కాగజ్‌నగర్‌లో ఆటోలో ప్రమాదకరంగా వెళ్తున్న విద్యార్థులు
కాగజ్‌నగర్‌టౌన్: అధికారుల పర్యవేక్షణలోపం..రాజకీయ నాయకుల అండదండలతో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి సొంత ఎజెండాను అమలు చేస్తున్నాయి. డోనేషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. సెలవు దినాల్లోనూ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కాగజ్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నాగోబా జాతర రోజు పాఠశాల కొనసాగించారని డీఈవో మెమో జారీ చేశారు. కాని రాజకీయ అండదండలు, పలుకుబడితో మేనేజ్ చేసినట్లు సమాచారం. విద్యతోపాటు పాఠశాలల్లో క్రీడలు ఉండాలి. కాని చాలా పాఠశాలల్లో మైదానాలే లేవు.
అంతే కాకుండా పైఅంతస్తులో పాఠశాల నిర్వహిస్తే అదనంగా అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలి. కాని కొన్ని పాఠశాలలకు అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. జిల్లాలో 104 ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు కనీసం ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా లేదు. ఇలాంటి సౌకర్యాలు కల్పించని పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జనవరి 31న ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి ఒక చోట, నిర్వహణ మరోచోట..
అనుమతి తీసుకున్న చోటనే ప్రైవేటు పాఠశాలలు కొనసాగించాలి. కాని కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల రెండు ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఒకచోట ఉంటే వాటిని మరోచోటకు తరలించారు. ఇలా స్కూల్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే అనుమతి తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది. ఇందుకు యాజమాన్యాలకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనిని ఎగ్గొంటేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కాయి. ఇలాంటి వాటిపై స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు సమాచారం ఉన్నా, ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదుదారుల ఒత్తళ్ల మేరకు ఉన్నతాధికారులు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అతితక్కువ జీతాలు చెల్లిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజు మొత్తంలో 50 శాతం జీతాలు చెల్లించాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం 12 నెలల జీతాలు చెల్లించాల్సి ఉండగా కేవలం 10 నెలల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
విద్యార్థులపై ఒత్తిడి
ప్రైవేటు పాఠశాలలు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు రోజుకు ఏడు గంటలు కొనసాగాలి. మధ్యాహ్న భోజన విరామం, స్వల్ప విరామాలు కలుపుకొని ఏడు గంటలు ఉండాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 7:15 నిమిషాలు కొనసాగాలి. ఎక్కువ గంటలు పాఠశాలల్లో విద్యార్థులను ఉంచకూడదు. కాని 9 నుంచి 10 గంటల వరకు విద్యార్థులను పాఠశాలల్లో ఉంచుకొని ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
మండల కమిటీల పర్యవేక్షణ కరువు
ప్రైవేటు పాఠశాలల్లో మండల స్థాయి అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో వసతులు, సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. ప్రతీ మండలంలో తహసీల్దార్ చైర్మన్, ఎంఈవో కన్వీనర్, ఎంపీడీవోతోపాటు సీఐ, ఎస్సైలు సభ్యులుగా ఉంటారు. కాని ఈ కమిటీలు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
నిబంధనలు పాటించడం లేదు
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం తరఫున ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. టీచర్లకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు.
-ఎండీ.ఆసీఫ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
పట్టించుకుంట లేరు
ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చాలా మంది ప్రమాదకరంగా ఆటోల్లో వెళ్తున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులే బాధ్యత వహించాలి.
తేజశ్విని, టీపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రెటరీ
Comments
Please login to add a commentAdd a comment