
ప్రభుత్వ స్కూళ్లపై సర్కారు దృష్టి
విద్యార్థుల చేరికలలో తగ్గుదలపై ఆందోళన
వార్షిక విద్యా స్థాయి నివేదిక నేపథ్యంలో కదలిక
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి అధ్యయనానికి ఆదేశం
రంగంలోకి తెలంగాణ విద్యా పరిశోధన మండలి
అత్యవసర సర్వే కోసం నేటి నుంచి జిల్లాలకు సర్వే బృందాలు
9 వేల స్కూళ్లల్లో విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు..
నివేదికల తర్వాత కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతుండటం, విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిస్థితిని మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముందుగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా చేరికలు తగ్గడంపై సర్వే చేయాలని చెప్పింది.
దీంతో తొలిసారిగా తెలంగాణ విద్యా పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రంగంలోకి దిగింది. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు జిల్లాలకు వెళ్లనున్నాయి. ఇందుకోసం తొలుత ఈ నెల 3, 4 తేదీల్లో మాస్టర్ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనానికి వెళ్లే బృందాలకు 6, 7 తేదీల్లో శిక్షణ ఇచ్చారు.
ఒక్కో జిల్లాలో 100 స్కూళ్ల పరిశీలన
జిల్లాకు దాదాపు 100 చొప్పున స్కూళ్లను ఈ బృందాలు పరిశీలిస్తాయి. మొత్తం ఆరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతాయి. స్కూళ్లలో అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్, సిలబస్ పూర్తి, ల్యాబొరేటరీ నిర్వహణ, అంతర్గత మూల్యాంకన విధానంపై అధ్యయనం చేస్తాయి. సర్వేలో భాగంగా దాదాపు 9 వేల పాఠశాలల్లోని విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. బృందాలు ఇచ్చే నివేదికలపై ముందుగా విద్యాశాఖ, ఆ తర్వాత ప్రభుత్వం లోతుగా సమీక్షించి చేపట్టవలసిన కార్యాచరణ సిద్ధం చేయనున్నాయి.
ప్రమాణాలు పడిపోతున్నాయన్న ‘ఆసర్’
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని వార్షిక విద్యా స్థాయి నివేదిక (ఆసర్) ఇటీవల వెల్లడించింది. గత ఏడాది ఆసర్ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. ఇటీవల ఈ నివేదికను అందజేసింది. రాష్ట్రంలోని 270 గ్రామాల్లో 5,306 ఇళ్లకు వెళ్లిన ఆసర్ బృందాలు 3 నుంచి 16 ఏళ్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, 14–16 ఏళ్ల వయసు విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించాయి. ఈ క్రమంలో పలు ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి.

స్కూళ్లకూ ఫోన్లు.. ఆలోచనా శక్తే లేదు!
చిన్నపాటి కూడికలు, తీసివేతల్లో కూడా పాఠశాల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. 96 శాతం విద్యార్థుల్లో ఆలోచన శక్తి, క్రియేటివిటీ పూర్తిగా లోపించింది. అంతా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలకూ వీళ్లు ఫోన్లు తెస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో హాజరు శాతం 2022లో 75.50 శాతం ఉంటే, ప్రస్తుతం 73 శాతానికి పడిపోయింది. 62 శాతం పాఠశాలల్లో ఒకటో తరగతి పిల్లలను ఇతర తరగతులతో కలిపి కూర్చోబెట్టడం వల్ల విద్యాభ్యాసం ఏమాత్రం సాగడం లేదు. రానురాను 60 మంది కన్నా తక్కువ ఉన్న స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది. 2010లో ఇలాంటి పాఠశాలలు 17.20 శాతం ఉంటే 2024లో 45.20 శాతానికి చేరుకోవడం ఆందోళన కల్గించే అంశం.
వచ్చే ఏడాదికల్లా విశ్వాసం కల్పించేలా..
గత పదేళ్లలో ప్రభు త్వ స్కూళ్లల్లో చేరికలు 32 శాతం తగ్గిపోయాయి. 2014–15లో 24.85 లక్షల మంది సర్కారీ స్కూళ్లల్లో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలుగా ఉంది. విద్యా ర్థులు ప్రైవేటు స్కూళ్లలో చేరుతుండటమే ఇందుకు కారణం. కాగా టీచర్ల సంఖ్య పెంచినా, మౌలిక వసతులు కల్పించినా, ఎందుకు ఈ పరిస్థితి ఉందనే దానిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ప్రైవేటు స్కూళ్లలో 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 2024–25లో ఈ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. వీటన్నింటినీ అధ్యయనం చేసి, వచ్చే ఏడాదికి ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సర్వే చాలా కీలకం
రాష్ట్ర విద్యా రంగంలో తీసుకురావా ల్సిన మార్పులపై సరైన ఫీడ్‌బ్యాక్ కోసం తొలిసారిగా సర్వే చేపడుతున్నాం. క్షేత్రస్థా యిలో పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలిస్తాం. దాని ఆధారంగా అవసరమైన మార్పులు, సంస్కరణలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. అందుకే ఈ సర్వే చాలా కీలకమైంది. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్యా డైరెక్టర్
ఎక్కడ ఏం చేయాలో తెలుస్తుంది
క్షేత్రస్థాయి సర్వేతో ఎక్కడ, ఎలాంటి మార్పులు తేవాలనేది వెల్లడవుతుంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి వీలవుతుంది. అధ్యయనాలతో సరిపెట్టకుండా స్కూళ్లకు అవసరమైన మేర నిధులు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు పోటీ కోణంలో విద్యా విధానం ఉంటే ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ప్రవేశాలు పెరుగుతాయి. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ, పీఆర్టీయూటీఎస్ నేత
Comments
Please login to add a commentAdd a comment