సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా పాజిటివ్ కేసులు జిల్లాల్లో సైతం నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో, వారికి చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ కలకలం చోటుచేసుకుంది. కొత్త వేరియంట్ జేఎన్-1కు సంబంధింంచి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక ఆసుపత్రి నర్సు, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళకు పాజిటివ్‌గా తేలింది. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారి శాంపిల్స్‌ను జీనోమ్ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. వారి సన్నిహితుల సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ నగరంలో 9, కరీంనగర్‌లో ఒక్క కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి ఒకరు కోలుకున్నారు. మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్ సూచించారు. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరోవైపు.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. యాదమ్మ కుటుంబసభ్యులు భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఇంట్లోనే ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment