హంద్రీ–నీవా.. ‘ఈనాడు కిరణ్‌’ బంధువా! | Chandrababu Govt Looting in second phase lining work of Handri-Neeva main canal | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా.. ‘ఈనాడు కిరణ్‌’ బంధువా!.. లైనింగ్‌ పనుల్లో రూ.192.85 కోట్ల లూటీ!

Published Fri, Mar 7 2025 4:31 AM | Last Updated on Fri, Mar 7 2025 8:08 AM

Chandrababu Govt Looting in second phase lining work of Handri-Neeva main canal

హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండో దశ లైనింగ్‌ పనుల్లో దోపిడీ పర్వం  

ఐదు ప్యాకేజీల్లో మూడు ‘ఈనాడు’ కిరణ్‌ బంధువుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కే 

రెండు ప్యాకేజీలు సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్‌ ప్రాజెక్ట్స్‌కు 

టెండర్లలో అర్హత సాధించేందుకు ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌తో జాయింట్‌ వెంచర్‌  

అధిక ధరకు కోట్‌చేసి ఎల్‌–1, ఎల్‌–2 స్థానాల్లో ఆర్వీఆర్, బీఎస్సార్‌ ప్రాజెక్ట్స్‌

కాంట్రాక్టు విలువ రూ.743.85 కోట్లు.. ఆ సంస్థలకు అప్పగించింది రూ.936.70 కోట్లకు 

దీంతో ఖజానాపై రూ.192.85 కోట్ల మేర భారం 

లైనింగ్‌ పనులను రైతులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని సర్కారు 

పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనుల్లోనూ ఇదే దందా 

మొత్తం మీద ఖజానాపై రూ.204.32 కోట్ల భారం 

‘రివర్స్‌ టెండరింగ్‌’ ఉంటే కనీసం రూ.300 కోట్లు ఆదా అయ్యేవంటున్న అధికారులు  

సాక్షి, అమరావతి: అధికారం మనోళ్ల చేతిలో ఉంటే అక్రమాలకు అడ్డేముంది..! దోచుకున్నోడికి దోచుకున్నంత! టెండర్లలో ఎన్నో వండర్లు సృష్టించొచ్చు. నియమ, నిబంధనలు అనుకూలంగా సృష్టించుకోవచ్చు. దోపిడీకి అడ్డుండదు. హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువకు సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ (ఆధునికీకరణ) పనుల్లో ఇదే జరుగుతోంది. 

లైనింగ్‌ చేస్తే భూగర్భ జలాలు పెరగవని.. బోర్లు, బావులు ఎండిపోతే పంటలు సాగుచేసుకోలేక రోడ్డున పడతామని అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల రైతులు మొత్తుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోకుండా లైనింగ్‌ పనుల టెండర్లకు ఆమోదముద్ర వేశారంటే ప్రభుత్వ పెద్దల ‘ఉద్దేశం’ ఏమిటో అర్థమవుతుంది. అస్మదీయులకు పనులను అధిక ధరలకు కట్టబెట్టి ఖజానాను దోచుకోవడమే ఇందులోని పరమార్థం. ఈ బాగోతం కథాకమామిషు ఏమిటంటే..  

బట్టబయలైన లాలూ‘ఛీ’ పర్వం.. 
హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,520 క్యూసెక్కులకు పెంచడమే లక్ష్యంగా 216.3 కి.మీ. నుంచి 400 కి.మీ. వరకూ లైనింగ్‌ పనులను 12 ప్యాకేజీలుగా చేపట్టేందుకు రూ.936.70 కోట్లతో గతేడాది డిసెంబరు 3న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. కానీ, ఈ పనులను ఐదు ప్యాకేజీలకు కుదించి ఆర్నెలల్లో పూర్తి చేయాలనే నిబంధనతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. 

టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ముందే.. ఐదు ప్యాకేజీల్లో మూడు ప్యాకేజీలను ‘ఈనాడు’ కిరణ్‌ సమీప బంధువుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు, రెండు ప్యాకేజీలను సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్‌ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టాలని ముఖ్యనేత నిర్ణయించినట్లు అప్పట్లో కాంట్రాక్టర్లలో చర్చ జరిగింది. 

ఈ టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కోసం ఆ రెండు కాంట్రాక్టు సంస్థలు ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థతో వేర్వేరు జాయింట్‌ వెంచర్లు (జేవీ) ఏర్పాటు చేశాయి. ఒకటి, రెండు, మూడు ప్యాకేజీల పనులను ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌–ఎల్‌సీసీ (జేవీ).. నాలుగు, ఐదు ప్యాకేజీల పనులను బీఎస్సార్‌ ప్రాజెక్ట్స్‌–ఎల్‌సీసీ (జేవీ) దక్కించుకునేలా లోపాయికారీ ఒప్పందం మేరకు బిడ్‌లు దాఖలు చేశాయి. 

ఆర్ధిక బిడ్‌ తెరిచినప్పుడు ఒకటి, రెండు, మూడు ప్యాకేజీల్లో ఆర్వీఆర్‌–ఎల్‌సీసీ (జేవీ) ఎల్‌–1గా నిలిస్తే, బీఎస్సార్‌–ఎల్‌సీసీ (జేవీ) ఎల్‌–2గా నిలిచింది. నాలుగు, ఐదు ప్యాకేజీల్లో బీఎస్సార్‌–ఎల్‌సీసీ (జేవీ) ఎల్‌–1గా నిలిస్తే ఆర్వీఆర్‌–ఎల్‌సీసీ (జేవీ) ఎల్‌–2గా నిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే ఈ సంస్థలు అధిక ధరలకు కోట్‌ చేశాయి. లైనింగ్‌ పనులను రైతులు వ్యతిరేకించడంతో టెండర్లను ఆమోదించడంలో జాప్యం చోటు చేసుకుంది. 

చివరికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఇటీవల ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ) టెండర్లకు ఆమోద ముద్ర వేసింది. ఐదు ప్యాకేజీలకు రూ.743.85 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్టు సంస్థలు అధిక ధరకు కోట్‌ చేశాయి. రూ.936.70 కోట్లకు పనులను ఈ సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అంటే.. ప్రభుత్వ ఖజానాపై రూ.192.85 కోట్ల మేర భారం పడింది. 


పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లోనూ ఇంతే
పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో 0 కి.మీ. నుంచి 75.075 కి.మీ. వరకూ లైనింగ్‌ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.254.77 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ రెండు ప్యాకేజీల పనులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు రూ.266.24 కోట్లకు కట్టబెట్టారు. అంటే.. ప్రభుత్వ ఖజానాపై రూ.11.47 కోట్ల భారం పడింది. 



మొత్తమ్మీద హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులను అధిక ధరలకు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.204.32 కోట్ల మేర భారం పడింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసింది. 

అది అమల్లో ఉంటే ఈ పనుల్లో కనీసం రూ.300 కోట్లు ఖజానాకు ఆదా అయ్యేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో 75.075 కి.మీ. నుంచి 207.80 కి.మీ. వరకూ రూ.480.22 కోట్లతో చేపట్టిన లైనింగ్‌ పనులను ఎన్‌సీసీ సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో ప్రభుత్వం కట్టబెట్టడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement