హంద్రీ–నీవా కాలువ
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులతో కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చే రోజులు తగ్గినందున.. గతం కంటే తక్కువ రోజుల్లో శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వర్షాభావ ప్రాంతమైన రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో –4.806 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,450 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచబోతోంది. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా కాలువ విస్తరణ, 8 చోట్ల ఎత్తిపోతలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఈనెల 1న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. –4.806 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు రూ.2,487.02 కోట్లు, 88 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు చేయాల్సిన పనులకు రూ.2,165.46 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా పనులు అప్పగించి.. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
73 రోజుల్లోనే ఒడిసిపట్టేలా..
శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించేలా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా పనులు చేపట్టారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కృష్ణా నదికి వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. అనేకసార్లు వరద ఒకేసారి గరిష్ట స్థాయిలో వస్తోంది. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టేలా కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం లేకపోవడంతో ఏటా వందలాది టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 73 రోజుల్లోనే హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment