climate change
-
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల!
వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఐక్యరాజ్యసమితి తేలి్చచెప్పింది. భూగోళంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎండగట్టింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రత మరో 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వార్షిక ఉద్గారాల నివేదికను ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసింది. వాస్తవానికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకే(2.7 ఫారెన్‌హీట్) పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్దతు పలికాయి. 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సులో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూగోళంపై జీవుల మనుగడ కొనసాగాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయాల్సిందేనని నిపుణులు స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసి దాదాపు పదేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి ఆక్షేపించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. → కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. → 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానం. → ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు. → ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్–29) సదస్సు వచ్చే నెలలో అజర్బైజాన్లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుంచించుకుపోతున్న కాస్పియన్
ప్రపంచంలోనే అతి పెద్దదైన కాస్పియన్ సరస్సు ఉనికి ప్రమాదంలో పడింది. రోజురోజుకూ నీరు తగ్గిపోయి కుంచించుకుపోతోంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది...కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. దీని సముద్రతీరం 4,000 మైళ్ళకు పైగా విస్తరించి ఉంది. కజకిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్, రష్యా, తుర్క్మెనిస్తాన్ దేశాలు.. చేపలు పట్టడం, వ్యవసాయం, పర్యాటకం, త్రాగునీటితో పాటు చమురు, గ్యాస్ నిల్వల కోసం కాస్పియన్పైనే ఆధారపడతాయి. ఆనకట్టలు, అధిక వెలికితీత, కాలుష్యం, పెరుగుతున్న వాతావరణ సంక్షోభంతో కాస్పియిన్ క్షీణిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఈ క్షీణత వేగవంతమవుతోంది. 130 నదుల నుంచి కాస్పియన్ సరస్సులోకి నీరు ప్రవేశిస్తుంది. అందులో 80 శాతం నీరు ఒక్క ఓల్గా నది నుంచే వస్తుంది. ఐరోపాలోనే పొడవైన నది ఓల్గా. దీనిపై రష్యా 40 ఆనకట్టలను నిర్మించింది. మరో 18 నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాస్పియన్కి నీటి ప్రవాహాన్ని తగ్గించాయి. ఓల్గా దిగువ ప్రాంతాలు అనేక పారిశ్రామిక కేంద్రాలకు నిలయంగా ఉన్నందున, రసాయన, జీవ కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. ఈ క్షీణతలో వాతావరణ మార్పులు సైతం కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే కాలుష్యం కూడా కాస్పియన్‌ను దెబ్బతీస్తోంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు బాషీ్పభవన రేటును పెంచి.. అస్తవ్యస్తమైన వర్షపాతానికి కారణమవుతున్నాయి. చమురు వెలికితీత, ఇతర పరిశ్రమల నుంచి వస్తున్న కారకాలతో కాస్పియన్ కలుíÙతమవుతోంది. వీటన్నింటితో.. కాస్పియన్ నీటి మట్టం పడిపోవడం 1990 మధ్య నుంచే ప్రారంభమైంది. 2005 నుంచి ఈ వేగం పెరిగింది. సుమారు 5 అడుగుల నీటిమట్టం తగ్గిందని జర్మనీలోని బ్రెమెన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సిస్టమ్స్ మోడలర్ మాథియాస్ ఫ్రాంజ్ వెల్లడించారు. ఈ శతాబ్దం చివరి నాటికి 8 నుంచి 18 మీటర్లు (26 నుంచి 59 అడుగులు) క్షీణించే అవకాశం ఉందని పరిశోధన ఒకటి అంచనా వేసింది. సంక్షోభంలోకి ఐదు దేశాలు... సరస్సు క్షీణత.. దీనిపై ఆధారపడి ఉన్న ఐదు దేశాలను సంక్షోభంలోకి నెడుతోంది. చేపలు పట్టడం, పర్యాటకం తగ్గిపోతుంది. ఓడరేవు నగరాల్లో నౌకలు దిగడం సమస్యగా మారడంతో షిప్పింగ్ పరిశ్రమ దెబ్బతింటుంది. దేశాల మధ్య రాజకీయంగానూ కీలక పరిణామాలు సంభవిస్తాయి. వనరుల కోసం పోటీ పెరుగుతుంది. చమురు, గ్యాస్ నిల్వలపై కొత్త విభేదాలకు దారితీస్తుంది. ఇక కాస్పియన్‌ను ఆవాసంగా చేసుకున్న ప్రత్యేకమైన వన్యప్రాణుల పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. వందలాది జంతుజాలానికి నిలయమైన అడవి కూడా అంతరించనుంది. కానీ నీరు తగ్గుముఖం పట్టడం వల్ల దాని లోతుల్లో ఆక్సిజన్ స్థాయిలు క్షీణిస్తాయి. దీంతో కొంత కాలానికి అందులోని జంతుజాలం తుడిచిపెట్టుకుపోతుంది. కాస్పియన్ సముద్రంలో అనేక రకాల స్టర్జన్ జాతులు ఉన్నాయి. ఈ చేప అత్యంత విలువైన, రుచికరమైన కేవియర్‌ను ఇస్తుంది. ప్రపంచంలోని కేవియర్‌లో 80–90% మధ్య కాస్పియన్ నుంచే ఉత్పత్తి అవుతుంది. కానీ కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. స్టర్జన్ చేపలు వేగంగా కనుమరుగవుతున్నాయని, త్వరలో అంతరించిపోయే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. ఇది బయటకు కనిపించని ఒక భారీ సంక్షోభం. సముద్ర క్షీరదాలైన కాస్పియన్ సీల్స్కు కూడా ప్రమాదకర సంకేతం. ఈ సంక్షోభానికి పరిష్కారాలు తక్కువ. ఇందుకు ఏ ఒక్క దేశాన్ని నిందించలేమని, కానీ సమిష్టి చర్యలు తీసుకోవడంలో విఫలమైతే అరల్ సముద్ర విపత్తు పునరావృతం అవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర మట్టాలు పెరుగుతుంటే కాస్పియన్ ఎందుకు తగ్గుతోంది? వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలను పెంచుతున్నాయి. కానీ కాస్పియన్ వంటి భూపరివేష్టిత సరస్సులది భిన్నమైన కథ. ఇవి నదుల నుంచి ప్రవహించే నీరు, వర్షపాతం సమతుల్యతపై ఆధారపడతాయి. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ఈ సమతుల్యత దెబ్బతింటోంది. దీంతో అనేక సరస్సులు కుంచించుకుపోతున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఎక్కువ శ్రమా అక్కర్లేదు. ఎందుకంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల మధ్య ఉన్న అరల్ సముద్రం దాదాపు అంతరించిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటిగా ఉన్న అరల్.. ఇప్పుడు అంతంతమాత్రంగా మిగిలింది. -
Climate change 2024: గతి తప్పుతున్న రుతుపవనాలు
వాతావరణ మార్పులు. భూమిపై జీవుల మనుగడకే సవాలు విసురుతున్న విపరిణామం. ప్రధానంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌పై వీటి ప్రభావం ఎలా ఉందన్న దానిపై క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ సమగ్ర అధ్యయనం చేసింది. రుతపవనాల సీజన్లో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు తేల్చింది. వాతావరణ మార్పులు వర్షాల గతినే పూర్తిగా మార్చేస్తున్నట్లు వెల్లడైంది. సాధారణ వర్షాలు పడాల్సిన సమయంలో అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అసలు వర్షాలే లేకపోవడం వంటి విపరీత పరిణామాలకు వాతావరణ మార్పుల ప్రభావమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. → దేశవ్యాప్తంగా 729 జిల్లాల్లో క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. 2024 రుతుపవనాల సీజన్లో ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతంలో వైవిధ్యం కనిపించింది. → 340 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. → 158 జిల్లాల్లో భారీ వర్షాలు, 48 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. మరోవైపు 178 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వీటిలో 11 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. → గత ఐదేళ్లలో చూస్తే ఈ ఏడాది తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురిసిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. వర్షపాతంలో మార్పులతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ఇందోళనకర పరిణామం అని చెబుతున్నారు. దీనివల్ల వరదలు, తద్వారా ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుందని అంటున్నారు. → ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 753 వాతావరణ కేంద్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 2020 తర్వాత ఇదే అత్యధికం. → భూమి ఉపరితలం, సముద్రాల ఉష్ణోగ్రతల్లో మధ్య వ్యత్యాసాలు రుతుపవనాలను ప్రభావితం చేస్తుంటాయి. సముద్రాలతో పోలిస్తే భూమిపై ఉష్ణోగ్రతలు వేగంగా మారుతుంటాయి. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా భూమి క్రమంగా వేడెక్కుతుండడంతో రుతుపవనాలు సైతం గతి తప్పుతున్నాయి. గత పదేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. → 2023లో దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. భూమిపై సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల రుతుపవనాల్లో ప్రతికూల మార్పు మొదలైందని క్లైమేట్ ట్రెండ్స్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఆర్తి ఖోస్లా చెప్పారు. → వ్యవసాయం, నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యతకు రుతుపవనాలే అత్యంత కీలకం. కోట్లాది మంది ప్రజల జీవితాలు రుతుపవనాలపై ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాలు పూర్తిగా గతి తప్పితే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే వాతవరణ మార్పులను అరికట్టాలని, పర్యావరణ పరిరక్షణపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!
పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. ఏమిటీ జలచక్రం...!? జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది. గతి తప్పితే అంతే...! జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. → నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.హరిత జలం.. అతి కీలకం చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్ వారి్మంగ్ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’– రిచర్డ్ అలన్, క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్, రీడింగ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోవిడ్‌ను మించే భూతం... భూతాపం
రెండేళ్ల పాటు కరోనా వైరస్ ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. కోవిడ్ కల్లోలం సృష్టించిన నష్టం ఈ శతాబ్దంలోనే కాక, మానవ చరిత్ర లోనే ఓ పెనువిషాదం. ఆ పీడకల నుంచి తేరుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచానికి మరో పెద్ద సవాలు... ‘గ్లోబల్ వార్మింగ్’. ఫలితంగా తీవ్రమైన ఎండలు, అంతలోనే వరదలు... మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. వాతా వరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతి యేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి.భూతాపం వల్ల సప్త సముద్రాలు వేడెక్కి పోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 1950 నాటికి హిమాలయాలపై ఘనీభవించిన మంచు నేటికి చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిణామం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత్‌తో సహా అనేక దేశాలలో శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోంది. మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు ముందుకు చొచ్చుకొచ్చి అనేక ద్వీపాలను కబళించి వేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో అధికంగా నష్టపోతున్న రంగాలలో వ్యవసాయం, ఆరోగ్యం ముఖ్యమైనవి. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రంగాలు అభివృద్ధిలో అనూహ్యంగా ముందంజ వేస్తుండగా... మరో వైపు నిలకడైన వాతావరణ పరిస్థితులు లేక వ్యవసాయం, తదితర ఉత్పత్తి రంగాలలో భారీ క్షీణత కనిపిస్తోంది. ఈ వైరుధ్యం ప్రజల మధ్య అనేక అసమానతలకు దారితీస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పేదల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. నివాసం ఉన్న చోట బతికే పరిస్థితి లేకపోవడం వల్ల మనుషులు వలసలు పోవాల్సిన దుఃస్థితి అనేక దేశాలలో నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల, భారీ వర్షాల వల్ల అపసవ్య దిశలో సముద్రపు నీరు పొంగి పంట పొలాల్లోకి, నదీసంగమాల వద్ద నదుల్లోకి ప్రవహి స్తోంది. వాతావణ మార్పుల వల్ల జీవ వైవిధ్యం పూర్తిగా గాడి తప్పింది. మారిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక మనుషు లతోపాటు మొక్కలు, జంతుజాలానికి తీవ్రమైన హాని కలుగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం తాజా నివేదిక ప్రకారం, సుమారు 10 లక్షల వృక్ష, జంతుజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 400 ఏళ్లల్లో 680 వెన్నెముక గలిగిన జాతులు నశించగా, కేవలం గత 2 దశాబ్దాలలోనే అంతకు రెట్టింపు జాతులు నశించాయి. కాలుష్యం, భూవినియోగంలో మార్పులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య తేడాలు ఇందుకు కారణంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూతాపం, కాలుష్యం కారణంగా మనుషులలో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలు కనపడుతున్నాయి. కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 87 లక్షల ప్రజలు చనిపోతున్నారు. కాలుష్యం వల్ల అప్పుడే పుట్టిన పసికందులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఒకప్పుడు అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక... బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజల ఇంధనాలను మండించడం ఎక్కువయ్యాక వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇంకా గ్రీన్ హౌజ్ వాయువుల కారణంగా కేవలం 150 సంవత్సరాలలో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర భూతాపం పెరిగింది. సహజ వాయువు వెలికితీత, దాని వాడకం వల్ల బయటపడే మీథేన్ కారణంగా మరో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిమి పెరిగే అవకాశం ఏర్పడింది.పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. అధిక వర్షాలు, వరదల వల్ల చేతికొచ్చిన పంటల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అన్ని చోట్లా ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా, వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం, అనుబంధ రంగాల కార్మికులకు ఆదాయాలు పడిపోయాయి. ఇప్పటికీ 60% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలంటే, అత్యవసర పర్యావరణ కార్యచరణతో ముందుకు సాగ వలసిందే! రుతుపవనాల గమనం, వాతావరణ వైవిధ్యం ఆధారంగా దేశాన్ని 7 జోన్లుగా వర్గీకరించుకొని అందుకు అనుగుణంగా పంటల సాగును నిర్వహిస్తూ వస్తున్న మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పంటలు పుష్పించే కాలంలో విపరీతమైన ఎండలు కాయడం వల్ల విత్తనాలు బలహీనపడుతున్నాయి. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపు తున్నది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతియేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం, గోధుమ, పప్పుధాన్యాల్లో ఉండే ప్రొటీన్లు నశిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పశువులకు అవసరమైన గ్రాసం అందడం లేదు. దాంతో, పశువుల ఎదుగుదల తగ్గి మాంసం ఉత్పత్తి పడిపోతోంది. పశువుల పునరుత్పత్తిపై ప్రతి కూల ప్రభావం చూపడమేకాక పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. అధిక వర్షాలు, వరదల వల్ల కోళ్లు, గొర్రెలు, ఇతర పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టాలు జరుగు తున్నప్పుడు రైతాంగానికి ప్రభుత్వపరంగా అందుతున్న సాయం అరకొరగానే ఉంటోంది. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయలేని నేపథ్యంలో... పంటవేసి నష్టపోయే కంటే, పంట వేయకపోతేనే తక్కువ నష్టం అనే భావన చాలా ప్రాంతాల్లోని రైతాంగంలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. ఇందువల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. భూతాపం తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించాయి, డిక్లరేషన్లపై సంతకాలు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రియో ఒప్పందం, కోపెన్హెగన్ సదస్సు, క్యోటో ఒప్పందం, కాప్ 21 పారిస్ ఒప్పందం... ఇలా అనేక విస్తృత వేదికలపై ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించడానికి చేసిన ఉమ్మడి ప్రమాణాలు కాగితాలకే పరిమితం కావడం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడింది.అయితే, కొన్ని దేశాలు మాత్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వాడకం దిశగా ముందుకు సాగడం కొంతలో కొంత ఊరట. శిలాజ ఇంధనాల వాడకాన్ని పక్కనపెట్టి, సున్నా కాలుష్యం వెదజల్లే (నెట్ జీరో ఎమిషన్) టెక్నాలజీల వైపు పరుగులుపెడుతున్నాయి. ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచడం; మొక్కజొన్న, మరికొన్ని రకాల ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారీ చేయడం; గాలి మరలు, సోలార్ ప్యానళ్ల నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలైన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నాయి. కొన్ని దేశాలు బయోఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తు న్నాయి. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వాడకం మొద లైనప్పటికీ వాటి సంఖ్య స్వల్పం. అలాగే, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచాలి. ముఖ్యంగా, ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం, మద్దతు అవసరం. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే ఫలితాలు అందుతాయి. లేకుంటే... కరోనాను మించిన భూతం అయిన భూతాపం వల్ల మరిన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
సహారాలో పచ్చందనం
సహారా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. కనుచూపుమేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు. ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆలవాలం. అలాంటి సహారా పచ్చబడుతోంది. నీళ్లు నిండిన మడుగులు, పచ్చని గడ్డితో, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తోంది...! వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు. పశి్చమ ఆఫ్రికాలోని ఈ ఎడారిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొద్ది రోజులుగా ముంచెత్తుతున్నాయి. అసలు వాన చినుకే పడని ప్రాంతాలు కూడా కుండపోతతో తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో సహారాలో విస్తారంగా గడ్డి మొలుస్తోంది. పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! చాద్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, మాలి, నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుని కనిపిస్తోంది. భారీ వర్షాలు సహారాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెపె్టంబర్ 7, 8 తేదీల్లో కుండపోత కురిసింది. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్లలో పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది. దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్లకు కూడా నోచుకోని విస్తారమైన ఇసుక మేటలు కాస్తా కొలనులుగా మారి ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్)లో మార్పులే దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల గాలులు ఉత్తర దిశ నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి. ఫలితంగా తుపాన్లు, భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్నే ఐటీసీజెడ్గా పిలుస్తారు. ఈ సీజన్లో ఇది సహారా ఎడారికి సమీపంగా జరిగింది. వానలు, వరదలకు కారణమయ్యే లా నినా పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహారా పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో పలు దేశాల్లో 40 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 21 వేల ఏళ్లకోసారి... సహారా ఎడారి ప్రతి 21 వేల ఏళ్లకోసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట. విస్తారమైన అడవులు, నదులు, సెలయేళ్లు, గుట్టలతో కళకళలాడుతూ ఉంటుందట. కొన్ని వేల ఏళ్లపాటు ఇలా సాగాక తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ విస్తారమైన ఇసుక మేటలతో ఎడారిగా మారిపోతుంది. ఒక్క చివరి మంచు యుగాన్ని మినహాయిస్తే గత 8 లక్షల ఏళ్లుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందని సైంటిస్టులు తేల్చారు. భూ అక్షంలో 21 వేల ఏళ్లకు ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేడాది జరిగిన ఒక అధ్యయనం తేలి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
గ్లేసియర్ టూరిజం... ప్రాణాంతకం!
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది. హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...! వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు. కరిగే మంచు.. పెను ముప్పు సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్‌జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్‌కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు! ఎన్నెన్ని విషాదాలో...! → 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్‌లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్. → 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు. → 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు. → 2023లో ఐస్లాండ్లోని ఓ గ్లేసియర్‌లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్లాండ్లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సుడిగాలి మిస్టరీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, ఏటూరునాగారం/తాడ్వాయి: రాష్ట్రంలో.. ఆ మాటకొస్తే దేశంలోనే అరుదుగా జరిగే బీభత్సం ములుగు అడవుల్లో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు.. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో 200 హెక్టార్ల (దాదాపు 500 ఎకరాల) విస్తీర్ణంలో 50వేలకుపైగా చెట్లు నేలకూలాయి. ఇది ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. 4,5 రోజులు ఆగకుండా కురిసిన వర్షాలకు తోడు భారీ సుడిగాలుల (టోర్నడోల)తోనే ఈ ఘటన జరిగినట్టు అంచనా వేస్తున్నారు. లోతుగా అధ్యయనం అవసరం: టోర్నడోలు చాలా వరకు బహిరంగ ప్రదేశాల్లోనే వస్తాయని.. ఇంత పెద్ద ఎత్తున చెట్లతో నిండి ఉన్న అటవీప్రాంతంలో వచ్చే వీలు లేదని వాతావరణ, నీటి వనరుల నిపుణుడు బీవీ సుబ్బారావు తెలిపారు. ములుగు ప్రాంతంలో ఈ పరిణామం చాలా విచిత్రంగా ఉందని.. అయితే మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లాలో ఇలాంటి స్వల్పస్థాయిలో చోటుచేసుకుందని చెప్పారు. వాతావరణ మార్పులతోనే ఇలా జరిగిందని భావిస్తున్నామని.. అడవుల్లో ఇలా జరగడంపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అతివేగమైన గాలి.. తడిసిన నేలతో..: అత్యంత వేగంగా, బలంగా వీచిన గాలులతోనే ములుగు అడవిలో విధ్వంసం జరిగి ఉంటుందని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి (మాజీ పీసీసీఎఫ్ ర్యాంక్ అధికారి) రఘువీర్ అంచనా వేస్తున్నారు. నాలుగైదు రోజులు ఆగకుండా కురిసిన వానతో నేల తడిసి, డొల్లగా అవుతుందని.. దీనికితోడు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కొమ్మలు కొట్టేయడంతో చెట్లు బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటప్పుడు అతివేగంగా వీచే గాలులతో చెట్లు కూలిపోయే చాన్స్ ఉంటుందని వివరించారు. 1996లో మధ్యప్రదేశ్‌లోని ఓ అభయారణ్యంలో ఇలాంటి ఘటన జరిగిందని.. ములుగులో జరిగిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో చెట్లు పడిపోయాయని నిపుణులు చెప్తున్నారని రఘువీర్ వెల్లడించారు. ములుగులో పెద్ద సంఖ్యలో చెట్లు కూలినా.. చాలా వరకు వేళ్లతో సహా పెకిలింతకు గురికాలేదన్నారు. మధ్యకు విరిగిన, కొమ్మలన్నీ పోయి కాండం మిగిలిన చెట్లు త్వరలోనే కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక టోర్నడో వృత్తాకారంలోఒకేచోట తిరుగుతుందని.. కానీ ములుగు అడవిలో అలాకాకుండా ఒకేవైపు నుంచి ప్రభావం పడిందని తెలిపారు. అందరిలోనూ విస్మయం ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో 50వేల చెట్లు నేలకూలడం అటవీశాఖ అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. దీనికి కారణమేంటన్న దానిపై పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియల్, జిల్లా అధికారులు రాహుల్‌కిషన్ జాదవ్, ఇతర అధికారులు పరిశీలన జరుపుతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా కూలిన చెట్లను పరిశీలించారు. మరోవైపు పెనుగాలులతో నేలకూలిన చెట్లపై కలప స్మగ్లర్ల కన్నుపడిందని స్థానికులు అంటున్నారు. చెట్ల దుంగలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. తల్లుల దీవెనలతోనే బయటపడ్డాం: మంత్రి సీతక్క సుడిగాలి గ్రామాలపైకి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినా.. ఇలా వేలాది చెట్లు కూలిపోయాయని ఊహించలేదని మంత్రి సీతక్క చెప్పారు. డ్రోన్ కెమెరాల సాయంతో పరిశీలించినప్పుడు విధ్వంసం బయటపడిందన్నారు. బుధవారం సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓ, స్థానిక అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదని.. అలా మళ్లి ఉంటే పెను విధ్వంసం జరిగి ఉండేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందాలను పంపి చెట్లు కూలిన ఘటనపై పరిశోధన జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కోరారు. సుడిగాలితో నేలకొరిగి ఉంటాయి! సుడిగాలి, మేఘాలు రెండూ కలిసినపుడు ఇటువంటి వర్షాలు కురుస్తాయి. సాధారణంగా చెట్ల వేళ్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళితే గట్టి పట్టు ఉంటుంది. కానీ ఇక్కడి ఆకులు రాలుతూ అక్కడే చెట్టుకు అవసరమై ఎరువు తయారవుతూ ఉంటుంది. దీనితో వేర్లు లోతుగా కాకుండా పక్కలకు విస్తరించి పట్టులేకుండా ఉంటాయి. ఇలాంటి చెట్లు సుడిగాలితో పట్టుకోల్పోయి నేలకొరిగి ఉంటాయి. ఇలాంటి ఘటనను నా 35 ఏళ్ల సర్వీస్‌లో ఎప్పుడూ చూడలేదు. – ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ -
చెలియలికట్ట దాటేస్తోంది..!
వాతావరణ సంక్షోభం సముద్రాలనూ అల్లకల్లోలం చేస్తోంది. వినాశకరమైన మార్పులకు కారణమవుతోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు సముద్ర మట్టాల పెరుగుదల ఊపందుకుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ ధోరణి నానాటికీ కలవరపెడుతోంది. ఏకంగా ‘ప్రపంచ విపత్తు’ స్థాయికి చేరి పసిఫిక్ దీవుల అస్తిత్వానికే ముప్పుగా పరిణమించింది! దీనిపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మనిషి చేజేతులా తెచి్చపెట్టుకున్న సంక్షోభమిది. ఇది గనుక పరాకాష్టకు చేరితే మనం సురక్షితంగా బయటపడేందుకు లైఫ్‌బోట్ కూడా మిగలదు’’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ప్రపంచం స్పందించాలని పిలుపునిచ్చారు... పసిఫిక్ ద్వీప దేశం టోంగా రాజధాని నుకులోఫాలో ఇటీవల పసిఫిక్ ఐలండ్స్ ఫోరం సమావేశం జరిగింది. ఆ వేదిక నుంచే, ‘మన సముద్రాలను కాపాడండి (సేవ్ అవర్ సీస్)’ పేరిట అంతర్జాతీయ స్థాయి పెనుప్రమాద హెచ్చరిక (గ్లోబల్ ఎస్ఓఎస్)ను ఐరాస చీఫ్ విడుదల చేశారు. ‘‘పసిఫిక్ ఉప్పొంగిపోతోంది. అక్కడి బలహీన దేశాలు అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటికి ఆర్థిక సాయాన్ని, మద్దతును భారీగా పెంచండి’’ అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మూడింతల ముప్పు! నైరుతీ పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1980 నుంచి ప్రపంచ సగటు కంటే ఏకంగా మూడు రెట్లు వేగంగా పెరిగినట్టు ప్రపంచ వాతావరణ సంస్థ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ పేర్కొంది. దీంతో గత 30 ఏళ్లలో అక్కడ సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే రెట్టింపు పెరిగాయట. సముద్ర వడగాలులూ రెట్టింపయ్యాయి. మున్ముందు అవి మరింత తీవ్రంగా, మరింత సుదీర్ఘకాలం కొనసాగుతాయి’’ అని నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధన ఉద్గారాల తాలూకు వేడిలో ఏకంగా 90 శాతం సముద్రాలే గ్రహించాయని నివేదిక వెల్లడించింది. దాంతో సముద్రపు ఉష్ణోగ్రతలు, ఫలితంగా సముద్ర మట్టం ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. వేగంగా కరిగిపోతున్న హిమానీ నదాలు, భారీ మంచు పలకలు ఇందుకు తోడవుతున్నాయి! ‘‘మున్ముందు సముద్రాలు కోలుకోలేని మార్పులకు లోనవుతాయి. మనుగడ కోసం మనిషి చేస్తున్న వినాశనమే ఈ ముప్పుకు కారణం’’ – డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టే సౌలో‘‘ఇప్పుడు పసిఫిక్ వంతు. మున్ముందు అన్ని సముద్రాలకూ ఈ ముప్పు పొంచి ఉంది. ఇప్పుడే కళ్లు తెరిచి పసిఫిక్‌ను కాపాడు కుంటే మొత్తం మానవాళినీ కాపాడుకున్నవాళ్లం అవుతాం. అందుకే ప్రపంచం పసిఫిక్ వైపు చూడాలి. ఈ హెచ్చరికల్ని వినాలి’’ – ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్మహానగరాలకూడేంజర్ బెల్స్... సముద్రమట్టం పెంపు తాలూకు ముప్పు ప్రభావం ప్రస్తుతానికి పసిఫిక్ ద్వీపాలపైనే కన్పిస్తున్నా అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా లోతట్టు ద్వీపాలన్నింటికీ పాకుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక జనసాంద్రతతో కిక్కిరిసిపోతున్న తీర ప్రాంత మహా నగరాలు, ఉష్ణమండల వ్యవసాయ డెల్టాలు తదితరాల భద్రతకు పెను ముప్పు పొంచి ఉన్నట్టేనని అంటున్నారు. ‘‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచాలి. అంతకంటే ముందు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ లోపుకు పరిమితం చేయడంపై మరింత దృష్టి పెట్టాలి. అందుకోసం కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించాలి’’ అని రెండు నివేదికలూ ముక్త కంఠంతో పేర్కొన్నాయి.ఆ దీవులకు పెను ముప్పే..వాతావరణ సంక్షోభం, సముద్ర మట్టాల పెరుగుదల వల్ల పసిఫిక్‌కు త్వరలోనే పెను ముప్పు పొంచి ఉందని ఐరాస వాతావరణ కార్యాచరణ బృందం మంగళవారం ప్రచురించిన రెండో నివేదికలో కూడా పేర్కొంది. అందులో ఏం చెప్పిందంటే... 👉 దీనివల్ల తువలు, మార్షల్ ఐలాండ్స్ వంటి పసిఫిక్ దీవులు ప్రభావితమవుతున్నాయి. 👉 సముద్ర తాపం, సముద్ర మట్టం పెరుగుదల, ఆమ్లీకరణ... ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాయి. 👉 ఫలితంగా పర్యావరణ వ్యవస్థలు, పంటలు దెబ్బ తినడమే గాక మంచినీటి వనరుల కలుషితమవుతున్నాయి. 👉 జీవనోపాధి కూడా భారీగా దెబ్బ తింటోంది. 👉 తీవ్ర వరదలు, ఉష్ణమండల తుఫాన్లు ఇప్పటికే ఆ ద్వీపాలను నాశనం చేస్తున్నాయి. 👉 2023లో 34 భారీ తుఫాన్లు, వరద సంబంధిత ఘటనలు భారీ సంఖ్యలో మరణాలకు దారితీశాయి. 👉 ఈ ప్రాంతంలో ఏకంగా 2.5 కోట్ల మందిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 👉 సముద్ర మట్టానికి కేవలం 1 నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉన్న పసిఫిక్ ప్రాంతంలో 90 శాతం ప్రజలు తీరానికి 5 కి.మీ. పరిధిలోనే నివసిస్తున్నారు. 👉 ఇక్కడి మౌలిక సదుపాయాల్లో సగానికి సగం సముద్రానికి 500 మీటర్ల లోపలే ఉన్నాయి. 👉 ప్రస్తుత 3 డిగ్రీల సెల్సియస్ వేడి పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి పసిఫిక్ దీవుల వద్ద సముద్ర మట్టం మరో 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. 👉 ఏటా 30 రోజులకు పైగా తీరప్రాంత వరదలు ముంచెత్తుతాయి. 👉 సముద్ర మట్టం పెరుగుదల అనుకున్న దానికంటే వేగవంతమవుతుంది. 👉 ఫలితంగా పసిఫిక్ దీవులకు ముంపు ముప్పు కూడా వేగవంతమవుతుంది. -
రైతులకు త్వరగా చేరినప్పుడే కొత్త వంగడాల ప్రయోజనం!
వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్‌తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్నజొన్న ఎస్పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్‌తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్‌లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు. 5 నెలల కంది సూటి రకంకంది ఎన్ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్‌కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్‌తో కలసి కర్ణాటక రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.పాలకులు శ్రద్ధ చూపాలిశాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్‌తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి. – డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్ -
జల సంక్షోభం ముంచుకొస్తోంది!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడమే కాక.. వ్యర్థజలం మురుగునీటిని శుభ్రపరిచి పునర్వినియోగంలోకి తేకపోయినట్లయితే ప్రపంచం మొత్తం జల సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (యూఎన్‌యూ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రపంచ జలభద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనాసహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది (72 శాతం)ని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి.పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జలసంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలిచావులు పెరిగే అవకాశముందని కూడ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సుమారు వంద కోట్ల మంది (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో 195 దేశాలుండగా.. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది.ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (ఒక మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదిక (గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్)ను ఇటీవల విడుదల చేసింది.నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ..కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే..⇒ పపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు ప్రధాన కారణం.⇒ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భజలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. ⇒ పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటమూ నీటి ఎద్దడికి దారితీస్తోంది.ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం..రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాçÜ్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాతి్వయా తదితర దేశాల్లోని వంద కోట్ల మంది 49 దేశాల్లోని వంద కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.⇒ ప్రపంచ జలభద్రత నివేదిక ప్రకారం 2030 నాటికి నీటి కష్టాలు ఇలా..⇒నీటి కష్టాలు చుట్టుముట్టనున్న దేశాలు 113⇒113 దేశాల్లో నీటి కష్టాలు ఎదుర్కోనున్న జనాభా 560 కోట్లు⇒గుక్కెడు పరిశుభ్రమైన తాగునీరు కూడా లభించని దేశాలు 24⇒ఈ 24 దేశాల్లో జనాభా 6.42 కోట్లు⇒ ఒక మనిíÙకి రోజుకు కనీసం కావాల్సిన పరిశుభ్రమైన నీరు 50 లీటర్లు⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న దేశాలు 49⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న జనాభా 100 కోట్లు -
పిట్టల్లా రాలిపోతున్నారు!
వాతావరణ మార్పుల కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న వడగాడ్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వేడి గాలులు, వడదెబ్బకు దేశంలో దశాబ్ద కాలంలో 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2013 నుంచి 2022 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10,635 మంది ప్రాణాలొదిలారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర హోం శాఖలో నమోదైన వేడిగాలులు, వడదెబ్బ మరణాల వివరాలను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పార్లమెంట్లో వెల్లడించింది. – సాక్షి, అమరావతిఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీదేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ ఉంది. ఈ విషయం అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 1970 నుంచి 2023 మధ్య ఐదు దశాబ్దాల్లో దేశంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో 1970తో పోలిస్తే 2023లో ఏపీలో 0.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగినట్టు వెల్లడైంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు పేర్కొంది. మానవ ప్రమేయంతో వాతావరణంలో వచ్చే మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.ఏపీలో 2015లోనే 654 మరణాలుదేశ వ్యాప్తంగా పదేళ్లలో 10 వేల మందికిపైగా మరణించగా అందులో ఏపీ నుంచే అత్యధికంగా 2,203 మరణాలున్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వేడిగాలులు, వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలారు. అప్పట్లో వడదెబ్బ ముప్పు నుంచి రక్షణ పొందడం, బాధితులకు సత్వర చికిత్సలు ఇతర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో రాష్ట్రంలో పదేళ్లలో 2,203 మరణాలు సంభవించగా.. 2014–19 మధ్యనే 1,538 మరణాలు సంభవించాయి. అత్యధికంగా 2015లో 654 మరణాలున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం జగన్ ప్రభుత్వం వడదెబ్బ మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. వేసవిలో వడదెబ్బ, వేడిగాలుల నుంచి రక్షణ పొందడంపై వైద్య శాఖ సిబ్బంది ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గర్భిణులు, చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీని చేపట్టడంతో పాటు, ఆస్పత్రుల్లోను ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి బాధితులకు సత్వర వైద్యం అందించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో వందల సంఖ్యలో ఉన్న మరణాలను గణనీయంగా నియంత్రించారు. దీంతో 2019లో 128.. 2020లో 50.. 2021లో 22.. 2022లో 47 చొప్పున మాత్రమే మరణాలు సంభవించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2022 మధ్య 1,172 మరణాలు సంభవించాయి. -
వాతావ'రణం'
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. కట్టుబట్టలతో ఆవాసాలను వదులుకుని వలసలు పట్టాల్సిన దుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రభావాల బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు,, అనావృష్టి, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు, ఇతర కాలుష్యాల విపత్తుల కారణంగా ఉన్న ప్రాంతాలను వదులుకుని వలస దారులు వెతుక్కుంటున్నారు. 2019లో దాదాపు 50 లక్షల మంది దేశంలో వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్నట్టు గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ నివేదిక పేర్కొంది. 2050 నాటికి 4.50 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ – దక్షిణాసియా నివేదిక తాజాగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. 2021 – 22 నుంచి దేశంలో గ్లోబల్ వార్మింగ్ 11 శాతం పెరిగిందని అమెరికాలోని కొలరాడోకు చెందిన యేల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సంస్థ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే నష్టాలు ఇవి.. » విపరీతమైన వేడి, కరువు, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు వంటి వాతావరణ మార్పుల కారణంగా వలసలు పెరుగుతాయి. » వ్యవసాయం దెబ్బతినడంతో దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేరే ప్రాంతాలకు వలస పోతారు. » మొక్కలు, జంతు జాతులకు ముప్పు వాటిల్లుతుంది. » తీవ్రమైన వేడి తరంగాలు వంటి పర్యావరణ ప్రమాదాలు తలెత్తుతాయి.» ముఖ్యంగా ప్రజల జీవనానికి కరువు, నీటి కొరత, తీవ్రమైన వాయు కాలుష్యం, తీవ్రమైన తుపానులు, వరదలు ఆటంకం కలిగిస్తాయి.» వాతావరణ విపత్తులతో వలసల ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతోంది. కుటుంబంలోని పురుషుడు వలస వెళ్ళినప్పుడు స్త్రీలు వ్యవసాయం, కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. » కుటుంబాలతో సహా వలస వెళ్లిన వారు సొంత భూమితో సంబంధాన్ని కోల్పోతున్నారు. భారత్ సహా దక్షిణాసియాకు ప్రమాద ఘంటికలువాతావరణ ప్రేరిత వలసలు దక్షిణాసియాను కుదిపేస్తున్నాయి. ప్రజల కష్టాలను పెంచి వలసలకు దారితీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో నదులు కోతకు గురవుతున్నాయి. పాకిస్తాన్, భారతదేశంలో వరదలు పోటెత్తుతున్నాయి. నేపాల్‌లో హిమానీ నదాలు కరుగుతున్నాయి. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్‌లలో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ప్రజలు ఆవాసాలు కోల్పోవాల్సి వస్తోంది. శ్రీలంకలోని వరి, టీ ఎస్టేట్లపై సాధారణంకంటే భారీ వర్షాలు, తుఫానులు విరుచుకుపడటంతో ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత భారత్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతోంది. మానవుల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ దశాబ్దానికి 0.26 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గత దశాబ్దంలో ఉష్ణోగ్రత 1.14 డిగ్రీల నుంచి 1.19 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత ఏడేళ్లలో భారత తలసరి బొగ్గు ఉద్గారాలు 29% పెరిగాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
భావి ఒలింపిక్స్‌కు వడదెబ్బ!
ఇదీ పారిస్ ఒలింపిక్స్‌తో వాతావరణం ఆటాడుకున్న తీరు. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ క్రీడా వేడుకల నిర్వహణను దేశాలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. కానీ 2050 నాటికి చాలా దేశాలకు ఒలింపిక్స్ నిర్వహణ కలగానే మిగలనుంది. ఆయా దేశాల్లో ఎండలు ఇప్పటికే ఠారెత్తిస్తుండటం, 2050కల్లా ప్రమాదకర స్థాయిని దాటేలా ఉండటమే ఇందుకు కారణం. ఒలింపిక్స్ జరిగేదే ప్రధానంగా వేసవిలోనే. కనుక ఉష్ణోగ్రతలు 27.8 డిగ్రీల సెల్సియస్ దాటితే వాటి నిర్వహణను రద్దు చేయాలన్నది అంతర్జాతీయ క్రీడా నిపుణుల సిఫార్సు. ఆ లెక్కన గతంలో ఒలింపిక్ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అట్లాంటా (అమెరికా), బీజింగ్ (చైనా), ఏథెన్స్ (గ్రీస్), టోక్యో (జపాన్) వంటి పలు నగరాలకు ఇంకెప్పటికీ ఆ అవకాశం దక్కబోదు. ఆ నగరాల్లో వేసవిలో ఎండలు మండిపోవడం పరిపాటిగా మారింది. అంతేకాదు, వచ్చే (2028) ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోయే అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఎండలపరంగా చూసుకుంటే ఏ మేరకు సురక్షితమన్న ఆందోళన ఇప్పట్నుంచే మొదలైంది. ఆదివారం అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీలు దాటేయడమే ఇందుకు కారణం! పారిస్‌లో ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఏకంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి! వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తున్నాయో, రోజురోజుకూ ప్రమాదం అంచులకు నెడుతున్నాయో చెప్పేందుకు ఈ పరిణామం మరో తార్కాణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో చాలావరకు 2050 నాటికి ఒలింపిక్స్ నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉండబోవని ప్రఖ్యాత క్లైమేట్ సైన్స్, అనలిటిక్స్ స్వచ్ఛంద సంస్థ ‘కార్బన్ప్లాన్’ హెచ్చరించింది. వాటిలో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరిగిపోతాయని పేర్కొంది. వాతావరణ మార్పుల ధోరణి ఆధారంగా రూపొందించిన గణాంకాలతో విడుదల చేసిన తాజా నివేదికలో సంస్థ ఈ మేరకు పేర్కొంది.ఎన్నో సమస్యలు... ఎండలు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధిని దాటితే ఒలింపిక్స్ నిర్వహణకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు... → ప్రఖ్యాత అథ్లెట్లు చాలా మంది ప్రధానంగా చలి దేశాల నుంచే వస్తారు. ఈ స్థాయి ఎండలను వాళ్లు అస్సలు తట్టుకోలేరు → దాంతో క్రీడాకారులు ఎండకు సొమ్మసిల్లిపోవడం, వడదెబ్బ బారిన పడటం వంటి సమస్యలు పొంచి ఉంటాయి → ఇవి వారిలో తీవ్ర అనారోగ్యానికి, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. → 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతి 100 మంది అథ్లెట్లలో ఒకరు ఎండలకు తాళలేక కళ్లు తేలేశారు! → దాంతో మారథాన్, వాకింగ్ వంటి ఈవెంట్లను పర్వతప్రాంత నగరమైన సపోరోకు మార్చినా లాభం లేకపోయింది. ఆరుగురు వాకర్లు, రన్నర్లు వడదెబ్బ బారిన పడ్డారు.ఇలా కొలుస్తారు... సమస్యలకు దారితీసే స్థాయి ఎండ వేడిమిని వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్‌గా పిలుస్తారు. వేడి, తేమ, గాలి వేగం, సూర్యుని కోణం, మేఘావరణం వంటి పలు అంశాల ప్రాతిపదికన దీన్ని నిర్ణయిస్తారు. ఆ లెక్కన ఒలింపిక్స్ నిర్వహణకు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధి 27.8 డిగ్రీ సెల్సియస్‌గా నిర్ణయించారు. ఎండలు అంతకు మించితే పోటీల వాయిదా, అవసరమైతే రద్దు తప్పనిసరని అంతర్జాతీయ క్రీడా నిపుణులు చెబుతారు. వచ్చే ఒలింపిక్స్ సంగతి ఏమిటీ?2028 ఒలింపిక్స్‌కు వేదిక అమెరికాలోని లాస్ ఏంజెలెస్. అక్కడ పసిఫిక్ గాలుల కారణంగా వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండదని భావించారు. కానీ ఒకట్రెండేళ్లుగా లాస్ ఏంజెలెస్‌లో ఎండలు గట్టిగానే ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా ఆదివారం 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతలు అక్కడ క్రమంగా పరిపాటిగా మారుతుండటం ఒలింపిక్ కమిటీని ఇప్పటినుంచే ఆందోళనపరుస్తోంది. 2032 ఒలింపిక్స్‌కు ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ వేదిక కానుంది. వేసవిలో అక్కడ కూడా ఎండలు ఠారెత్తిస్తాయి. కానీ ఒలింపిక్స్ నిర్వహించే జూలై చివరి నాటికి శీతాకాలమే ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండబోదని భావిస్తున్నారు. మనకు కష్టమే! 2036 ఒలింపిక్స్ వేదిక ఎంపిక మాత్రం నిర్వాహకులకు పెద్ద పరీక్షగానే మారనుంది. అందుకు బిడ్స్ వేసిన ఆరు దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడా సంరంభాన్ని నిర్వహించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఇండొనేసియా నూతనంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక రాజధాని నుసంతర, దోహా (ఖతర్), ఇస్తాంబుల్ (తుర్కియే), వార్సా (పోలండ్), శాంటియాగో (చిలీ) కూడా బరిలో ఉన్నాయి. కానీ ఉష్ణోగ్రతల కోణంలో చూస్తే అహ్మదాబాద్, çనుసంతర, దోహాల్లో ఒలింపిక్స్ నిర్వహణ అస్సలు సాధ్యపడకపోవచ్చు. ఇది అంతిమంగా వార్సా, శాంటియాగోలకు అడ్వాంటేజ్‌గా మారొచ్చు. వాటి తర్వాత ఇస్తాంబుల్ కూడా ఉష్ణోగ్రతపరంగా కాస్త అనువుగానే ఉండనుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో అనుమతించే పక్షంలో అహ్మదాబాద్‌కు చాన్సుంటుంది. -
డెంగీ హైరిస్క్ ప్రాంతాలు 2,071
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. దీంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా ఉన్నారని నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరాల్లో వచి్చన డెంగీ కేసుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే, అప్రమత్తమై 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.42 డెంగీ పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా, వాటిలో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు ఉన్నాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటినిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆమె శుక్రవారం డెంగీ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా ఆశ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని, నీటిలో డెంగీ కారక దోమల సంతానోత్పత్తిని నివారించాలని కోరారు. లార్వా వ్యాప్తి ఇతర జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది. జూలై నెలలోనే 800 కేసులు వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే... ఒక్క జూలైలోనే 800 వరకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నిల్వలు భారీగా పెరుగుతుండటం, పారిశుధ్యలోపం కారణంగా ఆగస్టు, సెపె్టంబరు నెలల్లో డెంగీ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు డెంగీ బాధితులు వస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటున్నారు. -
IPE Global: డేంజర్ మార్కు దాటేస్తున్న... భుగభుగలు
ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో ఏకంగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదై జనాలను బెంబేలెత్తించాయి. అలస్కాలో హిమానీ నదాలు ఇటీవలి కాలంలో వేసిన అంచనాలను కూడా మించి శరవేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. భూగోళానికి ఊపిరితిత్తులుగా చెప్పే అమెజాన్ సతత హరిత అరణ్యాలే క్రమంగా ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చుల బారిన పడుతున్నాయి.సౌదీ అరేబియాలో ఏకంగా 50 డిగ్రీలు దాటేసిన ఎండలకు తాళలేక 1,300 మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతాలన్నీ సూచిస్తున్నది ఒక్కటే. భూగోళం శరవేగంగా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందనంత దారుణ ప్రభావం చూపుతోంది. భూతాపం ఈ శతాబ్దంలోనే ఏకంగా 2.5 డిగ్రీలకు పైగా పెరిగి మొత్తం మానవాళినే వినాశనం వైపు నెట్టడం ఖాయమని వందలాది మంది ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు! పారిశ్రామికీకరణ ముందు స్థాయితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగింది. అది 1.5 డిగ్రీలను దాటితే ఊహించని ఉత్పాతాలు తప్పవని సైంటిస్టులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అలాంటిది, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ శతాబ్దాంతానికే భూతాపంలో పెరుగుదల 2.5 డిగ్రీల డేంజర్ మార్కును దాటేయడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వే తేలి్చంది. ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనీవినీ ఎరగని విపరిణామాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనాకు వచి్చంది. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెలా రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ ఏడాది సంభవించిన ఎల్‌నినో ఇప్పటిదాకా నమోదైన ఐదు అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచింది. శిలాజ ఇంధనాల వాడకం తదితరాల వల్ల జరుగుతున్న భారీ కాలుష్యం వంటివి వీటికి తోడవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌లో మూడొంతులు కేవలం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారం వల్లనే జరుగుతోంది. వాతావరణంలో సీఓటూ స్థాయి పెరుగుతున్న కొద్దీ వేడి గాలులు, హరికేన్లు, కార్చిచ్చులు, వరదలు వచి్చపడుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో చైనా, అమెరికా, భారత్ టాప్ 3లో ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా సంపన్న దేశాలే కారణమని ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ హెడ్ అబినాశ్ మహంతీ చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో గత రెండు శతాబ్దాలుగా జరిగిన మితిమీరిన పారిశ్రామికీరణ పర్యావరణానికి చెప్పలేనంత చేటు చేసిందని వివరించారు. ‘‘ఇప్పుడు కూడా సంప్రదాయేతర ఇంధనాల వాడక తదితరాల ద్వారా గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్న పెద్ద దేశాల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా భరించలేని ఎండలు, ఆ వెంటే వరదలు, హరికేన్ల వంటి ఉత్పాతాలు కొన్నేళ్లుగా సాధారణ పరిణామంగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద సూచికలే’’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన పాతాళానికి భూగర్భ జలాలు20 ఏళ్లలో 450 క్యుబిక్ కి.మీ. మేరకు మాయంఉత్తర భారతదేశంలో భూగర్భ జల వనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి! ఎంతగా అంటే, 2002 నుంచి 2021 మధ్య కేవలం 20 ఏళ్లలోనే కంగా 450 క్యుబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు లుప్తమైపోయినట్టు ఐఐటీ గాం«దీనగర్ తాజా సర్వే తేల్చింది. దేశంలోకెల్లా అతి పెద్ద జలాశయమైన ఇందిరా సాగర్ మొత్తం నీటి పరిమాణానికి ఇది ఏకంగా 37 రెట్లు ఎక్కువని సర్వేకు సారథ్యం వహించిన ఐఐటీ గాం«దీనగర్ సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగంలో విక్రం సారాబాయి చైర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా వివరించారు! అందుబాటులో ఉన్న సంబంధిత గణాంకాలతో పాటు శాటిలైట్ డేటా తదితరాలను విశ్లేíÙంచి ఈ మేరకు తేలి్చనట్టు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ధోరణి మరింతగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఉత్తరాదిన గత 75 ఏళ్లలో వర్షపాతం ఇప్పటికే 8.5 శాతం తగ్గిపోయింది. వాతావరణం 0.5 డిగ్రీల మేరకు వేడెక్కింది. దాంతో సాగునీటికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా బోర్లు పుట్టుకొచ్చాయి. దాంతో కనీసం భూగర్భ జల వనరులు 12 శాతం తగ్గిపోయాయి’’ అని మిశ్రా వెల్లడించారు. ఒక్క 2009లోనే వర్షాకాలంలో అల్ప వర్షపాతం, చలికాలంలో హెచ్చు ఉష్ణోగ్రతల దెబ్బకు ఉత్తరాదిన భూగర్భ జలాలు 10 శాతం మేర తగ్గిపోయాయని అంచనా! ‘‘గ్లోబల్ వారి్మంగ్ మరింత పెరిగే సూచనలే ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా వేగంగా ఎండిపోయేలా ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రమాద సంకేతాలే. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు గనుక 1 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగితే భూగర్భ జలాలు మరో 10 శాతం దాకా తగ్గిపోతాయి’’ అంటూ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ ఎన్జీఆర్ఐ పరిశోధకులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. సర్వే ఫలితాలను జర్నల్ ఎర్త్ తదుపరి సంచికలో ప్రచురించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
9 రోజులు.. 500 కోట్ల మందికి చుక్కలు చూపించిన ఎండలు!
న్యూఢిలీ: ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ నెలలో తొమ్మిది రోజులు నమోదైన అధిక ఎండలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు అల్లాడిపోయారు. ఈ విషయాన్ని తాజాగా అమెరికాకు చెందిన ‘క్లైమెట్ సెంట్రల్’ అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.జూన్ నెలలోని 9 రోజులు అధిక ఉష్ణోగ్రత నమోదై.. ఎండలు మండిపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లమంది, భారత్‌లో 61.9 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చైనాలో 57.9 కోట్ల మంది, ఇండోనేషియాలో 23.1 కోట్ల మంది, నైజిరియాలో 2.06 కోట్ల మంది, బ్రెజిల్లో 1.76 కోట్లమంది, బంగ్లాదేశ్‌లో 1.71 కోట్ల మంది, అమెరికా 1.65 కోట్లమంది, యూరోప్‌లో 1.52 కోట్ల మంది, మెక్సికోలో 1.23 కోట్ల మంది, ఎథియోపియాలో 1.21 కోట్ల మంది, ఈజిప్ట్‌లో 1.03 కోట్ల మంది ప్రజలు జూన్‌లో తొమ్మిది రోజల ఎండ వేడిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.వాతావరణ మార్పుల కారణంగా జూన్ 16 నుంచి 24 తేదీల మధ్య రోజుల్లో ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం మంది మూడుసార్లు అధిక ఎండకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. ‘‘ సుమారు శతాబ్దం పైగా బొగ్గు, ఆయిల్, నాచురల్ గ్యాస్‌ను మండించటం మూలంగా ప్రపంచానికి అధిక ఎండల ప్రమాదం పెరుగుతోంది. అర్బన్ జనాభాను కట్టడి చేయకపోవటంతో ఈ ఏడాది ఎండాకాలంలో ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా నమోదు అయ్యాయి’’ అని క్లైమెట్ సెంట్రల్ చీఫ్ ఆండ్రూ పెర్షింగ్ తెలిపారు.అదే విధంగా జూన్ 16నుంచి 24 వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4. 97 వందల కోట్ల మంది మూడు సార్లు తీవ్రమైన ఎండకు ప్రభావిత అయినట్లు క్లైమెట్ ఫిఫ్ట్ ఇండెక్స్ (సీఎస్ఐ)తెలిపిందన్నారు. భారత్‌లో అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన వేడి గాలులు రికార్డుస్థాయిలో నమోదైనట్ల రిపోర్టులో వెల్లడించింది. ఉష్ణోగ్రత, వేడి గాలులు కారణంగా సుమారు వంది మంది మరణించగా, 40 వేల మంది వడదెబ్బ తగిలిన కేసులు నమోదయ్యాయిని తెలిపింది. అధిక ఎండ, వడగాలులతో దేశరాజధాని ఢిల్లీ నీటి సంక్షోభం, పవర్ కట్ సంభవించినట్లు పేర్కొంది. అదేవిధంగా సౌది అరేబియాలో సైతం ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రపంచవ వ్యాప్తంగా హజ్ యాత్రకు అక్కడి వచ్చిన సుమారు 1300 మంది ఎండ తీవ్రత కారణంగా మృతి చెందారు. అదే విధంగా భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్, జూన్ నెలల్లో దేశంలో 40 శాతం మంది సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. అదీ కాక కొన్ని రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పలు చోటు రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రాత్రి పూటి ఉష్ణోగ్రత సైతం 35 డిగ్రీల వరకు నమోదైనట్లు పేర్కొంది. -
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
వాతావరణ మార్పులతో ‘బ్రెయిన్ స్ట్రోక్’
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఉష్ణోగ్రతలతో స్ట్రోక్ మరణాలు, పక్షవాత వైకల్య బాధితులు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు మూడు దశాబ్దాల డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులతో స్ట్రోక్ ప్రమాదం ముడిపడి ఉన్నట్టు నిర్ధారించారు. 2019లో 5.20 లక్షలకు పైగా స్ట్రోక్ మరణాలపై శీతల గాలులు, మండే వేడి తరంగాలు తీవ్ర ప్రభావం చూపాయని న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం వెల్లడించింది. స్ట్రోక్ మరణాల్లో అధిక భాగం 4.70 లక్షల కంటే ఎక్కువ మరణాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సంభవించినప్పటికీ.. 1990తో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతల పెరుగుదలతో మరణించిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు కనుగొంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంనాటకీయ ఉష్ణోగ్రత మార్పులు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని చైనాలోని చాంగ్షాలోని జియాంగ్యా హాస్పిటల్ సెంట్రల్ సౌత్ వర్సిటీకి చెందిన అధ్యయనం నివేదిక చెబుతోంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్ట్రోక్ ప్రమాదం వేగంగా పెరుగుతోందని, పదేళ్లు దాటిన వారితో పాటు ఆఫ్రికా వంటి వెనుకబడిన దేశాల్లో ప్రమాదం పొంచి ఉందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. వృద్ధాప్యం కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. భారతదేశంలో సరైన ఉష్ణోగ్రతలు లేని కారణంగా 33 వేల స్ట్రోక్ మరణాలు సంభవిస్తే.. వాటిల్లో 55 శాతం ఉష్ణోగ్రతలు పెరగడంతో, 45 శాతం ఉండాల్సిన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ప్రధాన కారణమని విశ్లేషించింది. పురుషుల్లోనే ఎక్కువఉష్ణోగ్రతల్లో మార్పులతో పక్షవాతం వచ్చి మరణించే వారి సంఖ్య ప్రతి లక్ష మందిలో 5.9 శాతం మంది మహిళలు కాగా.. పురుషుల్లో 7.7 శాతం ఉన్నట్టు అధ్యయన బృందం తేల్చింది. మధ్య ఆసియాలో లక్ష మందిలో 18 మంది అనుకూలంగా లేని (నాన్–ఆప్టిమల్) ఉష్ణోగ్రతల కారణంగా అత్యధిక స్ట్రోక్‌కు మరణాల రేటు నమోదైంది. శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలన, పారిశ్రామిక కాలుష్యం వాతావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలు పని చేయాలని సూచిస్తోంది.ఎందుకు జరుగుతోందంటే..!చల్లని ఉష్ణోగ్రతలు మానవ శరీరంలోని సునిశిత నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు రక్తనాళాల్లో అధిక రక్తపోటును పెంచి స్ట్రోక్‌లకు దారి తీస్తోందని అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతలో వేడి ఉష్ణోగ్రతలు నిర్జలీకరణానికి కారణమవుతాయని.. తద్వారా రక్తం చిక్కబడటం (క్లాట్స్) వల్ల స్ట్రోక్ ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. -
ప్రకృతి వికృతి
రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్‌లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు. సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం. ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్‌లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి. గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది. మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి. అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు. అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే! -
యువతరం ఎకో–యాంగ్జయిటీ! క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన..!
‘ఈ నెట్‌ఫ్లిక్స్, ఐపీఎల్ మ్యాచ్‌ల కాలంలో వాతావరణ మార్పులపై యూత్ దృష్టి పెడుతుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని చెబుతుంది డెలాయిట్ తాజా నివేదిక. ‘డెలాయిట్ 2024 జెన్ జెడ్, మిలీనియల్స్ సర్వే’ ప్రకారం వీరిలో ఎక్కువమంది ‘క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత మాట ఎలా ఉన్నా ఎకో–యాంగ్జయిటీ అనేది వారిలో కనిపించే మరో కోణం.ఢిల్లీలో ఒకరోజు...‘ఇల్లుదాటి బయటికి వెళ్లవద్దు అని పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. అయినా సరే వారి కనుగప్పి ఇంటి నుంచి బయటికి వచ్చి అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్లాను’ అంటుంది యశ్న ధృరియా. ఇంతకీ ఇరవై సంవత్సరాల యశ్న వెళ్లింది ఎక్కడికి? ఆరోజే విడుదలైన సినిమాకు కాదు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి కాదు. మహానగరంలో జరుగుతున్న గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్‌లో పాల్గొనడానికి. ‘వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్’ అంటూ పర్యావరణ సంక్షోభం గురించి యశ్న కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది.‘పరీక్షలో ఫెయిలైనట్లు ఏడుస్తున్నావేమిటి?’ అని అడిగారు ఒకరు. కానీ ఆ ఒకరికి తెలియనిదేమిటంటే వాతావరణానికి సంబంధించిన కీలకమైన పరీక్షను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సంక్షోభ నేపథ్యంలో యశ్నలాంటి వాళ్లు ఆశాదీపాలై వెలుగుతున్నారు. తాము వెలుగు దారిలో పయనిస్తూ ఎంతోమందిని తమ తోపాటు తీసుకువెళుతున్నారు. ‘తెలిసో తెలియకో, ఏమీ చేయలేకో పర్యావరణ సంక్షోభంలో భాగం అవుతున్నాం’ అనే బాధ. పశ్చాత్తాపం బెంగళూరుకు చెందిన శ్రీరంజనిలో కనిపిస్తుంది. గ్లోబల్ స్ట్రైక్ మూమెంట్ ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్(ఎఫ్ఎఫ్ఎఫ్) ఇండియా’లో భాగంగా ఎన్నో కార్యక్రమాల్లో శ్రీరంజని పాల్గొంది. పర్యావరణ సంక్షోభం తాలూకు ఆందోళన తట్టుకోలేక యూత్ క్లైమెట్ యాక్టివిస్ట్లలో కొందరు ట్రీట్మెంట్కు కూడా వెళుతున్నారు. ఎన్విరాన్మెంట్ యాక్షన్ గ్రూప్ ‘దేర్ ఈజ్ నో ఎర్త్ బి’తో కలిసి పనిచేసిన దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ అగ్రిమ ఛటర్జీ పర్యావరణ సంక్షోభంపై యూత్ ఆందోళనను దగ్గరి నుంచి గమనించింది. ‘తమ పరిధిలో వారు చేయగలిగింది చేస్తున్నారు. మరోవైపు సమస్య పెద్దగా ఉంది. కొన్నిసార్లు తాము చేస్తున్న ప్రయత్నం అర్థరహితంగా అనిపించి ఆందోళనకు గురవుతున్నారు. నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నారు’ అంటుంది అగ్రిమ. బెంగళూరుకు చెందిన సైకోథెరపిస్ట్ మోహినీ సింగ్ ఎంతోమంది యువ క్లైమెట్ యాక్టివిస్ట్‌లతో కలిసి పనిచేసింది. ‘పరీక్షల్లో ఫెయిల్ కావడం, లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ సందర్భంగా ఇతరుల నుంచి సానుభూతి, ఓదార్పు దొరికినట్లు క్లెమెట్ యాంగ్జయిటీ విషయంలో దొరకదు. ఎందుకంటే అది చాలామందికి అనుభవం లేని విషయం’ అంటుంది మోహిని. శివానీ గోయల్ తన స్వరాష్ట్రం అస్సాంలో వాతావరణ విధ్వంసంపై పరిశోధన చేస్తోంది. పత్రికలకు వ్యాసాలు రాస్తుంది. సోషల్ మీడియాలో కంటెంట్‌ను క్రియేట్ చేస్తుంటుంది. ‘నా ప్రయత్నం ఏ కొంచమైనా ఫలితాన్ని ఇస్తుందా?’ అనేది తనకు తరచుగా వచ్చే సందేహం.‘చేయాల్సింది చాలా ఉంది’ అంటున్న గోయల్ ‘ఇక ఏమీ చేయలేం’ అనే నిస్సహాయ స్థితిలోకి వెళ్లి ఆందోళన బారిన పడి ఉండవచ్చుగానీ దాని నుంచి బయటపడడానికి క్లైమెట్ యాక్టివిస్ట్‌గా తిరిగి క్రియాశీలం కావడానికి ఎంతో సమయం పట్టదు. అలా తొందరగా ఆందోళన నుంచి బయటపడడమే వారి బలం. సమాజానికి వరం.ఐడియాలు ఉండగా ఆందోళన ఏలనోయి!‘పర్యావరణంపై మన ప్రేమ ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న నయన ప్రేమ్‌నాథ్ డే–టు–డే సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన వీడియోలు, రీల్స్‌ను యువతరం ఇష్టపడుతోంది. ఆచరిస్తోంది. ‘ధరించకుండా మీరు మూలకు పడేసిన దుస్తులతో ఏంచేయాలి?’ ‘పీసీఆర్ ప్లాస్టిక్ గురించి తెలుసుకుందాం’ ‘జీరో–వేస్ట్ లైఫ్ స్టైల్’... మొదలైన వాటి గురించి బెంగళూరు చెందిన నయన ప్రేమ్‌నాథ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పాపులరయ్యాయి. ‘పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా కొంత’ అనే భావనకు మద్దతును, బలాన్నీ ఇస్తున్నాయి.పశ్చిమ కనుమల పరిమళంనా మూలాలు పశ్చిమ కనుమలలలో ఉన్నాయి. ఇల్లు బెంగళూరులో ఉంది. ప్రకృతి అంటే ఇష్టం. ‘ఇండియన్ యూత్ క్లైమెట్ మూవ్మెంట్’లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌ని. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్‌తో నా ప్రయాణం మొదలైంది. ‘నేచర్ అండ్ ఫ్లూరివర్శిటీ’కి ఫౌండర్‌ని. అధిక జీతం, పెద్ద సంస్థ అనే దృష్టితో కాకుండా విలువలతో కూడిన ఉద్యోగాలు చేయడం వల్ల ఎకో యాంగ్జయిటీ తగ్గుతుంది. ఎక్కువ జీతం వచ్చే సంస్థలో పనిచేయడం కంటే, పర్యావరణ సంరక్షణకు ఉపయోగపడే సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది. పర్యావరణ సంక్షోభాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... తుఫాను ఒక్కటే. అయితే మనం వేరు వేరు పడవల్లో ఉన్నాం. పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా చేయాల్సింది ఎంతో ఉంది.– శ్రీరంజని రమణ్, క్లైమెట్ యాక్టివిస్ట్ (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..)