బాబు సర్కారుకు గురువుల ప్రశ్న
ఒకటి పాయె.. మూడు పాయె.. ఆరో తేదొచ్చె
ఇంకా తప్పని ఎదురుచూపులు
ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ
మొదటి నెలకే పరిమితమైన 1వ తేదీ జీతాల చెల్లింపు
సంక్రాంతి నెలలో జీతాల కోసం ఎదురుతెన్నులు
రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు చెల్లించని ప్రభుత్వం
మాటలకు, చేతలకు పొంతన లేదని టీచర్ల ఆవేదన
సాక్షి, అమరావతి: కొత్త ఏడాది మొదటి నెలలో ఐదు రోజులు గడిచినా, వేతనాలు అందలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన మొదటి నెల తప్ప, మరే నెలలోనూ ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 31నే బిల్లులు రెడీ అయిపోయాయని.. జనవరి 1న వేతనాలు జమ కావడం ఖాయమని ప్రభుత్వం లీకులు ఇచ్చిందని, తీరా 5వ తేదీ దాటినా వేతనాలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగైతే ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల చెల్లింపులో జాప్యం జరగడంతో తాము డిఫాల్టర్లుగా మారుతున్నామని, చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నెలలో ఇలా జీతాల కోసం ఎదురు చూడటం ఇబ్బందిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (7వ తేదీ) వరకు జీతాలు పడే అవకాశం లేదని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయని, ఈ లెక్కన కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి.. ఇచ్చిన హామీకి.. చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలివ్వాలి : ఏపీటీఎఫ్ అమరావతి
జీవో 58 ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రతి నెలా 1నే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బడ్జెట్‌లోను వేతనాల కోసం వార్షిక నిధులను కేటాయించాలని కోరారు.
వేతనాలు వెంటనే చెల్లించాలి: సీహెచ్‌వో సంఘం
గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో సేవలు అందించే తమకు డిసెంబర్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్‌వో) అసోసియేషన్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలనూ విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఒకే దేశం.. ఒకే జీతం అమలు చేయాలి: ఏఐపీటీఎఫ్
ఉపాధ్యాయులు అందరికీ ఒకే దేశం.. ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏఐపీటీఎఫ్) తీర్మానించింది. ఆదివారం న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ భవన్‌లో తొలి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ నుంచి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐపీటీఎఫ్ కార్యనిర్వహక కార్యదర్శి ఏజీఎస్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment