పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
గోల్నాక, న్యూస్‌లైన్: పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. గాయాలకు గురైన మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ కిందే పడి ఇద్దరూ చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం... రామంతాపూర్, చర్చికాలనీలో నివాసముంటున్న హేమంత్‌కుమార్(18), వివేక్‌భారత్(17), సాయి స్నేహితులు. ముగ్గురూ హబ్సిగూడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు.
వివేక్ పరీక్షల్లో తప్పడంతో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టేందుకు కాలేజీకి వెళ్లడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మిత్రుడు నవీన్ బైక్ ను తీసుకున్నాడు.బైక్‌పై తన వెంట స్నేహితులు హేమంత్‌కుమార్, సాయిలను తీసుకెళ్లాడు. అంబర్‌పేట మెయిన్‌రోడ్డు దగ్గరకు రాగానే ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్ చేశారు. ఇదే క్రమంలో ముందు వె ళ్తున్న స్వీదా అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన టెంపో (ఏపీ22టి6818)ను కూడా ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్‌ను తాకింది. దీంతో హేమంత్‌కుమార్, వివేక్‌లు అంబులెన్స్ వెనుక టైర్ కింద పడ్డారు. హేమంత్ తలపై నుంచి టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రగాయాలకు గురైన వివేక్ రక్తపు వాంతులు చేసుకోగా... అతడిని రామంతాపూర్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కొద్దిసేపటికే వివేక్ చనిపోయాడు. సాయికి స్వల్పగాయాలు తాకడంతో అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హేమంత్, వివేక్ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివేక్ తల్లిదండ్రులకు ఒకడే కుమారుడు కావడంతో వారి దుఖాఃనికి అంతులేకుండాపోయింది. కాగా, ప్రమాద స్థలిలో బైక్ రామంతాపూర్ వైపు పడి ఉండటం అనుమానాలు రేకెత్తిస్తోంది.
రాంగ్‌రూట్లో వెళ్లడంతోనే...?
గోల్నాక: అంబులెన్స్‌ను ఢీకొని ఇద్దరు విద్యార్థులు మరణించిన ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఫీజు కట్టేందుకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారని కొందరంటుండ గా... బిర్యానీ కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యారని మరి కొందరుంటున్నారు. రామంతాపూర్ చర్చి కాలనీలో ఉండే కొందరు మిత్రులు బిర్యానీ తీసుకురమ్మని చెప్పగా నవీన్ అనే స్నేహితుడి బైక్‌ను తీసుకొని వివేక్ తన మిత్రులు హేమంత్, సాయిలను తీసుకొని అంబర్‌పేట మెయిన్‌రోడ్డుకు వ చ్చాడంటున్నారు. బిర్యానీ తీసుకొని రామంతాపూర్ తిరిగి వెళ్తున్న వీరు.. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తున్న విషయం గమనించి, వారి నుంచి తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారంటున్నారు.