exam fees
-
టెట్ ఫీజు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్–1 లేదా పేపర్–2 పరీక్ష రాసేందుకు రూ. వెయ్యిగా ఉన్న ఫీజును రూ. 750కి తగ్గించింది. పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాసే అభ్యర్థులకు గతంలో రూ. 2 వేలుగా ఉన్న ఫీజును రూ. తాజాగా వెయ్యికి తగ్గించింది. అలాగే టెట్ రాసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది.దీంతోపాటు సమగ్ర సమాచార బులెటిన్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. టెట్ పేపర్లో 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వాటికి 150 మార్కులుంటాయి. చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుంచి ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు ఇతర రిజర్వేషన్ కేటగిరీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు.టెట్ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుంది. çహాల్‌టికెట్లను డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 20 మధ్య డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇది ఈ నెల 20వ వరకు కొనసాగుతుంది. టెట్ అర్హత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకంలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. -
నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డ్ మంగళవారం వెల్లడించింది. 2025లో పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు.. నిర్ణయించిన తేదీల్లో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లించాలని బోర్డ్ స్పష్టం చేసింది.మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు రూ.520 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ.230తో కలిపి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. -
నీ కాల్మొక్తా సార్.. నా కొడుకు భవిష్యత్ కాపాడండి
కారేపల్లి: ‘‘నీ కాల్మొక్తా సార్.. నా కొడుకు భవిష్యత్‌ను కాపాడండి.. ఎలాగైనా సరే నా కొడుకు పదో తరగతి పరీక్ష రాసేలా చేయండి సార్’’ అంటూ ఓ తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కాళ్లపై పడి రోదించింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండాకు చెందిన గుగులోతు రమేష్ – సునీత దంపతుల కుమారుడు తరుణ్.. గతేడాది కారేపల్లి హైస్కూల్లో పదో తరగతి చదివాడు. అయితే గణితంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో, ఈ ఏడాది పరీక్ష రాసేందుకు హైస్కూల్ జూనియర్ అసిస్టెంట్ సులోచనకు పరీక్ష ఫీజు రూ.150తో పాటు ఆలస్యమైనందుకు అదనపు రుసుము రూ.వెయ్యి కూడా చెల్లించాడు. అయితే, ఆమె సెలవులో వెళ్తూ హెచ్ఎం పవన్‌కుమార్‌కు ఫీజు ఇచ్చినట్లుగా చెబుతోంది. బోర్డుకు మాత్రం ఫీజు అందకపోవడంతో తరుణ్‌కు హాల్‌టికెట్ రాలేదు. ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్లో అడగ్గా.. ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెబుతూ చివరకు తాము బోర్డుకు ఫీజు చెల్లించలేదని ఒప్పుకున్నారు. ఏం చేయాలో తెలియని తరుణ్ తల్లిదండ్రులు బుధవారం కారేపల్లి హైస్కూల్‌కు చేరుకుని హెచ్ఎం పవన్‌కుమార్ కాళ్లపై పడి రోదిస్తూ ఎలాగైనా తమ కుమారుడి భవిష్యత్‌ను కాపాడాలని వేడుకున్నారు. -
ఇంటర్ ఫీజు గడువు 28
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజును రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకూ చెల్లించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు గడువు ఈ నెల 19వ తేదీతో ముగిసింది. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
టెన్త్ పరీక్ష ఫీజు 125 రూపాయలే
సాక్షి, కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నెల క్రితమే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల10లోగా చెల్లించవచ్చు. అన్ని సబ్జెక్టులకు కలిపి కేవలం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరీక్ష ఫీజు పెంచలేదు. ఇదే మొత్తాన్ని వసూలు చేస్తోంది. అపరాధ రుసుంతో... రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 20 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 25 వరకూ అపరాధ రుసుం రూ.200తో , ఆ తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30లోగా రూ.500 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారు రూ.125తో పాటు ప్రాక్టికల్స్ కోసం అదనంగా మరో రూ.60 చెల్లించాలి. గతంలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులుంటే రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. హెచ్‌ఎంలదే కీలక బాధ్యత.. 10వ తరగతి పరీక్షల ఫీజు విషయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత ఉంటుంది. విద్యార్థుల పరీక్ష ఫీజుకు సంబంధించిన నామినల్ రోల్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే విద్యార్థులు నష్టపోతారు. పూర్తి చేసిన నామినల్ రోల్స్‌కు పాఠశాల లాగిన్‌లోని లింక్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చలానా లేదా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లిస్తే ఉపయోగం ఉండదు. 10 పరీక్షలకు సంబంధించిన మ్యానివల్ నామినల్ రోల్స్ (ఎంఎన్ఆర్)ను డిసెంబర్ 21 నుండి 31 లోగా డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు.. జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 11,782 మంది, మున్సిపల్ స్కూల్స్‌లో 1,803, కస్తూర్బా స్కూల్స్‌లో 1,115 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 783 మంది, సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 540 మంది, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో 220 మంది ఉన్నారు. అలాగే ఏపీఆర్ఈఐ సొసైటీ స్కూల్స్‌లో 88 మంది, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్‌లో 35 మంది, మోడల్ స్కూల్స్‌లో 796 మంది, నవోదయ విద్యాలయాల్లో 83 మంది, ప్రైవేటు/కార్పొరేట్ స్కూల్స్‌లో 5,603 మంది, సీబీఎస్సీ వారు 178 మంది, బీసీ వెల్ఫేర్ స్కూల్స్‌లో 724 మందితో పాటు గవర్నమెంట్ స్కూల్స్‌లో మరో 8 మంది అంధ విద్యార్థులతో కలిపి బాలురు 12,450 మంది, బాలికలు 11,308 మంది మొత్తం 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈసారి పది పరీక్షకు హాజరు కానున్నారు. ఈసారి ఆరు పేపర్లే.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ కారణంగా గత ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20 అలాగే 2020–21 విద్యాసంవత్సరాల్లో 10 పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని టెన్త్ పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి సీబీఎస్ఈ తరహాలోనే టెన్త్‌లో ఆరు పేపర్లే ఉంటాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీ‘జులుం’.. 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. స్కూల్ఫీజు, ట్యూషన్ ఫీజు, ట్రాన్స్‌పోర్టు ఫీజు ఇలా బకాయి ఉన్న ఫీజులన్నీ చెల్లిస్తే గానీ పరీక్ష ఫీజు తీసుకునేది లేదని మెలిక పెడుతున్నారు. ఇంకొన్ని చోట్ల కోవిడ్ సమయంలోని పెండింగ్‌లో ఉన్న ఫీజులు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫలానా తేదీకి ఫీజు మొత్తం క్లియర్ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులతో హామీ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్టుకు కలిపి ప్రభుత్వం కేవలం 125 మాత్రమే నిర్దేశించింది. కానీ చాలా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో రూ.500 నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు 10వ తరగతి పరీక్ష ఫీజు కన్నా అధిక మొత్తంలో వసూలు చేసిన పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం. అలాగే పరీక్ష ఫీజుకు పాఠశాల ఫీజులకు మెలిక పెడితే శాఖాపరమైన చర్యలు తప్పవు. నామినల్ రోల్స్ విషయంలో అజాగ్రత్త వహిస్తే సంబంధిత హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – మీనాక్షి, డీఈఓ -
పెండింగ్ ఫీజులు.. కడితేనే పరీక్షకు..
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్, రవాణా, ఇతర ఫీజులు చెల్లిస్తే తప్ప పరీక్ష ఫీజు కట్టించుకోమని తేల్చిచెబుతున్నాయి. ఈ నెల 15కల్లా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. కొన్ని పాఠశాలలు కోవిడ్ కాలంలో పెండింగ్‌లో ఉన్న ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్ ఫీజు సగం చెల్లించిన వారికీ తిప్పలు తప్పడం లేదు. టెన్త్ పరీక్షల తర్వాత విద్యార్థులు పాఠశాలను విడిచి వెళ్తారని, అప్పుడు వసూలు చేయడం కష్టమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఫలానా తేదీకల్లా మొత్తం ఫీజు చెల్లిస్తామని స్థానిక పెద్దల సమక్షంలో కొన్ని స్కూళ్లు హామీ పత్రాలు రాయించుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ వెసులుబాటు ఇచ్చేందుకు బడులు సుముఖంగా లేవు. వచ్చే మార్చిలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 5 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 3 లక్షల మంది ప్రైవేటు బడుల విద్యార్థులు ఉన్నారు. సర్కారీ బడుల్లోనూ... ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించడం కూడా కష్టంగా ఉంటోంది. వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాల్లో ప్రభుత్వమే ఈ ఫీజు చెల్లిస్తుంది. కానీ కొన్ని మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు చెల్లించాల్సి వస్తోంది. అయితే, వాస్తవ ఫీజుకు అదనంగా రూ.75 అధికంగా వసూలు చేస్తున్నారని కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫిర్యాదులొచ్చాయి. పరీక్షలకు సంబంధించి జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో అదనంగా వసూలు చేయాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇటీవల జిల్లా అధికారులను హెచ్చరించారు. నిబంధనలు గాలికి.. వాస్తవానికి టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125. దీన్ని బ్యాంకు చలాన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే, ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఫీజు తమకే చెల్లించాలని పట్టుబడుతున్నాయి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన ఫీజు కాకుండా రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. తాము బోర్డుకు చెల్లించే సమయంలో అనేక ఖర్చులుంటాయని యాజమాన్యాలు కుంటిసాకులు చెబుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపునకు అయ్యే ఖర్చు కూడా ఇందులోనే ఉంటుందని బుకాయిస్తున్నారు. పరీక్ష ఫీజుకు మాత్రం ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ క్రమంలో పెండింగ్ ఫీజుల విషయంలోనూ యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుంచి డొనేషన్లు, ట్యూషన్ ఫీజుల రూపంలో స్కూల్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. పాఠశాల ప్రారంభంలో సగం ఫీజు వసూలు చేసిన యాజమాన్యాలు ఇప్పుడు మిగతా సగం కోసం ఒత్తిడి చేస్తున్నాయి. -
ఫీజు కట్టాల్సిందే.. ఆ మటా ఉత్తిమాటే..!
సాక్షి, నారాయణపేట రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు ప్రక్రియ ఇటు ప్రభుత్వం ప్రకటించడానికి, అటు అధికారులు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్లో వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్చుతూనే వస్తోంది. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరికీ అది ఉపయోగపడటం లేదు. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టెన్త్ విద్యార్థులు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 11 రకాలైన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. వాటిలో సింగారం క్రాస్‌రోడ్డులో ఉన్న సీబీఎస్ఈ విద్యాలయం మినహాయిస్తే మిగితా వాటిలోని పదో తరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 753 మంది, 70 లోకల్‌బాడీ స్కూల్లలో 5,280, మూడు ఎయిడెడ్ స్కూళ్లలో 102 మంది, 45 ప్రైవేటు పాఠశాలల్లో 1,315 మంది, 11 కేజీబీవీల్లో 504 మంది, ఒక జ్యోతిరావుఫూలే స్కూల్లో 73మంది, రెండు మాడల్ స్కూల్లలో 192 మంది, రెండు మైనార్టీ గురుకులలో 135, ఆరు సోషల్ వెల్ఫేర్‌లో 480, ఒక ట్రైబల్ వెల్ఫేర్‌లో 79మందితో కలుపుకుని మొత్తం 4,354 మంది బాలురు, 4,597 మంది బాలికలతో కలిసి 8,961 మంది టెన్త్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: (రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 706 రోజుల తర్వాత..) వెనకబడిన వారికి మినహాయింపు అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో ఈ ఏడాది మే 11నుంచి 17వరకు జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24 వేలలోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ఠ ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. అయితే గత 30ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో 8,165 మంది వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతుంది. హాస్టల్లో చదువుతున్న వారికి ప్రత్యేకం బీసీ విద్యార్థులు ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలిగారు. మక్తల్ గరŠల్స్‌లో 8, బాయ్స్‌లో 17, ఊట్కూర్ బాయ్స్‌లో 9, మద్దూర్ గరŠల్స్‌లో 14, కన్మనూర్ 5, ధన్వాడ మాడల్ స్కూల్లో 1, నారాయణపేట వైదిక పాఠశాలలో 4 చొప్పున 58మంది, అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం 504 మంది బాలికలకు ఫీజు రాయితీ వచ్చింది. కానీ పేరెంట్స్ వార్షిక ఆదాయ ధ్రువపత్రంతో మాత్రం కాదనేది విస్పష్టం. అదేవిధంగా 14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువగా ఉన్న వారు మెడికల్ సర్టిఫికెట్తో పాటు రూ.300 చెల్లించి ప్రభుత్వ పరీక్షల విభాగానికి చలాన్ కట్టి జిల్లాలో 55మంది పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత తీసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా.. ఏటా అక్టోబర్‌లోనే టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్డ్ విడుదల చేసే బోర్డు అధికారులు రెండేళ్లుగా కరోనా కారణంగా ఆలస్యంగా విద్యాబోధన ప్రారంభం కావడంతో ఈసారి సైతం పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ టెన్త్ బోర్డు గతనెల చివరన విడుదల చేశారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లమెంటరీ విద్యార్థులు 3సబ్జెక్టులోపుకు రూ.110, మూడు దాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటిని సంబందిత హెచ్ఎంలకు ఈనెల 14 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాల్సి ఉండగా, రూ.50 జరిమానాతో ఫిబ్రవరి 24వరకు చెల్లించాల్సి ఉండింది. ఇక రూ.200తో మార్చి 4వరకు, ఆఖరులో రూ.500 అపరాధ రుసుం చెల్లిస్తే మార్చి 14వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్ఎస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్నియాజమాన్య పాఠశాలల హెచ్ఎంలకు వాటి ప్రతిని అందించాము. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే తప్పకుండా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20వేలు, పట్టణాల్లో రూ.24వేలు దాటకూడదు. అలాంటి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదు. కేవలం బీసీ హాస్టల్‌కు చెందిన 58, కేజీబీవీలకు చెందిన 504తో కలిపి 531మంది ఫీజు రాయితీతో పరీక్షకు హాజరవుతున్నారు. – రాజేంద్రకుమార్, జిల్లా పరీక్షల విభాగ అధికారి -
అంతా మా ఇష్టం..!... పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు
సాక్షి హైదరాబాద్: కరోనా కష్టకాలంలో విద్యా సంస్థలు పబ్లిక్ పరీక్ష ఫీజుపై సైతం బాదేస్తున్నాయి. తాజాగా పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ బహాటంగా కొనసాగడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో పాటు సర్కారు బడుల్లో సైతం ప్రధానోపాధ్యాయుల అండదండలతో పరీక్షల విభాగం బాధ్యులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత ఫీజు కంటే అధికంగా బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల 2021–22 విద్యాసంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఫీజు చెల్లింపు షెడ్యూలును ఎస్ఎస్సీ బోర్డు జారీ అయింది. తొలుత గత నెల 29 వరకు ఫీజు గడువును నిర్ధారించగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంక్రాంతి సెలవులను పొడిగించడంతో ఫీజు గడువును ఈ నెల 14 వరకు బోర్డు పొడిగించింది. రూ.50 ఆలస్య రుసుంతో 24 వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో మార్చి 4 వరకు. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించే విధంగా బోర్డు వెసులుబాటు కల్పించింది. పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు పేరిట అడ్డగోలు వసూళ్లు వివాదాస్పదంగా తయారయ్యాయి. నిబంధనల ప్రకారం పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు ప్రకటించిన నిర్ణీత గడువులోగా రూ. 125 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.అయితే ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా వసూళ్ల కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్‌లో పరీక్ష ఫీజు పేరుతో కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని యాజామాన్యాలు పాత బకాయి ఫీజులు మొత్తం చెల్లిస్తేనే పబ్లిక్ పరీక్షల ఫీజు కట్టుకుంటామనితేల్చి చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్కారు బడుల్లో సైతం... ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో సైతం పబ్లిక్ పరీక్షల ఫీజు పై అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ప్రాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సహకారంతో ఎగ్జామినేషన్ బ్రాంచ్ బాధ్యులు రూ.125 బదులు రూ.200నుంచి 500 వరకు పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిలదీస్తే మాత్రం నిర్వహణ ఖర్చులను సాకుగా చూపించడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ కుటుంబ యజమాని వార్షిక ఆదాయం రూ.25 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు రూ.20 వేల లోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే పరీక్ష ఫీజులో సైతం రాయితీ లభిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యే అవకాశం లేకపోవడంతో రూ.125 ఫీజు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నా..అదనపు చెల్లింపులు తలకు మించిన భారంగా తయారైంది. కరోనా కష్టకాలంలో పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. విద్యా శాఖాధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
టెన్త్‌లో పేరుకే పరీక్ష.. ఫీజు మినహాయింపు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా పేరుకే ఫీజు మినహాయింపు ప్రకటిస్తోంది తప్ప అమలు చేసే వీలు కల్పించట్లేదు. పొంతనలేని ఆదాయ పరిమితిని విధించడంతో పరీక్ష ఫీజు మినహాయింపును విద్యార్థులు పొందలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలలోపు వార్షికాదాయం ఉన్న వారికే ఫీజు మినహాయింపు వర్తిస్తుందన్న నిబంధనతో దాదాపు 2.5లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరట్లేదు. రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ట వార్షిక ఆదాయం రూ.లక్షకు పైనే ఉంది. కానీ పదో తరగతి పరీక్ష ఫీజు మినహాయింపునకు ప్రత్యేక వార్షికాదాయాన్ని కొనసాగిస్తోంది. 2015లోనే దీన్ని మార్చాలని ప్రభుత్వ పరీ క్షల విభాగం అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినా మార్పు లేదు. ఇప్పుడు అదే నిబంధన కొనసాగిస్తూ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఖరారు చేసింది. దీంతో పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఈ మినహాయింపు వర్తించే అవకాశం లేకుండా పోయింది. -
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 100 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, 500 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 2 వరకు, 1000 రూపాయల ఫైన్‌తో మార్చ్ 3 నుంచి మార్చి9 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలని పేర్కొంది. చదవండి: సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు అస్వస్థత మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిదే. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. -
...అందుకే ఫీజు పెంచాం
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో పెంచిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ఫీజుపై సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది. రూ. 200 కోట్ల ఆర్థిక లోటు వల్లే ఫీజులు పెంచాల్సి వచ్చిందని బోర్డు కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ మంగళవారం తెలిపారు. 10, 12 తరగతుల పరీక్షా నిర్వహణకు దాదాపు రూ. 500 కోట్ల ఖర్చు అవుతోందని అన్నారు. ఇప్పటి వరకూ నీట్, జేఈఈ వంటి పరీక్షల నిర్వహణ ద్వారా ఆర్థిక వెసులుబాటు ఉండేదన్నారు. ఇప్పుడు అవి మానవ వనరులు, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కిందకు వెళ్లిపోయాయన్నారు. దీంతో తప్పనిసరై పరీక్ష ఫీజులను పెంచాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికే బోర్డు రూ. 200 కోట్ల లోటుతో నడుస్తోందన్నారు. అయితే ఢిల్లీలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు పెంచిన ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు రూ.50 కడితే సరిపోతుందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులపై భారం పడకుండా పెంచిన ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. కేజ్రీవాల్ సర్కారు నిర్ణయంతో పేద విద్యార్థులకు ఊరట లభించింది. (చదవండి: సీబీఎస్ఈ ఫీజు 24 రెట్లు పెంపు) -
‘అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఎత్తివేస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు తొలి విడత పోలింగ్ సమయం సమీపిస్తున్నవేళ ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు అనేక హామీలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యువతను ఆకర్షించే విధంగా పథకాలను రూపొందిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ పరీక్షల దరఖాస్తు రుసుము లేకుండా చేస్తామని ప్రకటించారు. ఈమేరకు ఫేస్బుక్ వేదికగా ‘కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వసూలు చేసే పరీక్షల దరఖాస్తు ఫీజును ఎత్తివేస్తాం’ అని పోస్టు చేశారు. అదే విధంగా దేశ ప్రజలందరికీ ‘ఆరోగ్యం ప్రాథమిక హక్కు’గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని పోస్ట్‌లో పేర్కొన్నారు. దానికి తగిన విధంగా బడ్జెట్లో నిధులను కేటాయిస్తామని రాహుల్ వెల్లడించారు. కాగా కేంద్రంలో తము అధికారంలోకి వస్తే దేశద్రోహ చట్టం ఐపీసీ 124ఎను కూడా రద్దు చేస్తామని ఇదివరకే తెలిపారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్ అందులోనూ నిరుద్యోగులు, పేదలను ఆకర్షించే పథకాలను రూపొంచింది. ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయడంతో పాటు.. ఉపాధి హామీ పనిదినాలు 150 రోజులకు పెంచుతామని హామి ఇచ్చింది. -
చదవకుండానే ఫీజు కట్టమంటూ వేధింపులు
విశాఖపట్నం, చోడవరం: తాను కాలేజీలో చదవక పోయినా ఫీజు చెల్లించాలని వేధిస్తుండడంతో పాటు తన ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఓ గిరిజన విద్యార్థిని చోడవరం తహసీల్దార్, పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. కొయ్యూరు మండలం బట్టపనుకుల గ్రామానికి చెందిన బాధిత విద్యార్థిని జంపా సునీత కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో తాను ఇంటి వద్ద ఉండగా చోడవరం ఫోర్ ఎస్ కాలేజీకి చెందిన కొంత మంది సిబ్బంది వచ్చి తమ కాలేజీలో డిగ్రీ చదవడానికి చేరాలని కోరారని చెప్పింది. అప్పటికే తాను ఇంటర్ పూర్తిచేయడంతో డిగ్రీ బీకాంలో చేరాలని భావించానని, అయితే కాలేజీకి వచ్చి వివరాలన్నీ ఇస్తానని చెప్పినప్పటికీ తనపై ఒత్తిడి చేసి ముందుగా టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు ఇస్తేనే కాని సీటు రిజర్వు చేయలేమని చెప్పి సర్టిఫికెట్లు తీసుకెళ్లారని తెలిపింది. ఆ తర్వాత మా కుంటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఆ కాలేజీతో పాటు ఏ కాలేజీలోనూ చేరలేదని చెప్పింది. ఇచ్చిన సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళదామంటే చార్జీలకు కూడా డబ్బులేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత కాలేజీకి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగానని, ఏడాది ఫీజు రూ.15వేలు చెల్లిస్తేనే కాని సర్టిఫికెట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యం చెప్పిందని తెలిపింది. ఎంత ప్రాథేయపడినా ఇవ్వలేదని ఆమె వాపోయింది. ఈవిషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పానని, అంత డబ్బులేకపోవడంతో ఇప్పటి వరకు రాలేదని, తమ గ్రామంలో ఇంటర్ చదువుపై ఉద్యోగ అవకాశం రావడంతో సర్టిఫికెట్లు కావలసి ఉండడంతో మళ్లీ కాలేజీ వెళ్లి అడిగితే ఇప్పుడు రూ.30వేలు చెల్లించమంటున్నారని తెలిపింది. నేను కాలేజీలో చేరకుండా, కనీసం ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్లకుండా, ఎక్కడా సంతం చేయకపోయినా ఎలా ఫీజు అడుతున్నారో అర్థం కావడం లేదని, తన సర్టిఫికెట్లు అన్యాయంగా ఉంచేసుకున్న ఫోర్ ఎస్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ విషయమై చోడవరం డిప్యూటీ తహసీల్దార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేసి ఇంటర్, టెన్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలని సునీత కోరింది. -
ఇంటర్ విద్యార్థులకు ఫీజు పరీక్ష
ఇంటర్ విద్యార్థులకు పరీక్షల ముందే ఫీజుల రూపంలో అగ్ని పరీక్ష ఎదురవుతోంది. పరీక్ష ఫీజులను ఏకంగా 30 శాతం వరకు పెంచుతూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు వెలువరించింది. పైగా ఫీజు చెల్లింపునకు కేవలం 12 రోజులు మాత్రమే గడువు ఇచ్చిన బోర్డు ఆ తర్వాత అపరాధ రుసుం పేరుతో విద్యార్థులపై పెనుభారం మోపింది. రూ.5 వేల వరకు అపరాధ రుసుంగా నిర్ణయించడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. అనాలోచిత నిర్ణయాలకు పెట్టింది పేరైన ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు ,పుత్తూరు/మదనపల్లె సిటీ : విద్యార్థులను ఎలా ఇబ్బంది పెట్టాలో ఇంటర్మీడియట్ బోర్డుకు తెలిసినంతగా మరొకరికి తెలియదనే నానుడి ఉంది. దీన్ని నిజం చేస్తూ మరోసారి ఇంటర్మీడియట్ బోర్డు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజులను 15 నుంచి 200 శాతం వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. సాధారణంగా ఏడాదికి పది శాతం లోపు పరీక్ష ఫీజును పెంచుతుంటారు. అలాంటిది ఈ ఏడాది భారీగా పెంచడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. అరకొర వసతుల నడుమ ఉపకార వేతనాలపై ఆధారపడే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పెనుభారంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుత్తూరులో రెండు ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలు, ఆరు ప్రైవేట్ జూనియర్ కళాశాలల పరిధిలో సుమారు 6 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. పెంచినఫీజుల భారం ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులపై పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసే అవకాశాలున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అపరాధ రుసుంపైనే దృష్టి.. ఫీజులను భారీగా పెంచిన ఇంటర్ బోర్డు చెల్లింపునకు కేవలం 12 రోజులే గడువు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అసలే ఫీజులు పెరగడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపునకు తక్కువ సమయం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 24వ తేదీన పెంచిన ఫీజులకు సంబంధించి సర్క్యులర్ జారీ అయింది. ఫీజు చెల్లింపునకు నవంబర్ 5వ తేదీ తుది గడువుగా పేర్కొనడంతో విద్యార్థులు విస్తుపోతున్నారు. గడువు లోపు చెల్లించని విద్యార్థులకు రూ.120 నుంచి రూ.5 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. అపరాధ రుసుం వసూలు చేసేందుకే ఇంటర్మీడియ ట్ బోర్డు తక్కువ సమయం కేటాయించిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో బోర్డు వ్యాపారం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజులను పెంచిన ఇంటర్ బోర్డు అందుకు తగ్గట్టుగా చెల్లింపునకు కనీసం నెల రోజులు గడువు ఇచ్చి ఉంటే కొంతలోకొంత ఉపశమనంగా ఉండేదని అంటున్నారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఇంటర్ ఫీజుకు నాలుగురోజులే గడువు
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): 2018 –19 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో విద్యార్థులు అప్రమత్తమవ్వాలని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆదేశిస్తున్నారు. ఇంటర్మీడియేట్ కోర్సుకు పరీక్ష ఫీజును చెల్లించాలంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో నాలుగు రోజులే.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 5వ తేదీ ఫీజు కట్టేందుకు తుది గడువుగా నిర్ణయిస్తూ అధికారులు నిర్ణయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్ఐవో కార్యాలయానికి, కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత జాప్యమయ్యే కొద్దీ అపరాధ రుసుం మోత మోగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంత వీలైతే అంత త్వరగా పరీక్ష ఫీజును చెల్లిస్తే మంచిదన్న అభిప్రాయం జూనియర్ కళాశాలల వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 2019 జనవరి 22 వరకు ఆఖరి గడువు ఉన్నా అపరాధ రుసుం మాత్రం రూ.5 వేలు కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ముందస్తుగానే ఫీజు చెల్లించి ఉత్కంఠకు లోను కాకుండా సాఫీగా పరీక్షలకు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో మొత్తం 312 జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో ఆదర్శ కళాశాలలు నాలుగు, సాంఘిక, ట్రైబల్, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలు 25, ఎయిడెడ్ 16, ప్రభుత్వ కళాశాలలు 43 ఉండగా, వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో 49 కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలలు 179 ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 54,031 మంది, ద్వితియ సంవత్సరం 50,765 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రానున్న మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) రాయాలంటే దరఖాస్తుతో పాటు పరీక్ష ఫీజును తప్పని సరిగా చెల్లించాలి. అపరాధ రుసుం ఇలా.. ఒకవేళ విద్యార్థులు నిర్ణీత గడువు నవంబరు 5వ తేదీ లోపు చెల్లించకుంటే, ఈ నెల 14 వరకూ రూ.120 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 26 వరకు రూ.500, డిసెంబర్ ఆరు వరకూ రూ.1000, డిసెంబరు 20 వరకు రూ.2 వేలు, డిసెంబరు 31 నాటికి రూ.3 వేలు అపరాధ రుసుం చెల్లించాలి. 2019 జనవరి 22 నాటికి ఆఖరి అవకాశంగా రూ.5 వేల గరిష్ట ఫైన్‌తో పరీక్ష ఫీజును ఆయా యాజమాన్యాలు తీసుకోవచ్చు. గడువులోపు చెల్లించాలి పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలని సూచించాం. కేవలం పరీక్ష ఫీజు మాత్రమే వసూలు చేయాలి.– టేకి వెంకటేశ్వరరావు, ఆర్ఐవో,ఇంటర్‌బోర్డు, రాజమహేంద్రవరం ఫీజుల వివరాలు ఫస్టియర్ పరీక్ష దరఖాస్తు ఫీజు రూ.10, సాధారణ కోర్సులకు రూ.480, ఒకేషనల్ కోర్సులకు రూ.660, బ్రిడ్జి కోర్సులకు రూ.125, బ్రిడ్జి కోర్సుల్లో బైపీసీ తీసుకుని గణితం ప్రాక్టికల్స్ ఉన్న వారికి రూ.125 చొప్పున ఫీజు చెల్లించాలి. సెకండియర్ విద్యార్థుల దరఖాస్తు ఫీజు రూ.10, ప్రాక్టికల్స్ ఫీజుతో కలుపుకొని సాధారణ కోర్సులకు రూ.660, ఫస్టియర్‌లో పేపర్లు రాసేందుకు రూ.480, మొదటి, రెండు సంవత్సరాలత్లో సబ్జెక్టులున్న వారికి ప్రాక్టికల్స్‌తో కలిపి రూ.1140, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.660 వంతున ఫీజుగా ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. -
17 నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఈనెల 17 నుంచి పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, హాజరు మినహాయింపుతో పరీక్షలకు హాజరయ్యే వారు కూడా నిర్ణీత తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచిం చారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 24 వరకు ఫీజు చెల్లించొచ్చని వివరించారు. ఫీజు చెల్లింపు తేదీలు.. 17–9–2018 నుంచి 24–10–2018: ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు 25–10–2018 నుంచి 8–11–2018: రూ.100 ఆలస్య రుసుముతో చెల్లింపు 9–11–2018 నుంచి 26–11–2018: రూ.500 ఆలస్య రుసుముతో చెల్లింపు 27–11–2018 నుంచి 11–12–2018: రూ. 1,000 ఆలస్య రుసుముతో చెల్లింపు 12–12–2018 నుంచి 2–1–2019: రూ.2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు 3–1–2019 నుంచి 21–1–2019: రూ.3 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు 22–1–2019 నుంచి 4–2–2019: రూ.5 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు ఫీజు వివరాలు.. జనరల్, వొకేషనల్ థియరీ పరీక్షల ఫీజు రూ.460 థియరీ, ప్రాక్టికల్ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620 బ్రిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్ష ఫీజు రూ.170 బ్రిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120 మ్యాథ్స్/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460 హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఫీజు రూ.1,050 ఇదివరకే పాసైన సైన్స్ గ్రూపుల వారు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఫీజు రూ.1,200 -
బాలికలకు ఫీజు రాయితీ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: బాలికా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటున్న రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫీజులో బాలికలకు రాయితీ మాత్రం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి ప్రవేశ పరీక్షల్లో బాలికలకు ఫీజు రాయితీ ఇస్తున్నా, రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్లలో బాల బాలికలకు ఒకే రకమైన ఫీజు విధానం ప్రకటించింది. అయితే కేంద్ర విద్యా సలహా మండలికి (కేబ్) చైర్మన్‌గా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ఫీజు రాయితీపై ఆలోచన చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ ఫీజు బాలురకు రూ.2,600 ఉండగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, బాలికలకు రూ.1,300 గా నిర్ణయించింది. ఇక జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లకు బాలురకు రూ.1,800 ఫీజు ఉంటే, బాలికలకు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకుంటోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్ తదితర సెట్స్ ఫీజును మాత్రం బాల బాలికలకు ఒకేలా నిర్ణయించింది. ఎంసెట్ అగ్రికల్చర్ లేదా ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏదేని ఒక పరీక్ష రాసే వారిలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 400 ఉంటే ఇతరులకు రూ.800గా నిర్ణయించింది. ఇందులో వికలాంగులకు, బాలికలకు ప్రత్యేకంగా ఎలాం టి రాయితీ కల్పించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు బాలికలకు ఫీజు రాయితీ ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పరీక్ష ఫీజుల్లోనూ కక్కుర్తే!
సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబానికి చెందిన వీరేంద్ర తన కొడుకు నీరజ్‌ను అప్పు చేసి మరీ కొద్దిగా పేరున్న ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో చేర్పించారు. ఏటా రూ. 30 వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు పరీక్ష ఫీజు చెల్లించే సమయం వచ్చే సరికి రూ.3 వేలు చెల్లించాలని యాజమాన్యం చెప్పింది. అదేంటి పరీక్ష ఫీజు రూ.450 ఉంటే రూ. 3 వేలు చెల్లించమని అడుగుతున్నారేంటి అని ప్రశ్నిస్తే అది అంతే... చెల్లించాల్సిందేనన్న సమాధానం వచ్చింది. దీంతో గత్యంతరం లేక ఆ మొత్తాన్ని చెల్లించారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి అయిన సురేష్ తన కొడుకు విజయ్ను బాగా చదివించాలన్న ఆశతో నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో గతేడాది ఎంపీసీలో చేర్చించారు. ఇపుడు ఆ విద్యార్థి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యాజమాన్యం రూ. 4 వేలు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పింది. ఇప్పటికే వార్షిక ఫీజుగా రూ. 45 వేలు చెల్లించిన సురేష్.. పరీక్ష ఫీజు అంతెందుకు ఉంటుందని ప్రశ్నిస్తే ‘మీ అబ్బాయి సెకండియర్ కదా... ప్రాక్టికల్స్ ఉంటాయి.. అందుకు ఇతర ఖర్చులుంటాయి.. చెల్లించాల్సిందేనని చెప్పారు. ఏం చేయాలో అర్థంకాక ఆ మొత్తాన్ని చెల్లించారు. ఇలా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తమ వసూళ్ల దందాను చివరకు పరీక్ష ఫీజులోనూ కొనసాగి స్తున్నాయి. బోర్డు వార్షిక ఫీజు రూ.1,950 ఉంటే రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. పరీక్ష ఫీజుల విషయంలోనూ విద్యార్థుల తల్లిదం డ్రుల నుంచి భారీగా దండుకుంటున్నాయి. బోర్డు నిర్ణీత పరీక్ష ఫీజు కంటే 200 నుంచి 300 రెట్లు వసూలు చేస్తున్నాయి. సాధారణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.1,000 వరకు వసూలు చేస్తుం డగా, పేరున్న ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. నియంత్రణ లేని వ్యవస్థతో అవస్థలు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో వార్షిక ఫీజులు, పరీక్ష ఫీజుల వసూళ్లలో నియంత్రణ లేకపోవ డంతో యాజమాన్యాలు తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయి. అయినా ఇంటర్ బోర్డు ఫీజుల నియంత్రణపై దృష్టి సారించడం లేదు. ఫలితం గా నిరుపేద ప్రజలు, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినా బోర్డు అధికారులు ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టట్లేదు. రాష్ట్రంలో 406 ప్రభు త్వ జూనియర్ కాలేజీలు ఉండగా, 1,550 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రైవేటు కాలేజీల్లోనే 7.5 లక్షల మంది చదువుతున్నారు. యాజమాన్యాలు ఇష్టా రాజ్యంగా చేస్తున్న వసూళ్లు ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి. అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తల్లిదండ్రుల ఫిర్యాదులతో యాజమాన్యాలు చేస్తున్న అధిక వసూళ్లపై ఇంటర్ బోర్డు స్పందిం చింది. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ మొత్తం చెల్లించొద్దని సూచించింది. అధిక మొత్తం చెల్లించాలని అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని, అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామంది. ఇవీ బోర్డు నిర్ణయించిన పరీక్ష ఫీజులు ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు రూ. 450 ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులకు రూ. 450 ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు రూ. 610 (రూ. 450 థియరీకి, రూ. 160 ప్రాక్టికల్స్‌కు) ప్రథమ, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులకు (ప్రాక్టికల్స్ కాకుండా అయితే) రూ. 450 ప్రథమ, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులకు (థియరీ రూ. 450, ప్రాక్టికల్స్ రూ. 160) మొత్తంగా రూ. 610. -
పరీక్ష ఫీజు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: పరీక్ష ఫీజు చెల్లించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన హైదరాబాద్ కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. అంబర్‌పేట మారుతీనగర్‌కు చెందిన శ్రీరాములు మాదిగ కూతురు కొల్లూరి వాత్సల్య(20) బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సెమిస్టర్ పరీక్షలో వాత్సల్య ఫెయిలైంది. దీంతో పరీక్ష ఫీజు చెల్లించే స్తోమత తల్లిదండ్రులకు లేదని ఆమె సుసైడ్ నోట్లో రాసి జామై ఉస్మానియా-ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు. -
‘టెన్త్’ పరీక్ష ఫీజు మినహాయింపు!
ప్రభుత్వ పరిశీలనలో ఫైలు ఆదాయ పరిమితిని రూ. లక్షకు పెంచే యోచన సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు మినహాయింపులో అశాస్త్రీయంగా ఉన్న మినహాయింపు నిబంధనలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫీజు మినహాయింపునకు పరిగణనలోకి తీసుకునే ఆదాయ పరిమితిని రూ. లక్షకు పెంచే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ప్రతిపాదనలపై పరిశీలన జరుపుతోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించే సయమానికల్లా దీనిని ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రామా ల్లో ఏటా రూ. 20 వేలలోపు ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారి పిల్లలకు, పట్టణాల్లో అయితే ఏటా రూ. 24 వేలలోపు వార్షికాదాయం ఉన్న వారి పిల్లలకు మాత్రమే ఫీజు మినహాయింపు వర్తిస్తోంది. అలాగే గ్రామాల్లో 2.5 ఎకరాలలోపు వెట్ ల్యాండ్ ఉన్న, 5 ఎకరాలలోపు డ్రై ల్యాండ్ ఉన్న వారి పిల్లలకు మినహాయింపు వరిస్తోంది. భూమి నిబంధనను పక్కనబెడితే.. ప్రస్తుతం గ్రామాల్లో కూలీకి రోజుకు రూ. 100 వరకు వస్తోంది. ఈ లెక్కన ఏటా వారి ఆదాయం రూ. 20 వేలు దాటుతోంది. ప్రస్తుత పరిస్థితులు, శాస్త్రీయత లేని ఆ నిబంధనల వల్ల విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఆ నిబంధనలను మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
గోల్నాక, న్యూస్‌లైన్: పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. గాయాలకు గురైన మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ కిందే పడి ఇద్దరూ చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అంబర్‌పేట ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం... రామంతాపూర్, చర్చికాలనీలో నివాసముంటున్న హేమంత్‌కుమార్(18), వివేక్భారత్(17), సాయి స్నేహితులు. ముగ్గురూ హబ్సిగూడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. వివేక్ పరీక్షల్లో తప్పడంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టేందుకు కాలేజీకి వెళ్లడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మిత్రుడు నవీన్ బైక్ ను తీసుకున్నాడు.బైక్‌పై తన వెంట స్నేహితులు హేమంత్‌కుమార్, సాయిలను తీసుకెళ్లాడు. అంబర్‌పేట మెయిన్‌రోడ్డు దగ్గరకు రాగానే ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేశారు. ఇదే క్రమంలో ముందు వె ళ్తున్న స్వీదా అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన టెంపో (ఏపీ22టి6818)ను కూడా ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్‌ను తాకింది. దీంతో హేమంత్‌కుమార్, వివేక్‌లు అంబులెన్స్ వెనుక టైర్ కింద పడ్డారు. హేమంత్ తలపై నుంచి టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలకు గురైన వివేక్ రక్తపు వాంతులు చేసుకోగా... అతడిని రామంతాపూర్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కొద్దిసేపటికే వివేక్ చనిపోయాడు. సాయికి స్వల్పగాయాలు తాకడంతో అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హేమంత్, వివేక్ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివేక్ తల్లిదండ్రులకు ఒకడే కుమారుడు కావడంతో వారి దుఖాఃనికి అంతులేకుండాపోయింది. కాగా, ప్రమాద స్థలిలో బైక్ రామంతాపూర్ వైపు పడి ఉండటం అనుమానాలు రేకెత్తిస్తోంది. రాంగ్రూట్లో వెళ్లడంతోనే...? గోల్నాక: అంబులెన్స్‌ను ఢీకొని ఇద్దరు విద్యార్థులు మరణించిన ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారని కొందరంటుండ గా... బిర్యానీ కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యారని మరి కొందరుంటున్నారు. రామంతాపూర్ చర్చి కాలనీలో ఉండే కొందరు మిత్రులు బిర్యానీ తీసుకురమ్మని చెప్పగా నవీన్ అనే స్నేహితుడి బైక్‌ను తీసుకొని వివేక్ తన మిత్రులు హేమంత్, సాయిలను తీసుకొని అంబర్‌పేట మెయిన్‌రోడ్డుకు వ చ్చాడంటున్నారు. బిర్యానీ తీసుకొని రామంతాపూర్ తిరిగి వెళ్తున్న వీరు.. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తున్న విషయం గమనించి, వారి నుంచి తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారంటున్నారు. -
పరీక్ష పేరుతో అక్రమ వసూళ్లు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: విద్యార్థులను దోచుకునేందుకు పరీక్ష ఫీజుల్ని సైతం అడ్డంపెట్టుకుంటున్నాయి కళాశాలల యాజమాన్యాలు. ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష ఫీజుకు మూడు రెట్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగులంతా ఆగస్టు 13 నుంచి నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నారు. రెండు నెలలుగా జీతాల్లేవు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల పిల్లల నుంచి కూడా ప్రైవేటు కాలేజీలు బలవంతంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ 300 మాత్రమే చెల్లిం చాల్సి ఉండగా యాజమాన్యాలు బలవంతంగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా విద్యార్థుల నుంచి అక్రమంగా రూ 3 కోట్ల అదనపు వసూళ్లకు తెగబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతుంది. జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో 30 ప్రభుత్వ, 15 ఎయిడెడ్, 110 అన్ ఎయిడెడ్ కాలేజీల్లో మొత్తం 50,642 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 24,847 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా 25,795 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో నిర్ణీత పరీక్ష ఫీజునే వసూలు చేస్తుండగా ప్రైవేటు కాలేజీలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. మూడు రెట్లు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇంటర్ సెకండియర్ సైన్స్ విద్యార్థుల నుంచి ప్రాక్టికల్స్ ఫీజులు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తున్నాయి. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు 17,500 మంది (ఎంపీసీ, బైపీసీ) నుంచి ప్రాక్టికల్స్ ఫీజుగా ఒక్కో విద్యార్థికి రూ 100 వసూలు చేయాల్సి ఉండగా నిర్బంధంగా రూ 200 వసూలు చేస్తున్నారు. రూ 3 కోట్ల అక్రమ వసూళ్లు మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజు దరఖాస్తు ఫారంతో కలిపి రూ 300 చెల్లించాల్సి ఉండగా వారి నుంచి రూ 1,000 వసూలు చేస్తున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ 300 పరీక్ష ఫీజు కట్టాల్సి ఉండగా వెయ్యి రూపాయలు, సైన్స్ విద్యార్థులైతే పరీక్ష ఫీజు, ప్రాక్టికల్ ఫీజుతో కలిపి రూ 400 కట్టాల్సి ఉండగా రూ 1200 వసూలు చేస్తున్నారు. సైన్స్ విద్యార్థులు ఎంపీసీ అయితే 60 మార్కులకు, బైపీసీ అయితే 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ మార్కులు వారికి కీలకం. మంచి మార్కులు వచ్చేలా ప్రాక్టికల్స్‌లో ‘మేనేజ్’ చేసేందుకు, రాత పరీక్షలో సాయం చేసేందుకు అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఈనెల 17న కాలేజీలకు వచ్చే రోజు పరీక్ష ఫీజుతో రావాలని యాజ మాన్యాలు ఆదేశించాయి. అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు ఇంటర్మీడియెట్ విద్యార్థుల నుంచి ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశించిన ఫీజునే వసూలు చేయాలి. పరీక్ష ఫీజు పేరుతో కళాశాలల యాజమాన్యాలు అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) పి.మాణిక్యం హెచ్చరించారు. అదనపు ఫీజులు వసూలు చేసే కళాశాలల గురించి తమకు ఫిర్యాదు చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తనకు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఫీజు ‘పరీక్ష’
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ నిర్ణయాలతో పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వార్షిక పరీక్ష ఫీజు మాఫీ చేయాలని భావించినా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వార్షిక ఆదాయం రూ.24 వేలలోపు ఉంటేనే పరీక్ష ఫీజు మాఫీ చేస్తామని బోర్డ్ ఆఫ్ సెకండరీ ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు జీవో 109 విడుదల చేసింది. అయితే వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలు రూ.40 వేల కంటే తక్కువగా ఇవ్వలేమని తహశీల్దార్లు ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2014 మార్చిలో జరగాల్సిన పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అక్టోబర్ 21 లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ఆఫ్ సెకండరీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మొదటిసారిగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రూ.125 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మాఫీ అవకాశం ఉం ది. విద్యార్థులు ఫీజు మాఫీని పొందాలం టే పట్టణ ప్రాంత విద్యార్థులు రూ.24 వేలలోపు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు రూ.20 వేలలోపు వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలనే షరతు ఉం ది. ఇంత తక్కువఆదాయం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి తహశీల్దార్లు సు ముఖత చూపడం లేదు. ప్రభుత్వ పథకా లు పొందేందుకు అవసరమైన తెల్లరేషన్ కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుం బ వార్షికాదాయం కనీసం రూ.60 వేలు, పట్టణ ప్రాంతవాసులకు రూ.70 వేలు మించకూడదన్న నిబంధనలున్నాయి. వృత్తి విద్యా కోర్సుల్లో లబ్ధిపొందాలంటే వార్షికాదాయం గరిష్ట పరిమితి రూ.లక్షగా నిర్ధారించారు. పదో తరగతి విద్యార్థుల ఫీజు మాఫీ విషయంలో వివక్ష చూపుతోందని పదో తరగతి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 43 వేల మందికిపైగా విద్యార్థులకు నష్టం జిల్లాలో సుమారు 43 వేల మందికిపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో సుమారు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉంటారు. అంటే సుమారు 30 వేలకుపై చిలుకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. సాధారణంగా పదో తరగతి వరకున్న పాఠశాలలో ఫీజు రూ.125 ఉంటే, జిల్లాలో వృత్తివిద్యా కోర్సులు అమలులో ఉన్నా ఆదిలాబాద్(బాలికలు), భీమారం, ఉట్నూర్, తపాళాపూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), కౌట(బి), నిర్మల్‌లలోని ప్రభుత్వ పాఠశాలలో ఫీజు రూ.125కు అదనంగా మరో రూ.60 చెల్లించాలి. పదో తరగతి ఫీజు మాఫీకి అనుగుణంగా రూ.24 వేలు, రూ.20 వేల వార్షికాదాయం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది కూడా ఇటువంటి నిబంధనలే విధించడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఫీజు మాఫీ పథకం ప్రవేశ పెట్టినా నిబంధనల పేరుతో ఆంక్షలు విధించడం వల్ల నిరుపేద విద్యార్థులు లబ్ధి పొందలేక పోతున్నారని విద్యార్థి సంఘాలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలలో సడలింపులు చేసి అర్హులైన పదో తరగతి విద్యార్థులందరికీ ఫీజు మాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదాయం పెంచి ఫీజు మాఫీ చేయాలి.. ప్రభుత్వం ఫీజు మాఫీ పథకం బాగున్నా వార్షికాదాయం విషయంలో గందరగోళం ఉంది. రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే రూ.20 వేలు, రూ.24 వేలు గల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఇక ఫీజు ఎలా మాఫీ అవుతుంది. ప్రభుత్వం మాకు మేలు కలిగే విధంగా పట్టణ ప్రాంతాల వారికి రూ.70 వేలు, గ్రామీణ ప్రాంతాలవారికి రూ.60 వేల వరకు వార్షికాదాయం ఉన్న ఫీజు మాఫీ చేయాలి. ఇలా చేస్తే మేలు జరుగుతుంది. - భాగ్యలక్ష్మి, పదో తరగతి, బాలికల ఉన్నత పాఠశాల, జన్నారం -
ఫీజు మాఫీ అయ్యేనా?
మెదక్, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షల ఫీజు మాఫీ కోసం ప్రభుత్వం విధించిన ఆంక్షలు అలవికానివిగా ఉన్నాయి. వార్షికాదాయం రూ.24 వేలలోపు ఉంటేనే పరీక్ష ఫీజు మాఫీ చేస్తామని బోర్డు ఆఫ్ సెకండరీ ప్రకటించడంతో, ఆదాయం సర్టిఫికెట్ కోసం విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. కాగా వార్షికాదాయ సర్టిఫికెట్ కనీసం రూ.40 వేలకు తగ్గించి ఇచ్చేది లేదని తహశీల్దార్లు ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తప్పనిసరి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2014 మార్చిలో జరగాల్సిన పదో తరగతి పరీక్షల కోసం అక్టోబర్ 20 లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ఆఫ్ సెకండరీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మొదటిసారిగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి. కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజుమాఫీ అవకాశం ఉంది. కాని పట్టణ ప్రాంత విద్యార్థులైతే రూ.24 వేలలోపు, గ్రామీణ ప్రాంతాల వాసులైతే రూ.20 వేలలోపు వార్షికాదాయ ధ్రువపత్రం తేవాలని షరతులు విధించింది. అయితే ఇంత తక్కువ మొత్తంలో ఆదాయం సర్టిఫికెట్ ఇవ్వడానికి తహశీల్దార్లు సుముఖత చూపడం లేదు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవసరమైన తెల్ల రేషన్‌కార్డు కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం కనీసం రూ. 60 వేలు, పట్టణ వాసులైతే రూ.70 వేలు మించకూడదన్న నిబంధనలున్నాయి. వృత్తి విద్యా కోర్సుల్లో లబ్ధి పొందాలంటే వార్షికాదాయం గరిష్ట పరిమితిని రూ.లక్షగా నిర్ధారించారు. అయితే ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు మాఫీ విషయంలో చూపుతున్న వివక్షతో తాము నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈసారి సుమారు 45 వేల మంది విద్యార్థులు రాసే అవకాశం ఉంది. ఇందులో సుమారు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉంటారు. అంటే సుమారు 30 వేల పైచిలుకు విద్యార్థులు తమ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.24 వేలు, 20 వేల వార్షికాదాయం సర్టిఫికెట్ ఇవ్వాలంటే అది సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి నిబంధనలు విధించడంతో విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఫీజు మాఫీ పథకం ప్రవేశ పెట్టినప్పటికీ నిబంధనల పేరుతో ఆంక్షలు విధించడం వల్ల నిరుపేద విద్యార్థులు లబ్ధి పొందలేకపోతున్నారు.