గాల్లో దీపంలా పేదల ప్రాణాలు | Severe shortage of immunoglobulins in government hospitals across AP | Sakshi
Sakshi News home page

గాల్లో దీపంలా పేదల ప్రాణాలు

Published Tue, Feb 18 2025 4:10 AM | Last Updated on Tue, Feb 18 2025 4:10 AM

Severe shortage of immunoglobulins in government hospitals across AP

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఇమ్యూనోగ్లోబులిన్స్‌కు తీవ్ర కొరత 

10 జీజీహెచ్‌ల్లో నిల్వలు సున్నా 

ఐదారునెలలుగా ఇదే పరిస్థితి 

జీబీఎస్‌ చికిత్సలో ఇమ్యూనోగ్లోబులిన్స్‌దే కీలక పాత్ర

టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్‌ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనోగ్లోబిలిన్స్‌ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు.

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గులియన్‌ బారె సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనో గ్లోబిలిన్స్‌ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటికి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు, మరికొన్ని జీజీహెచ్‌ల్లో ఇమ్యునో గ్లోబులిన్‌ ఇంజెక్షన్ల నిల్వలు “సున్నా’గా ఉన్నాయి. 

గడిచిన ఐదు, ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల్లోని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) నుంచి సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్‌ కేసులు క్రమంగా పెరుగుతుయని, ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు పలుమార్లు చెప్పడంతో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న రెండు, మూడు ఆస్పత్రుల నుంచి మిగిలిన వాటికి చాలీచాలనట్టుగా సర్దుబాటు చేసే పనిలో వైద్య శాఖ నిమగ్నమైంది.

కేసులన్నీ రిఫర్‌ 
ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌కు గురవుతారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీబీఎస్‌ బారినపడిన వారిలోను స్వీయ రోగనిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనో గ్లోబులిన్స్‌ థెరపీ ఇస్తుంటారు. ప్రైవేట్‌లో ఈ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.40 వేల వరకు ఉంటోంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, చికిత్స చేయించుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు స్తోమతకు మించిన వ్యవహారం. 

ఇక జీబీఎస్‌తో పాటు, ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌తో బాధపడే చిన్న పిల్లలు... బోధనాస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో చికిత్సకు ఇమ్యూనో గ్లోబులిన్స్‌ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. కేవలం ఈ కారణంతో గడిచిన ఐదారు నెలలుగా అనేక కేసులను విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆస్పత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేసినట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆస్పత్రుల నుంచి విశాఖకు,  కర్నూలు ఆస్పత్రికి అనంతపురం, కడప తదితరాల నుంచి రిఫరల్‌ కేసులు పెరగడంతో ఈ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది.  

ప్రాణాలతో చెలగాటం
వైద్యశాఖలో ఏఐ వినియోగం పెరగాలి.. రోగులకు వైద్య సేవలు మరింత చేరువవ్వాలి... అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అయితే, ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళితే కనీసం మందులు కూడా అందుబాటులో లేని దీనావస్థలో ఆస్పత్రులను నెట్టేశారు. 

మెరుగైన వైద్యం కోసం కాకుండా.. కేవలం ఇంజెక్షన్లు, మందులు లేవన్న కారణంతో రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫరల్‌ పేరిట ప్రభుత్వమే బంతాట ఆడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో చికిత్సల్లో కాలయాపన జరుగుతోంది. వెరసి రోగులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. మరోవైపు సకాలంలో చికిత్సలు అందక అమాయకులు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్‌ ఇవ్వడంలేదు
గులియన్‌ బారె సిండ్రోమ్‌ (జీబీఎస్‌) అంటువ్యాధి కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. సోమవారం జీబీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.  ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. 

ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 749 ఇమ్యూనో గ్లోబులిన్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.అయితే ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు ఈ ఇంజక్షన్‌ను ఇవ్వడానికి ముందుకురావడంలేదన్నారు. గత ఏడాది 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదు కాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యామని వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement