handri-neeva canal
-
హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు శ్రీకారం
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులతో కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చే రోజులు తగ్గినందున.. గతం కంటే తక్కువ రోజుల్లో శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వర్షాభావ ప్రాంతమైన రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో –4.806 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,450 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచబోతోంది. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా కాలువ విస్తరణ, 8 చోట్ల ఎత్తిపోతలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఈనెల 1న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. –4.806 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు రూ.2,487.02 కోట్లు, 88 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు చేయాల్సిన పనులకు రూ.2,165.46 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా పనులు అప్పగించి.. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 73 రోజుల్లోనే ఒడిసిపట్టేలా.. శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించేలా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా పనులు చేపట్టారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కృష్ణా నదికి వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. అనేకసార్లు వరద ఒకేసారి గరిష్ట స్థాయిలో వస్తోంది. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టేలా కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం లేకపోవడంతో ఏటా వందలాది టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 73 రోజుల్లోనే హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. -
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే తిప్పారెడ్డి పోరాటం
-
టెండర్లు లేకుండానే హంద్రీ-నీవా పనులు
తిరుపతి : హంద్రీ- నీవా కాలువ పెండింగ్ పనులను టెండర్లు లేకుండానే కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తున్నారు. సీఎం చంద్రబాబు మౌఖిక ఆదేశాల మేరకు పనులు వేగంగా జరగలేదనే సాకు చూపి కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పజెప్పే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 53, 52, 8, 11, 25, 26 ప్యాకేజీ పనులను అప్పగించారు. నిబంధన 63సీ ప్రకారం ఈ పనులను కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పజెప్పారు. ఈమేరకు ముఖ్యమంత్రి సైతం నాలుగు నెలల క్రితమే మెమో జారీ చేసినట్లు సమాచారం. కట్టబెట్టిన పనులు ఇవే.... ఆడవిపల్లె రిజర్వాయర్, టన్నెల్-20 పెండింగ్ పనులను ఆర్కె ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. 8, 53 ప్యాకేజీలను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు కట్టబెట్టారు. 11, 52 ప్యాకేజీలలో పెండింగ్ పనుల్లో కొంత భాగాన్ని ఆర్కె ఇన్ఫ్రాకు ఇచ్చారు. 25, 26 ప్యాకేజీల్లో కొంత భాగం పనులను ఎంఆర్కెఆర్కు అప్పజెప్పారు. ఇంతకు మునుపు ఉన్న పాత రేట్లకే, వేగంగా పనులు చేస్తామని ముందుకు వచ్చిన కొత్త సంస్థలకు పనులు ఇచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం అప్పగించిన పనులకు ఎంత బిల్లు అవుతుందో, దానిని పాత ఏజెన్సీ నుంచి రాబట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంత మంది తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం చూపి పనులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పనుల పంపకంలో సీఎంతో సన్నిహితంగా మెలిగే వైఎస్సార్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి సోదరుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. పనులు తనకు అనుకూలమైన వారికే కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల తిరుపతి సీఈ కార్యాలయంలో అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. భూమి అప్పగిస్తేనే పనులు చేస్తామని మెలిక... భూసేకరణ పూర్తి కాకుండానే నవంబర్ 15వ తేదీలోపు పనులు చేస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. ఇప్పటికీ 59 ప్యాకేజీకి పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణకు ఇంకా రెండు నెలల సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు ప్రారంభించలేదన్న సాకుగా చూపి వేరే కాంట్రాక్టు సంస్థలకు అప్పజెబుతుండడంతో కొన్ని ఏజెన్సీలు నామమాత్రంగా పని చేస్తున్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని పనులు అప్పజెప్పాం... పనులు వేగంగా చేయని ప్యాకేజీలకు నిబంధన 60సీ ప్రకారం కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పజెప్పాం. 9 ప్యాకేజీలకు కొత్త రేట్ల ప్రకారం టెండర్లను పిలిచాం. పనులు సీఎం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. -సుధాకర్, తెలుగంగ సీఈ, చిత్తూరు -
హంద్రీ-నీవా పూర్తిచేస్తా
సీఎం అయిన వారం రోజుల్లో తంబళ్లపల్లెకు రోడ్లు ప్రతి గుండె చప్పుడులో వైఎస్ జగన్ ప్రసంగానికి భారీ స్పందన సాక్షి, తిరుపతి: రైతు కష్టం తెలుసని తాను ముఖ్యమంత్రి కాగానే హంద్రీ-నీవా పథకాన్ని త్వరగా పూర్తిచేస్తామని వైఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం తంబళ్లపల్లెలో మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా బి.కొత్తకోట, అంగళ్లు కేంద్రాలలో ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించారు. నీటి కోసం వేయి అడుగులకు పైగా బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ తనను కలుసుకున్న తంబళ్లపల్లె రైతులు ఆవేదన వెలిబుచ్చారన్నారు. ఇటువంటి కష్టం రైతులు పడకుండా ఉండేందుకు హంద్రీ-నీవా పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని అన్నారు. తాను ముఖ్యమంత్రినైన వారంరోజుల్లో తంబళ్లపల్లెకు రోడ్లు వేయిస్తానని చెప్పారు. పక్కనే పీలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గంలో రోడ్లు వేయించలేక పోయారని అవి ఎంత అధ్వానంగా ఉన్నాయో తనకు తెలుసునని పక్కన ఉన్న నియోజకవర్గానికే ఏమీ చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమి చేయగలరని ప్రశ్నిం చారు. ఈ హామీలకు ప్రజలు భారీగా స్పందించారు. ‘‘జై జగన్’’ అంటూ నినాదాలు చేశారు.జననేత ప్రసంగంలో ప్రతి మాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్ మరణించి ఎక్కడో లేడని, తమ గుండెల్లో ఉన్నాడని ప్రజలు అంటున్నారని, ఆయన ప్రతి గుండె చప్పుడులో ఉన్నాడని పేర్కొ న్నారు. వైఎస్ పేరు చెప్పగానే ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు. ‘ఒక్క మాటంటూ ఇస్తే మడమ తిప్పకూడదు, ఎన్నాళ్లు బతికామనేది ముఖ్యం కాదు ఎలా బతికామనేది ముఖ్యం’ అని తన తండ్రి చెప్పిన మాటలు చెవుల్లో రింగు రింగుమంటున్నాయని అనడంతో ప్రజలు చేతులు ఎత్తి స్పందన తెలిపారు. విభజన జరిగితే ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్‌ను, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కాలరు పట్టుకుని అడగాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొడితే, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీరే తప్ప తాగు నీళ్లు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చేయడమే రాజకీయమని అన్నారు. సీట్ల కోసం ఓట్ల కోసం చేసేది రాజకీయం కాదన్నారు. చంద్రబాబునాయుడికి రెండు ప్రశ్నలు వేయదల్చుకున్నానని, ఆయన నోటి నుంచి సమైక్యం అన్న మాట ఎందుకు రాదని అన్నారు. రాష్ట్రాన్ని విడదీయమని చెబుతున్న నీకు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటమని అన్నారు. తెలుగుజాతిని విడగొట్టాలా? నీటి కోసం తన్నుకు చావాలా అని ఆయన ప్రశ్నించగా ప్రజలు పెద్ద ఎత్తున ‘‘వద్దు’’ అంటూ సమాధానం చెప్పారు. ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా ఇంగ్లీషులో ‘నో’ అని సమాధానం చెప్పాలని జగన్ కోరినపుడు, వేలాది మంది చేతులెత్తి నో అని అరిచారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, అమరనాథ రెడ్డి, సమన్వయకర్తలు షమీమ్ అస్లాం, సునీల్‌కుమార్, రాజంపేట, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్ రెడ్డి, వరప్రసాదరావు, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ శివభరత రెడ్డి, ప్రోగామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, యువజన కన్వీనర్ ఉదయకుమార్ పాల్గొన్నారు. -
కదంతొక్కిన రైతులు
నందికొట్కూరూరల్, న్యూస్‌లైన్: కేసీ కెనాల్‌కు మార్చి వరకు నీరివ్వాలని కోరుతూ రైతులు గురువారం మల్యాల వద్ద ధర్నా నిర్వహించారు. హంద్రీ-నీవా కాలువ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ధర్నాలో మాట్లాడారు. కేసీ కెనాల్ రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇవ్యాలని ముచ్చమర్రి దగ్గర ఎత్తిపోతల పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారని గుర్తు చేశారు. అయితే రైతు నాయకుడుగా ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తి ఈ పనులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. బ్లాస్టింగుకు ఇళ్లు బీటలు బారి దెబ్బతింటున్నాయని చెప్పి నాలుగు సంవత్సరాలుగా పనులు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ పనుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి అనంతపూర్‌కు మూడు టీఎంసీల నీరు తీసుకొనిపోయారని తెలిపారు. జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన తప్ప రైతులగోడు వినడం లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రైతు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, బండిజయరాజు. జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి ఐజయ్య మాట్లడుతూ.. నీరు వదలి కేసీరైతులకు న్యాయం చేయలని కోరారు. హంద్రీనీవాకు రెండు పంపుల ద్యారా నీటిని పంపింగ్ చేయడంతో రైతులు అగ్రహం వ్వక్తం చేశారు. నీటిని బంద్‌చేయాలని డిమాండు చేయడంతో అధికారులు ఆమేరకు చర్యలు తీసుకున్నా రు. కాగా, వందలాది రైతులు మల్యా ల దగ్గర ధర్నా చేయడానికి రావడంతో సీఐ శివనారాయణ ఆధ్యర్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు మహేశ్వరరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, అబ్దుల్‌మునాఫ్, సత్యంరెడ్డి, కోకిల రమణరెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.