విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారు ప్రణాళిక
జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు ‘బడిబాట’కు శ్రీకారం
పక్కాగా కార్యక్రమం అమలు చేయాలని టీచర్లకు విద్యాశాఖ ఆదేశం
విద్యార్థుల చేరికలు పెంచాలని స్పష్టికరణ
ఈ ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు పెంచడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చేరికలు కొంత ఆశాజనకంగానే ఉన్నా ఆ తర్వాత క్లాసుల్లో ఎన్‌రోల్‌మెంట్ పడిపోతోంది. ఆరో తరగతి నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. దీన్ని సరిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఎన్‌రోల్‌మెంట్ పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టనున్నారు. ఏటా పాఠశాలలు తెరిచే ముందు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టడం సాధరణమే అయినప్పటికీ ఈసారి విద్యార్థుల శాతాన్ని ఎక్కువగా పెంచాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
సమస్యలు పరిష్కరిస్తేనే..
ఈ ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ నిధులతో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతోపాటు భవనాల మరమ్మతులు, స్మార్ట్ క్లాస్‌రూంలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిబ్బంది జీతాలకు ఖర్చు చేయనుంది. గతంలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద స్కూళ్లలో మౌలికవసతులు కల్పించాలని నిర్ణయించగా ప్రభుత్వం మారడంతో ఈ కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీంతోపాటు టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశాలలను వేధిస్తోంది. ప్రధానంగా ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరిగే అవకాశం లేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి.
ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇది..
⇒ రాష్ట్రంలో 30,023 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,213 స్కూళ్లలో గతేడాది జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైంది. 13,364 పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ సంఖ్య 50లోపే ఉంది.
⇒ రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. 5,821 స్కూళ్లు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. 80 శాతం స్కూళ్లలో సబ్జెక్టు లేదా భాషా పండితుల కొరత ఉంది.
⇒దివ్యాంగులకు టాయ్‌లెట్స్ లేని స్కూళ్లు 15.45 శాతం ఉన్నాయి. బాలికలకు టాయ్‌లెట్స్ లేని బడులు 9.44 శాతం ఉన్నాయి.
⇒ 18, 19 పాఠశాలల్లో సమీకృత సైన్స్ లే»ొరేటరీలు లేవు. ఐసీటీ ల్యాబ్‌లు లేని స్కూళ్లు 11.7 శాతం. స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్‌లు లేని బడులు 71 శాతం ఉన్నాయి.
⇒ ఎస్‌సీఈఆర్‌టీలో మంజూరైన పోస్టుల్లో 46.15 శాతం పోస్టులు, డైట్ కాలేజీల్లో 67.83 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కోవిడ్ కాలంలో పెరిగి.. మళ్లీ తగ్గి..
రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. వారిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే మిగతా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. 2020 నుంచి 2022 వరకూ ఏటా 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ 2023 నుంచి మళ్లీ క్రమంగా ఏటా లక్ష మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి నిష్క్రమిస్తున్నారు.
మెరుగైన విద్య లేనందుకేనా?
రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యార్థుల హాజరుపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఇటీవల ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యార్థులు కూడా ఉండటం లేదు. ఐదో తరగతి వరకు ఒక్కో క్లాసులో 40 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత, సకాలంలో పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన కుంటుపడుతోంది. దీంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టణాలకు తరలుతున్నాయని నివేదిక పేర్కొంది.
విస్తృత ప్రచారం కల్పించేలా..
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు పెంచుతున్న తీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి టీచర్లకు సూచించింది. జూన్ ఒకటి నుంచి 11వ మధ్య చేపట్టే బడిబాట కార్యక్రమంలో స్కూళ్లను ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని, ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment