
104, 108 సేవల నిర్వహణ టెండర్‌లలో వైద్యశాఖ వింత నిబంధనలు
పశు వైద్య సేవలు నిర్వహించినా అర్హత
అసోం, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో కానరాని ‘పశు వైద్య సేవలు’ అంశం
అస్మదీయ సంస్థకు అత్యవసర, సంచార వైద్య సేవల్లో అనుభవ లేమి
‘భవ్య’మైన స్కెచ్‌లో భాగమే టెండర్ నిబంధనల్లో పశువైద్య సేవలకు చోటు
సాక్షి, అమరావతి: బోడి గుండుకు... మోకాలికి ముడిపెట్టినట్టు.. మనుషుల వైద్య సేవల కాంట్రాక్ట్‌లో పశువుల వైద్య సేవల్లో అనుభవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముడిపెట్టింది. 104 మొబైల్ మెడికల్ యూనిట్‌లు (ఎంఎంయూ), 108 అంబులెన్స్‌ల నిర్వహణ టెండర్‌లలో సంచార పశువైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు అర్హత కల్పిస్తూ వైద్యశాఖ నిబంధనలు పొందుపరిచింది. సాధారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల వైద్య శాఖలు ఈ టెండర్‌లలో పాల్గొనే సంస్థలు గతంలో ఆయా విభాగాల్లో అనుభవం, సామర్థ్యం కలిగి ఉండాలని నిబంధనలు పెడుతుంటాయి.
ఏపీలో గతంలో నిర్వహించిన టెండర్‌లలో సైతం అవే నిబంధనలున్నాయి. కానీ, తొలిసారిగా గతానికి భిన్నంగా పశు వైద్య సేవల కల్పనలో అనుభవాన్ని ప్రస్తుత టెండర్ నిబంధనల్లో చేర్చారు. ‘భవ్య’మైన స్కెచ్‌లో ఇదీ భాగమేనని తెలుస్తోంది. రూ. రెండు వేల కోట్ల అంచనాలతో కూడిన ఎంఎంయూ, 108 అంబులెన్స్‌లు, కాల్ సెంటర్ నిర్వహణ కోసం ఐదేళ్ల కాలపరిమితికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్‌లను ఆహ్వానించింది. ఐదేళ్లకు రూ. రెండు వేల కోట్ల మేర అంచనాలున్నాయి.
పెద్ద ఎత్తున దోపిడీకి స్కెచ్
అయితే... 104, 108 అంబులెన్స్‌ల నిర్వహణలో అస్మదీయ సంస్థకు పెద్దగా అనుభవం లేదు. ఆ సంస్థ ఉత్తరాదితోపాటు, మధ్య భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పశు సంచార వైద్య సేవల కాంట్రాక్టులు నిర్వహించిన అనుభవం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కేవలం 104, 108 నిర్వహణ అనుభవం ప్రాతిపదికన నిబంధనలు ఉన్నట్లయితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుంది.
అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సంబంధం లేని పశు వైద్య సేవల వాహనాల నిర్వహణ అంశాన్ని టెండర్ నిబంధనల్లో చేర్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున దోచుకోవడం కోసం ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యాన్ని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదని టెండర్ నిబంధనలు చూసిన వైద్య రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
ఇక్కడ మాత్రమే వింత నిబంధనలు
దేశవ్యాప్తంగా అనుభవం, అవగాహన ఉన్న సంస్థలకే 108, 104 కాంట్రాక్ట్‌లు ఇచ్చేలా అనేక రాష్ట్రాలు అడుగులు వేస్తుంటే... చంద్రబాబు పాలనలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం వింత నిబంధనలు విధిస్తోంది. గడిచిన ఐదేళ్లలో అంబులెన్స్‌లు/ఎంఎంయూలతో పాటు మొబైల్ వెటర్నరీ యూనిట్స్/వెటర్నరీ క్లినిక్స్ వంటి పశు వైద్య సేవల నిర్వహించిన అనుభవాన్ని నిబంధనల్లో చేర్చారు.
108, 104 కలిపి 1700 వాహనాలను నిర్వహించాల్సి ఉండగా బిడ్ వేసే నాటికి వంద వాహనాలు నిర్వహించిన అనుభవం ఉన్నా చాలనే షరతు పెట్టారు. అంతేకాకుండా అంబులెన్స్, ఎంఎంయూ వాహనాల నిర్వహణ అనుభవానికి మార్కులు కేటాయించే విధానాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని అత్యవసర వైద్య సేవల కల్పన పేరుతో కనీస అనుభవం లేని సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెడితే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలేనని వైద్య శాఖలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
» గడిచిన రెండు, మూడేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 108, 104 వాహనాల నిర్వహణ కోసం పిలిచిన టెండర్‌ల నిబంధనలను ఓసారి పరిశీలిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ దోపిడీ స్కెచ్ అందరికీ అర్థం అవుతుంది.
» అసోంలో గతేడాది అంబులెన్స్‌ల నిర్వహణ కోసం వైద్య శాఖ టెండర్‌లు నిర్వహించింది. టెండర్ పిలిచిన నాటికి ముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లో అంబులెన్స్ సేవలు నిర్వహించి ఉండటంతో పాటు, బిడ్‌లు వేసిన సంస్థలకు 600లకు పైగా అంబులెన్స్‌లు నిర్వహించిన అనుభవం, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే షరతు ఉంది.
» జమ్ము కశ్మీర్‌లో గతేడాది అక్టోబర్‌లో టెండర్‌లు పిలిచారు. బిడ్‌లు వేసే సంస్థలకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 650 బేసికల్ లైఫ్ సపోర్ట్ (బీఎల్‌ఎస్), 150 మేజర్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్‌ఎస్)అంబులెన్స్‌లతో పాటు, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించిన అనుభవం ఉండాలనేది నిబంధన.
» కేరళలో ప్రస్తుతం అంబులెన్స్ నిర్వహణకు టెండర్‌లు నడుస్తున్నాయి. బిడ్‌లు వేసే సంస్థలు కనీసం 150 అంబులెన్స్‌లు నడిపిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. అదే విధంగా అంబులెన్స్ నిర్వహణ అనుభవానికి కూడా మార్కులు ఇచ్చి, అత్యంత అనుభవం కలిగిన సంస్థను ఎంపిక చేస్తున్నారు.
» ఇక... తెలంగాణలో 2022లో 108 టెండర్‌లు నిర్వహించారు. మూడేళ్ల పాటు కనీసం 200 అంబులెన్స్‌లను,
40 సీటింగ్ సామర్థ్యంతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే నిబంధన పెట్టారు.
» ఛత్తీస్‌గఢ్‌లో ఎంఎంయూ వాహనాల నిర్వహణ కోసం గత నెలలో టెండర్‌లు పిలిచారు. బిడ్‌లు వేసే సంస్థలు మొబైల్ మెడికల్ వ్యాన్స్ (ఎంఎంవీ), ఎంఎంయూ, మొబైల్ హెల్త్ యూనిట్స్ నిర్వహించి ఉండాలని
నిబంధన పెట్టారు. ఇక్కడ కూడా అనుభవానికి మార్కులు కేటాయించి, ఎంపిక చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment