బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్‌ | Promotions of teachers stopped by court orders in Telangana | Sakshi
Sakshi News home page

బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్‌

Published Wed, Oct 4 2023 4:14 AM | Last Updated on Wed, Oct 4 2023 4:14 AM

Promotions of teachers stopped by court orders in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బదిలీలను మాత్రం యథా విధిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అయితే గతంలో వెల్లడించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. గత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు.

బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధి కారులకు ఆదేశించారు. బదిలీల కోసం టీచర్ల నుంచి అందిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పు లను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలి పారు. ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్లు బదిలీ కావా ల్సిన పాఠశాలల వివరాలతో వెబ్‌ ఆప్షన్లు ఇవ్వా లని, వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యా యులకు అందించాలని స్పష్టం చేశారు. 

టెట్‌ తెచ్చిన తిప్పలు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గత నెల ఒకటవ తేదీన విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలు గుర్తించి, వాటిని స్కూల్‌ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదే క్రమంలో స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలను గుర్తించి, ఎస్‌జీటీల ద్వారా 70 శాతం నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకూ వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్‌–2 పరిధిలోని ప్రమోషన్లు తొలుత నిలిపివేశారు.

ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాసయిన వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. కానీ రాష్ట్రంలో టెట్‌ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైన టీచర్లకు టెట్‌ అర్హత ఉండే ఆస్కారం లేదనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్‌లో కొనసాగడానికేనని, పదోన్నతులకు టెట్‌ ఉండాలన్న వాదనను కోర్టు సమర్థించింది. ప్రమోషన్లపై స్టే ఇచ్చింది. న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని భావించిన అధికారులు, ప్రమోషన్ల అంశాన్ని పక్కనబెట్టేశారు. 

రిలీవర్‌ వస్తేనే స్థాన చలనం
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారి సంఖ్య 40 వేలకుపైనే ఉంటుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే 58 వేల మందికి బదిలీకి ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుడికి బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఉంటేనే రిలీవ్‌ చేయాలని హెచ్‌ఎంలకు సూచించారు.

అంటే రిలీవ్‌ అయ్యే టీచర్‌ బోధించే సబ్జెక్టుకు సంబంధించిన మరో టీచర్‌ బదిలీపై వస్తేనే ప్రస్తుతం ఉన్న టీచర్‌ను రిలీవ్‌ చేయాలని ఆదేశించారు. దీంతో 58 వేల మంది టీచర్ల బదిలీకి ఆస్కారమున్నా, 25 వేల మందికి మించి స్థాన చలనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్‌ మార్గదర్శకాల ప్రకారం.. టీచర్‌ 8 ఏళ్ళు, హెచ్‌ఎం 5 ఏళ్ళు ఒకేచోట ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట కనీసం రెండేళ్ళుగా పనిచేస్తున్న టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement