సాక్షి, హైదరాబాద్ : ఐఐటీ.. ఒలింపియాడ్.. టెక్నో.. కాన్సెప్ట్.. ఈ–శాస్త్ర.. ఒకటా రెండా.. ఇలా 62 రకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నాయి! పొద్దుట్నుంచి రాత్రి వరకు క్లాసులు చెప్పిస్తున్నా జీతాలు మాత్రం అరకొరగా విదిలిస్తున్నాయి. కొన్ని అగ్రస్థాయి పాఠశాలలు మినహా మెజారిటీ స్కూళ్లు.. తమ టీచర్లకు చెల్లిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ప్రైవేటు పాఠశాలల ఆదాయ, వ్యయాలను చూసే వ్యవస్థ లేకపోవడం, విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజుల నియంత్రణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం తమ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని ప్రైవేటు టీచర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. రెగ్యులర్ టీచర్లకు చెల్లిస్తున్న తరహాలోనే తమకూ వేతనాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతోంది.
ఎంతెంత ఇస్తున్నారో లెక్కే లేదు..
రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మంది విద్యార్థులు 11,700 పైగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. వీటిల్లో సుమారు 1.5 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. అయితే 50 వేల మంది వరకు టీచర్లను యాజమాన్యాలు అసలు వారి రికార్డుల్లోనే చూపించడం లేదు. వారందరికీ తక్కువ వేతనాలిస్తూ యాజమాన్యాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల్లో చూపించే టీచర్లకు చెల్లిస్తున్నది కూడా అంతంతే అని చెబుతున్నారు.
ఇక టీచర్ల వేతనాలను బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న యాజమాన్యాలూ తక్కువే ఉన్నాయి. దీంతో అత్యధిక స్కూళ్లు టీచర్లకు ఎంత మొత్తాన్ని వేతనంగా చెల్లిస్తున్నాయో తెలిసే పరిస్థితి లేదు. వాటికి ఓ లెక్కా పత్రం ఉండడం లేదు. తమతో నానా చాకిరీ చేయిస్తూ అరకొర వేతనాలివ్వడంతో జీవనం కూడా గడవడం కష్టమవుతోందని ప్రైవేటు పాఠశాలల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు.
ఇష్టారాజ్య వసూళ్లకు అడ్డదారులెన్నో..
ఒకటో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్‌న్‌అంటూ ప్రైవేటు యాజమాన్యాలు రకరకాల పేర్లతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏయే జిల్లాలో ఎన్ని ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయన్న లెక్కలను విద్యాశాఖ తేల్చింది. ఆకర్షణీయ పేర్లతో అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను సేకరించింది.
రాష్ట్రంలో 3,487 ప్రైవేటు స్కూళ్లు 62 రకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి పేర్లతో రూ.లక్షల్లో కేపిటేషన్‌న్‌ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయని, చివరకు నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలు అంటూ దోపిడీకి పాల్పడుతున్నాయని విద్యాశాఖ తేల్చింది.
జీవో నంబర్ 1 అమలేది?
ప్రైవేటు టీచర్ల వెతలు తీరాలంటే ప్రభుత్వం 1994లో జారీ చేసిన జీవో నంబరు–1 పక్కాగా అమలు చేయడమే సరైన మార్గమని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. అందుకే ప్రభుత్వానికి పంపిన నివేదికలో దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒక పాఠశాలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం 100 శాతం అనుకుంటే.. అందులో 50 శాతం టీచర్ల వేతనాలకు వెచ్చించాలి.
15 శాతం నిధులను పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు ఉపయోగించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల నిర్వహణకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమానికి ఉపయోగించాలి. యాజమాన్యం కేవలం 5 శాతం నిధులను మాత్రమే లాభంగా తీసుకోవాలని జీవో నంబర్–1 చెబుతోంది. ఈ ఉత్తర్వుల్లోని నిబంధనలను విద్యాశాఖ తమ నివేదికలో చేర్చింది.
వేతనాలు ఖాతాల్లోకి వేయరెందుకు?
ప్రైవేటు పాఠశాలలకు చెందిన టీచర్ల వేతనాలు, వారి సంక్షేమంపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికలోనూ స్పష్టమైన నిబంధనలు లేనట్టు తెలిసింది. అసలు టీచర్ల వేతనాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించకుండా కేవలం ఫీజుల పెంపునకు అవసరమైన సిఫారసులు చేయడం విమర్శలకు దారి తీసింది. జీవో నంబర్–1 అమలు ప్రస్తావనే అందులో లేదు. వాస్తవానికి విద్యాశాఖ అంతకుముందు ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో టీచర్ల సంక్షేమం, వేతనాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను పొందుపరిచింది.
ఉపాధ్యాయల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఆన్‌లైన్ ద్వారా వేయాలని సిఫారసు చేసింది. విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల్లో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు చెల్లించాలని పేర్కొంది. విద్యాశాఖ తెచ్చిన ఈ నిబంధన ప్రైవేటు యాజమాన్యాల్లో ఆందోళనకు కారణమైంది. అందుకే తిరుపతిరావు కమిటీపై ఒత్తిడి తెచ్చి ఆ నిబంధన లేకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment