
ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్)ను జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి విడుదల చేశారు. టెట్ పరీక్ష కోసం ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫలితాలను జూలై 27న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచార బులెటిన్‌ను ఈ నెల 15న విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది.
ఈసారి ఎక్కువ దరఖాస్తులు!
గతంలో 2024 మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించారు. ఈ పరీక్షకు రెండు పేపర్లకు కలిపి 2,36,487 మంది హాజరయ్యారు. కాగా త్వరలో డీఎస్సీ చేపడతామని ప్రభుత్వం వెల్లడించడంతో ఈసారి టెట్‌కు ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్ష ఫీజును ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000గా నిర్ణయించారు. బీఈడీ చేసిన అభ్యర్థులు రెండు పేపర్లు రాసే అవకాశం ఉంటుంది. దరఖాస్తుతో పాటే ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్లు కూడా సంబంధిత అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండు పేపర్లకు అర్హతలు ఇలా..
టెట్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు పేపర్–1 రాసేందుకు అర్హులు. వీరు టెట్ అర్హత ఆధారంగా 1–5 తరగతులు బోధించవచ్చు. డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు పోటీ పడవచ్చు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) చేసిన వారు ఉన్నత తరగతులకు బోధించే అర్హతకు సంబంధించిన పేపర్–2 రాయాల్సి ఉంటుంది. వీరు డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
150 మార్కులకు పరీక్ష
పేపర్–1, పేపర్–2 ప్రశ్నపత్రాలు 150 మార్కులకు ఉంటాయి. ప్రశ్నలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, టీజీటెట్ కమిటీ చైర్ పర్సన్ ఎంపిక చేస్తారు. పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణిస్తారు. టెట్ అర్హత సర్టీఫికెట్ జీవిత కాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి ‘స్కూల్‌ఎడ్యు.తెలంగాణ.జీవోవీ.ఇన్’అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వొచ్చు.