ఆంగ్లమూ అనర్గళంగా..ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల శిక్షణ | Telangana Govt Focusing On Spoken English Classes For Govt School Teachers | Sakshi
Sakshi News home page

ఆంగ్లమూ అనర్గళంగా..ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల శిక్షణ

Published Sun, Jan 23 2022 3:36 AM | Last Updated on Sun, Jan 23 2022 3:38 AM

Telangana Govt Focusing On Spoken English Classes For Govt School Teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యా బోధనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యార్థులకు సరిగా బోధన అందించేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దాలని.. అందుకోసం వారికి ఆంగ్లభాషలో పట్టుపెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతస్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు టీచర్లు కూడా.. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్‌కు మంచి భవిష్యత్‌ ఉంటుందని గుర్తించారు. ఆంగ్ల భాషలో బోధనకు అవసరమైన సామర్థ్యం పెంచుకునేందుకు సంసిద్ధమయ్యారు. విద్యాశాఖ అంతర్గత సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.02 లక్షల మంది టీచర్లు ఉండగా.. అందులో 10 శాతమే ఆంగ్ల మీడియంలో చదువుకున్న వారున్నారు. మరో 15% సొంతంగా ఆ భాషను నేర్చుకున్నట్టు గుర్తించారు. మిగతా 75 % మందికి ఆంగ్ల భాషపై పట్టు పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. 

మొదట స్పోకెన్‌ ఇంగ్లిష్‌తో.. 
విద్యార్థికి ఇంగ్లిష్‌ మీడియంలో బోధించే స్థాయిలో ఉపాధ్యాయుడికి ఏ తరహా శిక్షణ కావాలనే దానిపై కొందరు టీచర్లు తమ అనుభవాలను వెలిబుచ్చారు. ఇంగ్లిష్‌లో బోధించే సామర్థ్యమున్నా.. దానికి మెరుగులు దిద్దే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చిత్తశుద్ధితో శిక్షణ అందిస్తే.. అంతే నిబద్ధతతో నేర్చుకుంటామని అంటున్నారు. ఇంగ్లిష్‌ మీడియం బోధనతో సక్సెస్‌ స్కూళ్లను పెట్టినప్పుడు కేవలం 13 రోజులే శిక్షణ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 
     నిజానికి చాలా మంది తెలుగు మీడియంలో చదువుకున్నా.. తర్వాత అవసరాల రీత్యా ఇంగ్లిష్‌ భాషపై పట్టుపెంచుకున్నారు. కానీ ఇంగ్లిష్‌లో మాట్లాడే సామర్థ్యం మాత్రం తక్కువ. ఈ నేపథ్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పాలని, భయాన్ని పోగొట్టేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మొక్కుబడిగా కాకుండా.. ప్రాక్టికల్‌ క్లాసులు ఉండాలంటున్నారు. 
     సాధారణంగా క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు, టీచర్లు పరస్పరం ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంభాషణ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే సాగేలా ఉండాలని టీచర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ స్థాయికి ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ తర్వాత కూడా భాషపై పట్టు పెంచుకునేందుకు పాఠశాలల్లో ఇంగ్లిష్‌ రిఫరెన్స్‌ బుక్స్, లాంగ్వేజ్‌ లైబ్రరీ, డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 
ఆసక్తి ఉన్నవారితో శిక్షణ 
శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ కొంతమంది సుశిక్షితులను ఎంపిక చేస్తుంది. కానీ గతంలో ఈ విషయంగా పొరపాట్లు జరిగాయని ఉపాధ్యాయులు అంటున్నారు. శిక్షణ ఇచ్చే రిసోర్స్‌ పర్సన్లను వారి సమ్మతి లేకుండా ఎంపిక చేశారని.. వారు టీచర్లను సన్నద్ధం చేయడం కన్నా, ఏవో కొన్ని క్లాసులు చెప్పి వెళ్లారనే విమర్శలున్నాయి. ఇప్పుడైనా శిక్షణ ఇవ్వడంలో ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయాలని టీచర్లు కోరుతున్నారు. 

పదాలపై పట్టు ముఖ్యం 
ఇంగ్లిష్‌లో బోధించేప్పుడు సమాంతర పదాలు చాలా తెలియాలి. ఉదాహరణకు వెన్నెముక ప్రాణులు– వెన్నెముక లేని ప్రాణులను ఇంగ్లిష్‌లో ‘వర్టిబ్రే.. ఇన్‌ వర్టిబ్రే’అంటారు. కేవలం స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్చుకుంటే ఇలాంటి వాటిపై అవగాహన ఉండదు. అందువల్ల పదాలపై పట్టు సాధించాలి. నిరంతర అధ్యయనం వల్లే ఉపాధ్యాయుడికి సాధ్యం. మహాసముద్రాలు అనే పదాన్ని ఇప్పటికీ ఓషన్స్‌ అని చెప్పకుండా లార్జ్‌ బాడీస్‌ ఆఫ్‌ వాటర్‌ అని చెప్తున్నారు. కాబట్టి టీచర్లకు పదాలపై పట్టు పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 
– చెరుకు ప్రద్యుమ్నకుమార్, ప్రభుత్వ ఇంగ్లి్లష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ సెంటర్, కరీంనగర్‌ 


టీచర్లలో భయం తొలగించాలి 
నేను ఎస్జీటీగా ఉన్నప్పుడు రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేశాను. టీచర్లకు శిక్షణ ఇచ్చేప్పుడు తాము ఇంగ్లిష్‌ నేర్చుకున్నా.. బోధించగలమా? అనే భయం కనిపించేది. ఇది శిక్షణ ఇవ్వడంతోనే తొలగిపోదు. ప్రాక్టికల్‌ క్లాసుల ద్వారా ఈ భయాన్ని పోగొట్టాలి. శిక్షణ ఇచ్చేప్పుడు పరస్పర సంభాషణ తరగతులు ఎక్కువగా ఉండాలి. మోడల్‌ క్లాసులు నిర్వహిస్తే ఏ టీచర్‌ అయినా బోధించే మెళకువలు తెలుసుకోవడం కష్టమేమీ కాదు. మొదట 15 రోజులు.. కొన్నాళ్ళ విరామం తర్వాత మరో 15 రోజులు.. కలిపి కనీసం నెల రోజుల శిక్షణ ఉండాలి.  
– కలకుంట్ల రాజేశ్వర్‌రావు, బయో సైన్స్‌ టీచర్, మాజీ రిసోర్స్‌ పర్సన్, జిల్లెల్ల, రాజన్న సిరిసిల్ల 

మెళకువలను నిద్రలేపితే చాలు 
పూర్తిగా తెలుగు మీడియంలో చదువుకున్నా డిగ్రీ వరకూ ఇంగ్లిష్‌ సబ్జెక్టు ఉండేది. ప్రతీ టీచర్‌ పిల్లల కోసమో, సమాజంలో గౌరవం కోసమో ఇంగ్లిష్‌పై అవగాహన పెంచుకున్నారు. కాకపోతే స్కూళ్లలో తెలుగు మీడియమే ఉండటం వల్ల ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోతున్నాం. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పిస్తే.. ఏడాదిలోనే మాకు మేం గ్రామర్‌ కూడా నేర్చుకుంటాం. కొంతకాలం బోధనకు ముందే టీచర్‌ ఇంటి దగ్గర పాఠం ప్రిపేరవ్వాల్సి వస్తుంది.  
– పణితి రామనాథం, స్కూల్‌ అసిస్టెంట్, 
మోరంపల్లి బంజర్, బూర్గంపహాడ్‌ మండలం, భద్రాద్రి కొత్తగూడెం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement