
సమ్మర్‌లో సర్కారు స్పెషల్ టాస్క్
బడుల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రతి టీచర్‌కూ టార్గెట్
ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్
సర్విసు రికార్డులో చేర్చి పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యత
శిక్షణ కోసం విద్యాశాఖ వేసవి శిబిరాలు
కార్యాచరణ సిద్ధం.. జిల్లా అధికారులకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సమ్మర్‌లో సర్కారీ టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతోంది. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం ఇప్పటికే జరిగింది. ఇందులో భాగంగా ప్రతి టీచర్‌కూ విద్యార్థులను చేర్పించేందుకు టార్గెట్ పెడతారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారు. ఇవి వారి సర్విస్ రికార్డులోకి ఎక్కుతాయి. పదోన్నతులు, బదిలీల సమయంలో వీటిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు.
ఇక విద్యార్థుల కోసం క్షేత్రస్థాయికి వెళ్ళే టీచర్లకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఊరూరా ప్రచా రం చేపట్టాలని కూడా నిర్ణయించారు. వీటన్నింటికీ సిద్ధమవ్వాలని జిల్లా అధికారులకు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏటా వేసవిలో బడిబాట కార్యక్రమం చేపడుతున్నా..మొక్కుబడిగానే సాగు తోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చేరికలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఎందుకు తగ్గుతున్నారు?
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు రానురాను తగ్గుతున్నాయి. 2022–23లో 28.80 లక్షలు చేరితే, 2024–25 నాటికి ఈ సంఖ్య 25.13 లక్షలకు తగ్గింది. అంటే 3.5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారన్న మాట. మరోవైపు ప్రైవేటు స్కూళ్ళలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. 22–23లో 30.17 లక్షల మంది ఉంటే, 24–25లో ఈ సంఖ్య 37 లక్షలకు చేరింది. అంటే దాదాపుగా 7 లక్షలు పెరిగారు. ఈ పరిస్థితిపై విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది. దీనిపై ముఖ్యమంత్రి అధికారులతో ఇటీవల సమీక్షించారు. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది.
ప్రభుత్వ బడులపై విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఇందులో టీచర్లూ కీలక పాత్ర పోషించేలా చూడాలని సూచించింది. ఇంకోవైపు ‘ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తోంది. మౌలిక వసతులూ కల్పిస్తున్నాం. ప్రైవేటు కన్నా, ప్రభుత్వ స్కూళ్ళలోనే అర్హత గల టీచర్లున్నారు. అయినా పిల్లలెందుకు చేరడం లేదు?’అని సీఎం అనేకసార్లు విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చేరికలను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లల చేరికలు పెరిగేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.