Medical Services
-
‘బీమా’కు నైవేద్యం.. ఆరోగ్యం హరీ!
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. సూపర్–6, సూపర్ సెవన్ హామీల ఎగవేతల పరంపరలో భాగంగా ఈసారి ప్రజారోగ్యానికి ఎసరు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. కేవలం రూ.2.5 లక్షలతో బీమా పథకాన్ని అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోని కుటుంబాలకే వర్తింపజేస్తామని చావు కబురు చల్లగా చెప్పారు! ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి ఇప్పటికే ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ట్రస్టు పరిధిలో అమలు చేసి 95 శాతం కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాపీ కొట్టి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో ప్రైవేట్ బీమా కంపెనీని తెరపైకి తెచ్చి ప్రజారోగ్యాన్ని దళారీల చేతికి అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమాను వర్తింపజేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెబుతుండటం గమనార్హం. పదో వంతుతో సరి.. రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తించేలా మెలిక పెడుతోంది. దీన్ని ‘యూనివర్సల్ ఇన్సూరెన్స్’ అంటూ గొప్పలు చెబుతోంది. వాస్తవానికి రూ.25 లక్షల వరకూ పరిమితితో ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 95 శాతం కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు కల్పిస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎగవేతలు, కోతలే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య భరోసాకు తూట్లు పొడుస్తున్నారు. దేశంలో ఇప్పటికే బీమా విధానాన్ని అమలు చేసిన పలు రాష్ట్రాలు పెదవి విరిచాయి. మహారాష్ట్ర, కేరళ బీమా విధానాన్ని విడనాడి తిరిగి ఆరోగ్యశ్రీ తరహా ట్రస్ట్ విధానం బాట పట్టాయి. దీన్ని పెడచెవిన పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని బలి పెడుతోంది. అంతా అస్తవ్యస్థం.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా పథకం నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ అని పథకం పేరు మార్చడం మినహా కనీసం శాశ్వత సీఈవోను సైతం నియమించలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. దీంతో ఏడాది తిరగకుండానే ఆస్పత్రులు ఏకంగా నాలుగు సార్లు కూటమి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. అయినప్పటికీ సర్కారులో చలనం లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఇక ఆరోగ్య ఆసరా కింద ఇప్పటికే రూ.నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వం రోగులకు బకాయి పడింది. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న బీమా విధానంలో ఆసరా సాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజ్‌లు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడిన్ సొల్యూషన్ కొరత నెలకొంది. విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక మందులు, సర్జికల్ ఐటమ్స్ బయట కొనుగోలు చేయాలని వైద్యులు రోగులకు చీటీలు రాసిస్తున్నారు. ఇక వైద్య పరికరాలు పాడైతే పట్టించుకునే వారే లేరు. ఆదుకున్న ఆరోగ్య ఆసరా.. ఒకవైపు ప్రజలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించిన వైఎస్ జగన్ మరోవైపు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకూ ఆ కుటుంబం జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆదుకున్నారు. వైద్యులు సూచించిన మేరకు నెలకు రూ.5 వేల వరకూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రోజే రోగుల ఖాతాల్లో జమ చేశారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆస్పత్రి పాలైతే పోషణ కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అందించిన ఆరోగ్య ఆసరా సాయం కష్ట కాలంలో వారు ఆర్ధిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంది. ఇలా వైఎస్ జగన్ హయాంలో ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభించింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ హయాంలో పథకం అమలైన తీరు, లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అరకొర ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీకి రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2019–24 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.13 వేల కోట్లకుపైగా వెచ్చించి 45 లక్షల మందికిపైగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించింది. మరో 24.59 లక్షల మంది రోగులకు డిశ్చార్జీ అనంతరం జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లు చెల్లించారు. నాడు కోటిన్నర కుటుంబాలకు భరోసాదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా రూ.25 లక్షల వరకూ వైద్య పరిమితితో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసింది. చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, పేదలు వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకే పరిమితం అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా అండగా నిలిచింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పథకాన్ని విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. ఏకంగా 3,257 ప్రొసీజర్లలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్, గుండె మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా లభించాయి. 54 వేలకు పైగా పోస్టుల భర్తీ..ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా వైద్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రధాన సమస్య మానవ వనరుల కొరతను నివారించేందుకు మునుపెన్నడూ లేని విధంగా 2019–24 మధ్య ఏకంగా 54 వేలకుపైగా వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్లకు (ఎంవో) గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని, 22.30 శాతం ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్రమే ఉన్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్సీ వైద్యులు తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి.. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించేవారు. పట్టణ పీహెచ్‌సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల గత సర్కారు తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం.జీరో వేకెన్సీ పాలసీ..2019–24 మధ్య వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగ విరమణ, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేశారు. కేవలం వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ –ఇన్ –ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు దేశవ్యాప్తంగా 61 శాతం కొరత ఉండగా రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతను అధిమించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో అభినందించింది. ఏపీ విధానాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్లు ఇస్తూ మిగిలిన రాష్ట్రాలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడిచింది. ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ కాకపోవడంతో వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది.రెండో రోజు నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు సాక్షి, అమరావతి: నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలు రెండో రోజు మంగళవారం నిలిచిపోయాయి. రూ.3 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించలేదు. దీంతో సోమవారం నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ లబ్ధిదారులు చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నా నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేది లేక జేబులో డబ్బులు పెట్టి ప్రజలు, ఉద్యోగులు చికిత్సలు చేయించుకుంటున్నారు. మరోవైపు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చర్చలు నిర్వహించారు. నిలిపి వేసిన సేవలను పునఃప్రారంభించాలని కోరారు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు అందించలేమని ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రెండు గంటల పాటు సాగిన చర్చల్లో త్వరలోనే రూ.500 కోట్లు బిల్లులు విడుదల చేస్తామని ఆస్పత్రులకు హామీ ఇచ్చినట్టు వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చిన హామీపై అసోసియేషన్ సభ్యులతో చర్చించి, బుధవారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆశా ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. -
10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం!
సాక్షి, హైదరాబాద్: పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవలను నిలిపివేస్తామని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు భారీగా ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలి పాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ నేతృత్వంలోని ప్రతినిధులు ఆరోగ్య శ్రీ సీఈవోకు మెయిల్ ద్వారా లేఖ పంపారు. 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 368 నెట్వర్క్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కింద రాష్ట్రంలో 368 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలను కూడా చేర్చారు. ఈ పథకాల కింద చేసే చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.672 కోట్లు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అధిక ప్రచారంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ఇప్పటివరకు రూ.920 కోట్లు చెల్లించింది. ఇందులో పాత బకాయి రూ.672 కోట్లు పోను సుమారు రూ. 250 కోట్లు మాత్రమే కొత్తగా ఈ ఏడాది కాలంలో చెల్లించిందన్న మాట. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 368 ఆసుపత్రులకు కలిపి సుమారు రూ.1000 కోట్లకు పైగా రీయింబర్స్మెంట్ రావలసి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఒక్కో ఆసుపత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు గత సంవత్సరం జనవరి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ స్పష్టం చేశారు. బకాయిలు రూ.500 కోట్లే: అధికారులు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1000 కోట్లు ఉన్నాయన్న వాదనను ఆరోగ్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. రూ.500 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది కాలంలో రూ.920 కోట్లు చెల్లించామని, డిసెంబర్ చివరి వారంలో కూడా రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు. 2014– 2023 మధ్య ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు సగటున రూ.52 కోట్ల చొప్పున గత సర్కారు చెల్లిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య ప్రతి నెలా నెట్వర్క్ ఆసుపత్రులకు సగటున రూ.72 కోట్లు చొప్పున చెల్లించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. -
Andhra Pradesh: నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాథేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద ఔట్‌పేషెంట్ (ఓపీ), ఇన్ పేషెంట్ (ఐపీ) ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచి పోవడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘రూ. 3 వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు. వెంటనే ఆదుకుని రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలు ఆపేస్తాం’ అని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను ఆపేశాయి. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల వ్యవధిలో బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చాయి. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లతోపాటు ప్రతి నెల గ్రీన్ చానెల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది నెలలుగా చాలావరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఐపీ సేవలను కూడా నిలిపేశాయి. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు తేల్చిచెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తూ.. మరోవైపు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేయడం కోసం ప్రజారోగ్యంతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షకు పెద్దపీట వేసే కంపెనీలతో బీమా కార్యక్రమం అమలు కోసం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చర్చలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని.. చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపేసినట్టు వివరించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కాగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 1 నుంచి రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేశాయి. -
ఆయుష్షు పెంచే ‘ఏఐ’
సాక్షి, విశాఖపట్నం: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ).. అన్ని రంగాల్లోనూ ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమూల మార్పులు తెస్తోంది. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలతో ప్రపంచాన్ని మార్చేస్తోంది. వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఈ కృత్రిమ మేధ మనిషి ఆయుష్షును పెంచడానికి కూడా దోహద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ ప్రెసిడెంట్ డా. ప్రతీక్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్‌టెక్ సదస్సులో పాల్గొన్న డా. ప్రతీక్ శర్మ వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.ఇప్పుడు 6% మాత్రమే ఉపయోగిస్తున్నాంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నా.. వైద్య రంగంలో మాత్రం అట్టడుగున ఉంది. వైద్య సేవల రంగంలో ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో ఏఐ వినియోగం పెంచడానికి అన్ని దేశాలూ సంస్కరణలు కూడా తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెల్త్ కేర్‌లో ఏఐ సేవలు 6 శాతమే. 2022కి యూఎస్‌లో ఏఐ అడాప్షన్ రేట్ 19 శాతమే ఉంది.2047కి 85 శాతం వరకూ పెరిగే సూచనలున్నాయి. ఇది వైద్య సేవల్ని వేగవంతం చేయడమే కాకుండా మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏఐ వినియోగంతో రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది. ఔషధ పరిశోధనల్లోనూ ఏఐ సేవలు విస్త్రృతమవుతున్నాయి.హెల్త్‌కేర్ ఏఐలోభారీ పెట్టుబడులు..హెల్త్ కేర్‌లో ఏఐ వినియోగం కోసం అన్ని దేశాలూ పెట్టుబడులు భారీగా పెంచుతున్నాయి. అమెరికా ప్రస్తుతం 28.24 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. 2030కి 187.85 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించింది. హెల్త్ కేర్‌లో ఏఐ వినియోగంలో భారత్ కూడా పురోగమిస్తోంది. భారత్‌లో 2022కి 0.13 బిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడులుండగా.. 2030కి 2.92 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇది శుభపరిణామమే అయినా.. భారత్ మరింతగా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది.వైద్యంలో ఏఐ అప్లికేషన్స్ వినియోగం ఇలా..హెల్త్‌కేర్‌లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు చాలా వరకూ వినియోగంలో ఉన్నాయి. డయాగ్నసిస్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు, రోగి వైద్య రికార్డుల నిర్వహణ, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధి, వైద్యులపై పనిభారం తగ్గించడం మొదలైన అంశాలకు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ఇప్పటికే వీటిని అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్‌లో పేరొందిన ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే ఇవి ప్రారంభమవుతున్నాయి.క్యాన్సర్ చికిత్సలో అద్భుత ఫలితాలుక్యాన్సర్ చికిత్సలో ఆంకాలజీ విభాగంలో ఏఐ అద్భుత ఫలితాలు అందిస్తోంది. ప్రాథమిక దశలో బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించడం కష్టతరం. కానీ, అమెరికాలో అతి తక్కువ సమయంలోనే ఏఐ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించారు. సెర్టిస్ ఏఐ యాప్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఏఐ–డ్రివెన్ ఆంకాలజీ డ్రగ్ డిస్కవరీతో ఫలితాలు రాబడుతున్నారు. ఊపిరితిత్తులు, మెదడు, మెడ, చర్మ సంబంధమైన క్యాన్సర్ల గుర్తింపు ఫలితాలు కూడా వీలైనంత త్వరగా అందించేలా యాప్‌ల అభివృద్ధి జరుగుతోంది.మారుమూల పల్లెలకూ వైద్య సేవలుఏఐ ద్వారా మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు చేరువవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ ఫోన్లో ఏఐ ఉంటే.. ఆ ఫోన్ కూడా ఒక డాక్టర్‌గా మారిపోతుంది. ఏఐ డ్రివెన్ రిమోట్ కేర్ యాప్‌తో మారుమూల పల్లెల్లో ఉన్న రోగితో డాక్టర్ నేరుగా మాట్లాడి.. బీపీ, పల్స్ చెక్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చేసింది. వైద్యుల అపాయింట్మెంట్, వైద్య సలహాలు, సూచనల్ని చాట్‌బాట్ ద్వారా అందించే రోజులు కూడా వచ్చేశాయి. -
పీహెచ్‌సీల్లో స్పెషలిస్టు వైద్య సేవలు
సాక్షి, యాదాద్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన డాక్టర్లతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్సీలలో ప్రాథమిక వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు పీహెచ్సీలలో వారానికి మూడు రోజులు క్యాంపులు నిర్వహి స్తారు. వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య క్రమంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 29 మంది నిపుణులైన వైద్యులు పీహెచ్‌సీలకు వెళ్లి 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.ఇందుకోసం భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఆయా పీహెచ్‌సీలకు వెళతారు. వీలైతే అక్కడే వైద్యం చేసి మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం భువనగిరి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో పీడియాట్రిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఈఎన్టీ, సైక్రియాట్రిక్, దంత వైద్యం, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, సాధారణ శస్త్ర చికిత్సలకు పరీక్షలు నిర్వహిస్తామని భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. -
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ వైద్య సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో డ్రోన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఎయిమ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. ముందుగా మంగళగిరి మండలం నూతక్కి పీహెచ్సీలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు.పరీక్ష అనంతరం మహిళకు అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో మధుబానందకర్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్‌సీకి 9 నిమిషాల్లోనే డ్రోన్ చేరుకొని.. బ్లడ్ శాంపిల్స్ సేకరించిందని చెప్పారు. తద్వారా వేగంగా చికిత్స అందించడానికి అవకాశం లభించిందన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని గర్భిణులకు ఉచితంగా డ్రోన్‌తో వైద్య సేవలందిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ వైద్య సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎయిమ్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తల్లీ కొడుకు మృతివిజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ ఇటీవల డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి అప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే మృతిచెందాడు.రాష్ట్రంలో నాలుగు నెలలుగా అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రిని తీసుకున్నా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. విలేజ్ క్లినిక్‌లకు దిక్కు లేకుండా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టకు తిలోదకాలిచ్చింది. 104 వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. పీహెచ్‌సీల్లో అక్కర్లేదంటూ స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించింది. చాలా చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. మందుల కొరత వేధిస్తోంది. ఏ చిన్న మందు కావాలన్నా బయటకు రాసిస్తున్నారు. ఇక పరీక్షల సంగతి అయితే మాట్లాడుకోక పోవడమే మంచిది. కొంచెం క్రిటికల్ కేసు వస్తే చాలు.. రెఫర్ చేయడమే పరిపాటిగా మారింది. ఇదేంటయ్యా.. అని అడిగితే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని సీరియస్ అవుతున్నారు. నాలుగవ తరగతి సిబ్బందిపై నియంత్రణ కరువైంది. ఏ అర్ధరాత్రుళ్లో ఎవరికైనా సీరియస్ అయితే దేవుడే దిక్కు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫీవర్ సర్వే ఊసే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజారోగ్యాన్ని దీన స్థితికి తీసుకొచ్చింది.బడి బల్లలే బెడ్లు... కిటికీలే సెలైన్ స్టాండ్లు సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో జూన్ నుంచి ప్రజలు జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. పెద్ద ఎత్తున డయేరియా కేసులు వెలుగు చూశాయి. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా పంజా విసిరింది. 450 మందికిపైగా డయేరియా బారిన పడగా, వారిలో 11 మంది మృత్యువాతపడ్డారు. వెంటనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించి ప్రాణనష్టం జరగకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద సక్రమంగా ఉచిత వైద్యం లభించడం లేదు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటికే గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లో బీపీ, సుగర్ ఇతర జబ్బులతో బాధపడే వారికి క్రమం తప్పకుండా వైద్యం అందేది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు 104 వ్యవస్థ పని చేస్తోందా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ఉన్న 150 మంది స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. భయం గుప్పెట్లో గిరిజనం గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను డెంగీ, మలేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు వ్యాధులతో బాధపడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో మందులు, పరీక్షలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి విష జ్వరం వస్తే వైద్యానికి కనీసం రూ.5 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి మూడు నెలల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదుగురు విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడి మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో పాటు, తాగునీటిని సరిగా శుద్ధి చేయకపోవడంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా డయేరియా ప్రబలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడటంతో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి, జూలైలో కర్నూలు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా 250 మంది డయేరియా బారినపడ్డారు. వారిలో ఏడుగురు మరణించారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు జన్యు సంబంధమైన హీమోఫీలియా బాధితులకు మందులు సరిగా దొరకడం లేదు. వ్యాధిగ్రస్తుల్లో రక్తస్రావాన్ని నియంత్రించడానికి యాంటి హీమోఫీలియా ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను చికిత్సల్లో వినియోగిస్తారు. ఫ్యాక్టర్ 7, 8, 9 ఇలా వివిధ రకాల ఇంజెక్షన్లు అవసరం ఉండగా, చాలా వరకు జీజీహెచ్‌లలో ఇవి లేవని తెలుస్తోంది. అలాగే రోగ నిరోధకత బాగా తక్కువగా ఉండే క్యాన్సర్, న్యూరో, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు కూడా అన్ని జీజీహెచ్‌లలో లేవు. కేసులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సల్లో వినియోగించే అన్ని రకాల యాంటిబయోటిక్స్ సీడీసీ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లో ఉండటం లేదు. వైరల్ జ్వరాలకు వాడే ఎమాక్సిలిన్, మలేరియా చికిత్సకు అవసరమైన ఆర్టిసినేట్ ఇంజెక్షన్ చాలా ఆస్పత్రులకు సరఫరా కావడం లేదు. చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పలు రకాల క్రీములు ఆస్పత్రుల్లో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో మందులు సరిపడా లేవు. పెరిగిపోతున్న ఖాళీలు ⇒ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో ఏర్పడిన, కొత్తగా మంజూరైన పోస్టులను ఎప్పటికప్పుడే భర్తీ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో 54 వేల పోస్టులు ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీరో వెకెన్సీ పాలసీకి బ్రేక్ వేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పారా మెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాల కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీలు 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నోటిఫికేషన్లను రద్దు చేశారు.⇒ ఓ వైపు ఆస్పత్రుల్లో ఎఫ్ఎన్వో, ఎంఎన్‌వో ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇక సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గతంలో గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సైతం స్పెషలిస్ట్ వైద్యుల కోసం పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలు ఇచ్చి మరీ పోస్టులు భర్తీ చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెకండరీ హెల్త్‌లోని గిరిజన, మారుమూల ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ల కొరత ఉన్నప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారు సైతం వెళ్లిపోవడం, ఇటీవల కాలంలో పదవీ విరమణలు, పదోన్నతుల అనంతరం డీఎంఈ ఆస్పత్రుల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అదే విధంగా 900కుపైగా సీనియర్ రెసిడెంట్, 250కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం మన విద్యార్థులకు అన్యాయం చేసింది. ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయేలా చేసింది.అత్యవసర మందులూ బయటే⇒ 2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదని మండిపడుతున్నారు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. ⇒ జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు ఉంచాలని వైద్య శాఖ నిర్ణయించింది. 372 మేర సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులన్నింటినీ మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. గురువారం (17వ తేదీ) అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్లు అందరూ మందుల కొరత అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండటం లేదని, లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని మంత్రి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. స్థానికంగా కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే దీని అర్థం రోగులను బయట తెచ్చుకోమని చెప్పడమే. ⇒ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిపడా రసాయనాలు అందుబాటులో ఉండటం లేదు. పాడైన పరికరాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్చురీల్లోని శవాలకు కూడా భద్రత లేకుండాపోయింది. ఏలూరు ఆస్పత్రిలో అనాథ మృతదేహాలు మాయమైన ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఈ నిర్లక్ష్యం.. గర్భిణికి ఎంతకష్టం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారానికి చెందిన గర్భిణి యర్రా శకుంతల జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లి కంటిపాటి ధనలక్ష్మి మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన కుమార్తెకు పురిటినొప్పులు వస్తున్నాయని ధనలక్ష్మి నర్సులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. ఈలోగా శకుంతల బాత్రూమ్కు వెళ్లగా, అక్కడే తీవ్ర రక్తస్రావమై కడుపులోని బిడ్డ తల బయటకు వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి శకుంతల వెళ్లిపోయింది. ఇది గమనించిన తల్లి.. గట్టిగా కేకలు వేయగా, శిక్షణలో ఉన్న నర్సులు వచ్చి.. గర్భిణిని డెలివరీ రూమ్‌కు కాకుండా ప్రసూతి వార్డుకు తరలించారు. మంచంపై పడుకోబెట్టగా ఆ మంచంపైనే శకుంతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీరిగ్గా నర్సులు శకుంతలను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి మాయ తొలగించి, కుట్లు వేశారు. నర్సింగ్ విద్యార్ధినులు సకాలంలో పట్టించుకోకపోయి ఉంటే గర్భిణి ప్రాణాలకే ముప్పు వచ్చేది. ఆస్పత్రిలో శకుంతల పడిన నరకయాతనను చూసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే అంత జరుగుతున్నా, సిబ్బంది చీమ కుట్టినట్లు కూడా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతలో ఎంత మార్పు అంటూ నిట్టూర్చారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.పట్టించుకోరా అంటే.. బయటికి పొమ్మన్నారు విధుల్లో ఉన్న నర్సుల వల్లే నా బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు నా బిడ్డ ప్రాణాలతో దక్కింది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా కూతురిని పట్టించుకోకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా.. బయటకు పొమ్మంటూ దుర్భాషలాడారు. ఆస్పత్రిలో మూడురోజుల నుంచి నా కుమార్తె నొప్పులతో బాధపడుతోందని, పరీక్షించమని వేడుకున్నా ఒక్క నర్సు కూడా పట్టించుకోలేదు. డాక్టరు వస్తారు.. సమాచారం ఇస్తాం... అంటూ మమ్మల్ని పంపేశారు. ఆస్పత్రిలో సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ధనలక్ష్మి, గర్భిణి శకుంతల తల్లి, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు బకాయిలతో.. ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్‌మెంట్‌తో మరింత సమస్య ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతోపాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్‌పై అస్పష్టత గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు హెల్త్‌కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా బిల్లు కట్టి.. ఎదురుచూపులు నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లికి చికిత్స చేయించి.. నిజామాబాద్ జిల్లాలోని డీఆర్డీవో ఆఫీసులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు. రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం -
వెల్నెస్ సెంటర్లో వైద్యనిపుణులు లేక రోగుల తిప్పలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉద్యోగులు, జర్నలిస్టులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్యసేవలు అందించేందుకు ఉమ్మడి జిల్లాలో వెల్నెస్ సెంటర్‌ను ఆరేళ్ల కిందట ఏర్పాటు చేసినా ఇప్పటికీ కాంట్రాక్టు ఉద్యో గులతోనే కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2018, సెపె్టంబర్ 5న అప్పటి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పాత కలెక్టరేట్ ఆవరణలోని భవనంలో వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అయితే వైద్యులు, వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ సెంటర్‌కు జనరల్ ఫిజీషియన్లు ముగ్గు రు, డయాబెటిక్, స్కిన్, గైనకాలజిస్ట్, చి్రల్డన్స్ డాక్టర్, కార్డియాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, డెంటల్ డాక్టర్ ఒక్కొక్కరు అవసరం. అయితే ప్రస్తుతం ఆర్థోపెడిక్, డెంటల్ డాక్టర్‌తో పాటు డిప్యుటేషన్‌పై జనరల్ ఫిజీషియన్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక ముగ్గురు జీఎన్ఎంలకు ఒక్కరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు నలుగురికి ఇద్దరు, స్వీపర్లు నలుగురికి ఇద్దరు చొప్పున పనిచేస్తున్నారు. వీరందరికీ ఇన్చార్జ్గా ఫిజియోథెరపీ వివేక్ వ్యవహరిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. జిల్లాస్థాయి అధికారుల అజమాయిషీ కరువు ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి ప్రతిరోజూ కనీసం 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 90 శాతం మంది వృద్ధులే కావడంతో పైఅంతస్తులో ఉన్న ఈ సెంటర్‌కు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పైకి.. కిందికి వెళ్లి రావడానికి మోకాళ్ల నొప్పులు ఉన్న వారి బాధలు వర్ణణాతీతం. మొదట్లో పాత కలెక్టరేట్ ఆవరణలో సువిశాలమైన భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉండేది. ఏడాదిన్నర కిందట అక్కడి నుంచి ఊరు చివర ఓ మూలకు విసిరేసినట్లు పాత డీఎంహెచ్ఓ కార్యాలయంలోకి మార్చారు. వేరే గ్రామాలు, జిల్లాల నుంచి వచ్చే వారు వెల్నెస్ సెంటర్‌కు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రం నడి»ొడ్డున ఉన్న కొత్త బస్టాండు లేదా రైల్వే స్టేషన్ సమీపంలోకి మార్చాలని వారు కోరుతున్నారు. ఈ ఆరేళ్లలో ఉన్నతాధికారులు ఈ కేంద్రాన్ని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ఇక్కడి సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడింది. ఉన్న ఒక్క జీఎన్ఎం సెలవు పెట్టిన రోజు స్వీపరే బీపీ, షుగర్ చెక్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా వ చ్చిపోతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దీనివల్ల కొన్ని నెలలుగా వేడి నీటిలో వివిధ పరికరాలను కడిగే ఆటో క్లేవ్ యంత్రం పనిచేయడం లేదు. ఇన్వర్టర్ మరమ్మతుకు గురి కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని అధిగమించలేక పోతున్నారు. కనీసం టోకెన్ నమోదు చేసుకోలేక కొన్నిసార్లు రోగులు వెనక్కి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. సిబ్బంది కొరతతో అటెండరు, ల్యాబ్ టెక్నీíÙయనే రోగుల పేర్లను రాసుకోవాల్సి వస్తోంది.4 నెలల నుంచి ప్రత్యేక వైద్యుడు లేడు నేను డయాబెటిక్ పేషెంట్‌ను. రెండు మూడేళ్లుగా సొంతూరు నుంచి బస్సులో ఇక్కడికి వచ్చి పోతున్నా. నాలుగు నెలల నుంచి ప్రత్యేక వైద్యుడు లేకపోవడంతో వైద్యం సరిగా అందడం లేదు. జనరల్ ఫిజీషియన్ ఇ చ్చిన మందులనే వాడుతున్నాను. తరచూ కరెంట్ పోతున్నందున కొన్నిసార్లు వెనక్కి వెళ్లాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తనిఖీ చేసి ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది. – సత్యమ్మ, డయాబెటిక్ పేషెంట్, నాగర్కర్నూల్డాక్టర్ల కొరత తీరుస్తాం ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటాం. విద్యుత్ సమస్య పరిష్కరించాలని గతంలో ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ సెంటర్లో నెలకొన్న మిగతా సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ స్వప్న, రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్, మహబూబ్‌నగర్ -
మన డాక్టరమ్మకు భద్రత కావాలి
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థినిపై కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతలో లొసుగులను తేటతెల్లం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మన డాక్టరమ్మల భద్రత ఏ విధంగా ఉంది? సురక్షిత వాతావరణంలో మహిళా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సాక్షి’ పలువురు వైద్య నిపుణులతో చర్చించింది. వైద్య శాఖలో 30 ఏళ్లకుపైగా సేవలు అందించిన సీనియర్ వైద్యులు, మాజీ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.గళం విప్పే వ్యవస్థ రావాలిఅన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల్లో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించడానికి అంతర్గత కమిటీలు ఉంటాయి. అయితే వీటిల్లో ఆయా కళాశాల, ఆస్పత్రిలో పని చేసే ఫ్యాకల్టీ, వైద్యులు, ఇతర అధికారులే సభ్యులుగా ఉంటారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి సంకోచించే పరిస్థితులు న్నాయి. తమ వివరాలు బహిర్గతమై కొత్త చిక్కులు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. కమిటీల్లో పోలీస్, న్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానం కల్పిస్తే నిష్పాక్షిక విచారణకు వీలుంటుంది. బాధితులు నిర్భయంగా గళం విప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ఘటనల్లో బాధితులు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం ఆయా కమిటీల్లో సభ్యులంతా అక్కడి వారు కావడమేనని పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు 36 గంటలు, రెండు, మూడు రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగాయి. అందువల్ల విద్యార్థుల పని వేళలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించిన విద్యార్థికి డే ఆఫ్ తప్పకుండా ఇవ్వాలి.సహాయకుల రాకపోకలపై షరతులుప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగికి సహాయకుడిగా ఒకరినే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు సహాయకుడినే అనుమతించరు. పరామర్శలకు వచ్చే వారిని పరిమిత వేళల్లోనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి నిబంధనలే ప్రభుత్వాస్పత్రుల్లోనూ విధించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులు, బంధువులు, స్నేహితుల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చికిత్స అందించడంలో ప్రొటోకాల్ కారణంగా ఆలస్యం / దురదృష్టవశాత్తూ రోగి మృతి చెందిన సందర్భాల్లో వైద్య సిబ్బందిపై ఒక్కోసారి దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కర్నూలు, విజయవాడ జీజీహెచ్‌లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా సహాయకులను నియంత్రించాలి. ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లోకి ప్రవేశించేప్పుడే సహాయకులను స్క్రీనింగ్ చేయాలి. ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు భద్రత సిబ్బందిని నియమించాలి.భద్రతపై వైద్య వర్గాల ప్రధాన డిమాండ్లు⇒ రక్షణ చర్యలపై కనీస అవగాహన లేని వారు, వయసు మళ్లిన వారు ఆస్పత్రులు, కళాశాలల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. సుశిక్షితులైన భద్రతా సిబ్బందిని నియమించాలి. ⇒ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి. ఆస్పత్రులు, కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చి 24/7 పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తం కావాలి.⇒ విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి సరిపడా వాష్, రెస్ట్, డ్యూటీ రూమ్స్ ఉండాలి. మహిళా వైద్యులు, విద్యార్థినుల కోసం కేటాయించిన గదుల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి. ⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులు చాలా వరకూ కొన్ని దశాబ్ధాల క్రితం నిర్వహించినవే. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, సెకండరీ కేర్ పరిధిలో చాలా వరకూ కొత్తగా ఆస్పత్రుల్లో వైద్యుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించారు. కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో అదే తరహాలో వసతులు ఉంటున్నాయి. ఇక పాత బోధనాస్పత్రులతో పాటు, మరికొన్ని పాత ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు, విద్యార్థుల సంఖ్యకు వసతులు లేవు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వసతులు కల్పించాలి. ⇒ సాధారణంగా ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండాలి. పరిసరాల్లో ముళ్లు, చెట్ల పొదలు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి.⇒ వైద్య సిబ్బంది సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ లైట్లు ఉండాలి. సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు దీన్ని పర్యవేక్షించాలి. వైద్య సిబ్బందితో నిర్వహించే సమావేశాల్లో రోగులకు సేవల కల్పనతోపాటు భద్రతాపరమైన అంశాలపైనా చర్చించాలి. ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి.కమిటీల్లో పోలీసులు, లాయర్లు ఉండాలివైద్య విద్యార్థుల్లో 70 శాతం వరకు యువతులే ఉన్నందున వారి భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలల్లో సమస్యలను నివేదించేందుకు కమిటీలున్నా చురుగ్గా పనిచేసేలా చూడాలి. కేవలం టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా పోలీస్ శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, న్యాయ శాఖ నుంచి ఒకరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కమిటీలో సభ్యులుగా ఉండాలి. సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లను కళాశాలలో ప్రదర్శించాలి. – డాక్టర్ విఠల్‌రావు, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సీసీ కెమెరాలు పెంచాలివిశాలమైన ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల ప్రాంగణాల్లో భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదే. తరగతి గదులు, ల్యాబ్‌లు, కారిడార్లు, విద్యార్థులు, వైద్యులు సంచరించే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల సర్వే లెన్స్ ఉండేలా చూడాలి. వీటి పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో 24/7 సిబ్బంది ఉండాలి. ఆస్పత్రులు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి. దీనివల్ల భద్రతతోపాటు ఆస్పత్రుల్లో శిశువుల అపహరణలు అరికట్టవచ్చు. మహిళా వైద్య సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంపై దృష్టి సారించాలి. – డాక్టర్ వెంగమ్మ, రిటైర్డ్ డైరెక్టర్, వీసీ, స్విమ్స్ యూనివర్సిటీ, తిరుపతివసతులు మెరుగుపడాలిఆస్పత్రులు, కళాశాలల్లో వసతులను అభివృద్ధి చేయాలి. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన విద్యార్థిని 36 గంటలు విధులు నిర్వర్తించింది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు న్నాయి. వైద్య విద్యార్థుల పని వేళల మీద దృష్టి పెట్టాలి. తగినన్ని వాష్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, డ్యూటీ రూమ్స్ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఫ్యాకల్టీ సైతం విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించాలి. – డాక్టర్ శశిప్రభ, మాజీ డీఎంఈ, ఉమ్మడి ఏపీ వ్యవస్థ మారాలి..దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెల్లటి వస్త్రంపై ఎర్రటి సిరాతో చేతి ముద్రలు వేస్తూ.. మహిళలపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి రాత్రి భద్రత పెంచాలిబోధనాస్పత్రుల్లో టీబీ, ఇన్ఫెక్షన్ వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్‌లు, ల్యాబ్‌లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నందున జన సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లోనూ మహిళా వైద్యులు, సిబ్బంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అక్కడ సెక్యూరిటీ పెంచాలి. అనుమా నాస్పద వ్యక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు కట్టి చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం క్షుణ్నంగా పరిశీలించాకే పరిమిత వేళల్లో రోగుల సహాయకులను అనుమతిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ అలాగే వ్యవహ రించాలి. సహాయకులను గుంపులుగా అనుమతించకూడదు. – డాక్టర్ చాగంటి పద్మావతి, పూర్వ ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల -
సుప్రీమ్ ‘అభయ’మ్!
హేయమైన కోల్‌కతా హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవడం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది. విధినిర్వహణలోని వైద్యశిక్షణార్థి జీవితాన్ని చిదిమేసిన ఆగస్ట్ 9 నాటి ఉదంతంతో వైద్యసేవకుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను సుప్రీమ్ కోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది. సంతృప్తి చెందక జాతీయస్థాయిలో జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నా అసలంటూ రోగాన్ని గుర్తించి, మందు కనుగొనే ప్రయత్నమైనా జరుగుతున్నందుకు సంతోషించాలి. ప్రముఖ డాక్టర్ల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్ మహిళలు సురక్షితంగా పని చేసేందుకు చేపట్టాల్సిన సమూల సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది. కోర్ట్ ఆదేశించినట్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. దేశంలో నూటికి 80 ప్రజారోగ్య వసతుల్లో నిర్ణీత ప్రమాణాలైనా లేవని జాతీయ హెల్త్ మిషనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో పనిప్రదేశంలో సురక్షిత వాతావరణ కల్పనకు ఒక విధాన ఏర్పాటుకు జాతీయ వైద్యసంఘం గత వారమే వైద్యకళాశాలలకూ, ఆస్పత్రులకూ నోటీసిచ్చింది. వైద్యులకు విశ్రాంతి గదులు, నిఘాకు సీసీ టీవీలు కరవైన మన ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ సిఫా ర్సుల చికిత్స చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ఆడవాళ్ళు నైట్‌డ్యూటీలలో లేకుండా చూడాలని బెంగాల్ సర్కార్, ఒకవేళ డ్యూటీలో ఆడవాళ్ళుంటే వారికి తోడుండేలా చూడాలని కేంద్ర సర్కార్ సూచనలివ్వడం విడ్డూరం. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువున్న దేశంలో దాన్ని మరింత తగ్గించే ఇలాంటి ఆదేశాలు తిరోగమన «ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి.కోల్‌కతా ‘అభయ’ ఘటన, చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబుకుతుంటే... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి అంతా విమర్శకుల నోళ్ళు మూయించడంపై ఉండడం విషాదం. నిరసనకారులపై ‘రాజ్యాధికారం’ ప్రయోగించే కన్నా దేశవ్యాప్తంగా లోలోపలి భావోద్వేగాలు బయటపడుతున్న వేళ వారితో మరింత సున్నితంగా వ్యవహరించాలని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో – ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆస్పత్రికి అప్పట్లో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలున్నా ప్రభుత్వ పెద్దలు ఆయనను కాపాడాలని చూడడం నీచం. సదరు వ్యక్తి మానవ అక్రమ రవాణాకూ, బలవంతపు వసూళ్ళకూ పాల్పడినట్టు ఆయన మాజీ సహచరులే ఆరోపిస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో సాగిన అవినీతి, అక్రమాలపై కథనాలైతే కొల్లలు. అటు సీబీఐ దర్యాప్తు, ఇటు సుప్రీమ్ సొంత చొరవతో కేసులో ఇంకెన్ని లోతైన అంశాలు బయటపెడతాయో తెలీదు. ఇక, తాజాగా ఆసుపత్రికి భద్రతగా సీఐఎస్ఎఫ్ దళాల పహారా పెట్టాల్సి రావడం పోగొట్టుకున్న నమ్మకానికి పరాకాష్ఠ.అసలు మన దేశంలో ప్రతి వంద మంది డాక్టర్లలో 75 మంది సాధారణంగా రోగులు, వారి బంధువుల నుంచి ఏదో ఒక విధమైన హింస, దాడులను ఎదుర్కొన్నవారే. అమెరికాలో ఆ సంఖ్య 47 శాతమే. ఇలాంటి అనేక కారణాల రీత్యానే రెండేళ్ళ క్రితం 2022లో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య వృత్తి నిపుణులు, సంస్థలపై హింసా నిరోధక బిల్లు’ను తక్షణం ఆమోదించి, అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. నిజానికి, 2007 నుంచి మన దేశంలో మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఎంపీఏ) ఉంది. 23 రాష్ట్రాలు దాన్ని తమదైన రూపంలో అమలు చేస్తున్నాయి. ఆరోగ్య సేవకుల భద్రత నిమిత్తం అలా ఇప్పటికే చట్టాలున్నా ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది వేరే కథ. పైగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం శిక్ష. అంతటా ఒకే విధమైన నమూనా చట్టం అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే, కేవలం చట్టాలతో పరిస్థితి చక్కబడుతుందనీ, దాడుల నుంచి వైద్యులను కాపాడగల మనీ అనుకోవడం కూడా పొరపాటే. ప్రజారోగ్య సేవకుల భద్రత అనేది దీర్ఘకాలిక ప్రణాళికతో సాగాల్సిన ప్రభుత్వ విధానం. మున్ముందుగా ఉన్నతమైన వైద్యవృత్తికీ, వైద్యులకూ సమాజంలో గౌరవం ఇనుమడించే వాతావరణం పెంపొందించాలి. రోగులకు ప్రాణదాతలై రాత్రీ పగలూ లేకుండా శ్రమించే వైద్యులకు జీతభత్యాలే కాదు... మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కనీస బాధ్యత. ఆరోగ్య రంగానికి నిధుల పెంపుతో పాటు ‘అభయ’ లాంటివారు 36 గంటలు ఆపకుండా పని చేయాల్సిన అవస్థ తప్పించేలా తగినంతమంది వైద్య సిబ్బందిని తీసుకోవాలి. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు సమష్టిగా దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీమ్ చెప్పినట్టు ఆస్పత్రుల్లో లైంగిక వేధింపుల నిరో ధక చట్టం (పోష్) వర్తిస్తుందని గుర్తించాలి. ఇవాళ్టికీ జూనియర్ డాక్టర్లు అమానవీయ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్న తీరును గుర్తించి, ముందు అక్కడ నుంచే మార్పు మొదలుపెట్టాలి. కోల్‌కతా ఘటనపై ఆందోళన ఆగక ముందే, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో బడిలో చదువుకుంటున్న ఇద్దరు కిండర్‌గార్టెన్ చిన్నారుల్ని కాపలాదారు రూపంలోని ఓ మానవ మృగం కాటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్ళిన వ్యవస్థలోని విలువల పతనాన్ని మరోమారు నగ్నంగా నిలబె ట్టింది. ఈ వరుస ఘటనలు ఆందోళనతో పాటు సత్వర కార్యాచరణ అవసరాన్ని పెంచుతున్నాయి. ‘బాగా చదువుకోవాలి. బంగారు పతకం సాధించాలి. పెద్ద ఆసుపత్రుల్లో పనిచేయాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి’ అంటూ డైరీలో ఆఖరిరోజున సైతం రాసుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి కలల్ని చిదిమేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనలకు మూలకారణమవుతున్న వ్యవస్థాగత లోపాల్ని సరిదిద్దాల్సిందే! సుప్రీమ్ తీసుకున్న చొరవ, పాలకుల చర్యలు అందుకు దోహదపడితేనే అభం శుభం తెలియని ‘అభయ’లెందరికో ఆత్మశాంతి. -
నా బిడ్డను బతికించండి
గాందీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న తన కుమార్తెకు మెరుగైన వైద్యసేవలు అందించి కాపాడాలని ఓ కన్నతల్లి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడంలేదని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చేరే వరకు ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట గ్రామం తాటిపూడికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి అంబర్‌పేట తిరుమల నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. వీరి కుమార్తె జ్యోతి (25) తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ నెల 18న ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో జ్యోతి తల, వెన్నెముక, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) నమోదు చేసి అంబులెన్స్‌లో గాందీఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రాథమిక వైద్యం అందించి, జూడాల సమ్మె కారణంగా అత్యవసర శస్త్ర చికిత్స చేయడం కుదరదని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతూ గాంధీ వైద్యులు చేతులెత్తేశారని బాధితురాలి తల్లి సుశీల పేరిట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. సీఎం రేవంత్‌రెడ్డికి చేరేవరకూ పోస్ట్‌ను ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. తాము పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సోమవారం వైరల్ కావడంతో అప్పటివరకు పట్టించుకోని గాంధీ వైద్యులు స్పందించారని, న్యూరోసర్జరీ, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని బాధితురాలి బంధువు రవిశంకర్ మీడియాకు తెలిపారు. కాగా.. గాంధీ అత్యవసర విభాగంలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని, వైరల్ అయిన పోస్ట్‌లో వాస్తవం లేదని గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ రాజకుమారి స్పష్టంచేశారు. జ్యోతికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. -
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
మారని చంద్రం.. మళ్లీ ప్రైవేట్ మంత్రం..!
చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అన్నింటా వసూళ్లకు మారుపేరు. ఎవరికైనా సరే.. ఏదైనా సరే.. ఉచితంగా ఇవ్వడం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. గతంలో యూజర్ చార్జీల బాదుడుతో పేదలను పీల్చి పిప్పి చేసిన ఆయన, ఇప్పుడు అంతకు మించి అంటూ అన్నింటా ‘ప్రైవేట్’ పాట పాడుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందడంతో పాటు విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న గత ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని సెలవిచ్చింది. దీంతో ఆ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు ఆకాశాన్నంటడం ఖాయం. కష్టపడి కన్వీనర్ సీటు తెచ్చుకోగలిగిన పేద పిల్లలు అంత ఫీజు కట్టలేక వైద్య విద్యకు దూరం కావాల్సిన దుస్థితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా పరిస్థితి మారిపోయింది.2014-19 బాబు పాలనలో..20 లక్షలకు పైనే జనాభా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక్కటీ లేదు. మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిందే. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలని 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి కోరగా.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయలేం. అందుకు రూ.350 కోట్లు కావాలి. నిర్వహణకు ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలకైతే అనుమతి ఇస్తాం’ అని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.2019-24 వైఎస్ జగన్ హయాంలో..‘‘ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాం. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తాం’ అని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాకు రూ. 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. శరవేగంగా నిర్మాణం చేపట్టి 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించారు. ఇప్పుడు బోధనాస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. నేడు మళ్లీ బాబు రాకతో..కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్న కళాశాల, బోధనాస్పత్రి ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి వెళ్లనున్నాయి. ప్రైవేట్ కళాశాలల తరహాలో ఎంబీబీఎస్ కోర్సుల ఫీజుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇక బోధనాస్పత్రుల్లో నిర్దేశించిన చార్జీలు చెల్లిస్తేనే ప్రజలకు వైద్యం అందించే దుస్థితి దాపురించనుంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకొల్పిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పేద, మధ్య తరగతి వర్గాల వైద్య విద్య కలను సాకారం చేయాలనే ఉన్నత ఆశయంతో చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటిని ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టి పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, విద్యార్థుల విద్య కలలను కాలరాసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది.జగన్ మోడల్ ఇలా..⇒ పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ⇒ మెడికల్ సీట్లు మన రాష్టంలోనే ఉంటాయి... ఫీజులు తక్కువ ⇒ పోటీతత్వం పెరిగి ప్రైవేట్‌లో కూడా రేట్లు తగ్గుతాయి. ⇒ ప్రభుత్వమే కాలేజీలను నిర్మించి నిర్వహిస్తుంది. ⇒ మెరుగైన నిర్వహణకు కొన్ని సీట్లు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయి. ⇒ అవి కాలేజీ అభివృద్ధికే ఉపయోగిస్తారు. ⇒ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తారు. గుజరాత్ మోడల్ ఇదీ..⇒ భూమి, ఆస్పత్రిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. ⇒ మెడికల్ కాలేజీని మాత్రమే కడతారు ⇒ మొదటి ఏడాదే ఆదాయం రూ.50 కోట్లతో మొదలవుతుంది. ⇒ ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్లి 30 ఏళ్ల తరువాత వదిలించుకుని వెళ్లిపోతారు.ఒకేసారి 17 కళాశాలలు ఓ చరిత్ర2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 17 కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పిచారు. 1923లో రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించగా ఈలోగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. నిజమైన అమ్మకం అంటే ఇదే! గతేడాది మెరుగైన నిర్వహణ కోసం ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గత ప్రభుత్వంపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వీరికి వంతపాడే ఈనాడు ‘వైద్య విద్యనూ అమ్మేశారు’ ‘వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్’ అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసింది. తద్వారా ప్రభుత్వ పెద్దల బినామీల జేబులు నింపేందుకు బాటలు పరిచారు.పీపీపీతో వైద్యానికి తూట్లు ఇక సీఎం చంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానాన్ని పరిశీలిస్తే.. గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా బోధనాస్పత్రి, కళాశాలను నెలకొల్పడం), బ్రౌన్ ఫీల్డ్ (అప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి కొత్త వైద్య కళాశాలను నెలకొల్పడం) ఇలా రెండు విధాలుగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ విధానంలో కళాశాల, ఆస్పత్రి నెలకొల్పడానికి ఎంతో చౌకగా ప్రభుత్వమే భూమిని కేటాయిస్తుంది. ఆ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు కళాశాల, బోధనాస్పత్రిని నిర్మిస్తారు. కొన్నేళ్ల పాటు వారి ఆధ్వర్యంలోనే ఆస్పత్రి, కళాశాల నడుస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో అప్పటికే నడుస్తున్న 300 పడకల ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి, ఇచ్చిన భూమిలో కళాశాలను ప్రైవేట్ వారు నిర్మిస్తారు. ఈ రెండు విధానాల్లో కళాశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు. 2023–24 విద్యా సంవత్సరం ఫీజులను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది. అక్కడ ప్రభుత్వ పరిధిలో నడిచే కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా) సీట్లకు రూ.25 వేలు ఫీజు ఉంది. అదే పీపీపీ కళాశాలల్లో కన్వీనర్ కోటాకు రూ.5.50 లక్షలు, రూ.6.65 లక్షలు వరకూ ఉన్నాయి. యాజమాన్య (బీ కేటగిరి) కోటాకు రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఫీజులున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ఏడాది ప్రారంభించిన ఐదు కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాకు కేవలం రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంది. ఇక గ్రీన్ ఫీల్డ్‌లో కళాశాలలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు కూటమి సర్కారు నడుం బిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదల ప్రయోజనాలే లక్ష్యంగా పేదల ఆరోగ్య ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం లాంటి గిరిజన ప్రాంతాలు, పల్నాడు, అన్నమయ్య, సత్యసాయి లాంటి వెనుకబడిన జిల్లాల్లో ఈ కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి లాంటి మారుమూల గ్రామాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం 150 కి.మీ ప్రయాణించి గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. అదే పిడుగురాళ్లలో సూపర్ స్పెషాలిటీ బోధనాస్పత్రి ఏర్పాటుతో పల్నాడు ప్రజలకు చేరువలో వైద్య చికిత్సలు లభిస్తాయి. ఇలా ప్రతి కొత్త జిల్లాలో ఒక బోధనాస్పత్రిని అందుబాటులోకి వచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ భావించారు. ఇప్పటి వరకూ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్స్సెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు అరకొర వసతులతో నడిపే ఆస్పత్రుల్లో చేసిందే వైద్యం అనే పరిస్థితులున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఏ చీకూ చింతా లేకుండా పూర్తి ఉచితంగా గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు చికిత్సలు లభిస్తాయి. అంతేకాకుండా 17 కొత్త కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చి మన విద్యార్థులు వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని వైఎస్ జగన్ యోచించారు. మన విద్యార్థులకు తాముంటున్న ప్రాంతాల్లో తల్లిదండ్రుల కళ్లెదుటే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించాలనుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్, లాక్డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి కొత్త వైద్య కళాశాలల విషయంలో గత ప్రభుత్వం అడుగులు వేసింది. వైద్య కళాశాలల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏపీ మెడికల్, ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా కళాశాలల నిర్మాణ భారాన్ని ప్రభుత్వమే భరించి లాభాపేక్ష లేకుండా వాటిని నిర్వహించాలనేది వైఎస్ జగన్ విధానం. తమిళనాడు మోడల్ కావాలిప్రభుత్వాన్ని దోచేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం గుజరాత్ మోడల్. అది ప్రజలకు అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు చేసే తమిళనాడు తరహా 69 శాతం రిజర్వేషన్ మోడల్‌ను ఏపీలో అమలు చేయాలి. సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేయడమే చంద్రబాబు విధానం అనే విషయం గత చరిత్రను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ధనికులకే వైద్య విద్య అందుబాటులో ఉండేలా ఫీజులను ఆయన పాలనలో అమాంతం పెంచారు. 2014–19 మధ్య రూ.2.5 లక్షలుగా ఉన్న ఎంబీబీఎస్ బీ కేటగిరి ఫీజును అమాంతం పెంచారు. రూ.5 లక్షలున్న మెడికల్ పీజీ బీ కేటగిరి ఫీజును రూ.25 లక్షలకు తీసుకుని వెళ్లారు. కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారు. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, గుంటూరు ప్రభుత్వ పరిధిలోనే కొనసాగాలి పీపీపీ విధానంలో గుజరాత్ తరహాలో కొత్త వైద్య కళాశాలలను నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల్లో అనేక అనుమనాలు రేకెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఆ«దీనంలో కళాశాలలు నడవాలన్నదే గుజరాత్ విధానం అయితే దాన్ని ఇక్కడ అమలు చేయకూడదు. గుజరాత్ తరహా ప్రైవేటీకరణ విధానాలను ఏపీ ప్రజలు ఆహ్వానించరు. ప్రభుత్వ పరిధిలోనే కళాశాలలను నిర్వహించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది. – సీహెచ్. బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
వైద్య సేవలందక వ్యక్తి మృతి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్య సేవలు అందక నెల్లూరు జిల్లా సైదాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగ్రహించిన ప్రజలు పీహెచ్సీ ఎదుట ధర్నాకు దిగారు. సైదాపురం దళితవాడకు చెందిన మల్లారపు వీరరాఘవయ్య (49) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అతడి నోట్లో నుంచి నురుగు రావడంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కేవలం స్టాఫ్ నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రథమ చికిత్స కూడా చేయకుండానే గూడూరు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సలహా ఇవ్వడంతో గూడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు దళితవాడకు చెందిన యువత పీహెచ్‌సీకి చేరుకుని ధర్నాకు దిగారు. కనీస వైద్య సేవలు అందకపోవడం వల్లే వీరరాఘవయ్య మృతి చెందాడని వాపోయారు. వివిధ పార్టీల నేతలు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని భీషి్మంచుకు కూర్చున్నారు. ఎస్ఐ డీఎస్ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ జరిపారు. ఇక్కడి పరిస్థితిని రాపూరు సీఐ విజయకృష్ణకు వివరించారు. అక్కడి నుంచే సీఐ ఆందోళనకారులను శాంతింపజేశారు. – సైదాపురం -
ఏజెన్సీ ‘నాడి’ పట్టేదెవరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.ప్రోత్సాహక నిర్ణయాలేవీ?ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్‌కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్‌లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్మెంట్లు ఫుల్ అయ్యాయి.⇒ నాగర్‌కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్‌బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్‌కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.ఆసిఫాబాద్ మండలం మానక్గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు. -
5 వేల కి.మీ. దూరం నుంచి శస్త్రచికిత్స
బీజింగ్: అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర, ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది. చైనాలోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది. 5జీ టెక్నాలజీ సాయంతో వైద్యుడు 5,000 కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సచేయడం విశేషం. టెక్నాలజీకి ఆధునిక వైద్యవిధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి రూఢీ అయింది. వాయవ్య చైనాలోని గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రిలో నూతన 5జీ సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఊపిరితిత్తుల్లో కణతితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడి నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలోని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లూ క్వింగ్‌క్వాన్ సిద్ధమయ్యారు. పలు రోబో చేతులు అమర్చిన 5జీ ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయసంగా వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణతిని విజయవంతంగా తొలగించారు.భారత్‌లోనూ సేవలు మొదలు: ఇలాంటి సేవలు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఈ సేవలను చేరువచేసింది. ఐదు రోబో చేతులున్న ఈ వ్యవస్థతో గుండె ఆపరేషన్లనూ చేయొచ్చు. వైద్యుని ముందు 32 అంగుళాల మానిటర్, ఒక 3డీ విజన్ ఉంటాయి. ఇందులో ఒక భద్రతా కెమెరానూ బిగించారు. ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తల పక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్‌ను ఆపేస్తుంది. శస్త్రచికిత్సలో ఒక్క సెకన్ కూడా పొరపాట్లు, తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్త ఏర్పాటుచేశారు. 8 మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తాయి. -
వాగులు దాటి వైద్యసేవలు..
వెంకటాపురం(కె): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం సీతారాంపురంలో వైద్య సిబ్బంది శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు.ఈ గ్రామానికి వెళ్లాలంటే వాగులు దాటాలి. వర్షాలు పడుతుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా వైద్యాధికా రి భవ్యశ్రీ, సిబ్బంది వాగులో నడుములోతు నీటిలో నడుచుకుంటూ గ్రామానికి వెళ్లారు. 67 మందికి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. కలిపాక గ్రామంలోని ఇద్దరు గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. -
ప్రపంచస్థాయి హెల్త్ హబ్: సీఎం రేవంత్‌రెడ్డి
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే.. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా హబ్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 24వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో బసవతారకం ఆస్పత్రికి స్థానం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఆయన ఆలోచనా విధానాలను కొనసాగించాలని.. చంద్రబాబునాయుడు ఆస్పత్రిని పూర్తి చేసి పేదలకు సేవలందించేలా చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి వేడుకల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే పెండింగ్‌లో ఉన్న భూమి లీజు పొడిగించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు. ఒంగోలు టౌన్: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి. పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు: జూన్ నుంచి అక్టోబర్ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్‌కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మందిమహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి: జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి. లక్షణాలను ఇలా గుర్తించాలి... పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్ జనరల్ ఫిజీషియన్ డా.కళ్యాణి చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు: పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.విష పాములను గుర్తించడం ఎలా...? పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.జిల్లాలో 72 పీహెచ్‌సీలు.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్సీల ఒక ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడింది.సకాలంలో వైద్యశాలకు తరలించాలి ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది. –డాక్టర్ ఎన్.కళ్యాణి, జనరల్ ఫిజీషీయన్, హెచ్ఓడీప్రజల్లో అవగాహన కలిగించాలి అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్‌లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – డాక్టర్ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు. -
ఏఎంసీలో ఏమైంది?
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలోని పాత అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ఏసీలు పని చేయకపోవడంపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నిమ్స్ మెడికల్ సూరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణను ఆదేశించింది. దీంతో నిమ్స్ యాజమాన్యం ఏఎంసీలోని పరిస్థితులపై సంజాయిషీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. నిమ్స్‌లోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ యూనిట్లు(ఏసీ) పురాతనమైనవి కారణంగా పనిచేయడం లేదని, మరమ్మతులు చేసినా ఫలితం కని్పంచడం లేదని లేఖలో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్యాకేజీ యూనిట్లను మరింత సమర్థవంతమైన డక్టబుల్ యూనిట్లతో భర్తీ చేయడానికి రూ.12.50 లక్షల వ్యయంతో అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు నిపుణుల అభిప్రాయం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా టెండర్లు వేయడం కుదరదని అడ్మిని్రస్టేషన్ సూచించిందని, ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తాత్కాలికంగా అదే బ్లాక్‌లోని పాత ఐసీయూకి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బుధవారం సాయంత్రానికల్లా ఏసీలను తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. దీంతో పనిచేయడం మొదలు పెట్టాయని రోగుల బంధువులు పేర్కొన్నారు. ‘సాక్షి’ పుణ్యమా అని తమకు ఉపశమనం లభించిందని ఓ రోగి సహాయకుడు డానియేల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
ఇది మామూలు ఆసుపత్రి కాదు..ఏ పట్టణంలోదో..పల్లెల్లోదో అంతకన్నా కాదు. సాక్ష్యాత్తు రాజధాని నగరం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్). కానీ ఇక్కడి అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)సెంటర్లో ఏసీ పనిచేయడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ‘ఏసీ పనిచేయడం లేదు..మీరే ఫ్యాన్లు తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది రోగుల సంబందీకులకు సెలవిస్తున్నారు. వాస్తవానికి ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వైద్య సంరక్షణ అందించేందుకు ఏఎంసీని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు నిమ్స్ ఏఎంసీని చూస్తే జనరల్ వార్డుకన్నా అధ్వానంగా మారింది. లక్డీకాపూల్: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రిలో సేవలు పొందడం చాలా కష్టతరమైంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన సేవలు, సౌకర్యాలు కలి్పంచడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఇందుకు ఉదాహరణగా ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డును పేర్కొనవచ్చు. వ్యాధి సమస్య తీవ్రరూపం దాలి్చన స్థితిలో రోగిని ఇక్కడకి తరలించి వైద్యసేవలను అందిస్తారు. వాస్తవానికి ఏఎంసీ సాధారణ వ్యాధులు(జనరల్ మెడిసిన్) విభాగానికి సంబంధించిన ఐసీయూ(అత్యవసర చికిత్సా కేంద్రం). ఇందులో రోగి ప్రాణపాయస్థితికి చేరినప్పడు వైద్యసేవలను అందిస్తారు.ముఖ్యంగా అన్ కంట్రోల్ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారిని, డెంగ్యూ ఫీవర్, తీవ్రమైన స్థాయిలో రక్తాన్ని కోల్పోతున్న రోగులకు ఏఎంసీలో చికిత్స అందిస్తుంటారు. అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వాళ్లతో పాటు ఇతర మెడికల్ కండిషన్లో రోగులకు సైతం ఏఎంసీలో వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం ఈ వార్డులో 16 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రోగులతో నిండుకున్నాయి. అయితే..అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏసీలు పని చేయకపోవడంతో రోగుల బాధలు వర్ణణాతీతం. ఇక్కడకి చికిత్స కోసం వచ్చే రోగులకు ముందు ఫ్యాన్ తెచ్చుకోవాలని అక్కడి వైద్య సిబ్బంది నేరుగా సూచించడం పరిపాటి. రెండు దశాబ్దాల నాటి ఏసీలు చెడిపోయాయి. దీంతో ఏఎంసీ దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాలం చెల్లిన ఏసీలు.. దాదాపు 15 ఏళ్ల నాటి ఏసీలే ఇప్పటికీ వినియోగిస్తుండడంతో అవి మొరాయిస్తున్నాయి. కనీసం రిపేరుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరక్క వాటిని ఆపేస్తున్నారు. ఏఎంసీ వార్డులో కూడా ఇదే జరిగింది. కండెన్సర్లు దెబ్బతినడంతో ఏసీలు పని చేయడం మానేశాయి. మరొపక్క ఆస్పత్రిలో ఏసీ లోడ్ భారం కూడా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఆస్పత్రిలో ఒకప్పుడు 200 పడకల సామర్ధ్యం కలిగిన ఐసీయూ యూనిట్లు ఉండేవి. ప్రస్తుతం 500ల వరకు ఐసీయూ పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు వైద్య పరీక్షల్లో మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో అందుబాటులోకి తీసుకువచి్చన అత్యాధునికి వైద్య పరికరాలకు సైతం ఏసీల అవసరం ఉంది.మరమ్మతులు చేయిస్తాం.. ‘ఏఎంసీలో ఏసీలు పని చేయడం లేదు..రోగులే ఫ్యాన్లు తెచ్చకుంటున్నారు. ఇది నిజమే. ఆ ఏసీలను రిపేరు చేయాలంటే ఆ వార్డును ఖాళీ చేయాలి. అందులో ఉన్న రోగులను ఎక్కడికి షిప్ట్ చేయాలో తెలియడం లేదు. అందుకే సకాలంలో రిపేరు చేయించలేకపోతున్నాం. ఏఎంసీని పూర్తిగా ఆధునీకరించేందుకు దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. హెచ్‌డీయూ లేదు..సాధారణంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏఎంసీతో పాటు హై డిఫెడెంట్ యూనిట్(హెచ్‌డీయూ)ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రిఫరల్ ఆస్పత్రిగా ఖ్యాతి చెందిన నిమ్స్‌లో హెచ్డీయూను విస్మరించారు. ఏఎంసీలో వైద్య సేవలకు అంతరాయం కలిగినప్పుడే కాకుండా వ్యాధి తీవ్రత మేరకు ఏంఎంసీపై భారం తగ్గించడానికి హెచ్‌డీయూ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విధంగా ఈ విభాగాన్ని ఏఎంసీ సపోరి్టంగ్ యూనిట్‌గా వినియోగిస్తారు. అలాంటి దాని విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఏసీలు పని చేయని కారణంగా.. రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. -
మరో ఐదు మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగాఐదు చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్‌పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్‌పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలువైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. -
మీ ఆరోగ్యానికి పూచీ మాది
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. స్వతహాగా వైద్యుడైన మాజీ సీఎం వైఎస్సార్ ఆ విషయాన్ని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్, గ్రామీణ వైద్య సేవల కోసం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వ్యవస్థ 2014–19 మధ్య బాబు పాలనలో నిర్విర్యమైంది. తర్వాత ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు. వైఎస్సార్ కన్నా మరో రెండడుగులు ముందుకు వేసి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. 108 అంబులెన్స్‌లు 768, ఎంఎంయూలు 936, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు 500 చొప్పున అందుబాటులోకి తెచ్చి వైద్య పరంగా సేవలందించారు. మొత్తంగా 2,204 వాహనాల ద్వారా ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను నెలకొల్పారు. దేశంలో అగ్రస్థానంలో ఏపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సుమారు 25 కోట్లకుపైగా ప్రజలకు 988 అంబులెన్స్‌లు ఉన్నాయి. యూపీ కంటే ఐదు రెట్లు తక్కువ జనాభా ఉన్న ఏపీలో 768 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో తక్కువ సంఖ్యలో అంబులెన్స్‌లు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్స్ ఉంది. తెలంగాణలో 75,524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒకటి చొప్పున అంబులెన్స్‌లు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు సేవల విస్తరణ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్స్‌లు 336 లే ఉన్నాయి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. దీంతో సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్స్‌లు ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలు తీసుకొచ్చారు. దీంతో అంబులెన్స్‌ల సంఖ్య 748కు పెరిగింది. దీనికి రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్‌లో అదనంగా మరో 20 అంబులెన్స్‌లు గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీనికి రూ.4.76 కోట్లు వెచి్చంచారు. ఈ క్రమంలో 108 అంబులెన్స్‌ల సంఖ్య 768కి చేరింది. 2023లో 2.5 లక్షల కిలో మీటర్లు తిరిగిన పాత వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచి్చస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. రోజుకు సగటున 3 వేలకు పైగా అత్యవసర కేసుల్లో అంబులెన్స్‌లు సేవల్లో ఉన్నాయి. 2020 జూలై నుంచి 43 లక్షల మంది ప్రాణాలను 108 అంబులెన్స్‌లు కాపాడాయి. పల్లె చెంతకే వైద్యులు వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమం కింద 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బాబు పాలనలో ఒక వాహనంలోనే ఆస్పత్రుల నుంచి ఇద్దరు, ముగ్గురు బాలింతలను ఇళ్లకు తరలించేవారు. ఈ ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఏసీ వాహనంలో ఒక బాలింతను, ఆమె సహాయకులను మాత్రమే ఇంటి వరకూ సురక్షితంగా చేరుస్తున్నారు. గతంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ. 499 మాత్రమే ఖర్చు చేస్తుండగా, ప్రస్తుతం రూ.895 ఖర్చు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 4 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణులు ఈ సేవలను పొందారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పల్లె ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండుసార్లు పల్లెలకు 104 ఎంఎంయూలతో పాటు వెళుతున్నారు. అన్ని పల్లెలను నెలలో రెండుసార్లు సందర్శించేందుకు వీలుగా 936 ఎంఎంయూలను సమకూర్చారు. ఈ విధానంలో 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వైద్య సేవలను ప్రభుత్వం అందించింది. -
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పేరుతో యూపీహెచ్‌సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్‌సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం చంద్రబాబు హయాంలో యూపీహెచ్‌సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్‌సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు. ఇంతలోనే.. ఎంతో మార్పు సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్‌సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు. అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్‌సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఖరీదైన పరీక్షలు ఉచితం గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్‌కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్‌పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