
ఖమ్మం జిల్లా నారపునేనిపల్లి యూపీఎస్‌లో ఒకరే విద్యార్థిని
పాఠశాలను మూసివేయాలని అధికారుల నిర్ణయం
మూసేస్తే తన బిడ్డ చదువు మాన్పిస్తానని విద్యార్థి ని
తండ్రి బెదిరింపు నిర్ణయం మార్చుకొని
అడ్మిషన్ల పెంపునకు అధికారుల ప్రయత్నాలు
వైరా రూరల్: కారణాలు ఏమైనా ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకే మొగ్గు చూపుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలు వైభవం కోల్పోతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లి యూపీఎస్‌కు కూడా అదే గతి పట్టింది. ఈ ఏడాది స్కూల్ మొత్తంలో నాలుగో తరగతి చదివే ఒకే విద్యార్థి మిగిలింది. దీంతో అధికారులు స్కూల్‌ను మూసివేసేందుకు యత్నించారు. కానీ ఆ విద్యార్థి ని తండ్రి పట్టుదల కారణంగా స్కూల్ ఇంకా మూతపడకుండా నడుస్తోంది.
24 మంది నుంచి ఒకరికి..
నారపునేనిపల్లిలో పాఠశాల స్థాయి విద్యార్థులు 35 మంది ఉంటారు. గ్రామ యూపీఎస్‌లో 2018లో 24 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. 2022–23లో ఎనిమిదికి, 2023–24లో నలుగురికి ఆ సంఖ్య పడిపోయింది. దీంతో ఉమాపార్వతి అనే టీచర్ మినహా ఉపాధ్యాయులందరినీ డిప్యూటేషన్‌పై వేరే స్కూళ్లకు పంపారు. ఈ విద్యాసంవత్సరం నాలుగో తరగతి చదివే కీర్తన మాత్రమే మిగిలింది. ఈ స్కూల్ నుంచి విద్యార్థులు వెళ్లిపోవటానికి కోతుల బెడద కూడా కారణమైంది.
విద్యార్థులు లేని కారణంగా స్కూల్ మూసివేతకు అధికారులు సిద్ధపడడంతో ఆమె తండ్రి అనిల్‌శర్మ అడ్డుకున్నాడు. పాఠశాల మూస్తే తన కుమార్తె చదువు మాన్పిస్తానని.. అదే జరిగితే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టంచేయటంతో వెనక్కి తగ్గారు. స్కూల్‌లో ప్రవేశాల పెంపునకు అధికారులు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయటంతో ఇంకో టీచర్‌ను కేటాయిస్తే పిల్లల్ని పంపిస్తామని గ్రామస్తులు చెప్పారు. దీంతో డిప్యూటేషన్‌పై ఖానాపురం హిందీ పండిట్ మాచర్ల రాంబాబును కేటాయించారు.
స్కూల్ మూత పడొద్దనే...
ఒకసారి స్కూ ల్ మూసేస్తే మళ్లీ తెరవడం సాధ్యం కాదు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత ఉన్నా పాఠశాల మూసివేయొద్దనే ఉద్దేశంతో మా పాపను ఇక్కడ చదివిస్తున్నా. ప్రభుత్వ బడుల్లో ఉన్న సదుపాయాలపై ప్రచారం చేసి ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. – నందిగామ అనిల్‌శర్మ, కీర్తన తండ్రి
అన్ని వసతులు కల్పిస్తాం..
యూపీఎస్‌లో వి ద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం. కోతుల ని వారణకు పాఠశాల ప్రహరీపై సో లార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయడమే కాక డిజిటల్ బోధ న చేయనున్నాం. తల్లిదండ్రులు రూ. లక్షలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా పిల్లలను సర్కారు బడులకు పంపించి ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి సహకరించాలి. – కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా.
Comments
Please login to add a commentAdd a comment