Department of Education
-
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
మేమూ ఇంగ్లిష్‌లో మాట్లాడతాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ సులువుగా అర్థం చేయించడం.. ఆపై మాట్లాడేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్తోపాటే విద్యార్థులు మాట్లాడేలా గతనెల 28 నుంచి జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నారు. 1,252 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలోని కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 16 పాఠశాలలను స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థులు 1,252 మంది ఉండగా.. 16 మంది టీచర్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానర్ (ఐఎప్పీ) డిజిటల్ బోర్డులున్న పాఠశాలలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌కి చెందిన భారత్ దేఖో, మంత్రా పర్ చేంజ్, అలోకిట్, శిక్షా లోక్ స్వచ్ఛంద సంస్థలు రోజూ 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈ పాఠశాలలకు ఆన్లైన్లో పంపిస్తుండగా.. వీడియో చూశాక మరో 15 నిమిషాలు విద్యార్థుల నడుమ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు. వీడియోలోని బొమ్మలు, వాటి నడుమ సంభాషణ గుర్తుండి ఇంగ్లిష్ మాట్లాడటం సులువవుతుందని భావిస్తున్నారు. వీటిద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. 15 రోజులకోసారి సమీక్షిస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్ధికి ఇంగ్లిష్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు మంచి అవకాశం ఇంగ్లిష్ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఆడియో, వీడియోల ద్వారా పిల్లలు ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఇప్పటికే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడుతున్నారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలతో త్వరలోనే ఇంకొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం. –జక్కంపూడి జగదీష్, జిల్లా కోఆర్డినేటర్, ఉయ్ కెన్ లెర్న్ ప్రోగ్రాం ఇంగ్లిష్ అంటే భయం పోతోంది.. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం తగ్గింది. కథల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడటం జరుగుతోంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు. –బి.రామనాథం, టీచర్, జెడ్పీహెచ్ఎస్, చిన్న కోరుకొండి, కల్లూరు మండలం చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. – డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గుబ్బగుర్తి, కొణిజర్ల మండలం కలెక్టర్ సార్‌కు ధన్యవాదాలు.. స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోగలుగుతున్నాం. రోజూ వినడం వల్ల కొంతకాలం తర్వాత మాట్లాడగలుగుతాం. మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ మొదలు పెట్టినందుకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సార్‌కు ధన్యవాదాలు. –బి.దేవిక, 7వ తరగతి, జెడ్పీఎస్ఎస్, కల్లూరు, ఖమ్మం జిల్లా త్వరలోనే 200 పాఠశాలల్లో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్ మాట్లాడగలమనే విశ్వాసం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం 16 పాఠశాలలను ఎంపిక చేసినా త్వరలోనే 200 పాఠశాలలకు విస్తరిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాక డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు ఇంగ్లిష్‌లో రాణించలేక ప్రైవేట్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం జిల్లా చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కొణిజర్ల మండలం -
కొత్త టీచర్లు ఎలా ఉన్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన కొత్త ఉపాధ్యాయుల పనితీరుపై విద్యాశాఖ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ జిల్లా విద్యాశాఖాధికారులను కోరింది. దీంతో డీఈవోలు ఈ బాధ్యతను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక అంశాలను ఎంఈవోలకు సూచించారు. ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మందికి టీచర్ పోస్టులు వచ్చాయి. ఇందులో చాలామందిని ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనే నియమించారు. కొత్తగా చేరినవారి బోధనా సరళి ఏ విధంగా ఉంది? విద్యార్థులతో ఎలా మమేకమవుతున్నారు? స మస్యలు వస్తున్నాయా? ఏమేరకు చొరవ చూపుతున్నారు? అనే అంశాలపై ప్రధా నంగా నివేదిక కోరారు. దీంతోపాటు పాలనాపరమైన విధులు, విద్యాశాఖ నిబంధనావళిని ఎంతవరకు పాటిస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఎంపికైన టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు భావించినప్పటికీ అది సాధ్యంకాలేదు. ముందుగా రిసోర్స్ పర్సన్స్‌ను ని యమించి, వారి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పాఠశాల విద్య అధికారులు తెలిపారు. ఈలోగా వారి బోధన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని, ఆయా అంశాలను కూడా శిక్షణలో జోడించే వీలుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
సర్కారు చదువులు చట్టుబండలు!
