
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. దీంతో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలోని గురుకులంలో 48 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మరోవైపు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించారు.
కరోనా వ్యాప్తి నిరోధంపై ఏమాత్రం అలసత్వం వద్దని జిల్లా విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వీటి అమలు బాధ్యత పాఠశాల ప్రధానోధ్యాయులదేనని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.
శానిటైజేషన్ ప్రక్రియను తప్పనిసరి చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో ప్రతి విద్యార్థిని పరిశీలించాలని, ఆరోగ్య పరమైన సమస్యలుంటే సమీపంలోని హెల్త్ సెంటర్‌లో పరీక్షలు చేయించాలన్న నిబంధన అమలుకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలి: మంత్రి
కరోనా మూడోదశపై అప్రమత్తంగా ఉండాలని, ఈ దిశగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లోని విద్యార్థుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment