ఉట్నూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ నిర్ణయాలతో పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వార్షిక పరీక్ష ఫీజు మాఫీ చేయాలని భావించినా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వార్షిక ఆదాయం రూ.24 వేలలోపు ఉంటేనే పరీక్ష ఫీజు మాఫీ చేస్తామని బోర్డ్ ఆఫ్ సెకండరీ ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు జీవో 109 విడుదల చేసింది. అయితే వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలు రూ.40 వేల కంటే తక్కువగా ఇవ్వలేమని తహశీల్దార్లు ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2014 మార్చిలో జరగాల్సిన పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అక్టోబర్ 21 లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ఆఫ్ సెకండరీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మొదటిసారిగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రూ.125 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మాఫీ అవకాశం ఉం ది.
విద్యార్థులు ఫీజు మాఫీని పొందాలం టే పట్టణ ప్రాంత విద్యార్థులు రూ.24 వేలలోపు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు రూ.20 వేలలోపు వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలనే షరతు ఉం ది. ఇంత తక్కువఆదాయం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి తహశీల్దార్‌లు సు ముఖత చూపడం లేదు. ప్రభుత్వ పథకా లు పొందేందుకు అవసరమైన తెల్లరేషన్ కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుం బ వార్షికాదాయం కనీసం రూ.60 వేలు, పట్టణ ప్రాంతవాసులకు రూ.70 వేలు మించకూడదన్న నిబంధనలున్నాయి. వృత్తి విద్యా కోర్సుల్లో లబ్ధిపొందాలంటే వార్షికాదాయం గరిష్ట పరిమితి రూ.లక్షగా నిర్ధారించారు. పదో తరగతి విద్యార్థుల ఫీజు మాఫీ విషయంలో వివక్ష చూపుతోందని పదో తరగతి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
43 వేల మందికిపైగా విద్యార్థులకు నష్టం
జిల్లాలో సుమారు 43 వేల మందికిపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో సుమారు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉంటారు. అంటే సుమారు 30 వేలకుపై చిలుకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. సాధారణంగా పదో తరగతి వరకున్న పాఠశాలలో ఫీజు రూ.125 ఉంటే, జిల్లాలో వృత్తివిద్యా కోర్సులు అమలులో ఉన్నా ఆదిలాబాద్(బాలికలు), భీమారం, ఉట్నూర్, తపాళాపూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), కౌట(బి), నిర్మల్‌లలోని ప్రభుత్వ పాఠశాలలో ఫీజు రూ.125కు అదనంగా మరో రూ.60 చెల్లించాలి.
పదో తరగతి ఫీజు మాఫీకి అనుగుణంగా రూ.24 వేలు, రూ.20 వేల వార్షికాదాయం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది కూడా ఇటువంటి నిబంధనలే విధించడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఫీజు మాఫీ పథకం ప్రవేశ పెట్టినా నిబంధనల పేరుతో ఆంక్షలు విధించడం వల్ల నిరుపేద విద్యార్థులు లబ్ధి పొందలేక పోతున్నారని విద్యార్థి సంఘాలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలలో సడలింపులు చేసి అర్హులైన పదో తరగతి విద్యార్థులందరికీ ఫీజు మాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదాయం పెంచి ఫీజు మాఫీ చేయాలి..
ప్రభుత్వం ఫీజు మాఫీ పథకం బాగున్నా వార్షికాదాయం విషయంలో గందరగోళం ఉంది. రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే రూ.20 వేలు, రూ.24 వేలు గల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఇక ఫీజు ఎలా మాఫీ అవుతుంది. ప్రభుత్వం మాకు మేలు కలిగే విధంగా పట్టణ ప్రాంతాల వారికి రూ.70 వేలు, గ్రామీణ ప్రాంతాలవారికి రూ.60 వేల వరకు వార్షికాదాయం ఉన్న ఫీజు మాఫీ చేయాలి. ఇలా చేస్తే మేలు జరుగుతుంది.
- భాగ్యలక్ష్మి, పదో తరగతి, బాలికల ఉన్నత పాఠశాల, జన్నారం
ఫీజు ‘పరీక్ష’
Published Sat, Oct 5 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement