spoken english classes
-
మేమూ ఇంగ్లిష్‌లో మాట్లాడతాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ సులువుగా అర్థం చేయించడం.. ఆపై మాట్లాడేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్తోపాటే విద్యార్థులు మాట్లాడేలా గతనెల 28 నుంచి జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నారు. 1,252 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలోని కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 16 పాఠశాలలను స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థులు 1,252 మంది ఉండగా.. 16 మంది టీచర్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానర్ (ఐఎప్పీ) డిజిటల్ బోర్డులున్న పాఠశాలలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌కి చెందిన భారత్ దేఖో, మంత్రా పర్ చేంజ్, అలోకిట్, శిక్షా లోక్ స్వచ్ఛంద సంస్థలు రోజూ 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈ పాఠశాలలకు ఆన్లైన్లో పంపిస్తుండగా.. వీడియో చూశాక మరో 15 నిమిషాలు విద్యార్థుల నడుమ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు. వీడియోలోని బొమ్మలు, వాటి నడుమ సంభాషణ గుర్తుండి ఇంగ్లిష్ మాట్లాడటం సులువవుతుందని భావిస్తున్నారు. వీటిద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. 15 రోజులకోసారి సమీక్షిస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్ధికి ఇంగ్లిష్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు మంచి అవకాశం ఇంగ్లిష్ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఆడియో, వీడియోల ద్వారా పిల్లలు ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఇప్పటికే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడుతున్నారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలతో త్వరలోనే ఇంకొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం. –జక్కంపూడి జగదీష్, జిల్లా కోఆర్డినేటర్, ఉయ్ కెన్ లెర్న్ ప్రోగ్రాం ఇంగ్లిష్ అంటే భయం పోతోంది.. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం తగ్గింది. కథల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడటం జరుగుతోంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు. –బి.రామనాథం, టీచర్, జెడ్పీహెచ్ఎస్, చిన్న కోరుకొండి, కల్లూరు మండలం చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. – డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గుబ్బగుర్తి, కొణిజర్ల మండలం కలెక్టర్ సార్‌కు ధన్యవాదాలు.. స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోగలుగుతున్నాం. రోజూ వినడం వల్ల కొంతకాలం తర్వాత మాట్లాడగలుగుతాం. మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ మొదలు పెట్టినందుకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సార్‌కు ధన్యవాదాలు. –బి.దేవిక, 7వ తరగతి, జెడ్పీఎస్ఎస్, కల్లూరు, ఖమ్మం జిల్లా త్వరలోనే 200 పాఠశాలల్లో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్ మాట్లాడగలమనే విశ్వాసం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం 16 పాఠశాలలను ఎంపిక చేసినా త్వరలోనే 200 పాఠశాలలకు విస్తరిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాక డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు ఇంగ్లిష్‌లో రాణించలేక ప్రైవేట్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం జిల్లా చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కొణిజర్ల మండలం -
AP: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడేలా విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. 26 జిల్లాల్లో తొలి దశలో భాగంగా జిల్లాకు 5 హైస్కూళ్లను ఎంపిక చేసి ప్రత్యేక ‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనుంది. సాధారణ తరగతులతో పాటే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ నేర్పిస్తారు. బెండపూడి.. నిడమానూరులో సక్సెస్ తూర్పుగోదావరి జిల్లాలోని బెండపూడి, గన్నవరం సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చిన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణతో అద్భుత ఫలితాలొచ్చాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. (క్లిక్: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
ఓయూలో 14 నుంచి సెల్ట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెనింగ్ సెంటర్ (సెల్ట్)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్ డాక్టర్ సవీన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. న్యాయశాస్త్రం పీహెచ్డీ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ న్యాయశాస్త్రంతో పాటు గణితం, జియోలజీ పీహెచ్డీ కోర్సుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. అక్టోబరులో జరిగిన వివిధ పీహెచ్డీ కోర్సుల పార్టువన్ (కోర్సు వర్క్) పరీక్ష ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఓయూ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఓయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, బీకాం ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలను వెబ్సైట్లో చూడవచ్చు. -
ఆంగ్లమూ అనర్గళంగా..ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యార్థులకు సరిగా బోధన అందించేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దాలని.. అందుకోసం వారికి ఆంగ్లభాషలో పట్టుపెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతస్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు టీచర్లు కూడా.. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని గుర్తించారు. ఆంగ్ల భాషలో బోధనకు అవసరమైన సామర్థ్యం పెంచుకునేందుకు సంసిద్ధమయ్యారు. విద్యాశాఖ అంతర్గత సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.02 లక్షల మంది టీచర్లు ఉండగా.. అందులో 10 శాతమే ఆంగ్ల మీడియంలో చదువుకున్న వారున్నారు. మరో 15% సొంతంగా ఆ భాషను నేర్చుకున్నట్టు గుర్తించారు. మిగతా 75 % మందికి ఆంగ్ల భాషపై పట్టు పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట స్పోకెన్ ఇంగ్లిష్తో.. విద్యార్థికి ఇంగ్లిష్ మీడియంలో బోధించే స్థాయిలో ఉపాధ్యాయుడికి ఏ తరహా శిక్షణ కావాలనే దానిపై కొందరు టీచర్లు తమ అనుభవాలను వెలిబుచ్చారు. ఇంగ్లిష్‌లో బోధించే సామర్థ్యమున్నా.. దానికి మెరుగులు దిద్దే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చిత్తశుద్ధితో శిక్షణ అందిస్తే.. అంతే నిబద్ధతతో నేర్చుకుంటామని అంటున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనతో సక్సెస్ స్కూళ్లను పెట్టినప్పుడు కేవలం 13 రోజులే శిక్షణ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి చాలా మంది తెలుగు మీడియంలో చదువుకున్నా.. తర్వాత అవసరాల రీత్యా ఇంగ్లిష్ భాషపై పట్టుపెంచుకున్నారు. కానీ ఇంగ్లిష్‌లో మాట్లాడే సామర్థ్యం మాత్రం తక్కువ. ఈ నేపథ్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పాలని, భయాన్ని పోగొట్టేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మొక్కుబడిగా కాకుండా.. ప్రాక్టికల్ క్లాసులు ఉండాలంటున్నారు. సాధారణంగా క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు, టీచర్లు పరస్పరం ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంభాషణ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే సాగేలా ఉండాలని టీచర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ స్థాయికి ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తర్వాత కూడా భాషపై పట్టు పెంచుకునేందుకు పాఠశాలల్లో ఇంగ్లిష్ రిఫరెన్స్ బుక్స్, లాంగ్వేజ్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆసక్తి ఉన్నవారితో శిక్షణ శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ కొంతమంది సుశిక్షితులను ఎంపిక చేస్తుంది. కానీ గతంలో ఈ విషయంగా పొరపాట్లు జరిగాయని ఉపాధ్యాయులు అంటున్నారు. శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్లను వారి సమ్మతి లేకుండా ఎంపిక చేశారని.. వారు టీచర్లను సన్నద్ధం చేయడం కన్నా, ఏవో కొన్ని క్లాసులు చెప్పి వెళ్లారనే విమర్శలున్నాయి. ఇప్పుడైనా శిక్షణ ఇవ్వడంలో ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయాలని టీచర్లు కోరుతున్నారు. పదాలపై పట్టు ముఖ్యం ఇంగ్లిష్‌లో బోధించేప్పుడు సమాంతర పదాలు చాలా తెలియాలి. ఉదాహరణకు వెన్నెముక ప్రాణులు– వెన్నెముక లేని ప్రాణులను ఇంగ్లిష్‌లో ‘వర్టిబ్రే.. ఇన్ వర్టిబ్రే’అంటారు. కేవలం స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటే ఇలాంటి వాటిపై అవగాహన ఉండదు. అందువల్ల పదాలపై పట్టు సాధించాలి. నిరంతర అధ్యయనం వల్లే ఉపాధ్యాయుడికి సాధ్యం. మహాసముద్రాలు అనే పదాన్ని ఇప్పటికీ ఓషన్స్ అని చెప్పకుండా లార్జ్ బాడీస్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నారు. కాబట్టి టీచర్లకు పదాలపై పట్టు పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – చెరుకు ప్రద్యుమ్నకుమార్, ప్రభుత్వ ఇంగ్లి్లష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్ టీచర్లలో భయం తొలగించాలి నేను ఎస్జీటీగా ఉన్నప్పుడు రిసోర్స్ పర్సన్‌గా పనిచేశాను. టీచర్లకు శిక్షణ ఇచ్చేప్పుడు తాము ఇంగ్లిష్ నేర్చుకున్నా.. బోధించగలమా? అనే భయం కనిపించేది. ఇది శిక్షణ ఇవ్వడంతోనే తొలగిపోదు. ప్రాక్టికల్ క్లాసుల ద్వారా ఈ భయాన్ని పోగొట్టాలి. శిక్షణ ఇచ్చేప్పుడు పరస్పర సంభాషణ తరగతులు ఎక్కువగా ఉండాలి. మోడల్ క్లాసులు నిర్వహిస్తే ఏ టీచర్ అయినా బోధించే మెళకువలు తెలుసుకోవడం కష్టమేమీ కాదు. మొదట 15 రోజులు.. కొన్నాళ్ళ విరామం తర్వాత మరో 15 రోజులు.. కలిపి కనీసం నెల రోజుల శిక్షణ ఉండాలి. – కలకుంట్ల రాజేశ్వర్‌రావు, బయో సైన్స్ టీచర్, మాజీ రిసోర్స్ పర్సన్, జిల్లెల్ల, రాజన్న సిరిసిల్ల మెళకువలను నిద్రలేపితే చాలు పూర్తిగా తెలుగు మీడియంలో చదువుకున్నా డిగ్రీ వరకూ ఇంగ్లిష్ సబ్జెక్టు ఉండేది. ప్రతీ టీచర్ పిల్లల కోసమో, సమాజంలో గౌరవం కోసమో ఇంగ్లిష్‌పై అవగాహన పెంచుకున్నారు. కాకపోతే స్కూళ్లలో తెలుగు మీడియమే ఉండటం వల్ల ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోతున్నాం. స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తే.. ఏడాదిలోనే మాకు మేం గ్రామర్ కూడా నేర్చుకుంటాం. కొంతకాలం బోధనకు ముందే టీచర్ ఇంటి దగ్గర పాఠం ప్రిపేరవ్వాల్సి వస్తుంది. – పణితి రామనాథం, స్కూల్ అసిస్టెంట్, మోరంపల్లి బంజర్, బూర్గంపహాడ్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం -
22 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ బ్యాచ్‌లు
- సాక్షి ఎడ్జ్, పనాచె ఆధ్వర్యంలో 30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గంగా మాట్లాడేందుకు ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్‌లు జూన్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 30 రోజుల ఈ కోర్సులో ఆంగ్లంలో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛారణ తదితరాలను క్షుణ్నంగా నేర్పుతారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తరగతులు ఉంటా యి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఫీజు రూ.4,600. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600, నంబర్లలో గానీ, sakshiedge@gm ail.com మెయిల్ ద్వారా గానీ ‘సాక్షి ఎడ్జ్, 8-2.696, కార్మెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్’ చిరునామాలో గానీ సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్లు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతాయి. -
రామకృష్ణమఠ్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు
రామకృష్ణమఠ్‌లో సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీనిలో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు 50 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు పదోతరగతి ఒరిజినల్ సర్టిఫికెట్, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు చూపి దరఖాస్తు పొందొచ్చు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి. వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో రామకృష్ణమఠ్ ప్రాంగణంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు రుసుం రూ.100, అడ్మిషన్ ఫీజు రూ. 800. మరిన్ని వివరాలకు 040-27635545 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. www.rkmath.org చూడొచ్చు.