సాక్షి, అమరావతి: సజావుగా సాగుతున్న పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను, అందులోనూ ప్రాథమిక దశ నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను దూరం చేసేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళుతోంది. తాజాగా జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను నిర్దయగా రద్దు చేస్తోంది. పిల్లల్లో విద్యా నాణ్యత పెంచేందుకు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన అందించేందుకు తీసుకొచ్చిన జీవో 117ను రద్దుచేసి, వచ్చే ఏడాది నుంచి ఆ తరగతులను ప్రాథమిక పాఠశాల్లోకి మార్చాలని నిర్ణయించింది. ఏపీ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ‘ప్రభుత్వాలు మారడం సహజం. కానీ.. పాలన మాత్రం మారకూడదు. మంచి ఏ ప్రభుత్వంలో జరిగినా దాన్ని కొనసాగించాలి’ అని ఇటీవల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులనూ పరిశీలించారు. గత ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, వాటిని అలాగే కొనసాగిద్దామని ఉన్నతాధికారుల వద్ద కూడా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రే బాగున్నాయని చెప్పిన సంస్కరణలను రద్దు చేయడం విస్మయం కలిగిస్తుంది. జీవో 117 రద్దు చేస్తే విద్యార్థులకు అన్యాయం పలు సర్వేల అనంతరం విద్యారంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చి0ది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల్లోను ఒకేవిధమైన విధానాలు అనుసరించాలని, పిల్లలు నేర్చుకునే దానికి, వస్తున్న ఫలితాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని సూచించింది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పతి్తని తగ్గించాలంది. ఎన్ఈపీ–2020 విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో–117 జారీ చేసింది. దీనిప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు.అంతేగాక ఉపాధ్యాయులపై బోధనా ఒత్తిడి తగ్గించేందుకు ప్రాథమిక విద్యార్థుల బోధనను ఒక టీచర్‌కు 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎంతో ఉన్నతమైన ఆశయంతో తీసుకొచ్చిన జీవో 117ను ఉపాధ్యాయులు సైతం మెచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే చట్టాన్ని రద్దు చేయడమంటే పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేయడమేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2024 కౌన్సెలింగ్‌లో తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ నెల 22 లోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు. అయితే ఈ నెల 19 నుంచే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఏపీఈ ఏపీసెట్‌లో అర్హత సాధించిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సెలింగ్ కోసం 1,28,619 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ధ్రువపత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 19,524 సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటాలకు సంబంధించి మెరిట్ జాబితా రానందున ఈ సీట్లను చివరిగా భర్తీ చేస్తామని వివరించారు. -
ఏటా రెండుసార్లు టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో ఒకసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇకపై రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈమేరకు సవరణ ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీ చేశారు. ఒక అభ్యర్థి టెట్ పరీక్షను ఎన్నిసార్లు అయినా రాయొచ్చని, మెరుగైన మార్కుల కోసమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడితో పాటు ఎస్సీఈఆర్టీ సంచాలకులను ఆయన ఆదేశించారు. -
‘ప్రైమరీ’లో ప్రగతి జాడేదీ?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రాథమిక వి ద్యలో విద్యార్థుల ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. తెలగాణ సహా అన్ని రాష్ట్రాల్లో ఈ లోపం కనిపిస్తోందని.. దీన్ని అధిగమించేందుకు కసరత్తు అవసరమని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2026 నాటికి దశల వారీగా ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రాలు.. ఆ దిశగా అడుగులు వేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ రెండేళ్లకోసారి నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్)ను నిర్వహించి.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా ర్థుల ప్రమాణాలను పరిశీలిస్తుంది. అలా తాజాగా చేపట్టిన సర్వేలో తేలిన అంశాలను వెల్లడించింది. కనీస స్థాయి కూడా ఉండక.. ప్రతి విద్యార్థికి ఐదో తరగతికి చేరేసరికి చదవడం, రాయడంతోపాటు సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన అవసరం. ఇది తేల్చేందుకు కేంద్ర విద్యాశాఖ సర్వేలో 28 అంశాలపై స్వల్పస్థాయి ప్రశ్నలు ఇచ్చింది. విద్యార్థుల్లో 56– 68 శాతం మంది 50శాతం ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు. గణితంలో అయితే 70 శాతం మంది విద్యార్థులు 30శాతం ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. 8వ తరగతి విద్యార్థులు కూడా గణితంలో 37శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నట్టు సర్వేలో గుర్తించారు. ప్రాంతీయ భాషల్లో రాయడం, చదవడంలోనూ విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఈ కేటగిరీలో కనీసం సగం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగినవారు 53 శాతం మంది మాత్రమే. చాలా రాష్ట్రాల్లో 13.85 శాతం మంది 8వ తరగతి వచ్చే సరికే బడి మానేస్తున్నారని.. దీన్ని కనీసం 6 శాతానికి తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం టార్గెట్ పెట్టింది. నెరవేరని లక్ష్యం! రెండేళ్ల క్రితం సర్వే చేసిన సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. కనీసం 50శాతం, ఆపైన ప్రశ్నలకు సరైన సమాధానం రాసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించింది. ఆ సమయంలో తర్వాతి ఐదేళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని రాష్ట్రాలు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటివరకు పెద్దగా మార్పు మొదలైనట్టు కనిపించలేదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు కొత్త లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పిల్లల్లో ప్రమాణాలు పెరగకపోవడానికి పాఠశాలల్లో టీచర్ల కొరతే కారణమని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా కరోనా తర్వాత నాణ్యమైన టీచర్లు దొరికే పరిస్థితి లేక సమస్యగా మారిందని విశ్లేషిస్తున్నారు. -
ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ముకుతాడు !
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రవేశాలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక రూ పొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేట్ కాలేజీల పెత్తనాన్ని అడ్డుకోవాల్సిన అవసరముందని, ఇది ఏ విధంగా సాధ్యమనే అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పలువురు ఉన్నతాధికారులతో సీఎం విద్యాశాఖపై శుక్రవారం సమీక్షించారు. సకాలంలో స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాల్సిన అంశాన్ని ప్రస్తావించారు. ఇంటర్ కాలేజీల ఫీజులపై తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందనే విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది. దీనిని కట్టడి చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా వీసీల నియామకం, పలు విద్యాశాఖ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
3 నుంచి బడిబాట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఏ రోజున ఎవరేం చేయాలనే మార్గదర్శకాలను బుధవారంరాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. నిర్ణయించిన తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలు, శివారు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. చదువుకోని పిల్లలను గుర్తించి, వారిని సమీపంలోని అంగన్వాడీలు, స్కూళ్లలో చేర్పించడం, ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు పెంచడం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించడం బడిబాట ఉద్దేశం. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక బృందాలు, ఎన్జీఓల తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 3 నుంచి 19వ తేదీ వరకు ఏ రోజు ఏం చేయాలనే వివరాలతో కూడిన షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. కలెక్టర్ల నేతృత్వంలో కార్యాచరణ» జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఈఓలు, ఎంఈఓలు, స్కూల్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమ ప్రణాళిక ఖరారు చేస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వ స్కూళ్లల్లో నోట్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్, యూనిఫాం పంపిణీకి సిద్ధం చేస్తారు.» సామాజిక సేవాసంస్థలు, ఎన్జీఓలు వివిధ వర్గాలను డీఈఓలు సమన్వయపరిచి, బడిబాటను ముందుకు తీసుకెళ్లాలి. ఎంఈఓలు, హెచ్ఎంలకు, టీచర్లకు బడిబాట దిశానిర్దేశం చేస్తారు. కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పిస్తారు. మండలపరిషత్ అధికారులు, ఎస్ఐ, వివిధ వర్గాల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. »మండలస్థాయి కమిటీలను ఎంఈఓలు ఏర్పాటు చేస్తారు. ఏరోజు ఏం చేయాలనే కార్యాచరణను మండల పరిధిలో ఎంఈఓలు రూపొందిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు.» గ్రామస్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని స్కూల్ హెచ్ఎంలు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యాన్ని తీసుకోవడంలో కీలక భూమిక పోషిస్తారు. బడిబాట ద్వారా గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. -
ఇంజనీరింగ్‌లో 74 శాతం.. అగ్రి, ఫార్మాలో 89 శాతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీ సెట్–2024) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 78.98 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం అర్హత సాధించారు. ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ పోటీ పడ్డాయి. రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తొలి 10 ర్యాంకులు సమానంగా వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రి, ఫార్మసీ విభాగంలో ఏపీకే చెందిన అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని టాప ర్లుగా నిలిచారు. ఈ మేరకు ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కనీ్వనర్ డీన్‌కుమార్, కో–కన్వీనర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. 74.98 శాతానికి తగ్గిన అర్హులు టీఎస్ఈఏపీ సెట్ ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది సెట్‌కు హాజరయ్యారు. 1,80,424 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. 82,163 మంది అర్హత సాధించారు. గత రెండేళ్ళతో పోలిస్తే సెట్ రాసిన వారి సంఖ్య పెరిగింది. కానీ అర్హత శాతం తగ్గింది. గత ఏడాది (2023) 3,01,789 మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. 2,48,814 (86.31%) మంది అర్హత సాధించారు. ఈ ఏడాది (2024) 3,32,251 మంది రాస్తే, ఇందులో 2,62,587 (74.98%) మంది అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కనీస అర్హత మార్కులు లేకపోవడంతో రాసిన అందరూ అర్హులయ్యారు. ఆన్లైన్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ రాష్ట్ర ఈఏపీ సెట్ ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించడం అభినందనీయమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడకుండా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే కాలేజీలపై చర్య తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఆన్లైన్ విధానం ద్వారా ఈ సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా, తల్లి హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగా. –సతివాడ జ్యోతిరాదిత్య, ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్)ఐఐటీ బాంబేలో చదవడమే లక్ష్యం.. మా స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – గొల్లలేఖ హర్ష, సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్) బాంబే ఐఐటీలో సీఎస్ఈ లక్ష్యంప్రతిరోజు 10 గంటల పాటు చదివేవాడిని. తండ్రి బి.రామసుబ్బారెడ్డి, తల్లి వి.రాజేశ్వరి ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. మాది ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని. ఇంజనీరింగ్‌లో 4వ ర్యాంకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే నా లక్ష్యం. – సందేశ్, 4వ ర్యాంకు, ఇంజనీరింగ్, హైదరాబాద్ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా మాది ఏపీలోని కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదవాలనుకుంటున్నా. – మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి, ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్)నాన్నలాగే అవ్వాలని అనుకుంటున్నా.. రోజుకు 16 గంటలు చదువుతున్నా. రాబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటి ఐఐటీ బాంబేలో సీటు సాధిస్తా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అవుతా. మెయిన్స్‌లో 5వ ర్యాంకు వచ్చింది. ఈఏపీ సెట్లో ర్యాంకు రావడంతో ఆనందంగా ఉంది. నా తండ్రి అనిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. దీంతో నాన్నలాగే అవ్వాలని చిన్నప్పట్నుంచీ అనుకునేవాడిని. తల్లి మమత ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. – విదిత్, 7వ ర్యాంక్, ఇంజనీరింగ్ (మణికొండ) తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణంతండ్రి రాజేశ్వరరావు పబ్బ, తల్లి లావణ్య పబ్బ, అక్క మానస పబ్బల సహకారం, ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించా. బాంబే ఐఐటీలో సీటు సాధించి గొప్ప ఇంజనీర్‌ను కావడమే నా లక్ష్యం. – పబ్బ రోహన్ సాయి, 8వ ర్యాంకు, ఇంజనీరింగ్ (ఎల్లారెడ్డిగూడ) అమ్మా నాన్నల ఆశలు నెరవేరుస్తామంచి కళాశాలలో బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్‌లో అధ్యాపకుల బోధన, కోచింగ్‌తోనే ఉత్తమ ర్యాంకు సాధించా. ముఖ్యంగా మా చదువు కోసమే అమ్మా నాన్న ఊరు విడిచి హైదరాబాద్‌కు వచ్చారు. వారు పడుతున్న కష్టాలు రోజూ చూస్తున్నా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మా తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తా. వారి ఆశలు నెరవేరుస్తా.–కొంతం మణితేజ, 9వ ర్యాంకు, ఇంజనీరింగ్, వరంగల్తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ర్యాంకులు మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మా నాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహమే ర్యాంకులకు కారణం. –ధనుకొండ శ్రీనిధి, పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) గుండె వైద్య నిపుణురాలినవుతా.. మాది ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్‌గా, తల్లి కళ్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగి్నజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్‌గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష. – ఆలూరు ప్రణీత, ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) నా కష్టం ఫలించింది.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మా నాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. – నగుడసారి రాధాకృష్ణ, సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) డాక్టర్ కావడమే లక్ష్యంమధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ మా అమ్మానాన్న నా చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డాక్టర్ కావాలన్న నా ఆకాంక్షను గుర్తించి హైదరాబాద్‌లోని కాలేజీలో చేర్పించారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా చదువుపైనే దృష్టి పెట్టా. నీట్ పరీక్ష బాగా రాశా. – గడ్డం శ్రీవర్షిణి, 3వ ర్యాంకు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (హనుమకొండ)వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానా తల్లిదండ్రులు ఎండీ జమాలుద్దీన్, నుస్రత్ ఖాన్లు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదగడమే నా లక్ష్యం. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తా. కరోనా కష్ట కాలంలో అన్ని రంగాలూ కుదేలైనా వ్యవసాయ రంగమే మన దేశాన్ని ఆదుకుంది.– అజాన్ సాద్, 6వ ర్యాంకు, అగ్రికల్చర్ ఫార్మసీ (నాచారం)వైద్య వృత్తి అంటే ఇష్టంనా తల్లిదండ్రులు జయశెట్టి సూర్యకాంత్, భాగ్యలక్ష్మి. నాకు వైద్య వృత్తిపై ఆసక్తి ఎక్కువ. సేవ చేయాలనే తపనతో నీట్ పరీక్ష రాశా. దాంతో పాటు ఈఏపీ సెట్ కూడా రాశా. ఈఏపీలో మంచి ర్యాంకు వచ్చింది. అదే విధంగా త్వరలో రానున్న నీట్ ఫలితాల్లో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని ఆశిస్తున్నా. – ఆదిత్య జయశెట్టి, 9వ ర్యాంకు, అగ్రి ఫార్మసీ (కూకట్పల్లి) -
TS: పదో తరగతి పరీక్షలు ప్రారంభం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను పరీక్ష సమయానికి సెంటర్లోకి అనుమతించారు. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఇక, ఏప్రిల్ రెండో తేదీ వరకూ జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. అయితే ఈనెల 26, 27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే ఉంటాయి. నిర్ణీత పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే డీఈవోలకు, సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది వరంగల్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో.. ఈసారి పరీక్ష కేంద్రాల సిబ్బందితో పాటు, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్స్ కూడా ఫోన్లను బయటపెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులను స్వీకరించననున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 17 నుంచి 31 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరపనున్నారు ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. -
ఏపీ డిజిటల్ విద్యకు ప్రశంసల వెల్లువ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ఎన్సీఈఆర్టీ మరోసారి ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు ఏపీ విధానాలను అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా ఐఎఫ్‌పీల ద్వారా డిజిటల్ బోధన, ట్యాబ్‌ల వినియోగం, విద్యార్థుల ట్రాకింగ్, జగనన్న గోరుముద్ద యాప్, విద్యా సమీక్ష కేంద్రాల పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సమీక్ష కేంద్రాల(వీఎస్కే) పనితీరుపై గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రెండు రోజులు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ(సీఐఈటీ) ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనరేట్ ఐటీ విభాగం అధికారి రమేష్‌కుమార్, విద్యా సమీక్ష కేంద్రాల సూపర్వైజర్ రమ్యశ్రీ, సమగ్ర శిక్ష నుంచి శ్రీదీప్ హాజరై రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న డిజిటల్ విధానాలు, వీఎస్‌కేల పనితీరును వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో యాప్ ద్వారా లెక్కించడం, ఆన్లైన్ విధానంలో విద్యార్థుల హాజరు, ట్రాకింగ్ చేయడం వంటివి వివరిండంతో ఎన్సీఈఆర్టీ ప్రశంసించింది. ఐఎఫ్‌పీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2డి, 3డీల్‌లో పాఠాలు బోధించడం అద్భుతమని సీఐఈటీ జాయింట్ డైరెక్టర్ అమరేంద్ర బెహరా కితాబిచ్చారు. విద్యా సమీక్ష కేంద్రాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుందని, అక్కడి విధానాలను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాలని సూచించారు. ఏపీలో వీఎస్కే పనితీరు ఇలా.. ♦ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన విజయవాడ, విశాఖపట్నంలలో విద్యా సమీక్ష కేంద్రాలు(వీఎస్కే) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 58,465 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 70,70,143 మంది విద్యార్థుల హాజరును ప్రతిరోజు ట్రాక్ చేస్తున్నారు. ♦ ప్రతిరోజు ఉదయం విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వెంటనే ఎంతమంది గోరుముద్ద స్వీకరిస్తారు, ఎవరెవరు కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ తీసుకుంటారనే వివరాలు సైతం ‘ఏఐ’ టెక్నాలజీ అటెండెన్స్ యాప్‌లో నమోదవుతున్నాయి. ♦ ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నేషన్ సైతం ఇదే తరహాలో ఉదయం 9 నుంచి 9.15 గంటల మధ్య స్కూలు పరిధిలోనే ఫొటోతో నమోదు చేస్తున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా సిగ్నల్ వచ్చినప్పుడు టైమ్‌తో సహా అప్డేట్ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. ఆ వెంటనే ‘స్కూల్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం’(సిమ్స్)లో నమోదై, ఉదయం 11– 12 గంటల్లోగా విజయవాడ, విశాఖల్లోని విద్యా సమీక్ష కేంద్రాలకు చేరుతాయి. ♦ ఈ టెక్నాలజీ రాకతో గతంలో రోజుకు 68 శాతం కంటే తక్కువగా ఉన్న హాజరు... ఇప్పుడు 99 శాతం పైగా నమోదవుతోంది. ♦ విద్యార్థి ఒక్కరోజు స్కూలుకు రాకపోతే తల్లిదండ్రులకు, వరుసగా మూడురోజులు రాకపోతే విద్యార్థి ఇంటి పరిధిలోని వలంటీర్‌కు, నాలుగు రోజులు హాజరుకాకపోతే గ్రామ, వార్డు సంక్షేమ కార్యదర్శికి, ఎంఈవో, డీఈవోలకు సమాచారం అందుతుంది. వారు కారణాలను తెలుసుకుని ఆ వివరాలను యాప్‌లో నమోదు చేసి సమస్యకు పరిష్కారం చూపించాలి. ♦ ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది సిబ్బంది, జోన్‌కు ఒక్కరు చొప్పున నలుగురు పర్యవేక్షకులు ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండి, ఆరోజు అంశాలను అదేరోజు పరిష్కరిస్తున్నారు. ♦ విజయవాడ సెంటర్ నుంచి టీచర్స్ అటెండెన్స్, గోరుముద్ద, బైజూస్, అకడమిక్ అంశాలను, విశాఖపట్నం కేంద్రం ద్వారా విద్యార్థుల హాజరు, కన్‌స్టెన్ రిథమ్(నాడు–నేడు), జేవీకే, డీబీటీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ♦ డిజిటల్ టెక్నాలజీని అత్యంత పకడ్బందీగా వినియోగిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది, ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దృష్టిని ఆకర్షించింది. -
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
పదోన్నతులకు టెట్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. వీలైనంత త్వరగా డిపార్ట్మెంటల్ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు. ఎప్పుడో చెప్పిన కేంద్రం ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి అంతర్గతంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్ లోపు ఈ తరహా టెట్ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. -
నడుస్తున్న చరిత్ర!
పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది. అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ అయిన సీఐ ఐజాక్ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. ‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్ ‘భారత్’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్ భారత్’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది. అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్ ఐజాక్ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్ దీక్షిత్ సారథ్యంలోని కమిటీని కోరారు. దీక్షిత్ సాక్షాత్తూ ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్ డైరెక్టర్ జనరల్. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్‌శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్‌కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు. చంద్రయాన్–3, నారీ శక్తి వందన్, కోవిడ్ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు! -
ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: విద్యా శాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ‘‘బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్‌కి ఒక రూపాయి చెల్లించలేదు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ నిప్పులు చెరిగారు. టోఫెల్లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్‌కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు. 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టింది. ఆ టెస్ట్‌లో పాస్ అయిన వారికి మాత్రమే టెస్ట్‌కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్ టెస్ట్‌ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. చదవండి: బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ.. ‘‘డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోంది. ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుండి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించాం’’ అని మంత్రి వెల్లడించారు. -
బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బదిలీలను మాత్రం యథా విధిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అయితే గతంలో వెల్లడించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధి కారులకు ఆదేశించారు. బదిలీల కోసం టీచర్ల నుంచి అందిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పు లను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలి పారు. ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్లు బదిలీ కావా ల్సిన పాఠశాలల వివరాలతో వెబ్ ఆప్షన్లు ఇవ్వా లని, వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యా యులకు అందించాలని స్పష్టం చేశారు. టెట్ తెచ్చిన తిప్పలు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గత నెల ఒకటవ తేదీన విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలు గుర్తించి, వాటిని స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదే క్రమంలో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను గుర్తించి, ఎస్జీటీల ద్వారా 70 శాతం నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకూ వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్–2 పరిధిలోని ప్రమోషన్లు తొలుత నిలిపివేశారు. ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. కానీ రాష్ట్రంలో టెట్ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైన టీచర్లకు టెట్ అర్హత ఉండే ఆస్కారం లేదనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్‌లో కొనసాగడానికేనని, పదోన్నతులకు టెట్ ఉండాలన్న వాదనను కోర్టు సమర్థించింది. ప్రమోషన్లపై స్టే ఇచ్చింది. న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని భావించిన అధికారులు, ప్రమోషన్ల అంశాన్ని పక్కనబెట్టేశారు. రిలీవర్ వస్తేనే స్థాన చలనం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారి సంఖ్య 40 వేలకుపైనే ఉంటుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే 58 వేల మందికి బదిలీకి ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుడికి బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఉంటేనే రిలీవ్ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. అంటే రిలీవ్ అయ్యే టీచర్ బోధించే సబ్జెక్టుకు సంబంధించిన మరో టీచర్ బదిలీపై వస్తేనే ప్రస్తుతం ఉన్న టీచర్‌ను రిలీవ్ చేయాలని ఆదేశించారు. దీంతో 58 వేల మంది టీచర్ల బదిలీకి ఆస్కారమున్నా, 25 వేల మందికి మించి స్థాన చలనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం.. టీచర్ 8 ఏళ్ళు, హెచ్ఎం 5 ఏళ్ళు ఒకేచోట ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట కనీసం రెండేళ్ళుగా పనిచేస్తున్న టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. -
Fact Check: చదువులపై ‘చెత్త’ రాతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యనందించడాన్ని పచ్చ పత్రికలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అసత్య కథనాలతో పదే పదే విషం చిమ్ముతున్నాయి. స్కిల్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు మాయం చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలు కావడంతో దిక్కుతోచని పచ్చ పత్రికలు మరోమారు బడుగుల చదువులపై పడ్డాయి. చంద్రబాబు దోపిడీ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బుధవారం ఓ పచ్చపత్రిక బైజూస్‌కు లేని టెండర్ సీమెన్స్‌కు కావాలా? అంటూ అర్థంపర్థం లేని వార్తను ప్రచురించించి. ఇది పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని, కేవలం ప్రజలను తప్పుదోవపట్టించేందుకే ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సీమెన్స్ సంస్థతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. ముందస్తుగానే వందల కోట్లు చెల్లించేసింది. ఇందులోనే అసలు మతలబు తెలిసిసోతోంది. ఈ వ్యవహారంతో తమకు ఏ సంబంధం లేదని సీమెన్స్ సంస్థ కూడా స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పేద పిల్లల అభ్యున్నతికి బైజూస్ కంటెంట్ అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించింది. బైజూస్‌తో ఒప్పందం చేసుకొని మరీ ఆ సంస్థ కంటెంట్‌ను పిల్లలకు అందిస్తోంది. పైగా, బైజూస్‌కు ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. వందల కోట్ల విలువైన కంటెంట్‌ను బైజూస్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది. ఎటువంటి ఒప్పందం లేకుండా జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి.., పూర్తి పారదర్శకంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకొని, పూర్తి ఉచితంగా అందిస్తున్న విద్యా సేవకు లింకు పెట్టి పచ్చపత్రిక కథనాన్ని ఇవ్వడాన్ని విద్యా శాఖ ఖండించింది. అసలు వాస్తవాలను విద్యా శాఖ వెల్లడించింది. ♦ బైజూస్ సంస్థతో చేసుకున్న ఎంవోయూ ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో 4 నుంచి 10వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్ యాప్‌ను వారి సొంత మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఉచితంగా యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంచారు. ♦ దీనికోసం బైజూస్‌కి ప్రభుత్వం ఎటువంటి డబ్బు చెల్లించలేదు. ♦ 8వ తరగతి చదివే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు బహిరంగ, పారదర్శక బిడ్డింగ్ ద్వారా శామ్సంగ్ కంపెనీ నుండి ట్యాబ్‌లను ప్రభుత్వం సేకరించింది. ♦ దీనిలో బైజూస్ పాత్ర ఏమీ లేదు. ఈ శామ్సంగ్ ట్యాబ్ ఎస్డీ కార్డ్‌లో కంటెంట్‌ను లోడ్ చేసినందుకు బైజూస్‌కు శామ్సంగ్ సంస్థే లేబర్ ఛార్జీలను చెల్లించింది. ♦ ఇది బైజూస్, శామ్సంగ్ హార్డ్‌వేర్ తయారీదారుల మధ్య అంతర్గత ఏర్పాటు. కాబట్టి ప్రభుత్వం, బైజూస్ మధ్య ఎటువంటి డబ్బుల ఒప్పందం లేదు. ♦ బడి పిల్లలకు కోర్సుకు రూ. 15,000 చొప్పున 5.18 లక్షల మంది పిల్లలు కంటెంట్‌ని ఉచితంగా యాక్సెస్ చేస్తున్నారు. కాబట్టి దీని విలువ దాదాపు 750 కోట్లు ఉచితంగా అందజేసినట్లుగా భావించాలి. ♦ అంతేకాకుండా 4 నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థులు 17,59,786 మందికి రూ.12,000 విలువ చేసే కంటెంట్ విలువ మొత్తం రూ. 2,111.74 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కూడా రాష్ట్ర విద్యార్థులకు ఉచితంగా బైజూస్ అందించింది. -
విద్యపై ఖర్చు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడి
సాక్షి, విశాఖపట్నం: విద్యపై చేస్తున్న ఖర్చు మన రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ కుటుంబ సభ్యులేననీ, ప్రతి ఉద్యోగి ప్రభుత్వంలో అంతర్భాగమేనని వారిపై పనిఒత్తిడి తగ్గించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. విశ్వవిద్యాలయాల్లో 3,200 పోస్టుల భర్తీ రాష్ట్రంలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? కేవలం సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యమయ్యాయి. 7 లేదా 8 తేదీల్లో జీతాలు జమచేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ‘నో అడ్మిషన్’ బోర్డులు పెడుతున్నాం. అదేవిధంగా.. ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఎక్కువ స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులే దక్కించుకున్నారు. వీటన్నింటికీ కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇక విద్య మీద ఖర్చుచేసే ప్రతి రూపాయి రాష్ట్రం మీద పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. గత 15 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాల్లేవు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం 3,200 పోస్టులు భర్తీని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తాం. ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుంది.. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు విశాఖకు విడదీయలేని అనుబంధం ఉంది. సీఎం జగన్ న్యాయం చేయలేకపోతే ఉపాధ్యాయులకు మరెవ్వరూ మేలు చేయలేరు. ఒక రోజు అటు ఇటుగా అందరికీ న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ‘విద్యావ్యవస్థలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి పాఠశాలలను మెరుగుపరచేందుకు అనేక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది’ అన్నారు. ‘ప్రపంచ జ్ఞానం నేర్పే గురువులకు కృతజ్ఞతాభివందనాలు’ ‘బిడ్డ గొప్పగా ఎదిగితే.. ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆనందం.. ఆకాశాన్నంటుతుంది. వందలు.. వేల పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ప్రతి టీచర్‌కు లభించే సంతోషం, సంతృప్తి ఇంకెంత గొప్పదో మాటల్లో చెప్పలేం. శిక్షణ, క్రమశిక్షణ.. పాఠాలు, జీవిత పాఠాలు.. అక్షరజ్ఞానం, ఆలోచనలు.. ప్రపంచ జ్ఞానం అన్నీ నేర్పే గురుబ్రహ్మలకు, మేథోశక్తులకు ఆదర్శప్రాయులైన మంచి టీచర్లకు, రాష్ట్రం తరఫున కృతజ్ఞతాభివందనాలు. (విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ సందేశాన్ని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు చదివి వినిపించారు.) రాష్ట్రపతి, ప్రధాని సందేశాలు ఇక గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతిముర్ము సందేశాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి... ప్రధాని మోదీ సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చదివి వినిపించారు. అనంతరంరాష్ట్రవ్యాప్తంగా 11 కేటగిరీల్లో 196 మందికి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ డా.భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, విశాఖ మేయర్ జీహెచ్‌వీ కుమారి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నాగరాణి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ దిశగా మంగళవారం విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్‌గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్). -
100 శాతం జీఈఆర్.. తొలి మండలంగా తెనాలి అర్బన్
ఈ చిత్రంలోని బాలుడి పేరు.. ఆదిముళ్ల నాగచైతన్య. గుంటూరు జిల్లా తెనాలి ఇందిరానగర్ కాలనీలో ఇతడి కుటుంబం ఉంటోంది. ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్న మున్సిపల్ హైస్కూలులో ఐదో తరగతి చదువుతూ మధ్యలో మానేశాడు. చదువుపై ఆసక్తి లేదని చెప్పడంతో తల్లిదండ్రులూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సచివాలయం నుంచి ఒక విద్యా కార్యదర్శి వచ్చి పిల్లాడిని చదివించాలని వారికి నచ్చజెప్పారు. ఫీజులు కట్టలేమని చెబితే దగ్గర్లోని కాన్వెంటులో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పిల్లాడూ సరేనన్నాడు. ఇప్పుడు రోజూ కాన్వెంటుకు వెళుతున్నాడని బాలుడి తల్లి సౌజన్య సంతోషంతో చెబుతున్నారు. తెనాలి: బడి బయట ఉన్న పిల్లలను, మధ్యలో బడి మానేసినవారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 2005 సెప్టెంబర్ 1–2018 ఆగస్టు 31 మధ్య పుట్టినవారంతా సెప్టెంబర్ 4 నాటికి ఏదో ఒక స్కూల్/కాలేజీలో నమోదై ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైనా బడి/కాలేజీకి దూరంగా ఉంటే వారిని చేర్పించాలని ప్రభుత్వం.. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి అర్బన్ మండలం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించిన తొలి మండలంగా అవతరించింది. ఈ మండలంలో బడి బయట చదువుకు దూరంగా ఉన్న మొత్తం 935 మందిని పాఠశాల/కాలేజీలో చేర్పించారు. జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్.. గ్రామ/ వార్డు సచివాలయాల సహకారంతో పాఠశాల విద్యాశాఖ నూరు శాతం జీఈఆర్ సాధనకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో 47 సచివాలయాలు కలిగిన తెనాలి అర్బన్ మండలం 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోల పర్యవేక్షణలో వలంటీర్లు, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు ఇంటింటా సర్వేను ఒక ఉద్యమంలా చేపట్టారు. ఒక్కో సచివాలయం పరిధిలో వందలాదిమంది బడి ఈడు పిల్లల సమాచారాన్ని సేకరించారు. విద్యాశాఖ.. వార్డు/ గ్రామ వలంటీర్లకు అందజేసిన యాప్‌లో వారి వివరాలను పొందుపరిచారు. పదో తరగతిలోపు విద్యార్థులను వారు కోరుకున్న ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలకు పంపారు. స్థోమత లేని పేదింటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అందుకు ఇష్టపడని పిల్లలను తల్లిదండ్రుల అభిమతం ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలకు పంపారు. ఇంటర్ ఫెయిలైనవారు, మధ్యలో మానేసినవారిని కాలేజీ/ఐటీఐ/ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేర్చారు. మరికొందరిని వారు కోరినట్టుగా కోచింగ్ క్లాసులకు పంపారు. ఈ విధంగా తెనాలి అర్బన్ మండలంలో 935 మంది మళ్లీ బడి/కళాశాల బాటపట్టారు. కాగా అర్బన్ మండలంతోపాటు తెనాలి రూరల్ మండలం కూడా నూరు శాతం జీఈఆర్ లక్ష్యాన్ని సాధించింది. ఇక్కడ కూడా బడి బయట ఉన్నట్టు గుర్తించిన 355 మంది పిల్లలను బడి/కళాశాలల్లో చేర్పించారు. కోరిన పాఠశాలల్లోనే చేర్పించాం.. రాష్ట్రంలో నూరు శాతం జీఈఆర్ సాధించిన తొలి మండలంగా తెనాలి అర్బన్ నిలవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. అందరి సమన్వయంతో రూరల్ మండలంలోనూ ఈ లక్ష్యాన్ని సాధించాం. పిల్లలు, వారి తల్లిదండ్రులు కోరుకున్న విద్యాసంస్థల్లోనే చేర్పించాం. – మేకల లక్ష్మీనారాయణ, మండల విద్యాశాఖాధికారి, తెనాలి, గుంటూరు జిల్లా చాలా సంతృప్తిగా ఉంది.. కరోనా తర్వాత మైగ్రేషన్, డేటాలో వయసు తప్పు వంటి సాంకేతిక సమస్యలను అధిగమించి మా సచివాలయం పరిధిలో 563 మందిని సర్వే చేశాం. చదువుకు దూరంగా ఉన్న ఇద్దరు పేద పిల్లలను గుర్తించి వారిని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేర్పించాం. చాలా సంతృప్తిగా ఉంది. – గంగవరపు స్వాతి, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, 35వ సచివాలయం, తెనాలి, గుంటూరు జిల్లా -
6,612 టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆమె గురువారం ఎస్సీఈఆర్టీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, 1,523 పోస్టులు ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం నిర్దేశించినవి. వీటిని త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. 2017లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. దీనితో గతంలో నిర్వహించినట్టుగా డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టనున్నాం..’’ అని మంత్రి సబితారెడ్డి వివరించారు. 9,979 పోస్టులకు పదోన్నతులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. వీటిలో 1,03,343 పోస్టుల్లో టీచర్లు పనిచేస్తున్నారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 6,612 పోస్టులను భర్తీ చేస్తుండగా.. పదోన్నతుల ద్వారా మరో 9,979 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన కేటగిరీలో గెజిటెడ్ హెచ్ఎం ఖాళీలు 1,947 ఉన్నాయని, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు 2,162 ఉన్నాయని.. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతుతో వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎస్జీటీ టీచర్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 15న టెట్ డీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాలకు టెట్ కీలకమని.. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తామని సబితారెడ్డి ప్రకటించారు. టెట్ ఫలితాలను వచ్చేనెల 27వ తేదీన ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతోందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తక్షణమే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇటీవల కేజీబీవీల్లో 1,264 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని.. కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుతో మరో 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. వీటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా విద్యాశాఖలో 3,896 మందికి లబ్ధి చేకూరిందని, ఇందులో అత్యధికులు విద్యాశాఖ వారే ఉన్నారని మంత్రి చెప్పారు. గురుకుల విద్యాసంస్థల్లో కూడా పలువురు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. మొత్తంగా విద్యాశాఖ పరిధిలో 8,792 పోస్టులు, కాలేజీల్లో 3,149 పోస్టుల భర్తీ ప్రక్రియలు టీఎస్పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు. భర్తీ చేసే టీచర్ పోస్టులు ఇవీ.. మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు: 6,612 జనరల్ టీచర్లు: 5,089 వీరిలో స్కూల్ అసిస్టెంట్లు: 1,739 సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575 భాషా పండితులు: 611 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 164 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523 వీటిలో ప్రాథమిక స్థాయిలో 796 పోస్టులు – ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులు ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ’ ఇలా.. ప్రతి జిల్లాకు ఒక ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)’ ఉంటుంది. దీనికి సదరు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (జెడ్పీ సీఈఓ) వ్యవహరిస్తారు. గతంలో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది.