మెదక్, న్యూస్‌లైన్:
పదో తరగతి పరీక్షల ఫీజు మాఫీ కోసం ప్రభుత్వం విధించిన ఆంక్షలు అలవికానివిగా ఉన్నాయి. వార్షికాదాయం రూ.24 వేలలోపు ఉంటేనే పరీక్ష ఫీజు మాఫీ చేస్తామని బోర్డు ఆఫ్ సెకండరీ ప్రకటించడంతో, ఆదాయం సర్టిఫికెట్ కోసం విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. కాగా వార్షికాదాయ సర్టిఫికెట్ కనీసం రూ.40 వేలకు తగ్గించి ఇచ్చేది లేదని తహశీల్దార్లు ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తప్పనిసరి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2014 మార్చిలో జరగాల్సిన పదో తరగతి పరీక్షల కోసం అక్టోబర్ 20 లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ఆఫ్ సెకండరీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మొదటిసారిగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి. కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజుమాఫీ అవకాశం ఉంది. కాని పట్టణ ప్రాంత విద్యార్థులైతే రూ.24 వేలలోపు, గ్రామీణ ప్రాంతాల వాసులైతే రూ.20 వేలలోపు వార్షికాదాయ ధ్రువపత్రం తేవాలని షరతులు విధించింది. అయితే ఇంత తక్కువ మొత్తంలో ఆదాయం సర్టిఫికెట్ ఇవ్వడానికి తహశీల్దార్లు సుముఖత చూపడం లేదు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవసరమైన తెల్ల రేషన్‌కార్డు కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం కనీసం రూ. 60 వేలు, పట్టణ వాసులైతే రూ.70 వేలు మించకూడదన్న నిబంధనలున్నాయి.
వృత్తి విద్యా కోర్సుల్లో లబ్ధి పొందాలంటే వార్షికాదాయం గరిష్ట పరిమితిని రూ.లక్షగా నిర్ధారించారు. అయితే ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు మాఫీ విషయంలో చూపుతున్న వివక్షతో తాము నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈసారి సుమారు 45 వేల మంది విద్యార్థులు
రాసే అవకాశం ఉంది. ఇందులో సుమారు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉంటారు. అంటే సుమారు 30 వేల పైచిలుకు విద్యార్థులు తమ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.24 వేలు, 20 వేల వార్షికాదాయం సర్టిఫికెట్ ఇవ్వాలంటే అది సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి నిబంధనలు విధించడంతో విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఫీజు మాఫీ పథకం ప్రవేశ పెట్టినప్పటికీ నిబంధనల పేరుతో ఆంక్షలు విధించడం వల్ల నిరుపేద విద్యార్థులు లబ్ధి పొందలేకపోతున్నారు.
ఫీజు మాఫీ అయ్యేనా?
Published Mon, Sep 30 2013 11:41 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement