నంద్యాలవిద్య: ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో అరకొర జీతాలతో ప్రైవేటు సంస్థల్లో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి పరిస్థితిని ఆసరగా చేసుకొని యాజమాన్యాలు నానా రకాల షరతులు పెడుతూ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాయి.
సెలవు పెడితే రెండురోజుల జీతం కట్ : నంద్యాల పట్టణంలోని దాదాపు 120 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4వేల మంది ఉపాధ్యాయలు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు అడ్మిషన్లు చేపట్టాలంటూ టార్గెట్లు పెడుతున్నారు. లక్ష్యాలను చేరుకోలేనివారిపై క్రమశిక్షణ చర్యలకు కూడా వెనుకాడటం లేదు. ఆదివారం, రెండో శనివారం, జాతీయ సెలవుదినాలు అంటే ఏమిటో తెలియని స్థితిలో విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఉపాధ్యాయులకు వరుసగా తరగతులు కేటాయిస్తుండటంతో 10 నుంచి 12 గంటల వరకు నిలబడి బోధించాల్సి వస్తోంది. దీంతో అనారోగ్యాలపాలవుతున్నారు. అత్యవసరమై ఒక రోజు సెలవు పెడితే రెండు రోజులు వేతనం కోత పెడుతున్నారు. అంతేకాకుండా అనివార్య పరిస్థితిలో ఆలస్యంగా వస్తే యాజమాన్యంతో చీవాట్లతోపాటు అర పూట జీతంలో కటింగ్‌లు కూడా ఉంటాయి.
వేసవిలో ప్రచారం
ప్రైవేటు, కార్పొరేట్ ఉపాధ్యాయులు తమ బాధ్యతతో పాటు వేసవి సెలవుల్లో మండుటెండలో వీధులు వీధులు, ఊరూరు తిరుగుతూ విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ప్రచారం చేయిస్తున్నారు. వీరికి కనీస వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర సదుపాయాలు కూడా కల్పించడంలేదు. వీరు వేసవిలో సెలవులు పొందాలంటే కనీసం ఐదుగురు విద్యార్థులను అడ్మిషన్ చేయించాలనే షరతు ప్రతి కార్పొరేట్ పాఠశాలలో పరిపాటిగా మారింది. అలాగే పాఠశాల వదిలి వెళ్లాలన్నా వేతనాలు, సర్టిఫికెట్లు యాజమాన్యం వద్ద ఉంచుకొని వేధిస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల సంఘం నాయకులు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
అరకొర వేతనాలతో ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. టీచర్లను అన్ని రకాలుగా వినియోగించుకున్న యాజమాన్యాలు వారి హక్కులను కాలరాస్తున్నాయి. వేతనాల పెంపుపై యాజమాన్యాలు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నాయే తప్ప వారి బాగోగులను పట్టించుకున్న సందర్భం లేదు. యాజమాన్యాలు టీచర్ల సమస్యలపై స్పందించాలి.
– కల్యాణి, ప్రైవేటు టీచర్
అరకొర జీతాలతో ఇబ్బందులు
నిరంతరం శ్రమిస్తున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అరకొర వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టతరంగా మారింది. ఆర్జిత సెలవులు, పీఎఫ్, ఈఎస్‌ఐ, తదితర సౌకర్యాలు కల్పించడంలేదు. పాఠశాల ఎదుగుదలకు, తరుగుదలకు టీచర్లే కారణమంటూ చర్యలు తీసుకోవడం దారుణం. –సురేష్, ప్రైవేటు ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment