టెట్‌ ఫీజు తగ్గింపు | Telangana Govt Announces Reduces Of TET Exam Fees | Sakshi
Sakshi News home page

టెట్‌ ఫీజు తగ్గింపు

Published Fri, Nov 8 2024 6:04 AM | Last Updated on Fri, Nov 8 2024 6:04 AM

Telangana Govt Announces Reduces Of TET Exam Fees

ఒకే పేపర్‌ రాయాలనుకుంటే రూ.750.. రెండు పేపర్లకు కలిపి రూ. వెయ్యి

గతంలో టెట్‌ రాసిన వారికి మినహాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్‌–1 లేదా పేపర్‌–2 పరీక్ష రాసేందుకు రూ. వెయ్యిగా ఉన్న ఫీజును రూ. 750కి తగ్గించింది. పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు రాసే అభ్యర్థులకు గతంలో రూ. 2 వేలుగా ఉన్న ఫీజును రూ. తాజాగా వెయ్యికి తగ్గించింది. అలాగే టెట్‌ రాసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు టెట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది.

దీంతోపాటు సమగ్ర సమాచార బులెటిన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టెట్‌ పేపర్‌లో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వాటికి 150 మార్కులుంటాయి. చైల్డ్‌ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు ఇతర రిజర్వేషన్‌ కేటగిరీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు.

టెట్‌ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుంది. çహాల్‌టికెట్లను డిసెంబర్‌ 27 నుంచి 2025 జనవరి 20 మధ్య డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇది ఈ నెల 20వ వరకు కొనసాగుతుంది. టెట్‌ అర్హత సర్టిఫికెట్‌ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకంలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement