ఖమ్మం జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ సులువుగా అర్థం చేయించడం.. ఆపై మాట్లాడేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌తోపాటే విద్యార్థులు మాట్లాడేలా గతనెల 28 నుంచి జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నారు.
1,252 మంది విద్యార్థులకు లబ్ధి
జిల్లాలోని కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 16 పాఠశాలలను స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థులు 1,252 మంది ఉండగా.. 16 మంది టీచర్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానర్ (ఐఎప్‌పీ) డిజిటల్ బోర్డులున్న పాఠశాలలను ఎంపిక చేశారు.
హైదరాబాద్‌కి చెందిన భారత్ దేఖో, మంత్రా పర్ చేంజ్, అలోకిట్, శిక్షా లోక్ స్వచ్ఛంద సంస్థలు రోజూ 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈ పాఠశాలలకు ఆన్‌లైన్‌లో పంపిస్తుండగా.. వీడియో చూశాక మరో 15 నిమిషాలు విద్యార్థుల నడుమ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు.
వీడియోలోని బొమ్మలు, వాటి నడుమ సంభాషణ గుర్తుండి ఇంగ్లిష్ మాట్లాడటం సులువవుతుందని భావిస్తున్నారు. వీటిద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. 15 రోజులకోసారి సమీక్షిస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్ధికి ఇంగ్లిష్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్యార్థులకు మంచి అవకాశం
ఇంగ్లిష్ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఆడియో, వీడియోల ద్వారా పిల్లలు ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఇప్పటికే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడుతున్నారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలతో త్వరలోనే ఇంకొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం.
–జక్కంపూడి జగదీష్, జిల్లా కోఆర్డినేటర్, ఉయ్ కెన్ లెర్న్ ప్రోగ్రాం
ఇంగ్లిష్ అంటే భయం పోతోంది..
ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం తగ్గింది. కథల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడటం జరుగుతోంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు.
–బి.రామనాథం, టీచర్, జెడ్పీహెచ్‌ఎస్, చిన్న కోరుకొండి, కల్లూరు మండలం
చక్కగా నేర్చుకుంటున్నా..
ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.
– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, గుబ్బగుర్తి, కొణిజర్ల మండలం
కలెక్టర్ సార్‌కు ధన్యవాదాలు..
స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోగలుగుతున్నాం. రోజూ వినడం వల్ల కొంతకాలం తర్వాత మాట్లాడగలుగుతాం. మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ మొదలు పెట్టినందుకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సార్‌కు ధన్యవాదాలు.
–బి.దేవిక, 7వ తరగతి, జెడ్పీఎస్‌ఎస్, కల్లూరు, ఖమ్మం జిల్లా
త్వరలోనే 200 పాఠశాలల్లో..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్ మాట్లాడగలమనే విశ్వాసం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం 16 పాఠశాలలను ఎంపిక చేసినా త్వరలోనే 200 పాఠశాలలకు విస్తరిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాక డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు ఇంగ్లిష్‌లో రాణించలేక ప్రైవేట్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
– ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం జిల్లా
చక్కగా నేర్చుకుంటున్నా..
ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.
– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, కొణిజర్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment