సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్‌లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు.
దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్‌టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్‌ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి.
కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్‌జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది.
కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు.
టీఆర్‌టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి
టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్‌టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి.
– రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment