రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమిపూజ
కొందుర్గులో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/కొందుర్గు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ భవనాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.
అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొందుర్గులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని సీఎస్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు.
ఇప్పటికే సంబంధిత అధికారులు శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహిస్తున్నామని, రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్ చెప్పారు.
మొదటి విడత కింద ఎంపిక చేసినవి..
కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలున్నాయి.
కొందుర్గులో సీఎం సభ
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో రూ.125 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడ నున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని 109 సర్వే నంబర్‌లో 20 ఎకరాలను కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment