జీవో 117 రద్దుతో విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం
3, 4, 5 తరగతులు తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం
ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల బోధన రద్దు.. ఇప్పటికే సీబీఎస్‌ఈ స్కూళ్లను రద్దు చేసిన సర్కారు
సాక్షి, అమరావతి: సజావుగా సాగుతున్న పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను, అందులోనూ ప్రాథమిక దశ నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను దూరం చేసేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళుతోంది. తాజాగా జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను నిర్దయగా రద్దు చేస్తోంది.
పిల్లల్లో విద్యా నాణ్యత పెంచేందుకు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన అందించేందుకు తీసుకొచ్చిన జీవో 117ను రద్దుచేసి, వచ్చే ఏడాది నుంచి ఆ తరగతులను ప్రాథమిక పాఠశాల్లోకి మార్చాలని నిర్ణయించింది.
ఏపీ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే..
గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ‘ప్రభుత్వాలు మారడం సహజం. కానీ.. పాలన మాత్రం మారకూడదు. మంచి ఏ ప్రభుత్వంలో జరిగినా దాన్ని కొనసాగించాలి’ అని ఇటీవల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
అంతేకాదు.. విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులనూ పరిశీలించారు. గత ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, వాటిని అలాగే కొనసాగిద్దామని ఉన్నతాధికారుల వద్ద కూడా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రే బాగున్నాయని చెప్పిన సంస్కరణలను రద్దు చేయడం విస్మయం కలిగిస్తుంది.
జీవో 117 రద్దు చేస్తే విద్యార్థులకు అన్యాయం
పలు సర్వేల అనంతరం విద్యారంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చి0ది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల్లోను ఒకేవిధమైన విధానాలు అనుసరించాలని, పిల్లలు నేర్చుకునే దానికి, వస్తున్న ఫలితాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని సూచించింది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పతి్తని తగ్గించాలంది. ఎన్‌ఈపీ–2020 విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది.
ఎన్‌ఈపీ సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో–117 జారీ చేసింది. దీనిప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. 8 వేల మంది అర్హులైన ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు.
అంతేగాక ఉపాధ్యాయులపై బోధనా ఒత్తిడి తగ్గించేందుకు ప్రాథమిక విద్యార్థుల బోధనను ఒక టీచర్‌కు 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎంతో ఉన్నతమైన ఆశయంతో తీసుకొచ్చిన జీవో 117ను ఉపాధ్యాయులు సైతం మెచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే చట్టాన్ని రద్దు చేయడమంటే పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేయడమేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment