పదోన్నతులకు టెట్‌ చిక్కులు  | Teachers are promoted only after passing TET Eligibility Test: TS | Sakshi
Sakshi News home page

పదోన్నతులకు టెట్‌ చిక్కులు 

Published Mon, Dec 11 2023 4:35 AM | Last Updated on Mon, Dec 11 2023 4:35 AM

Teachers are promoted only after passing TET Eligibility Test: TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.

వీలైనంత త్వరగా డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్‌ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్‌ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు.  

ఎప్పుడో చెప్పిన కేంద్రం 
ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్‌ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్‌ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్‌ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

టెట్‌ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్‌ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్‌ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.  

ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! 
    రాష్ట్రంలో టెట్‌ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్‌ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్‌ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు.

ఎస్‌జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా, స్కూల్‌ అసిస్టెంట్లను హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ మాదిరి అంతర్గతంగా

టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్‌ లోపు ఈ తరహా టెట్‌ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement