మహబూబియా పాఠశాలలో విద్యార్థులతో మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమైనా పెద్దగా సందడి కనిపించలేదు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి విద్యార్థుల హాజరు 20 శాతానికి మించలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. తొలిరోజున బోధన ఏదీ జరగదన్న ఉద్దేశం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, సెలవుల కోసం ఊర్లకు వెళ్లినవారు ఇంకా తిరిగి రాకపోవడం వంటివి దీనికి కారణ మని అంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఎక్కువ శాతం విద్యార్థులు యూనిఫాంతో కనిపించగా.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంకా యూనిఫాం ఇవ్వకపోవడంతో సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు హాజరయ్యారు. పలుచోట్ల ప్రభుత్వ స్కూళ్లలో స్వాగత తోరణాలు కట్టి విద్యార్థులను ఆహ్వానించారు. మిఠాయిలు పంచారు.
నేతలు, టీచర్ల హడావుడి..
బడుల ప్రారంభోత్సవాన్ని పండుగలా జరపాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ ఏడాది నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉంటుందని, అందువల్ల ప్రైవేటు బడులకన్నా ఇక్కడ చదివించడమే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. మంత్రి సబిత హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లారు.
తరగతి గదిలో విద్యార్థులతో కలసి బెంచీపై కూర్చుని కాసేపు ముచ్చటించారు. స్కూలు ప్రాంగణానికి వచ్చిన తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కామన్‌పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన గురించి ఉపాధ్యాయులు వివరించారు. గార్లలో ఓ ప్రభుత్వ బడిలో చేరిన ప్రైవేటు స్కూలు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా స్వాగతించారు.
నల్లగొండ జిల్లా మాన్యంచెల్క ప్రాథమిక పాఠశాలలో 24 మంది విద్యార్థులకుగాను తొలిరోజున నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా.. ఒక్కో గదిలో ఇద్దరేసి విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు.
ఇక కార్పొరేట్ తీసికట్టు
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నాం. పైసా ఖర్చులేకుండా ఇంగ్లిష్ మీడియంలో విద్య నేర్చుకోవచ్చు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తాం. ఇప్పటికే 75 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందారు. భవిష్యత్‌లో అన్ని మౌలిక సదుపాయాలు అందించే సర్కారీ బడులను ఆదరించాలి.
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment