బాబు సూపర్ సిక్స్ హామీల ఎగవేత పరంపరలో ప్రజారోగ్యం బలి
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ
గద్దెనెక్కాక మొండి చెయ్యి.. పదో వంతుకే బీమా పరిమితం
కేవలం రూ.2.5 లక్షలతో అరకొరగా బీమా అమలుకు నిర్ణయం
అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తింపు
ఆరోగ్యశ్రీని నీరుగార్చి రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టిన సర్కారు
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చికిత్సలు నిలిచిపోయి రోగుల ఆర్తనాదాలు
పేరుకుపోయిన బకాయిలు.. పేషెంట్లను తిప్పి పంపుతున్న ఆస్పత్రులు
ఆసరా ఊసెత్తని బాబు సర్కారు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూదికీ దిక్కులేని వైనం
జీరో వేకెన్సీ విధానంతో నాడు వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు
వైద్య రంగంలో ఏకంగా 54 వేలకుపైగా పోస్టుల భర్తీ
నాడు స్పెషలిస్ట్ పోస్టులకు దేశవ్యాప్తంగా 61 శాతం కొరత.. ఏపీలో 6.2 శాతమే
వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచిన జగన్
రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా
డిశ్చార్జి తర్వాత జీవన భృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరాతో అండ
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. సూపర్–6, సూపర్ సెవన్ హామీల ఎగవేతల పరంపరలో భాగంగా ఈసారి ప్రజారోగ్యానికి ఎసరు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. కేవలం రూ.2.5 లక్షలతో బీమా పథకాన్ని అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోని కుటుంబాలకే వర్తింపజేస్తామని చావు కబురు చల్లగా చెప్పారు!
ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి ఇప్పటికే ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ట్రస్టు పరిధిలో అమలు చేసి 95 శాతం కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాపీ కొట్టి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో ప్రైవేట్ బీమా కంపెనీని తెరపైకి తెచ్చి ప్రజారోగ్యాన్ని దళారీల చేతికి అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమాను వర్తింపజేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెబుతుండటం గమనార్హం.
పదో వంతుతో సరి..
రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తించేలా మెలిక పెడుతోంది. దీన్ని ‘యూనివర్సల్ ఇన్సూరెన్స్’ అంటూ గొప్పలు చెబుతోంది. వాస్తవానికి రూ.25 లక్షల వరకూ పరిమితితో ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది.
ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 95 శాతం కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు కల్పిస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎగవేతలు, కోతలే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య భరోసాకు తూట్లు పొడుస్తున్నారు. దేశంలో ఇప్పటికే బీమా విధానాన్ని అమలు చేసిన పలు రాష్ట్రాలు పెదవి విరిచాయి. మహారాష్ట్ర, కేరళ బీమా విధానాన్ని విడనాడి తిరిగి ఆరోగ్యశ్రీ తరహా ట్రస్ట్ విధానం బాట పట్టాయి. దీన్ని పెడచెవిన పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని బలి పెడుతోంది.
అంతా అస్తవ్యస్థం..
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా పథకం నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ అని పథకం పేరు మార్చడం మినహా కనీసం శాశ్వత సీఈవోను సైతం నియమించలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. దీంతో ఏడాది తిరగకుండానే ఆస్పత్రులు ఏకంగా నాలుగు సార్లు కూటమి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి.
అయినప్పటికీ సర్కారులో చలనం లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఇక ఆరోగ్య ఆసరా కింద ఇప్పటికే రూ.నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వం రోగులకు బకాయి పడింది. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న బీమా విధానంలో ఆసరా సాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు
దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజ్‌లు, ఐవీ సెట్‌లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడిన్ సొల్యూషన్ కొరత నెలకొంది. విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక మందులు, సర్జికల్ ఐటమ్స్ బయట కొనుగోలు చేయాలని వైద్యులు రోగులకు చీటీలు రాసిస్తున్నారు. ఇక వైద్య పరికరాలు పాడైతే పట్టించుకునే వారే లేరు.
ఆదుకున్న ఆరోగ్య ఆసరా..
ఒకవైపు ప్రజలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించిన వైఎస్ జగన్ మరోవైపు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకూ ఆ కుటుంబం జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆదుకున్నారు. వైద్యులు సూచించిన మేరకు నెలకు రూ.5 వేల వరకూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రోజే రోగుల ఖాతాల్లో జమ చేశారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆస్పత్రి పాలైతే పోషణ కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అందించిన ఆరోగ్య ఆసరా సాయం కష్ట కాలంలో వారు ఆర్ధిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంది.
ఇలా వైఎస్ జగన్ హయాంలో ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభించింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ హయాంలో పథకం అమలైన తీరు, లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అరకొర ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీకి రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2019–24 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.13 వేల కోట్లకుపైగా వెచ్చించి 45 లక్షల మందికిపైగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించింది. మరో 24.59 లక్షల మంది రోగులకు డిశ్చార్జీ అనంతరం జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లు చెల్లించారు.
నాడు కోటిన్నర కుటుంబాలకు భరోసా
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా రూ.25 లక్షల వరకూ వైద్య పరిమితితో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసింది. చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, పేదలు వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకే పరిమితం అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు.
రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా అండగా నిలిచింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పథకాన్ని విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. ఏకంగా 3,257 ప్రొసీజర్‌లలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్, గుండె మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా లభించాయి.
54 వేలకు పైగా పోస్టుల భర్తీ..
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా వైద్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రధాన సమస్య మానవ వనరుల కొరతను నివారించేందుకు మునుపెన్నడూ లేని విధంగా 2019–24 మధ్య ఏకంగా 54 వేలకుపైగా వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది.
ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్లకు (ఎంవో) గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని, 22.30 శాతం ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్రమే ఉన్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది.
ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీ వైద్యులు తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి.. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించేవారు. పట్టణ పీహెచ్‌సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల గత సర్కారు తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం.
జీరో వేకెన్సీ పాలసీ..
2019–24 మధ్య వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగ విరమణ, వీఆర్‌ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేశారు. కేవలం వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ –ఇన్ –ఇంటర్వ్యూలు నిర్వహించారు.
నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు దేశవ్యాప్తంగా 61 శాతం కొరత ఉండగా రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతను అధిమించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో అభినందించింది. ఏపీ విధానాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్‌లు ఇస్తూ మిగిలిన రాష్ట్రాలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడిచింది. ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ కాకపోవడంతో వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది.
రెండో రోజు నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) సేవలు రెండో రోజు మంగళవారం నిలిచిపోయాయి. రూ.3 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించలేదు. దీంతో సోమవారం నుంచి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ లబ్ధిదారులు చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నా నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేది లేక జేబులో డబ్బులు పెట్టి ప్రజలు, ఉద్యోగులు చికిత్సలు చేయించుకుంటున్నారు.
మరోవైపు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చర్చలు నిర్వహించారు. నిలిపి వేసిన సేవలను పునఃప్రారంభించాలని కోరారు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు అందించలేమని ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రెండు గంటల పాటు సాగిన చర్చల్లో త్వరలోనే రూ.500 కోట్లు బిల్లులు విడుదల చేస్తామని ఆస్పత్రులకు హామీ ఇచ్చినట్టు వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చిన హామీపై అసోసియేషన్ సభ్యులతో చర్చించి, బుధవారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆశా ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment