీనికి కారణమని చెప్తున్నారు. ► ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధి వేగంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు కూడా దీనికి కారణమని అంచనా. ► ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు పెంచడం, కరోనాతో కుటుంబాల ఆదాయం తగ్గడం వల్ల కూడా.. ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు తరలడానికి కారణం అని విద్యా రంగ నిపుణులు చెప్తున్నారు. -
విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? అడిగే దిక్కేది!
నిజామాబాద్‌అర్బన్: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్ నిజామాబాద్, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్ పిల్లవాడికి నిజామాబాద్ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్ పాఠవాల వసూలు చేస్తోంది. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసిపేట్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. చదవండి👉🏻అసలే కానిస్టేబుల్.. ఆపై తులం బంగారమిస్తే డబుల్ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి! ఉత్తర్వులు అమలెక్కడ....? విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చదవండి👉🏻పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు ప్రైవేట్‌లో ఫీజుల వివరాలు.. చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి. భారం మోయలేకపోతున్నాం.. పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము. – మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్ నిబంధనల ప్రకారం వసూలు చేయాలి ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, డీఈవో -
తొలి రోజు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమైనా పెద్దగా సందడి కనిపించలేదు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి విద్యార్థుల హాజరు 20 శాతానికి మించలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. తొలిరోజున బోధన ఏదీ జరగదన్న ఉద్దేశం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, సెలవుల కోసం ఊర్లకు వెళ్లినవారు ఇంకా తిరిగి రాకపోవడం వంటివి దీనికి కారణ మని అంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఎక్కువ శాతం విద్యార్థులు యూనిఫాంతో కనిపించగా.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంకా యూనిఫాం ఇవ్వకపోవడంతో సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు హాజరయ్యారు. పలుచోట్ల ప్రభుత్వ స్కూళ్లలో స్వాగత తోరణాలు కట్టి విద్యార్థులను ఆహ్వానించారు. మిఠాయిలు పంచారు. నేతలు, టీచర్ల హడావుడి.. బడుల ప్రారంభోత్సవాన్ని పండుగలా జరపాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ ఏడాది నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉంటుందని, అందువల్ల ప్రైవేటు బడులకన్నా ఇక్కడ చదివించడమే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. మంత్రి సబిత హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లారు. తరగతి గదిలో విద్యార్థులతో కలసి బెంచీపై కూర్చుని కాసేపు ముచ్చటించారు. స్కూలు ప్రాంగణానికి వచ్చిన తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కామన్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన గురించి ఉపాధ్యాయులు వివరించారు. గార్లలో ఓ ప్రభుత్వ బడిలో చేరిన ప్రైవేటు స్కూలు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా స్వాగతించారు. నల్లగొండ జిల్లా మాన్యంచెల్క ప్రాథమిక పాఠశాలలో 24 మంది విద్యార్థులకుగాను తొలిరోజున నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా.. ఒక్కో గదిలో ఇద్దరేసి విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. ఇక కార్పొరేట్ తీసికట్టు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నాం. పైసా ఖర్చులేకుండా ఇంగ్లిష్ మీడియంలో విద్య నేర్చుకోవచ్చు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తాం. ఇప్పటికే 75 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందారు. భవిష్యత్‌లో అన్ని మౌలిక సదుపాయాలు అందించే సర్కారీ బడులను ఆదరించాలి. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
220 ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫారసు
బి.కొత్తకోట: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 220 ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దుచేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వెంబులూరు నారాయణరెడ్డి, బి.ఈశ్వరయ్య చెప్పారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. 2022–23 విద్యాసంవత్సరంలో విద్య, బోధన సామర్థ్యంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందని చెప్పారు. దీనిపై ఇప్పటికే మూడుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎనిమిది ఐటీడీఏల పరిధిలోని రెండువేల పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేసేందుకుగాను ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మూడుశాతం బడిబయట పిల్లలున్నారని, వీరిని పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. అక్షరాస్యతలో జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి ఇంటర్ చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అందిస్తున్న ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో పాఠశాల విద్యకు రూ.29 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వృత్తివిద్య కోర్సులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులకు, ఫీజులపై తల్లిదండ్రులకు, అభ్యసన సామర్థ్యంపై విద్యార్థులకు త్వరలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల కమిటీలను బలోపేతం చేయడం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. -
సెలవుల్లోనూ ‘స్టడీ’గా.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష క్లాసులతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయని భావిస్తున్న సమయంలో, ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు పాఠాల పునఃశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి సర్వ సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థి తుల్లో ఇన్ని రోజుల సెలవులపై తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కన్పిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్‌వేవ్‌తో స్కూళ్లు మూతపడుతున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. గడచిన రెండేళ్ళుగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థ లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా విద్యా ర్థులు పెద్ద మొత్తంలో లెర్నింగ్ లాసెస్ (అభ్యసన నష్టాలు) ఎదుర్కొంటున్నారు. 41 శాతం మందిలో రాత నైపు ణ్యం, 34 మందిలో చదివే సామర్థ్యం, 51 శాతానికి పైగా ఇంగ్లీష్ భాషపై పట్టు పోయిందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ స్కూళ్లు మూతపడితే విద్యార్థుల పరిస్థితి ఏమి టనే ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చదువుపై ప్రత్యేకంగా దృష్టి సారించా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరి ప్రణాళిక వారిది? ♦సెలవుల్లో విద్యార్థి చదువు స్పృహ నుంచి పక్క దారి పట్టకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో సంక్రాంతిని ఉమ్మడిగా ఆస్వాదించే అవకాశం కూడా లేదు కాబట్టి, విద్యార్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా చూడాలని భావిస్తున్నాయి. ♦ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులను మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు కనెక్ట్ చేసే (ఆన్లైన్ పాఠాలు) ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి వంటి జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు స్కూళ్ళు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి. ♦ఇప్పటివరకు జరిగిన పాఠాల్లో విద్యార్థులు ఆసక్తిగా వినలేదని భావించే సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు (పునఃశ్చరణ) నిర్వహించాలని నిర్ణయించినట్టు కొన్ని స్కూళ్ళ నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు క్విజ్, పజిల్స్, జనరల్ నాలెడ్జ్, పాఠ్యాంశాల్లోంచే సంక్షిప్త ప్రశ్నలు అడిగేలా ప్లాన్ చేసినట్టు ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని తెలిపాయి. ♦ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సైన్స్ సబ్జెక్టులో ఇప్పటివరకు చెప్పిన ఖగోళ, మొక్కలు, మానవ అవయవ నిర్మాణం తదితర అంశాలు త్రీడీ ద్వారా అర్థమయ్యేలా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు వివరించాలని భావిస్తున్నారు. ♦ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెలవు దినాల్లో ప్రత్యేక హోంవర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు రవికాంత్ తెలిపారు. ఇప్పటికే ఎస్ఏ–1 పరీక్ష పూర్తి చేశాం. కాబట్టి పిల్లలకు పరీక్షల భయం లేదు. కాకపోతే విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవ్వడం, ఇప్పుడిప్పుడే సిలబస్ ముందుకెళ్ళడం జరుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటిని మరిచి పోకుండా ఉండేందుకు ప్రణాళిక బద్ధంగా హోంవర్క్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. విద్యార్థుల మూడ్‌కనుగుణంగా బోధన సెలవుల్లో విద్యార్థులు సాధారణంగా మానసికోల్లాసాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మళ్లీ చదువు, పాఠాలంటే విసుగుకరంగా భావించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆసక్తి కలిగించే రీతిలో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీనికోసం మేం డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను వాడుతున్నాం. క్విజ్, పజిల్స్‌తో పాటు సిలబస్‌లోని పాఠాలు మరిచిపోకుండా ప్రాక్టికల్‌గా త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేశాం. సెలవుల్లో విద్యార్థి మేథోశక్తికి పదును పెట్టకపోతే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. – ఆర్ పార్వతీ రెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం బడి మరిచిపోకుండా హోం వర్క్ సెలవుల్లోనూ విద్యార్థి బడిని, చెప్పిన పాఠాన్ని మరిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్ నుంచైతే కొంత హోం వర్క్ ఇస్తున్నాం. దీన్ని ఫాలో అయితే ఫైనల్ పరీక్షల్లో విద్యార్థి చురుకుదనం పెరుగుతుంది. ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. రోజూ కొంత సేపైనా పుస్తకాలు పఠించేలా ప్రోత్సహించాలి. – పరాంకుశం రాజా భానుప్రకాశ్, హెచ్ఎం, ఎల్ అండ్ ఎం ప్రభుత్వ పాఠశాల, కరీంనగర్ -
25 శాతం ఉచిత సీట్ల నిబంధనను అమలు చేస్తాం
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటా యిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిం చింది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధన లను తప్పక అమలు చేస్తామని వివరించింది. అర్హు లైన విద్యార్థుల గుర్తింపు జరుగుతోందని తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలుకు మూడు నెలల గడువు మంజూరు చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరు తూ న్యాయవాది యోగేష్ 2017లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాస నం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ స్పందిస్తూ.. విద్యా హక్కు చట్టం అమలుపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాజశేఖర్ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీజే ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మూడు నెలల గడువునివ్వండి.. విద్యా హక్కు చట్టం అమలు నిమిత్తం రూపొందించిన మార్గదర్శకాల్లో భాగంగా సంబంధిత శాఖలన్నింటితో సమావేశం నిర్వహించామని రాజశేఖర్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో 1,19,550 ప్రవేశాలు జరిగాయన్నారు. ఇందులో విద్యా హక్కు చట్టం ప్రకారం.. 25 శాతం అంటే 29,887 మందికి ఉచిత సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 24న జీవో 53 జారీ చేసిందని తెలిపారు. ఒకటవ తరగతికి 25 శాతం ఉచిత సీట్ల నిబంధన అమలు చేయడానికి రూ.33 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంతేకాకుండా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించాల్సి ఉంటుందని, ఈ పోర్టల్ రూపకల్పనకు రెండు మూడు నెలల సమయం పడుతుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటికే ప్రవేశాలు ముగిశాయని, అందువల్ల 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
బద్వేలు అర్బన్: రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీపై మండిపడ్డారు. బుధవారం ఆయన బద్వేలులో విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీకి తోడు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుండటం భావ్యం కాదన్నారు. ప్రైవేటు యాజమాన్యం కింద నడిచే విద్యా సంస్థల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ ఒక కమిటీ వేసి ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏ విధంగా పని చేస్తున్నాయి.. టీచర్, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది.. ఫలితాలు ఎలా వస్తున్నాయి.. నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి.. తదితర విషయాల్లో సూచనలివ్వాలని కమిటీని ఆదేశించారన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితి దారుణం ► ఎయిడెడ్ స్కూళ్లు దాదాపుగా నిర్వీర్యమయ్యాయి. కొన్ని చోట్ల టీచర్లకు, యాజమాన్యం మధ్య సఖ్యత లేదు. చాలా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. అందువల్ల విద్యార్థులు ఆ స్కూళ్లలో చేరడం లేదు. ► ఈ పరిస్థితిలో యాజమాన్యాలు స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే అవసరమైన మేరకు టీచర్లను నియమించడంతో పాటు నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేయవచ్చని నిర్ణయించాం. ► అయితే ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తే స్కూళ్లు మూత పడిపోతాయని ప్రతిపక్షం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నాయి. వాస్తవానికి స్కూళ్లు అప్పగించాలని ప్రభుత్వం ఏ ఒక్క స్కూలు యాజమాన్యాన్ని బలవంత పెట్టడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకోవచ్చు ► ఎయిడెడ్ యాజమాన్యాలు తమకు గ్రాంట్ అవసరం లేదని, టీచర్లను ప్రభుత్వానికి సరెండర్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకుంటామని చెబితే ఎలాంటి అభ్యంతరం లేదు. ► రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీల్లో 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్టాఫ్‌తో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపారు. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్‌ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. మొత్తంగా 93 శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్‌నెస్ ఇచ్చాయి. ► 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉంటే 5 జూనియర్ కాలేజీలు ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం స్టాఫ్‌ను ఇస్తామని తెలిపాయి. ► 1,988 స్కూళ్లకు గాను 1200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్‌ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. ► విశాఖలో సెయింట్‌పీటర్స్, కాకినాడలో సెయింట్ యాన్స్ స్కూళ్ల యాజమాన్యాలు తాము స్కూళ్లు మూసి వేస్తున్నామని చెప్పాయి. కాబట్టి మీ పిల్లలను వేరే స్కూళ్లలో చేర్పించుకోండని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం విల్లింగ్‌నెస్ ఇచ్చినప్పటికీ, తిరిగి విత్‌డ్రా చేసుకుంటామంటే వారి ఆప్షన్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. ► రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణం.