అప్పటిదాకా జీతాలు తక్కువైనా వారి జీవితాలు సాఫీగానే సాగేవి. అతికొద్ది జీతంతోనే సరిపెట్టుకొని పొదుపుగా జీవిస్తూ జీవనయానం కొనసాగించేవారు. సంవత్సరమంతా పనిచేసినా వీరికి జీతాలు వచ్చేది కేవలం పది నెలలు మాత్రమే. ఎండాకాలం రెండు నెలలు ఫీజులు వసూలు చేయమనే సాకుతో యాజమాన్యాలు వీరికి విధిస్తున్న కోత ఇది. ఇక అడ్మిషన్లు జరిగే సమయాల్లో వీరి పరిస్థితి వర్ణనాతీతం. వీరే ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే అధ్యాపకులు. ఈ ఉపాధ్యాయులకు బిజినెస్ ఏజంట్ల మాదిరిగా టార్గెట్లు ఇస్తారు. ఈ లక్ష్యాలను చేరులేకపోతే జీతం కట్. టూకీగా ఇదీ మనకు ఓనమాలు దిద్దించిన ఉపాధ్యాయుల పరిస్థితి.
కుప్పకూలుతున్న జీవితాలు
ఇదంతా ఒకఎత్తైతే కరోనా మహామ్మారితో వీరి నెత్తిన మరో పిడుగు పడినట్లైంది. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్న విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక్కసారిగా తమ లెక్కలు తిరగబడటంతో మానవత్వాన్ని మరిచారు. మార్చి23న లాక్‌డౌన్ విధిస్తే ఆ నెలలోనూ ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతం చెల్లించలేదు. కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు సైతం ఇదే విధానాన్ని అవలంభించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇంటి అద్దెలు కట్టలేక ఆపసోపాలు పడుతున్నారు. ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్న అధ్యాపకుడు అరటిపండ్ల తోపుడు బండి పెట్టుకొని జీవనయానం చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చూసి కొందరు పూర్వ విద్యార్థులు చలించిపోయారు. తమకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయుని గడ్డు పరిస్థితిని తెలుసుకొని విద్యార్థులే డబ్బు సహాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment